26, ఆగస్టు 2021, గురువారం

సంస్కృత మహాభాగవతం*

 *26.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - రెండవ అధ్యాయము*


*జనకమహారాజునకును - తొమ్మిదిమంది యోగీశ్వరులకును మధ్య జరిగిన సంవాదమును తెలుపుట - నారదుడు వసుదేవునివద్దకు వచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీనారద ఉవాచ*


*2.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*ఏవం తే నిమినా పృష్టా వసుదేవ మహత్తమాః|*


*ప్రతిపూజ్యాబ్రువన్ ప్రీత్యా ససదస్యర్త్విజం నృపమ్॥12222॥*


*నారదుడు ఇట్లనెను* "వసుదేవా! నిమి (జనకుడు) ఈ విధముగా అడిగిన పిమ్మట ఆ మహామహులు సదస్యులతోను, ఋత్విజులతోడను గూడియున్న ఆ మహారాజును అభినందించుచు పలికిరి.


*కవిరువాచ*


*2.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*మన్యేఽకుతశ్చిద్భయమచ్యుతస్య పాదాంబుజోపాసనమత్ర నిత్యమ్|*


*ఉద్విగ్నబుద్ధేరసదాత్మభావాద్విశ్వాత్మనా యత్ర నివర్తతే భీః॥12223॥*


*కవి ఇట్లు పలికెను* "ఓ రాజా! భక్తజనుల హృదయమునుండి ఎప్పుడును దూరము కానట్టి అచ్యుత భగవానుని చరణములను నిత్యము - నిరంతరాయముగా ఉపాసించుటయే ఈ సంసారమునందు మిగుల శ్రేయోదాయకమగును. సకలభయములు పూర్తిగా సమసిపోవును. అని నా నిశ్చితాభిప్రాయము. దేహ, గేహాదులవంటి తుచ్ఛమైన, అసత్తు పదార్థములయందు అహంకార - మమకారములను కలిగి యుండుటచే, మానవుల చిత్తవృత్తులు ఉద్విగ్నమలై పోవును. అట్టియెడ వారలు వైరాగ్యభావమును పొంది భగవంతుని పాదపద్మములను ఆశ్రయించినచో, వారిని ఆవహించిన భయములన్నియును పూర్తిగా మటుమాయమైపోవును.


*2.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*యే వై భగవతా ప్రోక్తా ఉపాయా హ్యాత్మలబ్ధయే|*


*అంజః పుంసామవిదుషాం విద్ధి భాగవతాన్ హి తాన్॥12224॥*


అజ్ఞానులైన పురుషులుగూడ సాక్షాత్తు భగవత్ప్రాప్తిని సులభముగా పొందుటకు ఉపాయములను ఆ శ్రీహరియే స్వయముగా తెలిపియుండెను. వాటినే భాగవత ధర్మములుగా ఎఱుంగుము.


*భాగవత ధర్మములు* శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము - ఇవి భాగవత ధర్మములు (వీరరాఘవీయ వ్యాఖ్య)


*2.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*యానాస్థాయ నరో రాజన్ న ప్రమాద్యేత కర్హిచిత్|*


*ధావన్ నిమీల్య వా నేత్రే న స్ఖలేన్న పతేదిహ॥12225॥*


నిమి (జనక) మహారాజా! ఈ భాగవత ధర్మములను అవలంబించినవానికి ఎన్నడును విఘ్నములు ఏర్పడవు. కనులు మూసికొని పరుండినను అనగా విధివిధానములో ఏదైన నొకలోపము వాటిల్లినను ఆ మార్గమునుండి స్ఖలితుడుగాడు (జాఱిపడిపోడు), పతితుడునుగాడు. అనగా ఫలమును పొందకపోడు.


*2.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వానుసృతస్వభావాత్|*


*కరోతి యద్యత్సకలం పరస్మైనారాయణాయేతి సమర్పయేత్తత్॥12226॥* 


*భాగవత ధర్మముల పాటించువాడు ప్రత్యేకమైన విశేషకర్మనే ఆచరింపవలయునను నియమము లేదు*


భాగవత ధర్మములను ఆచరించువాడు శారీరకముగా, వాచికముగా, మానసికముగా, ఇంద్రియముల ద్వారా, బుద్ధిద్వారా, అహంకారమువలన లేక అనేకజన్మల సంసారప్రభావముచే ఏర్పడిన స్వభావమువలన ఏకర్మను ఆచరించినను దానిని *శ్రీమన్నారాయణార్పణమస్తు* అనుచు సమర్పింపవలయును.


*2.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*భయం ద్వితీయాభినివేశతః స్యాదీశాదపేతస్య విపర్యయోఽస్మృతిః|*.


*తన్మాయయాతో బుధ ఆభజేత్తం భక్త్యైకయేశం గురుదేవతాత్మా॥12227॥*


పరమేశ్వరునకు విముఖుడైన మానవుడు మాయా ప్రభావమున తన నిజమైన స్వరూపమును మఱచిపోయి దేహాత్మభావమునకు (ఈ దేహమే నేను - అను భ్రమకు) లోనగును. దేహము మొదలగు అనిత్యవస్తువులపై ఆసక్తుడగుట వలన అతనికి వార్థక్యము, మృత్యువు, రోగములు మున్నగు పెక్కు భయములు ఏర్పడును. కనుక వివేకవంతుడగువాడు అధీతవేదాంతజన్య జ్ఞానసంపన్నుడైన (వేదార్థములను బాగుగా ఆకళించుకొని బ్రహ్మజ్ఞానమును పొందిన) గురుదేవుని ఆశ్రయించి, అనన్యభక్తిద్వారా భగవంతుని భజింపవలెను.


*2.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*అవిద్యమానోఽప్యవభాతి హి ద్వయో ధ్యాతుర్ధియా స్వప్నమనోరథౌ యథా|*


*తత్కర్మసంకల్పవికల్పకం మనో బుధో నిరుంధ్యాదభయం తతః స్యాత్॥12228॥*


వాస్తవముగా భగవంతుడు, ఆత్మ అనునది తప్ప మఱి యే వస్తువూ నిత్యముకాదు. కాని, అనిత్యమైన జగత్తునుగూర్చి ఆలోచించుట వలన స్వప్నావస్థలోను, జాగ్రదావస్థలోను ఏర్పడిన మనోరథములవలె అది (జగత్తు) నిత్యముగా భాసిల్లుచుండును. కనుక, వివేకియైనవాడు సాంసారిక కర్మలకు సంబంధించిన సంకల్ప వికల్పములను చేయునట్టి మనస్సును నిగ్రహింపవలెను. తత్పలితముగా భయరహితమైన స్థితి అనగా భగవత్ప్రాప్తి కలుగును.


*2.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*శృణ్వన్ సుభద్రాణి రథాంగపాణేర్జన్మాని కర్మాణి చ యాని లోకే|*


*గీతాని నామాని తదర్థకాని గాయన్ విలజ్జో విచరేదసంగః॥12229॥*


భక్తుడు దేహాభిమానరహితుడై శ్రీహరియొక్క అవతారములను గూర్చియు, మంగళకరములైన ఆ స్వామి లీలలను గురించియు వినుచుండవలెను. భగవత్స్వరూప, గుణప్రతిపాదకములైన గీతములను, నామములనుగూర్చి ఎట్టి బిడియమూ లేకుండా గానముచేయుచు అసంగుడై సంచరించుచుండవలెను.


*2.40 (నలుబదియవ శ్లోకము)*


*ఏవంవ్రతః స్వప్రియనామకీర్త్యా జాతానురాగో ద్రుతచిత్త ఉచ్చైః|*


*హసత్యథో రోదితి రౌతి గాయత్యున్మాదవన్నృత్యతి లోకబాహ్యః॥12230॥*


భగవంతుని జన్మ, కర్మ, నామాదిశ్రవణగానాత్మకమైన వ్రతమును అవలంబించుట వలన ఆ సర్వేశ్వరునిపై అంతులేని అనురాగము (భక్తిప్రపత్తులు) కలుగును. అందువలన అతని చిత్తము ఆర్ధ్రమగును. అంతట అతడు అసాధారణస్థితికి లోనగును. అప్పుడు పారవశ్యములో ఈ లోకమునే మరచిపోవును. భక్త పరాధీనుడైన భగవంతుని స్మరించుచు బిగ్గరగా నవ్వును, 'ఇంతకాలమువరకును నేను భగవంతుని ఉపేక్షకు గుఱియైతినే' యని ఏడ్చును. భక్త్యతిరేకముతో భగవంతుని పిలుచును. హర్షాతిశయముచే మధురముగా ఆ స్వామి గుణములను గానము చేయును. ఒక్కొక్కప్పుడు తనకు భగవంతుని సాక్షాత్కారము కలిగినట్లు అనుభవించుచు ఉన్మత్తునివలె ఒడలు మఱచి నృత్యము చేయును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


*26.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - రెండవ అధ్యాయము*


*జనకమహారాజునకును - తొమ్మిదిమంది యోగీశ్వరులకును మధ్య జరిగిన సంవాదమును తెలుపుట - నారదుడు వసుదేవునివద్దకు వచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉బ🕉🕉🕉


*2.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*ఖం వాయుమగ్నిం సలిలం మహీం చ జ్యోతీంషి సత్త్వాని దిశో ద్రుమాదీన్|*


*సరిత్సముద్రాంశ్చ హరేః శరీరం యత్కిం చ భూతం ప్రణమేదనన్యః॥12231॥*


ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, గ్రహములు, నక్షత్రములు, ప్రాణులు, దిశలు, వృక్షములు మొదలగునవియును, నదులు, సముద్రములును భగవత్స్వరూపములనియు, ఈ అన్ని (వీటన్నింటి) రూపములలో భగవంతుడే ప్రకటితుడు అగుచున్నాడనియు అతడు భావించును. అందువలన అతడు ఈ అన్నింటికిని భగవద్భావముతో ప్రణమిల్లును. అంతేగాక, తానును భగవంతునితో తాదాత్మ్యము చెందును.


*2.42 (నలుబది రెండవ శ్లోకము)*


*భక్తిః పరేశానుభవో విరక్తిరన్యత్ర చైష త్రిక ఏకకాలః|*


*ప్రపద్యమానస్య యథాశ్నతః స్యుస్తుష్టిః పుష్టిః క్షుదపాయోఽనుఘాసమ్॥12232॥*


భోజనము చేయుచున్నవానికి ఏకకాలముననే ముద్దముద్దకును తుష్ఠి (సుఖము), పుష్టి (శరీరపోషణశక్తి), ఆకలి తీరుట అనునవి జరుగుచుండును. అట్లే మానవుడు భగవంతుని శరణు జొచ్చి భజించునప్పుడు ప్రతిక్షణమునను భగవద్భక్తి, పరమాత్మతత్త్వజ్ఞానము యొక్క అనుభవము శబ్దాది విషయములయెడ విరక్తి ఏకకాలముననే జరుగును.


*2.43 (నలుబది మూడవ శ్లోకము)*


*ఇత్యచ్యుతాంఘ్రిం భజతోఽనువృత్త్యా భక్తిర్విరక్తిర్భగవత్ప్రబోధః|*


*భవంతి వై భాగవతస్య రాజంస్తతః పరాం శాంతిముపైతి సాక్షాత్॥12233॥*


నిమి (జనక) మహారాజా! ఈ విధముగా ప్రతిక్షణము అభ్యాసబలముచే భగవంతుని చరణకమలములను భజించు భక్తునకు దైవభక్తి, సంసారమునెడ విరక్తి, భగవత్స్వరూప గుణములయెడ స్ఫూర్తి తప్పక ఏర్పడును. అప్పుడు

 ఆ భాగవతోత్తముడు ప్రత్యక్షమైన పరమశాంతిని పొందును.


*రాజోవాచ*


*2.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*అథ భాగవతం బ్రూత యద్ధర్మో యాదృశో నృణామ్|*


*యథాఽఽచరతి యద్బ్రూతే యైర్లింగైర్భగవత్ప్రియః॥12234॥*


*నిమి (జనక) మహారాజు ఇట్లు ప్రశ్నించెను* 'మహాత్మా! భగవంతుని శరణుజొచ్చిన భాగవతోత్తముని యొక్క ధర్మము ఎట్టిది? మానవులమధ్య అతడు ఎట్లు చరించును? అతని స్వభావము ఎట్లు ఉండును? అతని భాషణము ఎట్టిది? ఏ లక్షణముల వలన అతడు భగవంతునకు ప్రీతిపాత్రుడగును? మొదలగు విషయములను అన్నింటిని దయతో విశదపరుచుము.


*హరిరువాచ*


*2.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*సర్వభూతేషు యః పశ్యేద్భగవద్భావమాత్మనః|*


*భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః॥12235॥*


*పిమ్మట 'హరి' యను యోగీశ్వరుడు ఇట్లనెను* "నిమి మహారాజా! పిపీలికాది బ్రహ్మపర్యంతముగల సకల ప్రాణుల యందును, తనయందును భగవంతుని ఉనికిని భావించువాడు అట్లే, భగవంతునియందు ఆత్మస్వరూపుడగు సమస్త ప్రాణులను దర్శించువాడు భాగవతోత్తముడనబడును.


*2.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*ఈశ్వరే తదధీనేషు బాలిశేషు ద్విషత్సు చ|*


*ప్రేమమైత్రీకృపోపేక్షా యః కరోతి స మధ్యమః॥12236॥*


సర్వేశ్వరునియందు భక్తిభావమును, భగవద్భక్తులయందు మైత్రిని, దుఃఖితులపైనను, పామరులయెడలను కృపను, అట్లే భగవంతుని ద్వేషించువారియెడ ఉపేక్షాభావమును కలిగియుండువాడు మధ్యమస్థాయికి చెందిన భక్తుడు.


*2.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*అర్చాయామేవ హరయే పూజాం యః శ్రద్ధయేహతే|*


*న తద్భక్తేషు చాన్యేషు స భక్తః ప్రాకృతః స్మృతః॥12237॥*


భగవంతునియొక్క అర్చామూర్తిని శ్రద్ధచూపనివాడు, ఇక ఇతరులయెడ ఏ మాత్రమూ శ్రద్ధ చూపనే చూపనివాడు సామాన్య భక్తుడని అనబడును.


*2.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*గృహీత్వాపీంద్రియైరర్థాన్ యో న ద్వేష్టి న హృష్యతి|*


*విష్ణోర్మాయామిదం పశ్యన్ స వై భాగవతోత్తమః॥12238॥*


భాగవతోత్తముడు ఇంద్రియములద్వారా శబ్దాది విషయములను గ్రహించుచున్నను అవి తన ఇచ్ఛకు అనుకూలముగా ఉన్నప్పుడు పొంగిపోడు. మరియు అతడు ఈ జగత్తంతయును విష్ణుమాయయేయని తలంచును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

కామెంట్‌లు లేవు: