10, అక్టోబర్ 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం

 *10.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదమూడవ అధ్యాయము*


*భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*13.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*గుణేష్వావిశతే చేతో గుణాశ్చేతసి చ ప్రజాః|*


*జీవస్య దేహ ఉభయం గుణాశ్చేతో మదాత్మనః॥12711॥*


నాయనలారా! వాస్తవముగా జీవుడు నా స్వరూపమే. కాని అభినివేశకారణముగా చిత్తము గుణములయందు (విషయములయందు) ప్రవేశించును. సర్వదా వాటిని చింతించుటవలన గుణములు ఆ చిత్తమునందు లోతుగా పాదుకొనును. ఈ విధముగా గుణములు, చిత్తము, ఈ రెండును జీవుని దేహమునకు (ఉపాధికి) సంబంధించినవి.


*13.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*గుణేషు చావిశచ్చిత్తమభీక్ష్ణం గుణసేవయా|*


*గుణాశ్చ చిత్తప్రభవా మద్రూప ఉభయం త్యజేత్॥12712॥*


కావున ఆత్మకు చిత్తముతోగానీ, విషయములతోగానీ ఎట్టి సంబంధమూ లేదు. (గుణములచే నిర్మితమైనది స్థూలశరీరము. చిత్తము వలన ఏర్పడినది సూక్ష్మశరీరము. అనాత్మ పదార్థముల అభినివేశకారణముగా జీవుడు కర్మలయందు చిక్కుకొనును. వాసనామయ శరీరమునుగూడ నిర్మించుకొనును. వీటి అన్నింటికిని అజ్ఞానమే కారణము). విషయములను పదేపదే అనుభవించు చుండుటవలన చిత్తము ఆ విషయములయందు చొచ్చుకొనిపోవును. చిత్తముయొక్క సంకల్పవికల్పముల వలననే ఈ విషయములు ఉత్పన్నములగును. సాధకుడు తన చిత్తమును పెడదారి పట్టకుండగను, విషయముల చింతన చేయకుండగను నిరోధింపవలెను. నిరంతరము నాయందే చిత్తమును నిలిపి ఉంచవలెను. గుణములను నా స్వరూపముగా భావించి నా యందే అర్పించవలయును. ఈ విధముగా రెండింటీని నా యందే త్యజింపవలెను.


*13.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*జాగ్రత్స్వప్నః సుషుప్తం చ గుణతో బుద్ధివృత్తయః|*


*తాసాం విలక్షణో జీవః సాక్షిత్వేన వినిశ్చితః॥12713॥*


జాగ్రత్-స్వప్న-సుషుప్తి' అను మూడు అవస్థలును క్రమముగా సాత్త్విక, రాజస, తామస గుణములను అనుసరించుచుండెడి బుద్ధియొక్క వృత్తులు మాత్రమే. జీవుడు వీటి అన్నింటికి సాక్షిభూతుడు అనియు, ఈ మూడు ఆవస్థలకును అతీతుడు అనియును సిద్ధాంతరూపముగా ఆమోదింపబడినది.


*13.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*యర్హి సంసృతిబంధోఽయమాత్మనో గుణవృత్తిదః|*


*మయి తుర్యే స్థితో జహ్యాత్త్యాగస్తద్గుణచేతసామ్॥12714॥*


గుణముల వృత్తులయందు చిత్తము తిరుగాడుచున్నంతవరకు జీవునకు సంసారబంధము నివృత్తి కానేరదు. కావున, గుణములను, చిత్తమును ఈ రెండింటిని నాయందే త్యజించి, తురీయమగు నాయందు నిష్ఠుడై యుండవలెను.


*13.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*అహంకారకృతం బంధమాత్మనోఽర్థవిపర్యయమ్|*


*విద్వాన్ నిర్విద్య సంసారచింతాం తుర్యే స్థితస్త్యజేత్॥12715॥*


*నేను-నాది* అను అహంకారమే బంధములకు మూలము. అది జీవుని - పరమపురుషార్థములను దూరమొనర్చును. కావున విద్వాంసుడు (జ్ఞాని) తురీయావస్థయందు స్థితుడై బంధకారకమైన సంసారచింతను త్యజింపవలెను.


*13.30 (ముప్పదియవ శ్లోకము)*


*యావన్నానార్థధీః పుంసో న నివర్తేత యుక్తిభిః|*


*జాగర్త్యపి స్వపన్నజ్ఞః స్వప్నే జాగరణం యథా॥12716॥*


*దేహమే ఆత్మ* యని భావించెడి నానాత్వభ్రమ తొలగనంతవరకు, జీవుడు మేల్కొనియున్నను అజ్ఞానమనెడి నిద్రలో మునిగి యున్నవాడే అగును. అజ్ఞాని స్వప్నజగత్తులో సంభవించునట్టి సుఖదుఃఖములను సత్యములని భావించునట్లు, జాగ్రదవస్థయందుగూడ క్షణికములైన సాంసారిక సుఖ దుఃఖములు యదార్థములని భ్రమించుచుండును.


*13.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*అసత్త్వాదాత్మనోఽన్యేషాం భావానాం తత్కృతా భిదా|*


*గతయో హేతవశ్చాస్య మృషా స్వప్నదృశో యథా॥12717॥*


వాస్తవముగా ఆత్మకు దప్ప అన్యమైన దేహాది నామరూపాత్మకమైన ప్రపంచమునకు మరి దేనికిని *ఉనికి* లేదు. కావున స్వప్నావస్థలోనున్న వాని క్రియలన్నియును మిథ్యలైనట్లే, భేదబుద్ధి కారణముగా కలుగునట్టి వర్ణాశ్రమాది భేదములు, స్వర్గాది ఫలములు, వాటి కారణములగు కర్మలు ఇవన్నియును మిథ్యలే. ఆత్మజ్ఞానము కలిగినంతనే ఈ నానాత్వభ్రమ తొలగిపోవును.


*13.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యో జాగరే బహిరనుక్షణధర్మిణోఽర్థాన్ భుంక్తే సమస్తకరణైర్హృది తత్సదృక్షాన్|*


*స్వప్నే సుషుప్త ఉపసంహరతే స ఏకః స్మృత్యన్వయాత్త్రిగుణవృత్తిదృగింద్రియేశః॥12718॥*


జాగ్రదవస్థయందు సమస్త ఇంద్రియములద్వారా బాహ్యముగ గోచరించెడి క్షణభంగురములైన పదార్థములను అన్నింటిని అనుభవించువాడు (విశ్వుడు) స్వప్నావస్థలో హృదయమునందే, జాగ్రదావస్థలో చూచిన పదార్థములను పోలినవాటి వలనే వాసనామయ విషయములను అనుభవించును (తైజసుడు). ఇక సుషుప్తి అవస్థలో ఆ విషయములను అన్నింటినీ ఉపసంహరించుకొని వాటి లయమును కూడా అనుభవించును (ప్రాజ్ఞుడు). ఈ ముడింటిని అనుభవించినది ఒక్కడే. జాగ్రదవస్థయొక్క ఇంద్రియములకు, స్వప్నావస్థలోని మనస్సునకు, సుషుప్తియొక్క సంస్కరింపబడిన బుద్ధికి కూడా అతడే స్వామి. ఏలనన, త్రిగుణాత్మకములగు ఈ త్రివిధ అవస్థలకు అతడే సాక్షిగా ఉండును. స్వప్నము చూసిన నేనే, గాఢనిద్ర (సుషుప్తి) లో ఉన్నాను. ప్రస్తుతము మెలకువతో (జాగ్రదవస్థలో) ఉన్నది కూడా నేనే - అను ఇట్టి స్మృతి యొక్క బలమువలన ఒకేఒక ఆత్మ అవస్థలన్నింటిలోనూ ఉండునని స్పష్టముగ ఋజువగుచున్నది.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: