మణిద్వీపం
శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం
🌻 మణిద్వీపం అని తలచినంత మాత్రంగానే సకల దరిద్రాలూ.. దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి వేయిపడగల ఆదిశేషుడుకి కూడా సాధ్యం కాదు.
🌻 ఈ బ్రహ్మాండమును కనురెప్పపాటులో సృష్టించి లయం చేయగల ముప్పై రెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వమూ ఉండటంవలన ముప్పై రెండు రకాల పూలతో, పసుపు..కుంకుమలతో..నవరత్నాలతో.. రాగి, కంచు, వెండి, బంగారము మెదలగు లోహాలతో యథాశక్తి అమ్మవారికి పూజచేసుకుంటూ.. నైవేద్యాలుగా 32 రకాలు చేసి, సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసినిని పూజిస్తారు.
🌻 32 రకాల నైవేద్యాలకు శక్తి లేనివారు తమ శక్తి కొలది నైవేద్యాలను సమర్పించుకొని పూజించుకోవచ్చు. అమ్మకు భక్తి ప్రధానము.
🌻 మొగలి పూవు, బంతి పూవూ పూజకు పనికిరాదు. మందారాలలో, గులాబీలలో, చామంతులలో చాలా రకాలు ఉన్నా.. వాటన్నిటినీ ఒక్కొక్కటిగానే పరిగణించి ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
1. మల్లె పువ్వులు
2. గులాబి
3. సన్నజాజి
4. విరజాజి
5. సెంటుమల్లి
6. డిసెంబరం పువ్వులు
7. చామంతులు
8. లిల్లీ
9. ముద్ద గన్నేరు పువ్వులు
10. నందివర్ధనం
11. పారిజాత పువ్వులు
12. చంద్రకాంత పువ్వులు
13. సువర్నగన్నేరు పువ్వులు
14. కలువ పువ్వులు
15. పాటలీ పుష్పాలు
16. ముద్ద నందివర్ధనం
17. గన్నేరు పువ్వులు
18. కదంబ పువ్వులు
19. మందారాలు
20. తామరలు
21. కనకాంబ్రాలు
22. దేవగన్నేరు పువ్వులు
23. అశోక పుష్పాలు
24. నిత్యమల్లె పువ్వులు
25. కుంకుమ పువ్వులు
26. పొన్న పువ్వులు
27. మంకెన పువ్వులు
28. రాధా మనోహరాలు
29. కాడమల్లె
30. నాగమల్లె
31. విష్ణుక్రాంతం
32. రామబాణాలు లేక నూరు వరహాలు
33. దేవకాంచన పువ్వులు
34. చంపక ( సంపంగి)
35. పున్నాగ పుష్పాలు.
గమనిక:-
దయచేసి ఈ పువ్వుల రకాలన్నీ ఎక్కడ దొరుకుతాయో నన్ను అడగకండి.
ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంతే చేయండి.
మణిద్వీప వర్ణన మహత్యమేమిటి?
🌻 శ్రీచక్ర బిందు రూపిణి.. శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి..
శ్రీ మహావిద్య శ్రీ మహాత్రిపురసుందరి, శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. పద్నాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై వున్నారు. యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగానే ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని.. వర్ణించాలంటే మన శక్తి చాలదు. (నా శక్తి చాలదు). మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై వుంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో బాటు, బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు.
🌻 మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు.
అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే అదొక మహా వరం. అందుచేతనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి