*దత్తహోమము..దత్త దయ..*
"ఈసారి కూడా గురుపౌర్ణమి నాడు శ్రీ స్వామివారి మందిరం వద్ద 'దత్తహోమము' నిర్వహిస్తున్నారు కదా..మా దంపతుల పేర్లు కూడా నమోదు చేసుకోండి..ఆరోజుకు ఎన్ని పనులున్నా అక్కడికి వచ్చి, ఆ కార్యక్రమంలో పాల్గొంటాము.." అంటూ బెంగుళూరు నుంచి సురేష్ గారు ఫోన్ చేశారు..
"జూలై నెల పదహారో తారీఖు నాడు ఆషాడ పూర్ణిమ..ఆరోజే దత్తహోమము..మీ గోత్రము, పూర్తి పేర్లు మావద్ద ఉన్నాయి కనుక ఇబ్బంది లేదు..ఇప్పుడే నమోదు చేసి ఉంచుతాను.." అన్నాను.."ధన్యవాదములండీ.." అన్నాడు.
ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి నాడు మొగలిచెర్ల వద్ద గల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం నందు దత్త హోమము నిర్వహించడం ఒక ఆనవాయితీ..నాలుగైదేళ్ల క్రితం గురుపౌర్ణమి నాడు, శ్రీ స్వామివారి మందిరానికి దర్శనార్థం వచ్చిన సురేష్ దంపతులకు, ఆరోజు దత్తహోమము ఉందని తెలుసుకున్నారు..నిజానికి సురేష్ గారికి వివాహం జరిగి అప్పటికి ఆరు సంవత్సరాలు అవుతున్నది..సంతానం కలుగలేదు..బెంగళూరు, చెన్నై ల లోగల సంతాన సాఫల్య కేంద్రాలను సంప్రదించారా దంపతులు..ఒకసారి సురేష్ గారి భార్యకు నెల తప్పింది కానీ..రెండో నెలలోనే అబార్షన్ జరిగింది..ఆ తరువాత మరో చోట ప్రయత్నం చేశారు..డబ్బు ఖర్చు అయింది గానీ ఫలితం కలుగలేదు..
మరో నెలరోజుల తరువాత సురేష్ దంపతులు తమ బంధువుల ఇంటికి నెల్లూరు వచ్చారు..మాటల సందర్భంలో తమకు జరిగిన అనుభవాన్ని వాళ్ళతో చెప్పుకున్నారు..ఆ బంధువుల ఇంట్లో ఉన్న పెద్దావిడ..ఈ దంపతులను దగ్గర కూర్చోబెట్టుకొని.."మీరిద్దరూ నా మాట విని ఒక్కసారి మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వెళ్లి, ఆ స్వామివారి సమాధిని దర్శించి..సంతానం కావాలని ఆ స్వామిని వేసుకోండి..తప్పక ఫలితం ఉంటుంది..ఎలాగూ ఇంతదూరం వచ్చారు..రేపో ఎల్లుండో గురుపౌర్ణమి..ఆరోజుకు శ్రీ స్వామివారి సమాధిని దర్శించి, మ్రొక్కుకోండి..పెద్దదాన్ని చెపుతున్నాను వినండి.." అన్నది..
ఆ పెద్దావిడ మాటలు సురేష్ గారిమీద గట్టి ప్రభావాన్నే చూపాయి..భార్యతో చర్చించారు..ఆవిడ కూడా.."ఒకసారి వెళ్లి చూసొద్దాము..ఇంతకాలం డాక్టర్ల వెంట తిరిగాము..ఒకసారి దైవాన్ని నమ్ముదాము.." అన్నది..ఆరకంగా ఆ దంపతులు సరిగ్గా గురుపౌర్ణమి నాటి ఉదయానికి తమ కార్లో మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి చేరారు..అక్కడ అర్చకస్వాములు, ఆరోజు జరుపబోయే దత్తహోమానికి ఏర్పాట్లలో వున్నారు.."మీరిద్దరూ కూడా హోమం లో పాల్గొంటారా?..అంతా శుభమే జరుగుతుంది.." అని ఒక అర్చక స్వామి తమను అడగడం..అది ఆ దత్తాత్రేయుడి మాట గానే భావించి..ఆ దంపతులు సరే అని అంగీకారం తెలపడం క్షణాల్లో జరిగిపోయాయి..
దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన దత్తహోమము లో సురేష్ దంపతులు అత్యంత శ్రద్ధగా పాల్గొన్నారు..ఆ తరువాత శ్రీ స్వామివారి సమాధి ని దర్శించుకొని..ఆ సాయంత్రం దాకా అక్కడే గడిపి, తిరిగి తమ ఊరికి వెళ్లిపోయారు..
వెళ్లేముందు..నాదగ్గరికి వచ్చి.."ప్రసాద్ గారూ సంతానం గురించి మ్రొక్కుకుందామని ఇక్కడకు వచ్చాము..అనుకోకుండా ఈ హోమం లో పాల్గొన్నాము..స్వామివారి కృప అనిపించింది..అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.." అన్నారు..
సరిగ్గా మూడు నెలల తరువాత..సురేష్ ఫోన్ చేసి..తన భార్య గర్భవతి అని చెపుతూ.."ఈసారి ఎవ్వరికీ చెప్పుకోలేదండీ..స్వామివారి దయతో సంతానం కలిగిన తరువాత అందరికీ తెలియచేస్తాము.." అన్నాడు..మరో ఏడు నెలలకు ఆడపిల్ల పుట్టిందని ఉద్వేగంతో చెపుతూ..త్వరలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటానన్నారు..ప్రస్తుతం సురేష్ దంపతులకు ఇద్దరు సంతానం..ఇద్దరూ ఆడపిల్లలే..తాము దత్తహోమము లో పాల్గొన్నందునే ఫలితం కనబడిందనీ..శ్రీ స్వామివారి కృప, కరుణ తమ మీద ఉన్నాయని బలంగా నమ్మారు ఆ దంపతులు..అప్పటినుంచీ ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి నాటి దత్తహోమము లో పాల్గొనడం ఒక అలవాటుగా మార్చుకున్నారు..
మరి భక్తి విశ్వాసాలనే కదా భగవంతుడు మననుంచి ఆశించేది..
సర్వం..
శ్రీదత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి