🚩 _*మాఘ పురాణం*_🚩
🚩 _*14 వ అధ్యాయము*_🚩
*గురువారం*
*ఫిబ్రవరి 25, 2021*
🕉🌞🕉🌞🕉🌞🕉🌞
_*విప్రుని పుత్రప్రాప్తి*_
🕉️☘️☘️☘️☘️☘️☘️🕉️
గృతృనమద మహర్షిని జూచి జహ్నముని యిట్లనెను.
మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే, మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని యడుగగ, జహ్నమహర్షి యిట్లనెను. "జహ్నమునీ! వినుము. మాఘమాస వ్రతము నాచరించుటచే, ప్రాణికి యిహలోక సుఖములు, పరలోక సుఖములు, కలుగును. వారి కష్టములు తీరును, అందుచే సంతుష్టుడైన మానవుడింకను, హరి ప్రీతికరములగు వ్రతముల నాచరించి, జ్ఞానియై, సత్కర్మల నాచరించి, ముక్తినందును. అట్టి కథనొక దానిని చెప్పెదను వినుము" అని యిట్లు పలికెను.
పూర్వము గంగా తీరమున, బ్రాహ్మణుడొకడుండెను. అతడు వేదవేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతిదయజ్ఞానము, యింద్రియ జయము కలిగినవాడు. అతని భార్యయునుత్తమురాలు. వారికి సంతానము లేదను లోటు తప్ప, మరి దేనికిని లోటులేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడొకనాడు, భార్యతో, "గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు, అట్టి పుత్రుడొకడున్నను మన వంశమునకు, మనకును, సద్గతులు కలుగునాయని విచారపడెను". అప్పుడామె, "నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో? అందువలన మనకు సంతానము కలుగలేదనుకొందును"అని సమాధానము ఇచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడు," ప్రియా కష్టతరమైన తపము నాచరించి అయినను, శ్రీమన్నారాయణుని సంతుష్టిపరచెదను. పుత్ర వరమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి, నిశ్చలమైన తపముచేసి, మృకండు మహామునివలె, ఉత్తమ పుత్రవరమును కోరెదననియు పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించ వలెనని గంగాతీరమునకు పోయిరిl.
బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు, శ్రీహరిని, మనసులో నిలుపుకొని, తీవ్రమైన తపము ఆచరించెను. కొంత కాలమునకు, శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతులయందును, శంఖమును, చక్రమును, గదను ధరించియుండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణిభూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యులకాంతితో
నుండెను. శాంత భూషితమై ప్రసన్నతకల శ్రీహరి ముఖము, మకరమండలముల కాంతితో, మరింత శోభాయమానముగ నుండెను. నారదమహర్షి స్తుతించుచుండగా, అప్సరకాంతలు పాటలు పాడుచుండగా, లక్ష్మీసమేతుడై, గరుత్మంతుని పైనెక్కి, ఆ బ్రాహ్మణునకు, వరమీయవచ్చెను.
తనను గమనింపక, తీవ్రమైన తపమున నిమగ్నుడై యున్న బ్రాహ్మణుని చూసి, చిరునవ్వు నవ్వుచు, "విప్రా! నేను నీకు వరమునీయవచ్చితిని, నీ తపమునుమెచ్చితిని" అని పలికెను. శ్రీహరి యిట్లు పలికినను, ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై, బాహ్యజ్ఞానము లేని స్థితిలోనుండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి, నిశ్చల చిత్తముతో నతడు చేయుతపము, భగవంతుడగు శ్రీహరికి, మరింత ప్రీతి కలిగించెను. అతనికెట్టి వరమునైన, యీయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు, బాహ్యప్రపంచమునకు, మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా, నా బ్రాహ్మణుడు, కారణమేమని, కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే యెదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనందపరవశుడైన అతడు, శ్రీమన్నారాయణ మూర్తినిట్లు స్తుతించెను.
_*విప్రకృత విష్ణుస్తుతి*_
నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |
నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||
గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |
కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||
లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |
అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిలరూపిణే ||
యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |
జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||
సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వాఘనాశినే నమః |
కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||
నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |
విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||
సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |
హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||
పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |
ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||
జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |
వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||
జ్ఞానాయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |
ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||
నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |
గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||
కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే |
కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||
సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |
భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||
నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |
నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||
(శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు, భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము, అందరు చదువుట శ్రేయస్కరము)
జహ్నుమునీ! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి, ఆనంద పరవశుడై, నమస్కరించుచు నిలిచియుండెను, భగవంతుడు వరమును కోరుకొమ్మనెను శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు ''స్వామీ! నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తినిమ్ము, ఇహలోకమున, పరలోకమున, సద్గతికి కారణమైన, పుత్రసంతానమునిచ్చి, నాకు ముక్తినొసగుమ"ని కోరెను. శ్రీహరి, నీవు కోరినట్లే వరము నిచ్చితిని, నీవు చెప్పిన
యీ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివినవారికి, నేను శీఘ్రముగ ప్రసన్నుడనగుదునని పలికి, యంతర్థానము నుందెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కి లాభము నందినవానివలె సంతసింసించు, తన యింటికి చేరెను. కొంతకాలమునకు, వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.
కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి, వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములని చెప్పెను. తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య, బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని, వానిని, నిమురుచు, కన్నీరు కార్చుచు, నిట్టూర్పులు విడుచుచుండెను. విచారవదనముతో, ఆహారమును తీసికొనక, విచారించుచుండెను. "నాధా నీవు త్రీవ్ర తపమొనర్చి, వరముగా, నీ పుత్రుని పొందితివి. చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు, పండ్రెండు సంవత్సరములు జీవించి, విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా! నేనీ పుత్రశోకము నెట్లు సహింపగలను?" అని భర్తతో పలికెనుl.
ఆ విప్రుడును, భార్య మాటలను విని, బాధపడుచు, నామెనోదార్చ నిశ్చయించెను. ఆమె నూరడించుచు, యిట్లనెను. "ప్రియా దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది. అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయెట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా? నీకు, నాకును, యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు, మనము మరిణించిన తరువాతనైన, మరణింపక తప్పదు కదా! మరి యీ ముందు వెనుకలు, వయస్సులకు కలదు కాని, మృత్యువునకు లేదు. కావున నీవును శోకింపకుము. జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో, నీకు విచారమేల? నీవు దుఃఖించినను, కానున్నది కాక మానదు. అనగా, నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతిప్రాణియు, తాను చేసిన కర్మననుసరించి జన్మించును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా? కావున శోకింపకుము" అని, యామెనూరడించెను, "మరియు నిరర్థకమైన దుఃఖమును విడుపుము. శ్రీహరిని పూజించి, పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ నుండుము" అని పలికి, మరల గంగాతీరమున చేరి, నియమనిష్టలతో శ్రీహరిని, సర్వోపచారములతో, పూజించుచుండెను. శ్రీహరి, అష్టాక్షరీ మంత్రమును, జపించెను. శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది, ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు, శ్రీమన్నారాయణునకు, సాష్టాంగ నమస్కారము చేసి, నిలిచియుండెను.
*పదునాల్గవ అధ్యాయము*
*సమాప్తం*
🌹🌷🌼🛕🔔🌼🌷🌹
🙏🙏 *సేకరణ*🙏🙏
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి