పుట్టగానే పరిమళించిన పువ్వు 🙏🙏🙏🙏🙏
ఏల్చూరి మురళీధరరావు
🙏🙏🙏
అద్వైతశాస్త్రానికి ఆచార్యపీఠం శృంగేరి.
శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు -
పదవాక్యప్రమాణపారావారపారీణులు -
యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగయోగనిష్ఠాగరిష్ఠులు -
తపశ్చక్రవర్తులు -
అనాద్యవిచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురుపరంపరాప్రాప్త షడ్దర్శనస్థాపనాచార్యులు -
వ్యాఖ్యానసింహాసనాధీశ్వరులు -
సకలనిగమాగమసారహృదయులు -
సాంఖ్యత్రయప్రతిపాదకులు -
వైదికమార్గప్రవర్తకులు -
సర్వతంత్రస్వతంత్రాది
రాజధానీ విద్యానగరమహారాజధానీ
కర్ణాటకసింహాసన ప్రతిష్ఠాపనాచార్యులు -
శ్రీమద్రాజాధిరాజగురుభూమండలాచార్యులు -
ఋష్యశృంగపురవరాధీశ్వరులు -
తుంగభద్రాతీరనివాసులు -
శ్రీమద్విద్యాశంకరపాదపద్మారాధకులు -
శ్రీశ్రీశ్రీ మహాగురుస్వాములవారు అధివసించిన పుణ్యనివాసం శృంగేరి.
ఆస్తికు లందరికీ ఆశ్రయమైన తీర్థయాత్రాస్థలం.
ఇది 1966 నాటి మాట.
పరాభవ నామ సంవత్సరంలో జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీస్వామివారి శిష్యవర్యులు శ్రీమదభినవ విద్యాతీర్థస్వామివరేణ్యులు చాతుర్మాస్యదీక్షావ్రతులై ఉజ్జయినిలో ఉన్నప్పుడు
ఉత్తరాదిలోని పద-వాక్య-ప్రమాణ పారావార పారంగతులందరూ వారి సన్నిధిసేవకై ఏతెంచిన తరుణం.
సంస్కృతంలో ‘పదము’ అంటే వ్యాకరణమని సంకేతం.
‘వాక్య’మంటే పూర్వోత్తరమీమాంసలని అర్థం.
‘ప్రమాణం’ అంటే తర్కశాస్త్రం అన్నమాట.
ఆ పదవాక్యప్రమాణములే గాక సర్వశాస్త్రాలలోనూ, కావ్యనాటకసాహిత్యంలోనూ కోవిదులైన అగ్రగణ్యుల సమావేశం అది.
ఆ సమావేశాలకు వెళ్ళి ఆ వాక్యార్థాలూ, వాకోవాక్యాలను తిలకించినవారి భాగ్యమే భాగ్యం.
ఒకప్పుడు శ్రీ శృంగేరిలోని వాక్యార్థసభలో “విశ్వామిత్ర” శబ్దాన్ని గురించిన చర్చ వచ్చిందట. ఎవరో ‘విశ్వానికి అమిత్రుడు విశ్వామిత్రుడు’ అని హాసపూర్వకంగా అన్నారట.
అప్పుడు వైయాకరణసార్వభౌములు భట్నవిల్లి అప్పన్నశాస్త్రి గారు లేచి, విశ్వ శబ్దానికి విశ్వానికి మిత్రుడన్న అర్థంలో సమాసవిధి వల్ల దీర్ఘం వచ్చి, ‘విశ్వామిత్ర’ అవుతుందని సవిస్తరంగా ప్రసంగించారట.
ఆ తరుణంలో ప్రౌఢవయఃపరిపాకంలో ఉన్న విద్వత్కవి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు లేచి -
చంద్రునికి పదహారు కళలు ఉన్నట్లే, ప్రమితిస్వరూపుడైన సూర్యునికీ పదహారు కళలు ఉన్నాయనీ
వాటిలో “విశ్వా” అనే కళ నుంచి జన్మించిన “మిత్రుడు” (సూర్యుడు) కనుక విశ్వామిత్రుడయ్యాడనీ
వేదప్రామాణ్యంతో నిరూపించి మెప్పులందుకొన్నారట.
వాక్యార్థసభలలో పూర్వపక్ష సిద్ధాంతాల నీడల జాడలలో ఇటువంటి ఉల్లాసదోహద చమత్కారాలూ జరుగుతుంటాయి.
శ్రీ అభినవ విద్యాతీర్థ జగద్గురువుల వారు షడ్దర్శనీపారంగతులైన మహావిద్వాంసులు.
ఎంతటి మహావిద్వాంసులో అంతటి దయామయులు.
లోకానుగ్రహం కోసం అవతరించిన మహాపురుషులు వారు.
వారి భక్తరక్షణలీలలను స్మరిస్తుంటే యుగాలు క్షణాలుగా ఇట్టే గడిచిపోతాయి.
ఆ రోజు ఉజ్జయినిలో విద్యార్థుల సంస్కృతభాషా వక్తృత్వప్రదర్శనం జరిగింది.
ఆంధ్రదేశం నుంచి వచ్చిన ఒక పధ్నాలుగు - పదిహేనేళ్ళ పిల్లవాడు తనవంతు రాగానే –
నిరర్గళమైన ధారాశుద్ధితో,
ఉజ్జ్వలమైన తేజస్సుతో,
మేఘగంభీరమైన కంఠస్వరంతో
ఉద్దండపాండితీమండితంగా,
మధ్య మధ్య ఛందోమయవాణీభణితిపూర్వకంగా,
సర్వజనాహ్లాదకరంగా
వక్తవ్యాంశాన్ని పురస్కరించుకొని సంస్కృతంలో ప్రసంగించాడు.
విద్వత్పరిషత్తు విభ్రాంతి చెంది, పెద్దలందరూ నిండైన మనస్సుతో మెండైన ప్రశంసలు ఉట్టిపడే కన్నుల కాంతి వెల్లువను ఆ పిల్లవాడిపై వెల్లివిరియింపజేస్తున్నారు.
రాంకవ పుస్తకాది ప్రోత్సాహక పురస్కారాలు పూర్తయిన తర్వాత, శ్రీమదభినవ విద్యాతీర్థస్వాముల వారు ఆ పిల్లవాడికేసి చూస్తూ,
“కా పూర్వః?”
అని ప్రశ్నించారు.
ఏది పూర్వం?
సృష్టికంటె,
సృష్ట్యాది కంటె,
అన్నింటికంటె మునుపటిది ఏమిటి?
అని కాబోలు ఆ ప్రశ్నార్థం.
పిల్లవాడిని అడిగే ప్రశ్నేనా అది?
అని పెద్దలు, పండితులందరూ తెల్లపోయారు.
వేదలతాంతాలైన ఉపనిషత్తుల కుదుళ్ళ నుంచి పుట్టిన అపురూపమైన ప్రశ్నమని అందరూ అనుకొన్నారు.
సృష్టిలో పూర్వం జలము లుండేవట.
“యా సృస్టిః స్రష్టు రాద్యా” అన్నాడు కాళిదాసు శాకుంతలాదిని.
అంతకు మునుపో?
మైత్రాయణీ ఉపనిషత్తులోని కథ:
బృహద్రథు డడిగిన గడ్డుప్రశ్నకు వేదవేత్త, శాస్త్రవేత్త, ఆత్మవేత్త శాకాయనుడు,
“దుశ్శక్య మేతత్ప్రశ్నమ్” అంటాడు.
“అమ్మో, నీ ప్రశ్నకు సమాధానం చెప్పటమే!” అని.
ఇదీ అటువంటిదే.
అంతే కాదు.
పండితపరిషత్తులో పెద్దల ముందు ఎన్ని ఉదాహరణలతో, ఏమని చెప్పినా –
శాస్త్రవాదం “అథాతో బ్రహ్మజిజ్ఞాసా” అంటూ మళ్ళీ మొదటికే వస్తుంది.
ఏమని బదులిచ్చినా అంతకు ముందు మరేదో ఉండేదని –
ఏ శాస్త్రమో, పురాణమో
చర్చకు రాకుండా ఉంటుందా?
ఏదో వక్తృత్వాన్ని ప్రదర్శించినంత మాత్రాన ఆ చిన్న పిల్లవాడు –
అడిగిన ప్రశ్నకల్లా సమాధానాలు చెప్పాలని లేదు కదా!
అదీగాక,
జగద్గురువుల వారు “కః పూర్వః” అని అడగకుండా - లింగవ్యత్యయం చేసి, పుంలింగమైన “పూర్వ” శబ్దానికి మునుపు “కా” అని స్త్రీలింగాన్ని ప్రశ్నార్థకంగా జోడించారు.
అన్నింటికంటె పూర్వం ఉండినది పరాశక్తి అన్న స్త్రీత్వభావంతో అడిగితే మాత్రం, ఆ అవతారపురుషుని నోట లింగవ్యత్యయపూర్వకమైన అపశబ్దం దొర్లుతుందా?
లేక, విద్యార్థి తెలివితేటలను ఆ విధంగా పరీక్షించాలనుకొన్నారా?
ముసిముసి నవ్వులతో తండ్రిగారికేసి చూస్తున్న ఆ పిల్లవాడికేసి చూస్తున్నారు అందరున్నూ.
ఏమంటాడోనని ఆసక్తిగానూ, జగద్గురువులవారి దృష్టిని అంతగా ఆకర్షించినందుకు అమితాశ్చర్యంగానూ.
అదే ప్రశ్న నన్నడిగితే ఏమి చెప్పాలని కొంద రాలోచిస్తున్నారు.
ఆ పిల్లవాడి ఆత్మవిశ్వాసం చూడండి:
“మాది నరసరావుపేట” అన్నాడు.
సభ సభంతా విస్తుపోయింది.
మహాపండితుల కరతాళధ్వనులు మిన్నుముట్టకుండా ఉంటాయా?
“పూః పురీ” అని అమరకోశం.
జనములచే పూరింపబడేది కాబట్టి పురమునకు “పూః” అని పేరు.
“పూః” శబ్దం స్త్రీలింగం.
“కా పూః వః” అని ఆ పిల్లవాడి విరుపు.
వః = మీ యొక్క; పూః = పురము; కా = ఏది - అని.
మీ ఊరేమిటి? అన్నమాట.
“నరసరాట్ పూర్ నః” అన్నాడు.
మా ఊరు నరసరావుపేట అన్నాడు.
మాతృశ్రీ అనంతలక్ష్మమ్మ గారు, తండ్రి వేంకటేశ్వర అవధాని గారు ఇంటికి వెళ్ళి దిష్టి తీశారో లేదో.
ఎన్ని జన్మల పుణ్యఫలం కాకపోతే అటువంటి కొడుకును కనటం సంభవిస్తుంది కనుక!
ఆ పిల్లవాడి పేరు తంగిరాల సీతారామాంజనేయులు.
పల్నాటి సీమలో అలుగుమల్లెపాడు నుంచి నరసరావుపేటకు వచ్చి స్థిరపడిన కుటుంబం వారిది.
పసిపిల్లవాడుగా ఉండగానే కావ్యశాస్త్రాలలో, వేదవిద్యలలో, సంస్కృతాంధ్రాలలో ఆ బాలసరస్వతి అనుభవాన్ని చూసి బెజవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారంతటివారు ముచ్చటపడి మెచ్చుకొని మరీ దీవెనలు కురిపించారు.
ఆ బాలుడే, ఇప్పుడు యుగయుగాంతరానుగత కర్కశ సమస్యల సంక్షోభంలో అల్లకల్లోలమై ఉన్న జగత్తుకు కర్తవ్యాన్ని తెలియజెప్పి సన్మార్గోపదేశం చేస్తూ
శ్రీ శృంగేరీ జగద్గురు మహాపీఠాన్ని అధిష్ఠించిన అపర శంకరాచార్యులు,
యతిసార్వభౌములు, ధర్మప్రచార దృఢదీక్షావ్రతులు, జగదేకవిద్వాంసులు,
శ్రీమదభినవ విద్యాతీర్థస్వామి కరకమలసంజాతులు
శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివరేణ్యులు.
(శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానమువారు శిష్యస్వాములుగా ఉన్నప్పుడు వారికి ఆంధ్రవిద్యాగురువులై, ఆ తర్వాత శ్రీ అద్వయానంద భారతీస్వామిగా తురీయాశ్రమస్వీకారం పచేసిన మహాకవి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి ముఖతః నా చిన్నప్పుడు 1972 లో విన్న ఉదంతాన్ని మీకిప్పుడు విన్నవించాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి