26, ఆగస్టు 2021, గురువారం

అజ్ఞాతకవి వ్రాసిన ఈ పద్యం

 కన్యకు నైదు జంఘలును; గన్యకు నాఱు కుచంబు; లెన్నగాఁ గన్యకు నాల్గు కన్బొమలు; కన్యకు నేడు విశాలనేత్రముల్; కన్యకు ద్వాదశంబు నులికౌనును; గల్గుసులక్షణాఢ్య కాకన్యకు నీకు నింకఁ బదికావలెఁ గస్తూరిరంగనాయకా!


ఎవరో అజ్ఞాతకవి వ్రాసిన ఈ పద్యం గమనింౘండి. అంతా గందరగోళంగా ఉంది కదా! ఈ పద్యం అర్థం కావాలంటే ముందుగా జ్యోతిష్యశాస్త్రంతో కించిత్తు పరిచయం కావాలి. 

అందుకు ప్రాతిపదికగా ద్వాదశరాసులు ఏమిటో ౘూద్దాం! 


అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం.


ఇప్పుడు చిక్కు విడిపోతుంది ౘూడండి. ఇదంతా ఒక కన్య గురించిన ప్రస్తావన కనుక, 'కన్యకు ఐదు జంఘలును (పిక్క)' అన్నాడు కనుక ఇప్పుడు ద్వాదశరాసుల్లో కన్యనుంచి మొదలుపెట్టి ఐదోరాశి ఏమిటో ౘూద్దాం! అది 'మకరం'. పిక్కలు మకరంతో పోల్చడం కవిసమయం! 


తరువాత 'కన్యకు ఆరు కుచంబు (స్తనం)', కన్య నుంచి ఆరోది కుంభం అంటే స్తనాలు కుంభాల్లాగా ఉన్నాయని


ఆ తరువాత 'కన్యకు నాల్గు కన్బొమలు'. కన్య నుంచి నాలుగవది ధనూరాశి, అంటే కనుబొమలు ధనుస్సులాగా ఉన్నాయని


ఆ తరువాత 'కన్యకు నేడు విశాల నేత్రముల్' అంటే ఆవిడ కళ్ళు మీనం అంటే చేపల్లా ఉన్నాయని


ఆ తరువాత 'కన్యకు ద్వాదశంబు నులికౌనును (నడుము)' అంటే ఆవిడ నడుము సింహం నడుములా సన్నగా ఉంది. 


ఇటువంటి సల్లక్షణాలు కలిగిన కన్య 'నీకు బది కావలె', అంటే పదోరాశి అనగా మిథునం, అంటే 'ఆవిడతో నీకు జత కుదరాలని' కస్తూరి రంగనాయకుడికి విన్నవిస్తున్నాడు.


ఆ పద్యం వివరణ చదవక ముందు కాస్తా వెగటనిపించినా చదివిన తరువాత కవి చమత్కారానికి జోహార్లు.

కామెంట్‌లు లేవు: