5, డిసెంబర్ 2020, శనివారం

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


ఉద్యోగపర్వం.149


భీష్ముడు దుర్యోధనునికి చెబుతున్నాడు :


అంబకు సాంబశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు కదా !  


ఆమె నన్ను యుద్ధంలో ఓడించి వధించే సామర్ధ్యం యివ్వమని వరంకోరింది. పరమశివుడు అనుగ్రహించాడు.  కోరికైతే కోరింది గానీ, శివుడు వరం ప్రసాదించినట్లు     చెప్పినా కూడా ఆమెకు నమ్మకం కుదరక, ' నేను స్త్రీని కదా శంకరా ! నాకు యుద్ధరంగం లో భీష్మునిచంపే అవకాశం యెలావస్తుంది ? అని అడిగింది.  ' నావాక్కు అసత్యం కాదు.  నీవు పురుషునిగానే భీష్ముని సంహరిస్తావు.' అని ఆమె సందేహనివృత్తి చేసాడు, శంకరుడు. 


ఆమెను యింకా అయోమయంలో వుంచే వుద్దేశంలేక శివుడు, ' అంబా !  నీవు ద్రుపదుని యింటిలో, ఆడశిశువుగా జన్మిస్తావు.  ఎదుగుతున్న కొద్దీ క్రమంగా నీలో పురుషలక్షణాలు బహిర్గతమౌతాయి.  తరువాత నీవు అనుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయి. ' అని చెప్పి సాంబశివుడు మాయమైనాడు.  ఆమె శంకరుని మాటలకు సంతృప్తి చెంది,  తానే స్వయంగా యెండుపుల్లలను చితిగా పేర్చుకుని, స్వయంగా ' భీష్ముని వధించేందుకు' అని సంకల్పం చెప్పుకుని, హుతాశనుని వుదరంలోనికి యే జంకూ లేకుండా ప్రవేశించి, ఆహుతి అయింది.


ఇదంతా అమిత ఆశ్చర్యంగా వింటున్నాడు, దుర్యోధనుడు.  ఇంకొకప్రక్క సంజయుడు ధృతరాష్ట్రునికి భీష్మ దుర్యోధనుల సంభాషణ తెలియచేస్తున్నాడు.  దుర్యోధనుడు ఆశ్చర్యం చంపుకోలేక, '  స్త్రీగా ప్రాయోపవేశంచేసిన అంబ, పురుషునిగా  యేవిధంగా  జన్మించింది, త్వరగా వివరింపు,పితామహా ! 'అని అడిగాడు.  ' దుర్యోధనా !  ద్రుపద మహారాజు చిరకాలంగా సంతానలేమితో బాధపడుతున్నాడు.  నేను ద్రోణునికి ఆశ్రయమిచ్చానని,  అతడుకూడా నాపై  ద్వేషంతో రగిలిపోతున్నాడు.  ఎంతకాలానికీ సంతానం కలుగకపోవడంతో, తన కోరిక తీరదేమోనని, రెట్టించిన సంకల్పంతో, శివునిగురించి ఘోరతపస్సు చేసి,శివుడు ప్రత్యక్షమవగానే, భీష్మునిచంపే, పరాక్రమ వంతుడైన పుత్రుని ప్రసాదించమని అడిగాడు.   


ఆనాడు అంబకు యిచ్చిన వరం జ్ఞప్తిలో వుంచుకుని, శివుడు,   '  ద్రుపదా ! నీ కోరిక తీరుతుంది.   ముందుగా నీకు ఒక ఆడశిశువు జన్మిస్తుంది.  క్రమంగా ఆమె పురుషునిగా మారిపోయి, భీష్ముడిని చంపడానికి కారకురాలవుతుంది. '  అని అంతర్ధానమయ్యాడు.  ' దుర్యోధనా!  ఈ విషయాలన్నీ నాకు వేగులవారి ద్వారా, తెలుస్తూనే వున్నాయి. కొంతకాలానికి  ద్రుపదుని భార్య గర్భం ధరించి,  ఆడశిశువుని కన్నది.  లేక లేక కలిగిన శిశువు అవడం వలన, ఆడబిడ్డ అని తెలిసికూడా, తనకు పుత్రుడు పుట్టాడని లోకానికి తెలియబరచి, భర్త ద్రుపదునికూడా  అదేవిధంగా చెప్పమని చెప్పింది.  శిఖండి అనే నామంతో ఆమెను పిలువసాగారు  . వివాహమైతే ఆమె పురుషుడుగా మారుతుందనే ఆశతో ఆమెకు రహశ్యజీవితం కలిపించారు.


 వీరు యెంత రహస్యంగా పెంచదల్చుకున్నా, ప్రకృతిధర్మాలు శరీరానికి సహజంగా వచ్చేవేకదా !  శంకరుని వరంమీద నమ్మకముంచి, ఆమెకు శీఘ్రముగా,  వివాహం చెయ్యడానికి సిద్ధపడ్డారు తల్లిదండ్రులు.   దశార్ణ దేశాధిపతి, హిరణ్యవర్మ  కుమార్తెను ఆమెకు భార్యగా నిర్ణయించి, ఆయనకు వర్తమానం పంపారు.  ద్రుపదునితో వియ్యమని ఆయన సంతోషించి, తన కుమార్తెను శిఖండికిచ్చి వివాహం జరిపించాడు. 


కొద్దిరోజులకు శిఖండి  స్త్రీ  అనేవిషయం బయటపడింది,  తన భార్య దగ్గర.  ఇంకేముంది.  ద్రుపదుని కోడలు, తనపుట్టింటి వారికి యీవిషయం తెలియజేసి, తనను పుట్టింటికి తీసుకువెళ్ళమని వారిని కోరింది.  ఆమెతండ్రి ద్రుపదునిపై యుద్హం ప్రకటించి,  నిజం చెప్పమని కబురు చేసాడు. 


ఈలోపు, శిఖండి, తనముఖం యెవరికీ చూపించలేక, అరణ్యాలలలోనికి  పరుగులు తీసింది.   ఆమెవెళ్లిన అరణ్యప్రాంతం స్థూణాకర్ణుడు అనే యక్షుని అధీనంలో వున్నది. అతని భయంకర ప్రవృత్తికి భయపడి ఆయన భవనంలోకి యెవరూ అడుగుపెట్టరు.  ఆ విషయం తెలియక శిఖండి ఆ భవనం లోనికి అడుగుపెట్టి అన్నపానీయాలు విసర్జించి, తపస్సు చేసుకుంటూ వున్నది, భగవంతునిపై భారంవేసి.


స్థూణాకర్ణుడు ఆమెకు తెలియకుండా ఆమెను గమనిస్తూ, ఆమె నిజాయితీగా తపస్సు చేసుకోవడం గమనించి, ఆమెకువచ్చిన ఆపద యేమిటో చెబితే, తాను తీరుస్తానన్నాడు.


' దుర్యోధనా! నాకు ఆందోళన చెందే పరిస్థితి వుత్పన్నమై స్థూణాకర్ణునికి, ఆమెకు సహాయం చెయ్యాలని బుద్ధిపుట్టింది.  ఆయక్షుడు శిఖండికి తన మగతనం కొంతకాలం మార్పిడి చెయ్యడానికి సిద్ధపడ్డాడు.  ఆమె సంతోషించి తన మామగారైన  హిరణ్యవర్మని తాను పురుషుడినని నమ్మించి, తిరిగివచ్చి, తన ఆడతనం  తీసుకుంటానని కృతజ్ఞతలు చెప్పి పురుషునిగా అక్కడ నుండి ద్రుపదరాజును వెళ్లి కలిసింది.  ఆమె తల్లిదండ్రులు యెంతో సంతోషించి, హిరణ్యవర్మకి  కబురుపెట్టి, ' మీరు విన్నదంతా  అబద్ధం.  కావాలంటే మీ అల్లుడిని మీరు కలిసి మీ సందేహ నివృత్తి చేసుకోవచ్చు. '  అని  చెప్పారు.  హిరణ్యవర్మ కూడా సమస్య లేనందుకు సంతోషించి,  కావలసిన పరీక్షలు జరిపించి శిఖండి ఉత్తమజాతి పురుషుడుగా తేల్చుకున్నాడు.


అదే సమయంలో, స్థాణాకర్ణుడు వున్న ప్రదేశంపైనుండి,  విమానంలో,  స్థూణాకర్ణునికి ప్రభువైన కుబేరుడు వెళ్తూ,   అక్కడ దిగి స్థూణాకర్ణుని చూసి వెళదామని అతని భవంతి లోనికి వచ్చాడు..  అయితే, ఆడతనంతో వున్న స్థూణాకర్ణుడు, కుబేరుని కంటబడలేక చాలాసేపు కుబేరునికి కనబడకుండా వుండిపోయాడు.  తరువాత విషయం తెలుసుకుని,  అతనిపై కోపించి, అతని జీవితాంతం ఆడదానిగా వుండిపొమ్మని శపించాడు.  దానికి స్థూణాకర్ణుడు ' తాను చేసిన మంచిపని యీవిధంగా వికటించింది ' అని కుబేరునికి మొరబెట్టుకోగా,  శిఖండి మరణించిన తరువాత,స్థూణాకర్ణుడు తిరిగి పురుషజీవితం గడుపుతాడని వెసులుబాటు ఇచ్చాడు. 


ఇదేమీ తెలియని శిఖండి,  తాను అనుకున్న ప్రకారం తిరిగివచ్చి, తన ఆడతనం తనకు ఇచ్చేయమని స్తూనాకర్ణుని అడిగాడు.  శిఖండి నిజాయితీకి అతడు చాల సంతోషించాడు.  జరిగినదంతా స్థూణాకర్ణుడు శిఖండికి చెప్పి, ఆమెను బ్రతికి వున్నన్నాళ్ళూ పురుషజీవితం గడపమని దీవించి,  ఆమె ' సంకల్పం నెరవేరుగాక ! ' అని దీవించాడు.  స్థూణాకర్ణునికి కృతజ్ఞతా నమస్కారం చేసి, శిఖండి తిరిగివెళ్లి,  తన తల్లిదండ్రులకూ భార్యకూ జరిగినది చెప్పి, వారిని సంతోషపెట్టాడు.  ద్రుపదుడు, శిఖండిని ద్రోణాచార్యుని వద్దకు శిష్యునిగా పంపి, విలువిద్య నేర్పించాడు.  


' దుర్యోధనా !  మీరందరూ ద్రోణుని వద్ద శిక్షణ తీసుకున్నట్లే, శిఖండి కూడా విలువిద్యలో పరిపూర్ణత సాధించాడు.  ఇదీ శిఖండి కధ.   కాశీరాజు పెద్దకుమార్తె, అంబ యిప్పుడు శిఖండిగా వచ్చిన విషయం నాకుతెలుసు కాబట్టి, నేను నా నియమం ప్రకారం స్త్రీలతో యుద్ధం చెయ్యను కనుక,   ఆతడు పురుషరూపంలో వున్న స్త్రీ.. అతనిపై   నేను ధనుస్సు యెక్కుపెట్టను.' అని భీష్ముడు దుర్యోధనునితో చెప్పాడు. ' భీష్ముని నిర్ణయం సరి అయినదే అని దుర్యోధనుడు కూడా సమాధానపడ్డాడు '  అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు.  


తూర్పు తెల్లవారుతుండగా, దుర్యోధనుడు మళ్ళీ బీష్ముని వద్దకువచ్చి, ' పితామహా !  పాండవసేన యుద్ధానికి సిద్ధంగా వున్నది.  సాగరఘోషలాగా వినపడుతున్న  పాండవసేన ఆర్భాటం చూస్తుంటే, దేవతలు కూడా వారిని జయించలేరేమో అనిపిస్తున్నది.  మీ సర్వసైన్యాధ్యక్షతన యెన్నిరోజులలో మనం వారిని మట్టు పెట్టగలం ? ' అని కుతూహలంగా అడిగాడు. 


దానికి సమాధానంగా భీష్ముడు, '  మన శక్తివంతమైన అస్త్రశస్త్రాలు అన్నీ వినియోగిస్తే, ఒక మాసంలో వారిని తుడిచిపెట్టవచ్చు.' అన్నాడు.  ప్రక్కనే వున్న ద్రోణుడిని అడుగగా, ' నాకూ అదే అనిపిస్తున్నది. ' అన్నాడు.  కృపాచార్యుడు రెండు నెలలు పడుతుంది అనగా, అశ్వద్ధామ పదిరోజులు చాలన్నాడు.  అక్కడే వున్న కర్ణుడు యెవరూ అడగకుండానే, ' నాకైతే ఐదురోజులు చాలు. ' నన్నాడు.  


ఆమాటలకు భీష్ముడు నవ్వి, ' అవును కర్ణా !  నీకు ఐదురోజులు చాలు.  ఎందుకంటె, నీవు మునుపెన్నడూ, శ్రీకృష్ణుని రధసారధ్యంలో గాండీవం పట్టుకుని యుద్ధం చేస్తున్న అర్జునుని చూడలేదు కదా ! అందుకే యథేచ్ఛగా మాట్లాడుతున్నావు. ' అన్నాడు.  .    


ఇదంతా వేగుల ద్వారా తెలుసుకున్న ధర్మరాజు, అర్జునునితో, ' అర్జునా ! అక్కడ దుర్యోధనుడు వేసిన ప్రశ్ననే నేనూ వేస్తున్నాను.  నీకు యెంతకాలం పడుతుంది కౌరవసేనను నిర్జించడానికి ? '  అని అడిగాడు.   ' అన్నా !  కౌరవశ్రేష్ఠుల మాటలకు నీవు బాధపడవద్దు.  నీ మనస్థాపం హరించిపోవుగాక ! ఇది సత్యం.  నా రథంలో వాసుదేవుడు తోడుగా వుంటే,  ఒక్క కౌరవసేననే   కాదు, ముల్లోకాలను రెప్పపాటులో తుడిచి పెట్టెయ్యగలను.  ప్రళయసమయంలో జీవ సమాప్తికి వుపయోగించే అస్త్రం నాకు పరమేశ్వరుడు  అనుగ్రహించిన సంగతి వారెవరికీ తెలియదు.   కర్ణునికి అసలే తెలియదు.  నాకు పరమేశ్వరుడు పెట్టిన నియమం ప్రకారం,  అస్త్రాన్ని సామాన్య పరిస్థితిలో వాడకూడదు.  మనం మామూలుగానే గెలుద్దాము.  అంతెందుకు అగ్రజా !  అలుగుటయే యెరుంగని, మహామహితాత్ముడవు అజాతశతృడవు, నీవు అలిగిన చాలదా, సప్త సముద్రాలూ యేకమై శత్రువులను  తుడిచిపెట్టడానికి ?  నీకోపాగ్నికి నిలువబడ గలిగే ప్రాణి  యీభూమిమీద లేదని నాకు ఖచ్చితంగా తెలుసు. '  అన్నాడు దృఢంగా అర్జునుడు. 


ఇరుపక్షాలవారు, ఉదయసంధ్యా కార్యక్రమాలు పూర్తి చేసుకుని, అగ్నిహోత్రుడిని పూజించి, మంగళవాక్యాలు అవధరించి, కవచములు, శిరస్త్రాణాలు ధరించి వారివారి రథకేతనములు రెపరెపలాడుతూ యెగురుతుండగా,  విజయం మీద విశ్వాసంతో తమ సర్వ సేనాధిపతుల ఆజ్ఞలకు అనుగుణంగా,  తమతమ స్థానాలను గుర్తించి బయలు దేరారు, సమరానికి.


శంఖనాదాలు, భేరీధ్వనులు మిన్నంటుతుండగా, రధ, గజ, తురగ, పదాతి దళాలు

( చతురంగ బలాలు ) దూసుకుపోతుండగా, రెండు సముద్రాలూ ' ఢీ ' కొంటున్నాయా అన్నట్లుగా యిరుసేనలూ, ఏనుగుల ఘీంకారావాలతో, వీరుల సింహనాదాలతో, కురుక్షేత్ర రణరంగంలో  యెదురుబొదురుగా నిలిచాయి.  అని జనమేజయునకు వైశంపాయనుడు సర్పయాగం సమయంలో మహాభారతగాధ ఉద్యోగపర్వం లో వివరించాడని, నైమిశారణ్యంలో, శౌనకాది మహామునులకు, సూతమహర్షి చెప్పాడు.


ఉద్యోగ పర్వం సమాప్తం. 


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.


🙏🙏🙏

కామెంట్‌లు లేవు: