17, జులై 2021, శనివారం

బ్రాహ్మణుల-ధర్మం

 బ్రాహ్మణులు వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తారు. మద్యమాంసాలను ముట్టరు.

బృంహ్  - విస్తరణే - అనే  ధాతువు నుండి బ్రహ్మ అనే పదము వచ్చింది. అంతటా వ్యాపించి ఉన్న చైతన్యము బ్రహ్మము. ఆ బ్రహ్మమునే అంతటా దర్శించేవాడు బ్రాహ్మణుడు.
బ్రాహ్మణులు వ్యక్తిగత సుఖాన్ని, స్వార్థాన్ని విడిచి పెట్టి, వైదికాచారాలను పాటిస్తూ, శాంతస్వభావులై, ఏకాంతప్రియులై, సత్యధర్మాచరణ చేస్తూ, దయాళువులై ఉంటారు.
*" బ్రాహ్మణస్య దేహోయం న సుఖాయ ప్రకల్పతే " !!*
బ్రాహ్మణుని శరీరము అతని సుఖం కోసం కాదు, లోక క్షేమం కోసం పరమాత్మ తో కల్పించబడింది. బ్రాహ్మణుడు తన సుఖం చూసుకోడు. సర్వ మానవాళి సంక్షేమం కోసం పాటు పడతాడు కనుక,  మిగతావారందరూ బ్రాహ్మణుని సంక్షేమం కోరాలి.
బ్రాహ్మణ కులములో  తాము వేదములోని ఏ  శాఖకు సంబంధించిన వారో, ఆ వేదశాఖను శిక్షాది షడంగాలతో పూర్తిగా అధ్యయనము చెయ్యటము బ్రాహ్మణుల కర్తవ్యము.  బ్రాహ్మణోచితమైన అధ్యయనము, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహాలనే షట్కర్మలను ఆచరించటం బ్రాహ్మణుల విధి.
*"యజనం యాజనం దానం*
*బ్రాహ్మణస్య ప్రతిగ్రహః !*
*అధ్యాపనం చాధ్యయనం*
*షట్కర్మాణి ద్విజోత్తమాః"!!*
అగ్ని ఆరాధన, యజ్ఞ నిర్వహణ బ్రాహ్మణుల కర్తవ్యములు. నాలుగు వేదాలను, వేదాంగాలను అధ్యయనం చెయ్యటం, శిష్యులకు బోధించటం బ్రాహ్మణుల పని. వీరు పాపరహితులై, శుద్ధ మనస్కులై ఉండాలి. వీరు ఇంద్రియాలను తమ వశములో ఉంచుకుని, ధర్మం తప్పకుండా జీవించాలి.

సేకరణ 
సుబుద జన విధేయుడు 
సి. భార్గవ శర్మ , న్యాయవాది. 

కామెంట్‌లు లేవు: