17, జులై 2021, శనివారం

పరమాచార్య ఇచ్చిన భరణం

 పరమాచార్య ఇచ్చిన భరణం


పంచపకేశన్ అనే ఒక పెద్దాయన 1952 దాకా శ్రీమఠంలో కైంకర్యం చేసేవారు. పరమాచార్య స్వామివారికి కైంకర్యం చెయ్యడమే ఆయన జీవితాశయం. కొద్దిగా అనారోగ్యం చేయడం వల్ల పరమాచార్య స్వామి వద్దనుండి సెలవు తీసుకుని తంజావూరు దగ్గరనున్న అతని స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. కంచి మఠాని వదిలి వెళ్ళినా అతను మాత్రం ప్రతినిత్యమూ పరమాచార్య స్వామివారిని ఆరాధించేవాడు. ఎల్లప్పుడూ స్వామివారి స్మరణ చేసేవాడు. స్వామివారి పూజ విషయంలో చిన్న అలసత్వాన్ని కూడా చేసేవాడు కాదు. అతనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. అందరికి పెళ్ళిళ్ళయ్యాయి. తన తండ్రి అంత అనారోగ్యంలో కూడా ఇంకా పరమాచార్య స్వామివారి కైంకర్యం చెయ్యడం చూసి, అతని పెద్దబ్బాయి ఇలా అన్నాడు.


“ఎందుకు నాన్న ఎప్పుడూ పరమాచార్య స్వామి వారి సేవలో తలమునకలై ఉంటావు? మీరు చదివిన చదువుకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేసినట్లైతే, మీకు ఈపాటీకి దండిగా ఫించను(భరణం)గా వచ్చేది. ఆ డబ్బుతో మీరు హాయిగా బ్రతకేవారు కదా, ఏమంటారు?”


“రేయ్! మహాస్వామి వారి కైంకర్యం చెయ్యాలంటే పెట్టిపుట్టుండాలి రా! నాకు ఆ అదృష్టం దక్కింది. ఆసేవలో స్వామివారికి దగ్గరగా ఉన్నాను. దాని వల్ల మీకు కలిగిన ఇబ్బంది ఏముంది? మంచి చదువులు చదువుకున్నారు. పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. కేవలం మనుష్య రూపంలో ఉన్న ఆ భగవంతుడే మనకు ఏలోటు రాకుండా చూసుకోగలడు” అంటూ తన కొడుకు అలా అనడంతో ఆవేదనగా చెప్పసాగాడు. 


”లేదు నాన్న, మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఉంటే ఈపాటికి మీకు పింఛను వస్తుండేది కదా అనే ఉద్దేశంతో నేను అలా అన్నాను” అని ఈ విషయం ఇంతటితో ముగించాడు. 


ఈ సంఘటన కొన్నిరోజుల తరువాత చెన్నైలో ఒక వివాహం జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన ఆ వివాహానికి అతని పెద్దబ్బాయి కూడా వెళ్ళాడు. పెళ్ళిక్రతువు ముగిసిన తరువాత వధూవరులిద్దరిని కంచికి తీసుకునివెళ్ళారు స్వామివారి ఆశీస్సులకోసం. పంచపకేశన్ పెద్ద కుమారుడు కూడా వారితో పాటు కంచి వెళ్ళాడు. ఒకరి తరువాత ఒకరు స్వామివారి అశీస్సులు అందుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇతని వంతురాగానే స్వామివారిముందు నిలబడ్డాడు. స్వామివారు తలెత్తి అతణ్ణీ చూసి, “నువ్వు పంచపకేశన్ కుమారుడివి కదూ?” అని అడిగారు. ఆశ్చర్యపడుతూ అవునని సమాధానమిచ్చాడు. “మీ తండ్రిగారు ఎలా ఉన్నారు? నాపై ఎంతటి భక్తి తెలుసా మీ నాన్నకి? వారిని బాగా చూసుకోండి. ఎంతమంది పిల్లలు మీరు?” మొదలైన విషయాలు అడిగారు. 


“ఈ మఠంలో సేవచేసేవారికి చాలా చెయ్యాలని నాకు ఆశ. కాని నేను ఇక్కడ మఠం పరిపాలకుణ్ణి మాత్రమే. కనుక పెద్దగా ఏమి చెయ్యలేను. ప్రజలు ఇచ్చినదానితో మఠాన్ని పరిపాలిస్తున్నాను. ఇది ప్రభుత్వ కార్యాలయం కాదుగా. అందరూ బావుండాలని ఆ పరదేవత కామాక్షిని ప్రార్థించడం తప్ప ఏం చెయ్యగలను. కాని మీ తండ్రి భక్తికి అతని ఈ మఠానికి చేసిన సేవకి తనకి ఏమైనా చెయ్యాలని నా ఆశ. కనుక ప్రతినెలా 25 కలాల(12 మరక్కల్ ఒక కలం, 8 లీటర్లు ఒక మరక్కల్) ధాన్యం అందుతుంది ‘భరణం’గా” అని అన్నారు. 


ఇది వినగానే అతడు స్వామివారికి సాష్టాంగపడి, ఏడ్చాడు. “సర్వేశ్వరా! కేవలం వారిగురించి ఆలోచించి అలా అన్నాను కాని మీకు చేసిన సేవని నేను నిందించలేదు. నన్ను క్షమించండి” అని వేడుకున్నాడు. ”నేను నిన్ను నిందించడం లేదు. పెద్ద సహాయం చెయ్యలేను కాబట్టి మీ నాన్నకి ఈ చిన్న ఏర్పాటు చేశాను” అని ఆ త్రికాలజ్ఞాని అతణ్ణి ఓదార్చాడు.


తన తండ్రిసేవకి ఈ ఫలితం చాలు అనుకున్న ఆ కుమారుడు కూడా తన తండ్రి దారిలోనే నడిచి పరమాచార్య స్వామివారికి సేవకుడయ్యాడు. ఈనాటికి నీడమంగళంలోని అతని ఇంటికి అతని భరణం ధాన్యం రూపంలో వస్తోంది. 


--- “కంచి మహనిన్ కరునై ఉళ్ళమ్” పుస్తకం నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

కామెంట్‌లు లేవు: