24, ఫిబ్రవరి 2021, బుధవారం

మన మహర్షులు-32

 మన మహర్షులు-32


 యాజ్ఞవల్క్య మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


పూర్వం గంగానదీ తీరంలో ఉన్న చమత్కార పురంలో యజ్ఞవల్కుడు అనే బ్రాహ్మణుడుండేవాడు. అతడి భార్య సుకన్య. అతడు బ్రహ్మని గురించి తపస్సు చేసి బ్రహ్మవిద్యని వ్యాప్తి చెయ్యడానికి బ్రహ్మనే తనకు కొడుకుగా పుట్టమనడిగాడు


బ్రహ్మ సరేనన్నాడు. కార్తీక శుద్ధ ద్వాదశీ ఆదివారం ధనుర్లగ్నంలో యజ్ఞవల్కుడికి కొడుకుగా పుట్టాడు. ఆ పిల్లాడు బ్రహ్మగారంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతడికి యాజ్ఞవల్క్యుడు, బ్రహ్మరాతుడు, దైవరాతుడని పేర్లు పెట్టారు.


యాజ్ఞవల్క్యుడికి సమయ సందర్భ కాలోచితం గా సంస్కారాలన్నీ జరిపించి విద్య నేర్చుకుందుకు పంపించారు.


 ఋగ్వేదం పాష్కలుడి దగ్గర, సామవేదం జైమిని మహర్షి దగ్గర, అధర్వణ వేదం ఆరుణి ఋషి దగ్గర నేర్చుకున్నాక యాజ్ఞవల్క్యుణ్ణి వైశంపాయనుడి దగ్గరకి పంపించారు.


 ఆయన సేవ చేసుకుని గురువుగారితో మంచి వాడనిపించుకుని యజుర్వేదం, వేదరహస్యాలు, పరమార్ధ రహస్యాలు అందరికంటే ముందే నేర్చేసుకున్నాడు యాజ్ఞవల్క్యుడు.


కాని యాజ్ఞవల్క్యుడు నాకు అన్ని వేదాలు వచ్చు. నేను బ్రహ్మహత్యాపాతకం కూడ ఏడు రోజుల్లో పోగొట్టగలనని గర్వంగా అనడం మొదలు పెట్టాడు. గురువుగారికి ఇది తెలిసి నిజం తెలిసికోడానికి అతని గర్వం అణిగించడానికి తన మేనల్లుణ్ణి కాలితో తన్ని నా బ్రహ్మహత్యాపాతకం ఎవరైనా తగ్గిస్తారా? అని శిష్యుల్ని అడిగాడు.


యాజ్ఞవల్కుడు 'వాళ్ళకేం తెలుసు నాకే వచ్చు 'అన్నాడు. గురువుగారు కోపం వచ్చి మూర్ఖా! నాకు రాని విద్య నీ దగ్గరేముంది? నీ గర్వం అణగాలనే ఇలా చేశాను అన్నాడు వైశంపాయనుడు.


నేను చెప్పిన వేదాలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపొమ్మన్నాడు.


 శిష్యుడు ఎంత బ్రతిమిలాడినా వినలేదు గురువు .


గురుదేవా! మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తానని యాజ్ఞవల్క్యుడు రక్తం రూపంలో వేదాలన్నీ

అక్కడే వదిలేసి తపస్సు చేసి వైశంపాయనుడి బ్రహ్మహత్యాపాతకం పోగొట్టాడు.


ఆ రక్తం గడ్డలు కట్టి వుంటే తిత్తరపక్షులు తిని తిత్తరులనే వేదాలు చెప్పాయి. వాటినే “తెత్తిరీయోపనిషత్తు" అంటారు.


యాజ్ఞవల్క్యుడు సూర్యుణ్ణి ఆరాధించి శుక్లయజుర్వేదం నేర్చుకుని ఎంతో మంది శిష్యులు మళ్ళీ వాళ్ళకి

శిష్యుల్లో ప్రచారంలోకి తెచ్చాడు. యాజ్ఞవల్క్యుడి మొదటి శిష్యుడు కణ్వుడు.


ఒకసారి జనక చక్రవర్తి యాగం చేసి ఋషులందర్నీ పిలిచాడు. యాజ్ఞవల్క్యుడు కూడ వెళ్ళాడు. యాగం అయిపోయాక జనకుడు మీలో గొప్పవాడెవరో చెప్తే ఆయనకి ధనరాశుల్ని ఇస్తాననీ మీరే తేల్చుకుని చెప్పండి నాకంత శక్తి లేదని అన్నాడు.


ఎవరికి వాళ్ళు లేవలేదు. యాజ్ఞవల్క్యుడు మాత్రం శిష్యుల్ని పిలిచి ఆధనం ఇంటికి తీసికెళ్ళండి అన్నాడు.


 శాకల్యముని లేచి నువ్వే గొప్పవాడివని నీకు నువ్వే నిర్ణయించుకుంటావా? నాతో వాదించమన్నాడు.


శాకల్యమునితో వాదించి ఆయన్ని ఓడించాడు యాజ్ఞల్యుడు .జనకుడు ఆయనని సన్మానించి పంపాడు.


జనకచక్రవర్తి యాజ్ఞవల్క్యుణ్ణి అడిగి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నాడు.


తర్వాత విశ్వావసుడు యాజ్ఞవల్క్యుణ్ణి తత్త్వబోధన చెయ్యమని అడిగి విశ్వావిశ్వాలు, మిత్రావరుణులు, జ్ఞానజ్ఞేయాలు తపోతపాలు, సూర్యాతిసూర్యులు, విద్యావిద్యలు వేద్యావేద్యాలు వంటి చాలా విషయాల గురించి తెలుసుకున్నాడు.


మహర్షులందరూ కలిసి ఒక గొప్ప యోగికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అందరికంటే గొప్ప యోగరహస్యాలు తెలిసినవాడు యాజ్ఞవల్క్యుడేనని అతనికి యోగీంద్ర పట్టాభిషేకం మాఘశుద్ధ పౌర్ణమినాడు చేశారు.


యాజ్ఞవల్క్యుడు ఋషులకి చెప్పిన విషయాలే 'యోగ శాస్త్రం',

 'యోగయాజ్ఞవల్య్యం

అనే పేరుతో పన్నెండు అధ్యాయాలులో గ్రంథాలుగా వచ్చాయి.


 'యాజ్ఞవల్క్యస్మృతి' అనే గ్రంథంలో నాలుగు కాండలున్నాయి. మొదటి దాంట్లో

పధ్నాలుగు విద్యలు, పరిషత్తు, సంస్కాత, స్నాతకం, పౌరోహితం, వివాహం మొదలైనవి రెండో కాండలో న్యాయస్థానం, శిక్ష, స్త్రీధనం గురించి మూడు, నాలుగు, కాండల్లో అపరకర్మ, అశౌచశుద్ధి, యతి ధర్మాలు, మోక్షమార్గం, యమ నియమాలు, ప్రాయశ్చిత్తాలు మొదలైనవి.


చేసే పనులు, పొందిన జ్ఞానం రెండూ కలిస్తేనే మోక్షం కలుగుతుంది. ఒక్క జ్ఞానం వల్ల మోక్షం రాదని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: