13, సెప్టెంబర్ 2022, మంగళవారం

రామాయణానుభవం_ 141*

 🌹 *రామాయణానుభవం_ 141* 


*రామః కమల పత్రాక్ష స్సర్వ సత్త్వ మనోహరః* ।

*రూప దాక్షిణ్య సంపన్నః*

*ప్రసూతో జనకాత్మజే* ॥


సీతమ్మా! శ్రీ రాముడు కమల పత్రముల వంటి కన్నులు గలవాడు; సకల ప్రాణుల మనస్సును ఆకర్షించువాడు, రూపముతో దయతో కూడిన వాడై పుట్టిన వాడు;


ఈ శ్లోకమునందు హనుమంతుడు శ్రీరాముని పరతత్త్వమును సూచించుచున్నాడు,


రామః = ఆనంద స్వరూపుడు, ఆనందము గుణముగా గల వాడు; ఆనందమునొసంగువాడు; అయిన జగత్కారణ తత్త్వమే దశరథుని కుమారుడగు శ్రీరాముడు, 


ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందమే, 

ఆనందము కలవాడే; పరబ్రహ్మ అని తెలిసికొనెను, 

తైత్తి రీయోపనిషత్తు, భృగువల్లి, 


ఏషహ్యేవా ఽనందయాతి, 

ఈ పరబ్రహ్మమే సకల ప్రాణులను ఆనందింపచేయును; తైత్తిరీయోపనిషత్తు, ఆనందవల్లి అని శ్రుతి వాక్యము.


 కమల పత్రాక్షః = ఆ పరబ్రహ్మమే ఉపాసకుల సౌలభ్యము కొరకై సూర్య మండలమున నున్నాడు; అతడే పుండరీకముల వంటి కన్నులు గల శ్రీ మన్నారాయణుడు అని 


యఏషోఽంతరాదిత్య హిరణ్మయః పురుషోదృశ్యతే | హిరణ్యశ్మశ్రు ర్హిరణ్యకేశ ఆ ప్రణఖాత్సర్వ ఏవ సువర్ణః, తస్య యథాకప్యాసం పుండరీక మేవ మక్షిణీ సూర్యమండలము నందు హిరణ్మయస్వరూపుడగు పురుషుడు కనబడుచున్నాడు; బంగారు వెంట్రుకలు కలవాడు, బంగారు గడ్డము గల వాడు; గోళ్ళు మొదలుకొని అంతయు బంగారుమయమే; గంభీరమైన నీటిలో మొలచిన, లావైన దృఢమైన కాడపై నిలిచిన, అప్పుడే ఉదయించిన సూర్యుని కిరణములచే వికసించిన, తామర పూవుల వంటివి అతని యొక్క రెండు నేత్రములు - ఛాందోగ్యోపనిషత్తు, అని చెప్పిన ప్రకారముగా పుండరీకాక్షుడు; 


సర్వసత్వ మనోహరః = సకల ప్రాణుల చిత్తమునందున్న వాడు; రూపదాక్షిణ్య సంపన్నః = దివ్య మంగళ విగ్రహముతో, చేతనాచేతనములందు సంపూర్ణమైన దయతో కూడిన వాడు, అయిన ఆ పరమాత్మయే, 


ప్రసూతః = దశరథుని పుత్రుడైన శ్రీరాముడుగా అందరికీ కనబడునట్లు జనించినవాడు; జన్మ లేని వాడు. జన్మించినాడు; 


జనకాత్మజే = ఓ సీతమ్మా!; శ్రీరాముడు శ్రీమన్నారాయణుడేయని హనుమంతునిచే సూచింపబడినట్లు.....


**


హనుమ రామకథాగానం చేస్తున్నాడు...


రాముడు తేజస్సులో సూర్యునితోనూ, ఓర్పులో భూమితోనూ, బుద్ధిలో బృహస్పతితోనూ, కీర్తిలో దేవేంద్రుడితోనూ సమానమైనవాడు. సమస్తజీవజాలాన్నీ రక్షిస్తాడు. ధర్మాన్ని రక్షిస్తాడు. లోకంలో మర్యాదని (కట్టుబాట్ల) ను రక్షిస్తాడు..


రాముడు విద్వాంసుడు. శాస్త్రాభ్యాసం చేసాడు. రాజవిద్యలు నేర్చాడు. పండితుల మన్ననలు పొందాడు. వినీతుడు (వినయవంతుడు) శీలసంపన్నుడు. వేదవేదాంగాలలో నిష్ణాతుడు, వేదవేత్తలు ప్రశంసించే పండితుడు. స్వశాఖ అయిన యజుర్వేదం చక్కగా అభ్యసించాడు.


అతని రూపం ఎలా ఉంటుందని అడిగావు. రాముడిది నీలమేఘచ్ఛాయ. ఆరోగ్యంతో మిసమిసలాడుతూ ఉంటాడు. చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది. అతడి కంఠస్వరం దుందుభినాదంలా ఉంటుంది. కళ్ళు ఎర్రగా ఉంటాయి. భుజాలు విశాలమైనవి. బాహువులు దీర్ఘమైనవి. ముఖం మంగళప్రదం. బలిసిన కండతో మూపున ఎముకలు కనపడవు. త్రిస్థిరః ముంజేయి, పిడికిలి, వక్షఃస్థలం స్థిరంగా ఉంటాయి. త్రిప్రలంబ: కనుబొమలు, ముష్కములు, బాహువులు పొడవుగా ఉంటాయి. (ఇలా సాముద్రికశాస్త్రంలో చెప్పిన చక్రవర్తి లక్షణాలన్నీ వర్ణిస్తాడు) 


దేశకాల విభాగం తెలిసినవాడు. సత్యధర్మాలను ఉపాసించేవాడు. లక్ష్మణుడూ రాముడిలానే ఉంటాడు. రాముడు నీలమేఘశ్యాముడు, లక్ష్మణుడిది బంగారు శరీరచ్చాయి.


ఆ అన్నదమ్ములు నిన్ను వెదుకుతూ ఋశ్యమూకపర్వతం వద్దకు వచ్చారు. అక్కడ మేము సుగ్రీవుణ్ణి సేవిస్తూ ఉన్నాము. వీరి రూపాలూ, ఆయుధాలూ చూసి భయపడి వీరెవరో కనుక్కోమని సుగ్రీవుడు నన్ను పంపాడు. సుగ్రీవుడి గురించి విని రామలక్ష్మణులు సంతోషించారు. నేను వారిని వీపుమీద ఎక్కించుకుని సుగ్రీవాదులు ఉన్న చోటికి తీసుకువెళ్ళాను. రామసుగ్రీవులు. అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. ఒకరి కథ ఒకరికి చెప్పుకున్నారు.


సుగ్రీవుడి భార్య రుమ, అతడి అన్న వాలి మహాబలశాలి. పరాక్రమవంతుడు.  "ఒకానొక సంఘటనలో అపోహతో వాలి సుగ్రీవుణ్ణి రాజ్యంనుంచి వెళ్ళగొట్టాడు".

. ఆ కథ విని రాముడు సుగ్రీవుణ్ణి ఓదార్చాడు.


తరువాత తన అరణ్యవాస కథ, రావణుడు నిన్ను అపహరించడం వివరంగా చెప్పాడు. రావణుడు నిన్ను పట్టి వాయుమార్గంలో వెడుతుంటే నువ్వు పడవేసిన ఆభరణాలన్నీ వానరనాయకులు తీసి జాగ్రత్తచేసారు. అవన్నీ తెచ్చి రాముడికి చూపించాము. వాటిని చూస్తూనే రాముడు స్పృహ తప్పి పడిపోయాడు.


స్పృహరాగానే వాటిని ఒడిలో ఉంచుకుని అనేక విధాల విలపించాడు. నీ వియోగంవలన రాముడు  జ్వలిస్తున్న అగ్నివలన అగ్నిపర్వతం తపించినట్లు తపించుకుపోతున్నాడు. రాత్రింబవళ్ళు నిన్నే తలుచుకుంటూ దుఃఖిస్తున్నాడు.......


*

[రాముని యొక్క సౌందర్యాదులను మొల్ల అద్భుతం గా తెలుగు పద్యం గా అందించింది.


నీల మేఘ చ్ఛాయ బోలు దేహమువాఁడు. ధవ ళాబ్జ పత్ర నేత్రములవాఁడు

కంబు సన్నిభ మైన కంఠంబు గలఁవాఁడు చక్కని పీన వక్షంబువాఁడు.

తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహులవాఁడు ఘనమైన దుందుభి స్వనమువాఁడు పద్మ రేఖలు గల్గు పద యుగంబులవాఁడు


కపట మెఱుఁగని సత్య వాక్యములవాఁడు ,రమణి! రాముండు శుభ లక్షణములవాఁడు ఇన్ని గుణముల రూపింప నెసఁగువాఁడు వరుస సౌమిత్రి బంగారు వన్నె వాఁడు.]

కామెంట్‌లు లేవు: