*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*980వ నామ మంత్రము* 26.8.2021
*ఓం జ్ఞానగమ్యాయై నమః*
జ్ఞానముచే పొందదగినది అయిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జ్ఞానగమ్యా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం జ్ఞానగమ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి పరబ్రహ్మమును తెలుసుకోగలిగిన జ్ఞానమును పొందుటకు కావలసిన దీక్షాపటిమను అనుగ్రహించును.
సాధకునికి పరబ్రహ్మతత్త్వమును తెలియగలిగే జ్ఞానము ఉండవలెను. అట్టి జ్ఞానముతో మాత్రమే శ్రీమాతను తెలిసికోవడం జరుగుతుంది. వేదపండితుడైనను, సకల శాస్త్రపారంగతుడైనను, ప్రవచనములను చెప్పుటలో మంచి పట్టు ఉన్నవాడైనను, నీతిశాస్త్రములు ఎన్ని చదివినను మోక్షమును పొందడం కష్టం. తాను విన్నది, చదివినది మనసుకు పట్టించుకొని, పరబ్రహ్మతత్త్వాన్ని ఆకళింపుచేసుకుని దీక్షగా సాధనచేయాలి. జ్ఞానసముపార్జనకు కావలసిన సాధనాపటిమ కలిగియుండి, జీవాత్మపరమాత్మలు ఒకటే యనే అద్వైత భావనతో, జగన్మాత స్వరూపమును తన హృదయంలోని దహరాకాశంలో చిత్రించుకొని ఆరాధన చేస్తే లభించేదే బ్రహ్మజ్ఞానము. అట్టి బ్రహ్మజ్ఞానసముపార్జనతో ముక్తి లభించుతుంది. బ్రహ్మజ్ఞానస్వరూపమే జగన్మాత గనుకనే అమ్మవారు *జ్ఞానగమ్యా* యని అనబడినది.
*య త్తు మే నిష్కళం రూపం చిన్మాత్రం కేవలం శివమ్|*
*సర్వోపాధి వినిర్ముక్తం అనంత మమృతం పరమ్|*
*జ్ఞానేనైకేన తల్లభ్యం క్లేశేన పరమం పదమ్॥* (సౌభాగ్య భాస్కరం, 1072వ పుట)
'నాకు సకలము, నిష్కళము అని రెండు రూపములు కలవు. అందులో నా నిష్కళ రూపము శుద్ధజ్ఞానస్వరూపము. అది అమృతపరమైనది. నా నిష్కళరూపము కేవలము జ్ఞానముచేతనే పొందదగినది. ఎవరైతే సర్వత్ర జ్ఞానమును చూచుచున్నారో వారు నన్ను పొందుచున్నారు, కైవల్యముననుభవించుచున్నారు' అని శ్రీమాత చెప్పినట్లు కూర్మపురాణంలో ఉన్నది.
పరబ్రహ్మ జ్ఞానస్వరూపమగుటచే, అట్టి పరబ్రహ్మను పొందాలంటే జ్ఞానమే సరైన మార్గము గనుక పరమేశ్వరి *జ్ఞానగమ్యా* యని అనబడినది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం జ్ఞానగమ్యాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*397వ నామ మంత్రము* 26.8.2021
*ఓం మూలప్రకృత్యై నమః*
సమస్త జగత్తులకు మూలకారణమై తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మూలప్రకృతిః* యను ఐదక్షరముల నామ మంత్రమును *ఓం మూలప్రకృత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ మూలప్రకృతిస్వరూపిణియైన జగన్మాత, ఆ సాధకులు చేయు సాధనాపటిమను మరింత పటుత్వమొనరించి సాధనలో పరిపూర్ణతను సంప్రాప్తింపజేయును.
పాంచభౌతికమయిన చరాచరజగత్తుకు మూలమైనటువంటిది. అనగా పంచభూతములకు ములమైన ప్రకృతి ఆ పరమేశ్వరియే *మూలప్రకృతిః* అని అనబడినది.
పుట్టేబిడ్డకు తల్లిదండ్రులు మూలం. అనంతకోటి జీవాలకు మూలం ఈ పృథివి. అయితే ఈ భూమికి మూలం జలం. జలానికి మూలం అగ్ని. అగ్నికి మూలం వాయువు. వాయువుకు మూలం ఆకాశం. ఆకాశానికి మూలం పరబ్రహ్మ. ఇక ఈ పరబ్రహ్మకు మూలంలేదు. ఎందుకంటే జననమరణ చక్రభ్రమణమునకు అతీతమైనది ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ స్వరూపిణియైన పరమేశ్వరియే *మూలప్రకృతిః* అని యనబడుచున్నది.
సృష్టికి పూర్వము మాయలో కలిసి యుండిన అనంతకోటి జీవరాశులు పరిపక్వంకాని కర్మతో పరమాత్మలో లీనమై ఉంటాయి. కర్మపరిపక్వమయిన తరువాత సృష్టి జరుగుతుంది. ఈ కార్యములన్నియు పంచకృత్యపరాయణయైన పరమాత్మ నిర్వహించడం జరుగుతుంది. అటువంటి పరమాత్మయే *మూలప్రకృతిః* అని అనబడుతుంది.
మాయ అంటే వ్యక్తముకానిది. అందుచేత మాయనే అవ్యక్తము అంటారు. అటువంటి అవ్యక్తమునుండి మహత్తత్త్వము, ఆ మహత్తత్త్వమునుండి తమోగుణప్రధానమైన అహంకారము పుడుతుంది. ఆ విధంగా 1. సత్త్వము, 2. రజస్సు, 3. తమస్సు అను త్రిగుణములు ఉద్భవిస్తాయి. ఈ విధమైన సృష్టికి మూలమే మూలప్రకృతి. పంచకృత్య (సృష్టిస్థితిలయతిరోధాననుగ్రహములు) పరాయణ అయిన పరమేశ్వరియే *మూలప్రకృతిః* అనబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మూలప్రకృత్యై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి