21, జనవరి 2022, శుక్రవారం

నాగు అంటే

 నాగు అంటే చిరంజీవి నటించిన సినిమా కాదు, ఇది రైతులు చెల్లించాల్సిన వడ్డిపేరు.

........................................................


ఎదైనా కాయకుకాని పండుకు కాని ధాన్యానికి కాని అవి కాసే కాయలనుండి పూవులనుండి లేదా ఆకులనుండి పేర్లు ఏర్పడటం సహజం.ఉదా॥ మామిడిచెట్టుకు మామిడికాయల వలన, గోధుమకు గోధుమగింజల వలన తమలపాకుల చెట్టుకు తమలపాకుల వలన పేర్లు కలిగాయి. వరికి వడ్లని వరి గింజలకు (ధాన్యానికి) బియ్యమని పిలుస్తాము. ఇలా పిలవడం కాస్తావిచిత్రంగానే కనబడుతుంది.


సంస్కృతంలో పెంపుదలకు వృద్ధి అని అంటారు. ఆ వృద్ధినుండి తెలుగులో జొరబడిందే వడ్డి. మీ అసలు వడ్డి ఆణాపైసలతో సహా తీర్చేస్తానండి. డబ్బును వడ్దికి ఇవ్వడమంటే పెంపుదల చేసుకోవడమే కదా !


వరిమొక్కలు (సస్య) నాటితే అవి మొదల్లదగ్గర పిలకలు పుట్టి బాగా వృద్ధిచెందుతాయి.అలా వృద్ధిచెందిన వరిమొక్కలు బాగా దిగుబడిని ఇస్తాయి.

ఈ పెంపుదలను సూచించే వడ్డి ఏకవచనం కాగా జనబాహుళ్యంలో బహువచన రూపంగా వడ్లు అయింది.


ఇక వడ్డి విషయానికి వస్తే బారువడ్డి, చక్రవడ్డి, ధర్మవడ్డిల గురించి మనకు తెలుసు. వడ్డి చెల్లించని వ్యక్తికాని దేశంకాని వుందంటారా ?


ఇక నాగు అంటే చిరంజీవి నటించిన నాగు చిత్రంకాదు లేదా పామని కాదు. గతంలో రైతులు నాగు అనే వడ్డిని చెల్లించేవారు. ఎట్లాగంటే 


ఈ పద్ధతి రాయలసీమలో అమలులో వుండేది.


గతంలో రైతులు వ్యవసాయదారులు పూర్తిగా మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చినవారే. వారు పండించిన పంటంతా వారి కుటుంబఅవసరాలకు తెచ్చిన బుుణాలకు వడ్డిలకు సరిపోయేదే. మిగులుబాటు ఉండనేవుండదు.


ముంగారుకాలంలో పొలాలలో సేద్యంచేసి దుక్కులుగా మార్చిన తరువాత అదునులో విత్తనం వేసుకోటానికి వారివద్ద విత్తనంకాయలు లేదా ధాన్యాలు వుండేవి కావు. అలాంటపుడు రైతులు మోతుబరి వద్దనో ఆ వూరి శెట్టివద్దనో విత్తనపుకాయలు లేదా ధాన్యాన్ని అప్పుగా తెచ్చుకొనేవారు. అందుకు నాగును అంటే బుుణంగా తెచ్చుకొన్న విత్తనపుకాయలు లేదా గింజలకు వడ్డి చెల్లించేవారు. అనగా తెచ్చుకొన్న కాయలకు సగభాగాన్ని అసలుతో కలిపి చెల్లించేవారు. దీనినే నాగు అనేవారు.


 ఉదా॥ మా నాన్న 10 బస్తాల వేరుశెనగకాయలను నాగుగా తెచ్చి పండిన తరువాత బుుణదాతకు 15 బస్తాలకాయలను ఇచ్చేవాడు.అంటే అదనంగా ఇచ్చిన 5 బస్తాలు నాగు అన్నమాట. అంతేకాకుండా రైతు ఒక ప్రాంసరినోటు కూడా హామీగా వ్రాయించి ఇవ్వాలి.


నిజంగా ఈ నాగు ఓ కాలనాగేనన్న మాట. విత్తనపుకాయలు ఇచ్చిన వ్యక్తి కల్లంలోకి మనిషి పంపేవాడు. మొదటవాడికి నాగుతోపాటు అసలు చెల్లించాలి. కొసరు కింద ఆ వచ్చినవాడికి అంతోఇంతో ఇవ్వాలి.

విధివక్రికరించి పంటలు పండకపోతే ఈ ముంగారులో మేము తీసుకొన్న అసలు + ఇవ్వాల్సిన నాగు 15 బస్తాలు వచ్చే యేడుకు అసలు అవుతుంది. అపుడు ఈ15 బస్తాలు + నాగు 7 1/2 బస్తాలు కలిపి, 22 1/2 బస్తాలు చెల్లించాల్సివచ్చేది.

బుుణదాతలు నిర్ధాక్షిణ్యంగా వసూలు చేసేవారు. 

రైతు కుదేలైపోయేవాడు.

............................................................... జి.బి.విశ్వనాథ.డిప్యూటి కలెక్టర్ (ప.వి) 9441245857, అనంతపురం.

కామెంట్‌లు లేవు: