**దశిక రాము**
**సంపూర్ణ తిరుమల చరిత్ర - 13**
పెరియాళ్వార్లు
అంతయు నీవే హరిపుండరీకాక్ష, చెంతయు నీవే శ్రీరఘురామ
కులమును నీవే గోవిందా, నా కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర, నా నెలవును నీవే నీరజనాభ
అంతయు నీవే హరిపుండరీకాక్ష, చెంతయు నీవే శ్రీరఘురామ
పుట్టువు నీవే పురుషోత్తమా, కోన నట్టనడుమ నీవే నారాయణా
ఇట్టె శ్రీ వేంకటేశ్వరా నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే
అంతయు నీవే హరిపుండరీకాక్ష, చెంతయు నీవే శ్రీరఘురామ
ఇది అన్నమయ్య ఆలాపన. కానీ ఈ పాటను ఒక్కసారి రూపకల్పన చేస్తే ఏర్పడే రూపమే పెరియాళ్వార్లు. తన తనువు, మనసు, జీవనం, జీవితం - అంతా పుండరీకాక్షుడే. చిత్తములో భావమెల్ల, శ్రీ వేంకటేశుడే అన్నట్లు నిరంతరం విష్ణు చింతన. కనులు తెరిచినా, మూసినా ఆ శ్రీమన్నారాయణుని ధ్యాసే. నిత్య సౌందర్యమూర్తి ధ్యానం, అర్చన తప్ప వేరు ధ్యాస లేని విప్రపుంగవుడు శ్రీ పెరియాళ్వార్లు. ద్రవిడ దివ్య ప్రబంధాల్లో ప్రముఖంగా పేర్కొనబడింది తిరుప్పల్లాండు, ఇంకా తిరుప్పావై. తిరుప్పల్లాండు రచించింది పెరియాళ్వార్లు కాగా తిరుప్పావై రచించింది అతని కుమార్తె గోదాదేవి. భగవంతుని నిరంతర ధ్యానంలో అనంతమైన ఆనందాన్ని పొంది, స్వామి సేవలో తరించి దివ్య సాన్నిధ్యాన్ని పొందిన ధన్యజీవులు.
పెరియాళ్వార్లనే విష్ణుచిత్తులని పిలిచేవారు. అందుకేనేమో విష్ణునామాన్ని ఎప్పుడూ చిత్తంలో ధ్యానంచేస్తూ తన పేరును సార్ధకం చేసుకున్నాడు. విష్ణుచిత్తుడు చిన్నతనం నుండీ శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుని ఆలయంలోనే గడిపేవాడు. ఆ ఆలయంలోని తులసివనంలో నిత్యం పరంధాముని ధ్యానం చేస్తూ బాలప్రహ్లాదుని తలపింపచేసేవాడు. వనంలోని పూలమొక్కలకు నీళ్ళుపోస్తూ, పూలు కోస్తూ, మాలలు కడుతూ ఉండే ఈ బాలభక్తుడు అక్కడికి వచ్చే భక్తులకు చూడముచ్చటగా కనిపించేవాడు. ఆ దేవదేవునికే పిల్లను ఇచ్చినందుకు కాబోలు ఈయనకు పెరియాళ్వార్లు అని పేరు వచ్చింది.
విష్ణుచిత్తుడినే శ్రీమహావిష్ణువు వాహనమైన గరుడుని అంశగా శ్రీవైష్ణవులు భావిస్తారు. భక్తుల మరోరథాలను తీర్చే భక్తమందారుని తన భుజస్కంధాలపై తీసుకుని వచ్చి భక్తుల ముంగిట నిలిచినట్లుగా ఈ విష్ణుచిత్తుడు తన సేవలతో గోవిందుని మురిపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. వీరు కూడా మిగిలిన ఆళ్వారుల మాదిరిగానే ఎక్కడా విద్యను అభ్యసించలేదు. స్వయం జ్ఞానసంపన్నుడు, నిరంతర భగవన్నామ సంకీర్తనాచార్యులు. వీరికెప్పుడూ వాసుదేవుని దివ్యచరణారవింద సేవయే తప్ప అన్య ధ్యాస తెలీదు.
ఆ నిష్టానిది గేహసీమ నడురే యాలించినన్ మ్రోయునెం
తే నాగేంద్రశయాను పుణ్యకథలున్, దివ్య ప్రబంధానుసం
ధాన ధ్యానము, నాస్తి, శాకబాహుతా, నాస్త్యుష్ణతా, నాస్త్యపూ
పో, నాస్తోద్నసౌష్టవం చ కృపయా భోక్తవ్యమన్ పల్కులున్
శ్రీవిల్లి పుత్తూరుకు పది మైళ్ళ దూరంలో పాండ్య రాజధాని మధురానగరి ఉంది. శ్రీకృష్ణునకు ఉత్తర మధుర విహార భూమి కాగా ఈ మధుర సర్వ విద్యా కేంద్రమై ప్రాచీన దాక్షిణాత్య శిల్పముల కాలవాలమై వాపీకూప తటాకాదులచే సుమనోహరమైన పుష్పవనాలతో పరివృతమైన మహా నగరం ఈ మధురానగరం.
మధురా నగరాధినాథుడు వల్లభదేవుడు. ధర్మచింతనుడు, భగవద్భక్తి పరాయణుడు. ప్రజల కష్టసుఖాలను విచారించాలని ప్రతిరోజూ మారువేషంలో నగర సంచారం చేసేవాడు. అలా నగర సంచారం చేస్తూ ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణ వీధిలో ఒక పరదేశీ పడుకుని ఉండటం చూసి ఆతని వద్దకు వెళ్ళి ''మీరెవరు, ఏం పనిమీద ఇక్కడికి వచ్చారు? తమకు అభ్యంతరం లేకపోతే సెలవీయండి'' అన్నాడు. అంత అతడు ''అయ్యా! నేను బ్రాహ్మణుడను. తీర్థయాత్రలు చేస్తూ కాశీ నుండి బయల్దేరి రామేశ్వరం వెళ్తూ దారిలో ఈ నగరం వచ్చాను'' అని బదులిచ్చాడు.
ఆవిధంగా బాటసారికి, వల్లభదేవునికీ మధ్య సంభాషణ సాగింది. వారి మాటల మధ్యలో ఆ పరదేశీ ఒక పండితుడని, వీలయితే తన పాండిత్యాన్ని నగర పాలకుని ఎదుట ప్రదర్శించాలని విన్నవించుకున్నాడు.
అసలే సాహిత్యాభిలాషి అయిన వల్లభదేవుడు ఆ పండితుని ఒక పద్యం ఆలపించమని కోరగా ఆ పండితుడు
వర్షార్ధ మష్టో ప్రయతేతి మాసాన్ నిశార్ధ మర్ధం దివసం యతేత
వార్ధక్యహేతోర్వయసా ననేన పరత్ర హేతోరిహ జన్మనాచ
అంటూ పాడాడు. మానవుడు వర్షాకాలానికి అవసరమయ్యే పదార్ధాలను మిగిలిన ఎనిమిది మాసాలకు కష్టపడి సేకరించి ఉంచుకోవాలి. రాత్రికి కావలసిన వస్తువులు పగలే సంపాదించాలి. ముదిమి మీద పడినప్పుడు అవసరమయ్యే వస్తువులను ధాన్యాదులను పదచుదనంలోనే గడించాలి. పరమునకు అవసరమయ్యే పరమార్థమును ఈ జన్మలోనే పొందేందుకు ప్రయత్నించాలి.
ఈ శ్లోకార్ధం వల్లభదేవునకు ఎంతో సంతోషం కలిగించింది. కానీ అతని మనసులో అలజడి కూడా కలిగింది. మొదటి మూడు విషయాలకు సర్వ సంపద సమన్వితుడైనందున చింతలేదు. కానీ పరమార్థ లాభమున కై తానేం చేయాలి? ఇంతకాలం వృథా అయిపోయింది కదా! మానవ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలీదు కదా! పరమార్ధ సాధనకు తాను ఏమీ చేయలేదే అని బాధపడి ఇకపై తానేం చేస్తే పరమార్థం సిద్ధిస్తుందో తెలుసుకునేందుకు దేశం నలుమూలల నుండి పండిత గోష్టిని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాడు.
ఆయువు వీచి చంచలము, యౌవన మల్ప సుఖోదయంబు, పు
ష్పాయుధ కేళిజన్యసుఖమస్థిర, మర్ధము వాంఛవోలె సా
పాయము, భోగముల్ మెళపులట్లు చలంబు భావాబ్దిలంఘనో
పాయము బ్రహ్మ చింతనము బ్రాయక సేయుండు సజ్జనోత్తముల్
అని భర్తృహరి చెప్పినట్లు భావించి పరలోక ప్రాప్తికి పరతత్వ జిజ్ఞాస అవసరము కదా! అట్టి పరతత్వము నిర్ణయించుటకై వేదవేదాంతవేత్తలగు పండితులను పిలిపించి సభ చేయించిన యెడల ఈ పరమార్ధ సాధనకు ఏం చేయాలో తగిన సూచనలు పండితులు చేయగలరని ఆశించాడు. అందుకే సకల శాస్త్ర విశారదులు, పండిత ప్రకాందులు, విద్యావేత్తలు, తత్వవేత్తలు, వేదాంత మహామహోద్యాయులను సవినయంగా ఆహ్వానించి పెద్ద ఎత్తున అతిథి మర్యాదలు చేయించాడు. అందరినీ సంతుష్టులను చేసి వారిచ్చే సముచిత సలహాలతో తనలో ఉన్న సంశయాలను పోగొట్టుకోవాలనుకున్నాడు.
మర్నాడు ఆ బ్రాహ్మణుని ఆస్థానానికి ఆహ్వానించి తగురీతిన సత్కరించి ''ఆర్యా! పురుషార్ధ ప్రదమగు వస్తువేదో శాస్త్ర ప్రమాణ పూర్వకంగా పండితులచే తెలుసుకోవలసి ఉంది. కనుక మోక్ష ప్రాప్తికి, జగదుత్పత్తికి మూలమైన పదార్ధం గురించి తెలుసుకోకపోతే జన్మకు సార్ధక్యం లేదు కదా! కనుక వెంటనే వేదవేదాంత వేత్తలైన పండిత శ్రేష్టులను దేశదేశాల నుండి రప్పించి పురుషార్ధ సాధనకు తగిన మార్గం ఏదో తెలుసుకోదలచానని తెలియజేశాడు రాజు.
అంతటితో ఆగక ఆ మహారాజు తక్షణమె తగిన ఏర్పాట్లు చేసి పండిత గోష్టి ఏర్పాటు చేశాడు. కానీ ఎవరూ కూడా తగిన సమాధానంటో మహారాజును సంతృప్తి పరచలేకపోయారు. భగవంతుని తత్వాన్ని, అంతర్మధనంచేసి అవగాహన చేసుకున్న మహాభక్తునికి కానీ సాధ్యంకాని పరమాత్మ తత్వం తెలియజేయాలంటే మామూలు వ్యక్తికి సాధ్యంకాదు కదా! నిరంతరం భక్తి సాగరంలో తన్మయత్వంతో పరవశించే భక్త శిఖామణియే దీనికి పరిష్కారం ఇవ్వగలడనే భావం అందరికీ కలిగి తమ రాజ్యంలో అటువంటి పరమాత్మ భక్తవశుడైనవాడు విష్ణుచిత్తుడే నని తెలుసుకున్నాడు.
శ్రీవల్లి పుత్తూరులోని శ్రీకృష్ణుని ఆలయమ్లో నిత్య కైంకర్యంలో ఇహపరాలను వాసుదేవుని సేవకు అంకితం చేసిన విష్ణుచిత్తుని తన వద్దకు తీసుకురమ్మని ఆదేశించాడు రాజు. వాసుదేవుని ఆజ్ఞగా భావించిన విష్ణుచిత్తుడు ముకుళిత ధ్యానచిత్తంటో రాజప్రాసాదం చేరుకున్నాడు. రాజప్రాసాదం అంతా పండిత గోష్టితో శోభాయమానంగా ఉండి ముకుందుని రాకకై ఎదురుచూసే రేపల్లె మాదిరిగా కనిపించింది. ఎందరో విద్వాంసులు, పండితులు, జ్ఞానసంపన్నులు నిండు సభలో ఉండగా తాను విష్ణు పారాయణం తప్ప ఏం పురుషార్ధ నిర్ణయం చేయగలడు?!
నిత్య ధ్యాన సముద్రుడైన విష్ణుచిత్తుడు మహారాజు అడిగిన ప్రశ్నకు బదులుగా సర్వ పదార్థాలు వేదాల్లో ఇమిడిఉన్నాయి. వేదం అష్టాక్షరీ మంత్రంలో ఉంటుంది. అలాంటి నారాయణాష్టాక్షరి ప్రణవమున ఓంకారంలో ఉంటుంది. ఆ, ఓ, ఇ కారమునకు అకారము మూలం. వేదములకు మొదట ఓంకారం ఉంటుంది. అ, ఉ,మ – వీని కలయికయే ఓం. కనుక వేదములకు మూలం అకారమే. వేదాది అయిన ఆ అకారమే వేదాంతమునకు బ్రహ్మ విద్యకు మూలం. బ్రహ్మమే పరతత్వం. కనుక పరతత్వమునకు మూలం కూడా అకారమే. ఈ దృశ్యమానమైన ప్రకృతిని సృష్టించినవాడే పరుడు, స్థితికర్త. ఆ పరుడే పరమాత్మ, బ్రహ్మం లేక పరబ్రహ్మం. ''అక్షరాల్లో నేను అకారాన్ని'' అని గీతాచార్యుడు కూడా పలికాడు. అకారమే సర్వమునకు ఆత్మ. అట్టి ఆకారం విష్ణువునే చెప్తుంది. ఇతర దేవతలను అది యెంత మాత్రం చెప్పాడు. అకారవాచ్యుడైన ఆ విష్ణుభగవానుడే పరతత్వం, శ్రీమన్నారాయణుడు. మోక్ష ప్రదానార్హట బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో విష్ణువునకు ఒక్కనికే గలదను విషయం మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అనే మాట రుజువు చేస్తోంది కదా! కనుక అకార వాచ్యుడగు ఆ విష్ణు భగవానుడు ఒక్కడే అనడంలో విప్రతిపత్తి ఎంతమాత్రం లేదు. విష్ణువు నుండి ఉద్భవించిన ఈ జగత్తు అతనిలోనే ఉండి అతనిలోనే లీలమౌతుంది. కనుక నారాయణుని మించిన పరతత్వం నభూతో నభవిష్యతి. ఇదే అఖిల వేద పురాణసారం. వేదములను మించిన శాస్త్రంలేదు, కేశవుని మించిన పరతత్వం లేదు అని పండిత గోష్టిలో వినమ్రంగా విన్నవించుకుని ఎలుగెత్తి సుస్వరంగా సకల వేదసారమైన విష్ణు సహస్రనామ శ్లోకాలను గానం చేయసాగాడు. అద్భుతమైన తన గాన మాధుర్యంతో నిండు సభాస్థలిని అంతా తన్మయం చేయసాగాడు. నిశ్శబ్దం ఆవరించగా ప్రతి హృదయం విష్ణు పారాయణంతో నిండు సభాస్థలిని అంతా తన్మయం చేయసాగాడు. నిశ్శబ్దం ఆవరించగా ప్రతి హృదయం విష్ణుపారాయణంతో పరవశించసాగింది. ఉదయం ప్రారంభమైన విష్ణు సహస్రనామ సంకీర్తన సాయంత్రంవరకూ ప్రతి అణువూ పులకించగా పరవశించిపోయింది. అక్కడున్న అందరికీ అప్పుడు అర్ధమైంది మానవజన్మకు అవసరమైన చతురార్ధమైన ధర్మార్థ కామమోక్షాలలో పురుషార్ధకారకమైన ఏకైకమార్గం వేదవేద్యుడైన పరందాముని ధ్యానం, అర్చన, ఆరాధన తప్ప మరేం కాదని, అది బోధించిన విష్ణుచిత్తుని అంతరార్థం అర్ధమైంది. అంతట ఆ మహారాజు తన సింహాసనం నుండి దిగివచ్చి పరదేశీ పండితుని సముచితంగా సత్కరించి, విష్ణుచిత్తుని పండిత గోష్టి ముందు గజారోహణం చేయించి నగర వీధుల్లో ఊరేగించసాగారు.
అంతట నిరంతర విష్ణుచింతనాపరుడైన ఆ విష్ణుచిత్తుని ఆశీర్వదించగోరి మహాలక్ష్మి సమేతుడైణ శ్రీహరి గరుడారోహితుడై ప్రత్యక్షమయ్యాడు. అంతట విష్ణుచిత్తుడు అమందానంద పరవశుడై అఖిలాండ కర్తనధికుడైన పుండరీకుని చూసి సర్వాలంకార భూషితుని కాంచిన పారవశ్యంతో స్వామికి నమస్కరించుతాకు బదులు మహా మహితాత్ముడైన శ్రీమహావిష్ణువుని దివ్య మంగళ సౌందర్యరూపునికి సకల కల్యాణవిభుని గుణసంపదకును ప్రాకృత జనుల దృష్టి ఎక్కడ తగులుతుందోనని భీతి మనస్కులై యుక్తాయుక్తములు మరచి గజఘంటలనే తాళంగా చేసుకుని హృద్యమైన మృదుమధురమైన ద్రావిడ పాశురగానంతో స్వామివారిని ఆశీర్వదించారు. దీన్నే మంగళాశాసనం అని కూడా అంటారు. ఈ మంగళా శాసనానికి తిరుప్పల్లాండు అని పేరు. అది ఏమని స్తుతించారంటే -
పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి సూరాయిరం
మల్లాండ తిండోళ్ మణివణ్ణా ఉన్ శేవడు శెవ్వి తిరుక్కాప్పు
అనే తమిళ పాశురమే ముందుగా గానం చేసి మిగిలిన పాశురాలను తర్వాత గానం చేస్తారు.
హరి నీల కోమల శ్యామల దేహ, క్రూర కంస నిసృష్ట ఘోర చాణూర మల్లనిబర్హణ
మహిత బలిష్ట బాహుయుగళ నీదు పాదారవింద సౌందర్య సమధిక సంవత్సరమృద్ధి
బహు వత్సరములు బహు వత్సరములు బహు సహస్రాబ్దముల్
బహు కోటి లక్ష వర్షముల్ కొరలేక వర్ధిల్లు గాక
అని దేవదేవుడినే ఆశీర్వదించాడు. అందువల్లనే విష్ణుచిత్తునికి పెరియాళ్వారులని పేరు వచ్చింది. మహావిష్ణువునే బాలగోపాలునిగా భావించి దిష్టితీసిన విష్ణుచిత్తుని ఉన్నత భావనకు గుర్తుగా వీరికి పెరియాళ్వారులనే పేరు సార్ధకమైంది.
వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి
దయచేసి షేర్ చేయండి
స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన నామం " గోవిందా " ... ఎవరు తనని గోవిందా అని పిలుస్తారా అని ఎదురు చూస్తుంటారట స్వామి వారు ...
కనుక మనం ఆలస్యం చేయక
అందరం " గోవిందా గోవిందా " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ...
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి