10, అక్టోబర్ 2021, ఆదివారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*445వ నామ మంత్రము* 10.10.2021


*ఓం మత్యై నమః*


అనంతకోటి జీవరాశులలో మతి (బుద్ధి) స్వరూపిణిగా ఉన్న పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మతిః* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం మత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి చక్కని బుద్ధిని (మతిని) కలుగజేసి, అనంతమైన బ్రహ్మజ్ఞానసంపదను సంప్రాప్తింపజేసికొను దిశగా వారి సాధనను కొనసాగునటులు అనుగ్రహించును.


*యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా|*


*నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ:॥*


'అనంతకోటి జీవరాశులలో బుద్ధిరూపములో విలసిల్లు పరమేశ్వరికి నమస్కరిస్తున్నాను' 


'వేదప్రమాణమునందు ఆసక్తిగలదియు, మంగళప్రదమైనదియు, శ్రేష్ఠమగు అనుభవరూపమగు ఏ మతి (బుద్ధి) గలదో అదియే శివా (పార్వతీ) స్వరూపురాలు. ఆమె కేశవుడు మొదలగువారిచే సేవింపబడుతున్నది. ఆమె అత్యంత కైవల్య సుఖమును కలిగించునది. అటువంటి దేవికి నమస్కరించుచున్నాను' అని సూతసంహితయందు గలదు.


 అనంతకోటి జీవరాశులలో ఆ పరమేశ్వరి బుద్ధిరూపంలో ఉన్నది గనుకనే కంటికి దృశ్యశక్తి, నాసికకు ఘ్రాణశక్తి, నాలుకకు రసశక్తి, చర్మానికి స్పర్శశక్తి, చెవులకు శ్రవణశక్తి - ఇలా ఆయా ఇంద్రియాలలో ఆయాశక్తుల రూపాలలో ఉంటూ ఇంద్రియములను పనిచేయిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన మనసునందు బుద్ధిరూపంలో ఉన్నప్పుడు ఆయా జీవుల కర్మవాసనలననుసరించి ప్రవర్తించుట జరుగుతుంది.


సాధకులు అంతర్ముఖంగా సాధనచేయునపుడు జీవాత్మ, పరమాత్మల ఐక్యత అను అద్వైతభావనాజ్ఞానము కలిగించి సాధనాపటుత్వము ద్వారా పరబ్రహ్మతత్త్వమును పొందు దిశగా సాధనకొనసాగింపజేయును గనుకనే పరమేశ్వరి *మతిః* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మత్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: