10, అక్టోబర్ 2021, ఆదివారం

రసాభసా

 రసాభసా

                        ------------

     ఎప్పటిలాగే ఆ సభా మందిరం దీపకాంతులతో ధగధగలాడుతోంది!సాయం సంధ్యవేళ నిత్యం కళార్చనతో విలసిల్లే క్షేత్రమది.నగరంలో కళాప్రియులు,సాహితీ ప్రియులు సాయంవేళ సేదతీరి ఒయాసిస్ అది!

   "ఈ రోజు ఏమి కార్యక్రమాముందని!?" ఎవరినైనా ప్రశ్నిస్తే "తిరుమల క్షేత్రం లో ఏ కార్యక్రమాముందంటే ఏమని చెబుతాం!నిత్య కళ్యాణం పచ్చతోరణం!ఇక్కడ కూడా అంతే!"అని చమత్కారంగా సమాధానమిస్తారు.

 ప్రతి రోజు సాయంత్రం ఎదో ఒక సాహితీ సదస్సు,లేదా కళా కార్యక్రమం ,కవులు కళా కారులకు సన్మానాలు!

  ఆ రోజుకూడా యధావిధిగా కార్యక్రమం సాగుతోంది.రోజువచ్చే పెద్దలే వేదిక మీద కుడి ఎడమగా ఆసీనులై వున్నారు.సభికులు కూడా,ఒకరు ఆరా తప్ప దాదాపుగా రోజు వచ్చే వాళ్ళే!సాయంత్రమాయె సరికి వాళ్ళ కాళ్ళు ఇక్కడికే దారి తీస్తాయి.సత్కాలక్షేపం మంచిదేగా!వాళ్లంతా కూడా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చుని వున్నారు.మైకులో ఒకాయన ఘంటసాల గీతాన్ని ఖంగున పాడుతున్నాడు.(ఆయన కూడా ఆస్థాన విద్వాన్సుదేని వేరుగా చెప్పనవసరం లేదు).పాట ముగియడంతో అంతా చప్పట్లు కొట్టారు.సభాధ్యక్షుడు రోజు చెప్పే మాటలనే మలిచి కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు!అంతా రొటీన్ గా జరిగేదయితే మనం మాట్లాడుకోవాల్సిందేముందంటారా!అక్కడే వుంది అసలు కధ! 

  ఆ రోజు ప్రత్యేకత ఏమిటంటే,నగరమంతా రెండు మూడు రోజులుగా ముసురుపట్టి వానలు దంచికొడుతున్నాయి!గత సంవత్సరం కూడా ఇదే రోజులలో కుంభవృష్టితో రోడ్లు వాగులయ్యాయి.ఇండ్లు చెరువులై తల్లడిల్లి పోయారు.తేరుకోవడానికి చాలా కాలం పట్టింది.అటువంటి పరిస్థితులలోకూడా ఈ సభ జరగడం విశేషం!

 అలా జరగడానికి ఎవరి ఒత్తిడులు వాళ్ళకున్నాయి.వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సభను వాయిదా వేద్దామని నిర్వాహకుడు ఆ రోజు సన్మానం పొందాల్సిన కవులు కళాకారులను సంప్రదించాడు.వాళ్ళు వొప్పలేదు!తాము ఎట్టి పరిస్థితుల్లోనైనా వస్తామని ,ఒక వేళ అదే జరిగితే భవిష్యత్తులో ఆ నిర్వాహకుడి కార్యక్రమాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.దానితో ఆయన గొంతులో వెలక్కాయ పడింది.వారానికి ఒకటో రెండో కార్యక్రమాలు చేయక పోతే ఆయనకు పొద్దుపోదు!దాని ద్వారా ఆర్ధిక లభ్ది,ఉపలబ్ధి వున్నాయనుకోండి!వాటిగురించి మనం మాట్లాడ కూడదు!సరేని ముఖ్య అతిధి,ఇతర వక్తలతో మాట్లాడాడు.వాళ్ళు వస్తామన్నారు.మాకు పోయిందేముంది,రిటైర్ అయి కూర్చున్నాం!పడవలాంటి కారులో డ్రైవర్ ను పెట్టుకుని వచ్చి మాట్లాడి ఎంచక్కా పోతామని అన్నారు.పాపం వాళ్ళు ఆ వేదికలకు,మైకులకు,పేపర్ లో వచ్చే ఫోటో లకు అలవాటు పడిపోయారు.సభా ప్రాంగణం యాజమాన్యం యధావిధిగా హాలు తెరిచే ఉంటుందని చెప్పింది.ఈ సమీకరణాల్లో ఈ సభ తప్ప లేదు.మల్లి సభలోకి వద్దాం!

  ప్రసంగాల మధ్యలోనే కవిత్వాలు సాగుతున్నాయి.సభాధ్యక్షులవారు,అర్జునుడు రధం తొలినంత సులభంగా సభను నడిపిస్తూ రక్తికట్టిస్తున్నారు.అందుకే చాలా సంఘాలకు ఆయనే అభిమాన సభాధ్యక్షుడు!బయటి వర్షం తాలూకు శబ్దం,హోరు మైక్ శబ్దాలను అధిగమిస్తూ అప్పుడప్పుడు హాలు లోపటికి చొచ్చుకొస్తోంది.అలవాటుగా హాలులోకి వచ్చి పడినవారు తిరిగి వెళ్లిపోవాలని ఆలోచనకు వస్తున్నారు.ఇంతలోనే ఫెటేలుమని ఉరుముల శబ్దం!కరెంటు పోయింది.కొద్దీ సెకండ్ లలోనే జనరేటర్ ఆన్ అయి దీపాలు వెలిగాయి.ఆ చీకట్లో సగం హాలు ఖాళీ అయింది.

  విలేఖరులు,ఫొటోగ్రాఫేర్ లు నిర్వాహకుడిని వేదిక పక్కకు పిలిచి,నగరం లో వర్షం జోరు పెరుగుతోందని, తమకు ఇచ్చేది ఇచ్చేస్తే తమ దారీ తాము చూసుకుంటామని కరపత్రాన్ని చూసి వార్తలు రాసుకుంటామని తీసిన ఫోటోలు చాలని డిమాండు చేస్తున్నారు.వేదిక ముందు వరసలో కూర్చుని వున్న కవులు ఈ తతంగాన్నంతా ఓ కంట కనిపెడుతూనే వున్నారు.వాళ్లలో ఓ ముదురు కవి నిర్వాహకుడిని పిలిచి తమ సన్మానం ఫోటో లు రేపు పత్రికలలో రాకపోతే ఊరుకునేది లేదని విలేఖరులు,ఫొటోగ్రాఫేర్ పోవడానికి వీలు లేదని హెచ్చరించాడు.ఆ నిర్వాహకుడు అలాగే నంటూ వెర్రి నవ్వుతో సర్దిచెపుతున్నాడు.

  వేదికమీది పెద్దలు ఇవేమి పట్టనట్టు ప్రసంగాలు చేస్తున్నారు.ఛలోక్తులు వేస్తున్నారు.ఇలా నిర్వాహకులు,కవులు,కళాకారులు,విలేఖరులు,వేదికమీది పెద్దల మధ్య పితకాలాటం నడుస్తోంది.ఇంతలో నిర్వాహకుడికి ఫోన్ రావడంతో ఆయన మాట్లాడుకుంటూ హడావుడిగా బయటకు వెళ్ళిపోయాడు.అప్పటికే వేదికమీదున్న ఇద్దరు వక్తలు సభాధ్యక్షుడి అనుమతి తీసుకుని గంభీరంగా నడుచుకుంటూ హాల్ నుండి బయట పడ్డారు.విలేఖరులు కూడా ఒకరితర్వాత ఒకరు చెవికి సెల్ ఫోన్ ఆనించుకుని ఎదో కాల్ లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ జారుకున్నారు.ఈ సెల్ ఫోన్ తో ఇదో సౌకర్యం వుంది కదా!దాన్ని వినియోగించుకున్నారు!ఇక వేదిక మీద మిగిలింది సభాధ్యక్షుడు,సన్మానం చేయాల్సిన పెద్ద మనిషి!వేదికకింద మిగిలింది సన్మానం పొందాల్సిన కవులు,కళాకారులు మాత్రమే!సభామందిరం పూర్తిగా ఖాళీ అయింది.ఇదేమి కొత్త కాదండోయ్!రోజు జరిగే తంతే ఇది!అందుకే కెమెరా ఎప్పుడు వేదిక మీదకే పెట్టి ఫోటోలు తీస్తారు.వాళ్ళ చాతుర్యం వాళ్ళది!అందువలన సభలో మిగిలిన వాళ్ళు నిశ్చిన్తగా నిర్వాహకుడి కోసం ఎదురు చూస్తూ కబుర్లాడుకొంటున్నారు.

  ఇంతలో ఆ హాల్ వాచ్ మాన్ హడావుడిగా లోపలకు పరిగెత్తికొచ్చి"అయ్యా!అందరు పారిపోండి!నీళ్లు మన రోడ్ మీద ప్రవాహాంగా వస్తున్నాయి.ఈ హాల్ కూడా మునిగి పోవచ్చు."అని అంటూనే బయటకు పరిగెత్తి పోయాడు.వేదిక మీద పెద్ద వాళ్ళు కూడా తమ డ్రైవర్ లు రావడం తో మారు మాట్లాడకుండా బయటకు దారి తీశారు.

   శాలువాలు,పూలదండలు,ఫోటో లు,మెమెంటోల కోసం చివరి వరకు ఆశతో ఎదురు చూసిన కవులు ఆశాభంగమైనందుకు ఖిన్న వదనాలతో నిర్వాహకుడిని తిట్టుకుంటూ అలాగే స్థాణువులై ఉండి పోయారు.వాళ్లకు తెలియని విషయం మేమిటంటే ఆ నిర్వాహకుడి ఇల్లు వర్షం లో మునిగి పోయిందని ఫోన్ రావడం తో ఆయన ఎప్పుడో ఆగమేఘాలమీద ఇంటికి వెళ్ళిపోయి అక్కడ వరద నీళ్లలో తలమునకలవుతున్నాడు!ఇంతలో సభా మందిరం లోకి వర్షపు నీరు రావడం మొదలైంది.జనరేటర్ ఆపి వేయడంతో చిక్కని చీకట్లు హాల్ లో కమ్ముకున్నాయి.ఉరుములు మెరుపుల శబ్దాలు భయంకరంగా వినబడుతున్నాయి.ఓ మంచి ప్రకృతి కవిత్వం రాయడానికి అనువైన వాతావరణం గదా!

                                        -------

                                                                                         -సుగుణాకర్   

(ఇంతటి వర్ష బీభత్సం లో కూడా నగరం లో సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విస్తున్న ధీరులకు అంకితం.)

కామెంట్‌లు లేవు: