*25.08.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - రెండవ అధ్యాయము*
*జనకమహారాజునకును - తొమ్మిదిమంది యోగీశ్వరులకును మధ్య జరిగిన సంవాదమును తెలుపుట - నారదుడు వసుదేవునివద్దకు వచ్చుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*2.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*తాన్ దృష్ట్వా సూర్యసంకాశాన్ మహాభాగవతాన్ నృప|*
*యజమానోఽగ్నయో విప్రాః సర్వ ఏవోపతస్థిరే॥12215॥*
వసుదేవ మహారాజా! సూర్యతేజస్సులతో వెలుగొందుచున్న ఆ కవి ప్రభృతి భాగవతోత్తములను గాంచి, యజమానుడైన జనకుడు, ఆకృతులను దాల్చిన త్రేతాగ్నులు, మహర్షులు, మున్నగువారు అందరును వారికి స్వాగతము పలుకుచు లేచి నిలబడిరి.
*2.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*విదేహస్తానభిప్రేత్య నారాయణపరాయణాన్|*
*ప్రీతః సంపూజయాంచక్రే ఆసనస్థాన్ యథార్హతః॥12216॥*
జనకమహారాజు వారిని శ్రీమన్నారాయణునియెడ భక్తితత్పరులుగా ఎరింగెను. పిదప వారిని సుఖాసీనులను గావించి, సంతోషముతో యథాయోగ్యముగా భక్తిశ్రద్ధలతో పూజించెను.
*2.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*తాన్ రోచమానాన్ స్వరుచా బ్రహ్మపుత్రోపమాన్ నవ|*
*పప్రచ్ఛ పరమప్రీతః ప్రశ్రయావనతో నృపః॥12217॥*
ఆ మహానుభావులు బ్రహ్మమానస పుత్రులైన సనకాదులవలె దివ్యతేజస్సంపన్నులై విరాజిల్లుచుండిరి. అప్పుడు జనక (నిమి) మహారాజు మిగుల వినమ్రుడై ప్రీతితో వారిని ఇట్లు ప్రశ్నించెను.
*విదేహ ఉవాచ*
*2.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*మన్యే భగవతః సాక్షాత్పార్షదాన్ వో మధుద్విషః|*
*విష్ణోర్భూతాని లోకానాం పావనాయ చరంతి హి॥12218॥*
*విదేహరాజు ఇట్లనెను* "మహాత్ములారా! మీరు సాక్షాత్తూ సర్వేశ్వరుడైన ఆ మధుసూదనుని (శ్రీహరి) యొక్క పార్షదులని భావించుచున్నాను. విష్ణుభక్తులు లోకములను పావనము చేయుటకే సంచరించుచుందురుగదా!
*2.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణభంగురః|*
*తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠప్రియదర్శనమ్॥12219॥*
అట్టి మనుష్యశరీరము (నరజన్మ) లభించుట ఎంతయు దుర్లభము. ఐనను అది క్షణభంగురమైనధి. అట్టి మానవాళికి మీవంటి పరమ భాగవతోత్తముల దర్శనము లభించుట మరింత దుర్లభము.
*2.30 (ముప్పదియవ శ్లోకము)*
*అత ఆత్యంతికం క్షేమం పృచ్ఛామో భవతోఽనఘాః|*
*సంసారేఽస్మిన్ క్షణార్ధోఽపి సత్సంగః శేవధిర్నృణామ్॥12220॥*
మహానుభావులారా! ఈ లోకమున పరమశ్రేయస్సును గూర్చునది ఏది? దానిని పొందుటకు ఉపాయమేమి? ఈ లోకమున మహాత్ములతో సమాగమము అర్ధక్షణమ లభించినను అది మానవులకు పెన్నిధివంటిది గదా! దీనిని గూర్చి వివరింపప్రార్థన!
*2.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*ధర్మాన్ భాగవతాన్ బ్రూత యది నః శ్రుతయే క్షమమ్|*
*యైః ప్రసన్నః ప్రపన్నాయ దాస్యత్యాత్మానమప్యజః॥12221॥*
యోగీశ్వరులారా! వినుటకు మేము యోగ్యులమైనచో, మీరు దయతో మాకు భాగవత ధర్మములను ఉపదేశింపుడు. అట్టి ధర్మములను ఆచరించి, శరణాగతుడైన భక్తునిపట్ల భగవానుడు మిగుల ప్రసన్నుడగును. అంతేగాదు, కరుణామూర్తియగు భగవంతుడు అట్టి భక్తునకు తనను తానే ఇచ్చివేయును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235g
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి