21, జనవరి 2022, శుక్రవారం

ఈ అర్జుని ఎవరు ?

 అర్యా ! అర్జునుడు తెలుసు మరి ఈ అర్జుని ఎవరు ?

............................................................


(1) వృద్ధకాశి - తమిళనాడులోని కడలూరు జిల్లాలోని విరుదాచలానికే వృద్ధకాశి అనిపేరు. వారణాసి (కాశి) క్షేత్రానికన్నా పురాతమైనది కాబట్టి వృద్ధకాశి అనే పేరువచ్చింది. ఇదో శైవక్షేత్రం. కాశిలో జీవితచరమాంకం గడపటానికి చేతకానివారు వృద్ధకాశికి చేరుతారు. అంత్యకాలంలో అంబ వీరిని తనఒడిలో చేర్చుకొంటుందని శివయ్య ముక్తి మంత్రము ఉపదేశిస్తాడని కనుక ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.


(2) సుందోపసందులు - హిరణ్యకశ్యపుడి వంశంలోని నికుంభుడనే వాని కొడుకులు, అన్నదమ్ములు. బ్రహ్మను గురించి ఘోరతపస్సు చేసి తమకు కామరూపవిద్య అనగా కోరినరూపంలోకి మారగలిగే శక్తి, కామగమనత్వం అనగా ఇష్టం వచ్చి న చోటుకు వేగంగా వెళ్ళగలిగే విద్యలతోపాటు సకల మాయాశక్తులను, అంతేకాకుండా అన్యులచే (ఇతరులచే ) మరణం లేకుండా వరాలు పొందారు.


 వరగర్వంతో రెచ్చిపోయి లోకాలలో విధ్వంశం సృష్టిస్తూవుంటే బాధితులు విష్ణువు వద్దకు వెళ్ళిమోరపెట్టుకొన్నారు. విష్ణువు వారికి అభయమిచ్చి విశ్వకర్మచేత మాయ సౌందర్యవతిని సృష్టింపచేసి,


ఆ అందాలరాసిని వారివద్దకు పంపాడు. ఆమె అందానికి మోహితులైన అన్నదమ్ములు ఆమెను పెండ్లిచేసుకోటానికి సిద్ధపడి ఆ సంగతిని ఆమెనే అడిగారు. అప్పుడా వయ్యారి మీలో మీరు యుద్ధం చేసుకొని జయించి వచ్చినవాడిని పెండ్లాడుతానని చెప్పింది. అంతట ఆ అన్నదమ్ములు ముష్టియుద్ధానికి తలపడి ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారు. ఇతరుల చేతిలో వారికి మరణంలేదు కనుక వారిలో వారే కొట్టుకొని మరణించారు.ఇదే విష్ణుమాయ.


(3) 

(అ) భీషణుడు - బకాసురుని తమ్ముడు.

(ఆ) భీషణుడనేవాడు కాశిరాజు భటుడు.వీరబాహువు వద్ద దాసుడుగా హరిశ్చంద్రుడు కాటికాపరిగా వున్నపుడు,

చంద్రమతి హరిశ్చంద్రుల కుమారుడు లోహితుడు, విశ్వమిత్రుడు పంపగా వచ్చిన తక్షకునిచే కాటుకు గురై మరణించగా

చంద్రమతి ఆ చనిపోయిన బాలుడిని స్మశానికి తెస్తుంది. శ్మశానంలో ఖననంచేయటానికి సుంకం కట్టాలని కాటికాపరి తెలియచేస్తే సొమ్ము తీసుకురావటానికి చంద్రమతి వెళుతుండగా ఆదేశాన్ని పాలించే కాశీరాజు కొడుకును ఎవరోచంపి చంద్రమతి దగ్గరపడేస్తారు. అప్పుడు భీషణుడనే రాజభటుడు చంద్రమతిని బంధించి రాజుసమక్షంలో నిలుపుతాడు.


(4) ఇలబల - తృణబిందువుకు అలంబసకు జన్మించిన స్త్రీ. కుబేరుని పెండ్లాడుతుంది


(5) అంజనీపర్వుడు - ఘటోత్కచుని కొడుకు. తండ్రితోపాటుగా భారతయుద్దంలో పాల్గొన్నాడు. గొప్పవీరుడు కనుక కురుసేనలు భీతిల్లాయి. అశ్వత్థామ అంజనీపర్వుడి విల్లును తుంచి, రథాన్ని కూలదోశాడు. అంజనీపర్వుడు కత్తిచేతబట్టి అశ్వత్థామపై కురికాడు. అశ్వత్థామ వాడి ఖడ్గాన్ని తుత్తునీయులుగా చేశాడు. కోపించిన ఘటోత్కచ తనయుడు అకాశమార్గానికి ఎగిరి అశ్వత్థామపై ఆయుధవృష్టిని కురిపించాడు. అపుడు అశ్వత్థామ వాడి శరీరంలో 30 బాణాలు నాటాడు. ఆ బాధను భరించలేక అంజనీపర్వుడు భూమిపై దిగి యుద్ధం కొనసాగించాడు. అశ్వత్థామ ఒకపదునైన బాణంతో వాడి తలకొట్టి చంపేశాడు.


(6) అర్జుని - బాణాసురుడి కూతురు. ఉషకు సోదరి. ఉష శ్రీకృష్ణుని మనుమడైన అనిరుద్ధుని ప్రేమించి పెండ్లాడుతుంది.


బాణసురుడెవరంటే

మరీచుని కుమారుడు కశ్యపుడు,

కశ్యపుని కుమారులు హిరణ్యాక్షుడు, 

హిరణ్యకశ్యపులు.

ఆ 

హిరణ్యకశ్యపుని కనిష్ఠ (చిన్న) పుత్రుడు ప్రహ్లాదుడు

ప్రహ్లాదుని కుమారుడే విరోచనుడు

విరోచుని కుమారుడే బలిచక్రవర్తి

ఆ 

బలి కొడుకే ఈ బాణాసురుడు

ఆ బాణాసురుని భార్య పేరు కండల. వీరి కూతురే అర్జుని.


(7) ఇంద్రసేన - ద్రౌపతికి మరోపేరు.


(8) బోయవనిత ఆమె ఐదుగురు కొడుకులు - వారణావతానికే ప్రయాగ అని పేరు. పాండవులు వారణావతాన్ని చూడటానికి వచ్చినపుడు పురోచనుడనే గ్రహనిర్మాణకారుడు ( హౌసింగ్ ఇంజనీర్ ) లక్క,నేయి, మట్టితో గృహనిర్మాణం చేశాడు. వారికి సేవలు చేయటానికి ఒక వృద్ధబోయను నియమించాడు.ఆమెకు ఐదుగురు కొడుకులు. కృష్ణచతుర్ధశినాడు ఆ లక్కఇంటికి నిప్పుపెడతారని కనుక జాగ్రత్తగా వుండాలనే వార్తను విదురుడినుండి పాండవుల వద్దకు ఖనకుడు తెస్తాడు. ఖనకుడు లక్కఇంటి నుండి బయటకు సొరంగాన్ని త్రవ్వాడు, ఆ సొరంగాన్ని చూచి భీముడు సంతసించాడు. చతుర్ధశి రోజున బోయస్త్రీ, ఆమెకొడుకలు కల్లు తాగి ఆ లక్కఇంటిలో నిద్రిస్తారు. పురోచనుడు లక్కఇంటికి నిప్పు పెట్టినపుడు పాండవులు తప్పించుకొన్నారు. అమాయకులైన బోయలు ఆ అగ్నికి ఆహుతైనారు.

...................................................................... జి.బి.విశ్వనాథ.డిప్యూటి కలెక్టర్ (Rtd) 9441245857, అనంతపురం.

కామెంట్‌లు లేవు: