ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఏమౌతుంది?
ఆత్మజ్ఞానం కలగగానే, వేయి సూర్యులు ప్రకాశం కనిపించడం గాని, ఇతరుల మనుసులో ఏముందో తెలిసిపోవడం కానీ, తల వెనుక వెలుగు కానీ రావు.
సిద్ధులు కూడా ప్రాప్తించవని ఇంతకు ముందు ఈ సమాధానంలో చెప్పాను.[1]
జెన్ సంప్రదాయంలో ఒక సూక్తి ఉంది.
Before Enlightenment, chop wood, carry water. After Enlightenment, chop wood, carry water.
అంటే మన దైనందిన కార్యక్రమాలు ఎప్పటిలాగానే సాగుతాయి. జ్ఞానసిద్ధి పొందిన తర్వాత బాహ్యంగా ఏమీ పెద్ద మార్పు ఉండదు. మోహంలో శాంతి, చిరునవ్వు కూడా కనిపించాలని ఏమీ లేదు. రమణ మహర్షి వదనం కరుణను కురిపిస్తే, శ్రీ నిసర్గదత్త మహారాజ్ చివరివరకూ చిర్రుబుర్రులాడుతూనే ఉండేవారట.
కానీ మన అంతరంగంలో మాత్రం పెను మార్పులు సంభవిస్తాయి. వాటిలో ముఖ్యమైన కొన్నింటిని వివరిస్తాను.
ఇదివరకు తెలియని ‘తేలికతనం’ వస్తుంది
గతంలో మనం చేసిన/చేయని పనుల పట్ల ఆత్మనింద, మన క్షమత మీద అపనమ్మకం, ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారనే చింత, భవిష్యత్తు గురించి ఆందోళన, ఇలా మన జీవన ప్రయాణంలో తెలియకుండానే చాలా బరువులను మోస్తూ ఉంటాము.
ఈ బరువులన్నింటికీ కారణం ‘నేను’ అనే స్ప్రుహ కేవలం శరీరం, మనస్సు మాత్రమే పరిమితం అవడం. ఈ ‘మితమైన నేను’ ఒక భ్రమే అని నిస్సందేహంగా తెలియటమే ఆత్మజ్ఞానం. అపుడు దాని తాలూకు బరువులు కూడా, బేతాళుడిలా ఎగిరిపోతాయి. నిజానికి చిన్నపిల్లలగా ఉన్నప్పుడు (ఇంకా ‘ఊహ’ రానప్పుడు) మనకి ఈ స్థితి అనుభవైక్యమే. ఇపుడు కూడా, ఏ బాదరబందీ లేకుండా హాయిగా నవ్వుతున్న పిల్లలను చూస్తే మనకీ ఆనందం కలుగుతుంది. అదే స్థితి మళ్ళీ మనకే పూర్తి యెఱుకతో కలిగితే? ఆ ఆనందాన్ని అనుభవించగలమే కానీ వర్ణించలేము.
బానిసత్వానికి చెల్లు
మీరు గమనిస్తే మనం ప్రస్తుతం కన్నా గతం, భవిష్యత్తు తాలూకు ఆలోచనలలోనే ఎక్కువ సమయం గడుపుతాము. గతంలో జరిగినవి/జరగనివి అకస్మాత్తుగా గుర్తుకువస్తాయి. వాటి వెంబడే సంతోషం/గర్వం/గిల్ట్/నిస్పృహ ఆవహిస్తాయి. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచనలు కూడా ఉత్సాహం/ఆందోళన కలిగిస్తూ ఉంటాయి.
ఈ భావాలన్నిటికీ మూలం ఆలోచనలు. Thoughts ‘Arise’ and trigger ‘Actions’ (including emotional responses). ఈ ఆలోచనలు బుడగలుగా ఉద్భవిస్తాయి. వాటి ఆయుష్షు చాలా తక్కువ. అయితే ఈ విషయాన్ని మనం నిశితంగా గమనించకపోవటం వలన మనందరమూ మన ఆలోచనలకు బానిసలమై, అవి ఎటుతీసుకుని వెళితే అటు నిస్సహాయులమై పోతూవుంటాము.
ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత Arising - Action మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. దీని వలన ఏది అవసరమైన చింతనో ఏది అనవసరమో తెలుసుకునే సమయం దొరుకుతుంది. అపుడు ఆలోచన వ్యాకులతగా మారుతుంటే వెంటనే కళ్లెం వేయగలుగుతాము. జ్ఞానం స్థిరమౌతున్న కొద్దీ, ఈ అప్రమత్తత (alertness) ఆశావాదం లోనూ పనిచేస్తుంది. అదేంటి, ఆశావాదం మంచిదేకదా అనిపించవచ్చు. జ్ఞానులకు ఆశ-నిరాశ ఒక నాణెంలో ఉన్న బొమ్మ-బొరుసు. అందుకే వారు స్థితప్రజ్ఞుతతో ఉండగలరు.
సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది
జ్ఞానసిద్ధి పొందిన తర్వాత, సాధించాల్సింది ఇంకేమి ఉండదు కాబట్టి, గతంలో భవిష్యత్తులో కన్నా ప్రస్తుతంలో ఎక్కువ ఉంటాము.
మనకి ఎవరూ ఇవ్వగలిగేది ఇంకేమీ లేదు అనే ప్రచండమైన భావన ఆవహిస్తుంది. ఇది గొప్ప అనుభూతి. అపుడు అవతలి వారు ఎంత గొప్పవారైనా కూడా, you won’t be starstruck. Ever.
అంతటి సెల్ఫ్-వర్త్ వస్తుంది.
మరణ భయం పోతుంది
ఇది అన్నిటికన్నా గమనించదగ్గ విషయం.
మరణ భయం అంటే ఏమిటి? మనం ఆనందించేవి, మనకి ప్రియమైనవి కోల్పోతామేమోననే చింత. అవి కుటుంబ ప్రేమాప్యాతలు, ఆస్తిపాస్తులు, పేరుప్రతిష్ఠలు కావచ్చు. వీటన్నింటికి మించినది మన దగ్గరున్నప్పుడు (మనమే అయినప్పుడు) ఇవి కోల్పాతమనే చింత ఎందుకుంటుంది? Rolls Royce కారే ఉంటే, Alto ని వదులుకోవడంలో బాధ ఏమి ఉంటుంది?
అయితే బాధలేనంత మాత్రాన నొప్పి ఉండదని కాదు. నొప్పికి బాధకి తేడా ఉంది. మాజీ ప్రధాని శ్రీ వీపీ సింగ్ ఒకనొక చివరి ముఖాముఖీల్లో “నేను మరణానికి భయపడను కానీ ఆ సమయంలో నొప్పికి భయపడతాను” అన్నారు. నిజానికి నొప్పి కన్నా, నోప్పి కలుగుతుందేమో అన్న భయం మరింత బాధిస్తుంది. ఉదాహరణకు, మనకి ఎప్పుడో ఒకప్పుడు కాలికి ఎదో తగిలి ప్రాణం కడెట్టుంటుంది. అంత బాధా మనము భరిస్తాము, కానీ తెలిసితెలిసి ఒక చిన్న ఇంజక్షన్ తీసుకోలేము.
కానీ ఆత్మజ్ఞానులకు శరీర పరంగా నొప్పి ఉంటుంది కానీ బాధ ఉండదు. శ్రీ రామకృష్ణ పరహంస కి గొంతు కాన్సర్ కారణంగా తీవ్రమైన నొప్పి ఉన్నా అది ఆయనను బాధించలేదు.
జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాము
ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఆనందానికి దేని మీద ఆధారపడము. ఎపుడు ఎదో పనిలో నిమగ్నమవ్వాల్సిన ‘అవసరం’ ఉండదు. సాధన దశలో పెంచుకున్న ఏకాగ్రత ఫలవంతమై నిశబ్దంలో శాంతంగా ఉండగలుగుతాము. (ఈ ఏకాగ్రత సాధన ధ్యాన సమయాల్లోనే కాకుండా, ఇతర దైనందిన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఎలా చేయవచ్చో ఈ సమాధానం లో చెప్పాను.)[2]
అయితే ఈ మార్పులన్నీ వివిధ దశల్లో సంభవించవచ్చు. నిజానికి జ్ఞానోదయం అయిన తర్వాత జరిగే మార్పులను, మోక్ష సిద్ధి తర్వాత జరిగే మార్పులను నేను కలిపి చెప్పాను. జ్ఞానసిద్ధికీ, మోక్ష సిద్ధికీ తేడా ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి