మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట
శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు
ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి ఎన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...
కాకినాడ శ్రీమతి ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల లో విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారి అమృత గానము గురించీ, వారి దేశ భక్తి గురించీ, వారి ఉదాత్తమైన గుణము గురించీ పూజ్య గురువులు ప్రస్తావించిన విషయములు.. శ్రీ ఘంటసాల గారి జయంతి సందర్భముగా..
తిరుమల కొండలకు వెళ్ళినప్పుడల్లా నాకు... "మహానుభావుడు ఘంటసాల గారు. ఆయన ఎక్కడ కూర్చుని చేస్తే ఏం! స్వామి యొక్క పవిత్రమైన సన్నిధానము ఈ ఏడుకొండల మీద ఆయన కంఠము వినపడుతూ ఉంటుంది. భగవంతుడు చెప్పినది భగవద్గీత. ఆయన చెప్పిన భగవద్గీత ఘంటసాల గారు చెబుతూ ఉంటే శ్రీ వేంకటేశ్వరుడు కూడా దేవేరులిద్దరితో కలిసి వింటాడు. 'నేను ఎంత గంభీరంగా చెప్పానో అంత గంభీరంగా చెప్తున్నాడు' అని ఈశ్వరుడు కూడా ప్రశంసిస్తాడు. ఆయన ధన్యుడు! ఆయన శరీరం వెళ్ళిపోయినా, ఆయన కీర్తి శరీరం మిగిలిపోయింది. ఒక మనిషి బ్రతుకు అంటే అలా ఉండాలి." అని అనిపిస్తూ ఉండేది. అందుకే నేను.. "అసలు ఈయన ఇలా ఎలా కాగలిగారు?" అన్న విషయము తెలుసుకోవాలి అని తాపత్రయ పడే వాడిని.
నా అదృష్టం, శ్రీ వరప్రసాద్ గారు ముద్రించిన "అమ్మకు జే! జే!! నాన్నకు జే! జే!! గురువుకు జే! జే!!" అనే పుస్తకము నేను చదివాను. అసలు ఆ పుస్తకము ప్రతీ ఇంట్లోనూ తల్లితండ్రులు పిల్లలచేత చదివించాల్సిన పుస్తకము. అందులో - "ఘంటసాల గారు చిన్నతనములో ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన తన చేతికున్న ఉంగరము అమ్మేసుకొని, విజయనగరములో సంగీతము నేర్చుకోవటానికి వెళ్తే, ఆయన వెళ్లగానే అక్కడ ఆయనకు ప్రవేశము లభించక, సాలూరులో కొన్నాళ్ళు సంగీతము నేర్చుకొని వచ్చి, ప్రతీ రోజూ సాయంకాలం ఒక తువ్వాలు పట్టుకొని, ప్రతీ ఇంటికీ బిక్ష కోసము వెళ్ళేవారు. ఎవరింట్లోనో భోజనము చేసి, ఒక హనుమ దేవాలయములో పడుకునేవారు. నేను విజయనగరము వెళ్లినప్పుడు ఆ హనుమ దేవాలయము చూద్దామని ఎందరినో అడిగి ఆ దేవాలయమునకు వెళ్లాను. అటువంటి దేవాలయము నేను ఎన్నడూ చూడలేదు. అక్కడ ఉన్న హనుమ ప్రత్యేకముగా గాంధర్వ వేదమును ఉపాసన చేస్తున్న హనుమ. ఆయన తాళము వేస్తూ, ఒక పక్కకు చూస్తూ, సంగీతము పాడుతూ, పరవశించిపోతూ ఉంటారు. చిన్న గుడి. ఘంటసాల గారు ఇల్లు లేక అక్కడ పడుకునేవారట. నాకప్పుడు అనిపించింది.. ఈయన ఏ రాత్రి నిద్రపోతూండగా స్వామి హనుమ వచ్చి బీజాక్షరాలు రాసేసాడో.. లేక తల మీద చెయ్యి పెట్టి వెళ్ళిపోయాడో.. మహానుభావుడు అందుకే ఆ కంఠం లోంచి అంతటి అమృత ఝరి వంటి సంగీతం వచ్చింది అని".
అంత కష్టపడిన వ్యక్తికి జీవితములో ఒక పెను మలుపు వచ్చింది. ఆకాశవాణి లో ఆయన పాడిన ఒక పాట విని, చలన చిత్రాలన్నిటిలో ఆయన చేత పాడించి, ఆయన గొప్ప వృధ్ధిలోకి వస్తున్న రోజుల్లో, స్వాతంత్ర సంగ్రామము చేస్తున్న పెద్దలందరినీ తీసుకెళ్ళి బ్రిటీష్ ప్రభుత్వము కారాగారములో పెట్టింది. ఇంతమంది పెద్దలు స్వాతంత్రము కోసం ఎలుగెత్తి పోరాటము చేస్తూంటే, నేనొక్కడినీ, నాకు బాగుంది.. మంచి అవకాశాలు, డబ్బు వస్తున్నాయని ఇలా ఉండిపోనా అని సిగ్గుపడి, ఆయన, ప్రజల్లోకి వెళ్ళి, దేశ భక్తి గీతాలు పాడుతూ, ఉపన్యసిస్తూ, కారాగారబధ్ధులై 18 నెలలు కారాగారవాసము చేసారు. నా వృధ్ధి కన్నా ఈ దేశము గొప్పది. తన ఆర్జన కన్నా దేశ సేవ గొప్పదని నమ్మిన గొప్ప దేశ భక్తుడాయన.
కష్టపడి ఆయన కొంత డబ్బు సంపాదించుకున్న రోజులు... ఆ రోజుల్లో, ఉత్తర భారతదేశము నుంచి ఆలీ ఖాన్ అని ఒక సితార్ విద్వాంసుడు చెన్నై కచేరీల కోసం వచ్చారు. ఆయన దురదృష్టం.. ఎవ్వరూ కచేరీ పెట్టుకోలేదు. ఆయన బాధతో వెళ్ళిపోతున్నారు. సాటి విద్వాంసుడు కష్టాలలో ఉన్నాడని, ఘంటసాల గారు ఆయనని ఇంటికి పిలిచి, ఆయనే కచేరీ పెట్టి, ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు తాంబూలము ఇచ్చి పంపించారు. అలాగే బడే గులాబ్ ఆలీ ఖాన్ అని ఒక హిందుస్తానీ గాత్ర విద్వాంసుడు చెన్నై వచ్చి, ఉండటానికి తగిన వసతి దొరకకపోతే ఘంటసాల గారు ఆయన్ని తన ఇంట్లోనే ఉండమన్నారు. ఆ విద్వాంసుడి స్థాయి ఎంత గొప్పదీ అంటే... ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు, ఎం ఎల్ వసంత కుమారి గారు వంటి వారు కూడా ఆయనకోసం వస్తూండేవారు. దానితో రోజుకి ఎంతో మందికి కాఫీలు, ఫలహారాలు, భోజనాలు వగైరా అన్నీ పెట్టి, ఆలి ఖాన్ గారు ఉన్నంత కాలం సంతోషంగా తన ఇంట్లోనే ఉంచుకుని సాగనంపారు ఘంటసాల గారు. తాను బాగా సంపాదిస్తూ, తన సాటి సంగీత విద్వాంసుడికి ఒక రూపాయి రాకపోయినా పట్టించుకోకుండా ఉన్న వారు కాదు ఘంటసాల గారు. అంత గొప్పది ఆయన మనసు. ఉదాత్తమైన గుణము ఆయనది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి