5, డిసెంబర్ 2020, శనివారం

పరమాచార్య స్వామివారు

 పరమాచార్య - పెరుమాళ్


కంచి వరదరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో, ఆరవ రోజు స్వామివారికి వేణుగోపాల స్వామి అలంకారం చేశారు. ఆ అలంకారంలో విరాజమానమై వెలుగొందుతున్న స్వామివారిని చూసి అర్చకులు సీమా భట్టార్ ఆనందపరవశులయ్యారు. ఊరెరిగింపులో భాగంగా శ్రీమఠం ముందుకు రాగానే, పరమాచార్య స్వామివారు బయటకు వచ్చి భక్తులందరితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.


ఆ దృశ్యాన్ని చూసి సీమా భట్టార్ భావోద్వేగానికి లోనయ్యారు. అప్పుడే ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. వేణుగోపాల స్వామివారిని చూస్తూ, హఠాత్తుగా ఒక్కసారి పరమాచార్య స్వామివారి వైపు తిరిగారు. కాని పరమాచార్య స్వామివారు కనపడలేదు. అక్కడ వేణుగోపాల స్వామి కనపడ్డారు. ఎంతగా పరికించి చూసినా మహాస్వామివారు కనపడడం లేదు. నోటమాట రాక అలా స్థాణువై నిలబడిపోయారు. కేవలం వారికి మాత్రమే అలాంటి దర్శనం జరిగింది.


ఈ సంఘటనతో పరమాచార్య స్వామివారు సాక్షాత్ వేణుగోపాల స్వామివారే అని సీమా భట్టార్ కు అవగతమైంది. తను ఏదైతే అనుకునాడో అది నిజమని మరొక సంఘటనలో రుజువు చేశారు మహాస్వామివారు.


అప్పుడు పరమాచార్య స్వామివారు తెనంబాక్కంలొ మకాం చేస్తున్నారు. సీమా భట్టార్ ను తీసుకునిరమ్మని సేవకులను ఆదేశించారు స్వామివారు. ఆయన వచ్చి స్వామివారి ముందు నిలబడ్డారు.


“ఈరోజు ఏమి తిథి?” అని అడిగారు పరమాచార్య స్వామి.


చిన్నగా “ఏకాదశి” అని చెపారు సీమా భట్టార్.


“ఉపవాసం మనకు మాత్రమే కదా? వరదునికి(వరదరాజ స్వామి) కాదు కదా?” అని పరమాచార్య స్వామివారు అడగగానే, భట్టార్ కాస్త కలవరపడ్డారు. “పెరుమాళ్ కి నైవేద్యం ఎందుకు సమర్పించలేదు?” అని అడిగారు స్వామివారు. ఈ ప్రశ్నతో భట్టార్ ఉలిక్కిపడ్డారు. జవాబు చెప్పలేక అతి కష్టంతో, “వెంటనే కనుక్కుంటాను” అని దేవాలయానికి పరిగెత్తారు.


విషయం ఏమిటని అడుగగా, దేవస్తానం వంటశాలలో కొంచం గందరగోళం వల్ల స్వామికి నైవేద్యం వండలేదు. వెంటనే ఆ సమస్యని పరిష్కరించి, ప్రసాదాలు వండించి నైవేద్యం చేశారు. నివేదన చేసిన ఆ ప్రసాదాన్ని మహాస్వామి వారికి సమర్పించారు.


పెరుమాళ్ కు నైవేద్యం పెట్టలేదని పరమాచార్య స్వామివారికి ఎలా తెలుసు? పోనీ ఆ విషయం తెలిసినా, దాని గురించి తాపత్రయ పడవలసిన అవసరం ఏమిటి? కాని భట్టార్ ఇలా ఆలోచించలేదు. ఎందుకంటే, పరమాచార్య స్వామివారే సాక్షాత్ కంచి వరదరాజ స్వామి అని భట్టార్ కు అనుభవం అయ్యింది.


ఎందరికో వారి వారి ఆరాధ్య దైవంగా పరమాచార్య స్వామివారు అగుపించారు. అన్ని దేవతా స్వరూపాలు ఉన్నది ఈ పరబ్రహ్మ స్వరూపంలోనే కదా! కేవలం భక్తీ, శరణాగతి మాత్రమె మనల్ని పరమాచార్య స్వామివారికి దగ్గర చేస్తుంది. శ్రేయస్సును కలిగిస్తుంది.


--- సీమా భట్టార్, కాంచీపురం. ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: