🙏శివానందలహారీ🙏
తన వక్షసీమపై తన్నెదవని నెంచి
శంకించి పాఱును శమను డరయ
నిర్జరు లందఱు నీ పదయుగళిపై
మణిమయ మకుట0పు మహితమైన
భవ్యమౌ కాంతులు పరిఢవిల్లుచు నుండ
నీరాజనంబును నెఱపు చుండె
ముక్తి వధూకాంత మురిపంబు తోడను
కౌగలించెను నిన్ను గాఢముగను
సకల భక్తులకెల్లను స్వామి వీవ
యీప్సితార్థంబులందీర్చు నీశు డీవు
ధరణి వరములనిడు కల్పతరువు నీవు
దుర్లభం బేది త్వద్భక్త ధుర్యతతికి 65 #
ఈ ప్రపంచమునెల్ల ఈశ ! నీ క్రీడకై
సృష్టించినాడవు శ్రేష్ఠముగను
సకల జనంబులు సకల జీవంబులు
నీ క్రీడ మృగములే నిక్కముగను
నీ వల్ల బుట్టిన నిఖిల జీవంబుల
సలుపుచేష్ట లవెల్ల తెలియు నీకు
ప్రేమాస్పదా ! నీకు ప్రీతి కరంబులే
యవ్వారి నడవడు లరయ నెపుడు
శ్రీకరా ! నాదు పశుతుల్య చేష్టితములు
నరయ సత్కర్మ దుష్కర్మ లైన గాని
ప్రీతీ కరముగ నీకు సంప్రీతి నొసగ
మఱియు ననుగావ కర్తవ్య మవదె నీకు ?. 66 #
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి