13, సెప్టెంబర్ 2022, మంగళవారం

వ్యాసభగవానుడు

 Srimadhandhra Bhagavatham -- 1 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములయందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనే బుద్ధిచేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగుగా విభాగం చేశారు. ఆయన వేదరాశినంతటినీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు భాగములుగా విభాగం చేశారు.


వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసిన విధి విదానములను గురించి, మనం ఆచరించిన విధివిధానముల వలన మనం పొందే ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరిస్తుంది. ఉత్తరభాగం అంతాకూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తుట్టతుద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత మనకు కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తుంది. ‘జ్ఞానాత్ కేవల కైవల్యం’ జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది.


పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానమును వేదము ఉత్తరభాగం ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడయిన జైమినిచేత వేదమునకు పూర్వభాగమయిన కర్మకు సంబంధించిన, విషయములన్నిటికి వ్యాఖ్యానం చేయించారు. దానిని ‘పూర్వమీమాంస’ అంటారు. ఉత్తరభాగమంతా జ్ఞానమునకు సంబంధించినది. వ్యాసమహర్షియే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు. ఈ బ్రహ్మసూత్రములనే ‘ఉత్తరమీమాంస’ అని కూడా అంటారు. మరల ఆయన పదునెనిమిది పురాణములను రచించారు. పురాణములను రచించడం అంటే తేలికయిన పనికాదు.


‘సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ!

వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం!!

పురాణమునకు ఐదు లక్షణములు ఉండాలి. సర్గ, ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్పగొప్ప వంశములను గురించి ప్రస్తావన చేయాలి. అనేక మన్వంతరములలో జరిగిన విశేషములను చెప్పాలి. అది భగవత్సంబంధముగా దానిని ప్రతిపాదన చేయకలిగిన శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణమును చెప్పలేదు. అటువంటి పురాణములను రచించిన మహానుభావుడు వేదవ్యాసుడు. మనకి జ్ఞాపకం ఉండడము కోసమని తేలిక సూత్రమునొక దానిని పెద్దలు ప్రతిపాదించారు.


‘మ’ద్వయం ‘భ’ద్వయం చైవ ‘బ్ర’త్రయం ‘వ’చతుష్టయం!

‘అ’ ‘నా’ ‘ప’ ‘లిం’ ‘గ’ ‘కూ’ స్కా’ని పురాణాని పృథక్ పృథక్!! (దేవీభాగవతం 1-3-21)


మద్వయం – మకారముతో రెండు పురాణములు ప్రారంభము అవుతాయి. అందులో ఒకటి మార్కండేయ పురాణము, రెండవది మత్స్య పురాణము.

భద్వయం – భ తో రెండు పురాణములు ప్రారంభమవుతాయి. అవి భాగవత పురాణము, భవిష్య పురాణము.


బ్రత్రయం – బ్ర’ తో మూడు పురాణములు ప్రారంభమవుతాయి. అవి బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము.

వచతుష్టయం – ‘వ’కారంతో నాలుగు పురాణములు ప్రారంభమవుతాయి. అవి వరాహపురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, వాయు పురాణము.

అనాపలింగకూస్కాని – అన్నప్పుడు ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పురాణము వస్తుంది.


అ – అగ్నిపురాణం, నా – నారద పురాణం, ప – పద్మ పురాణం, లిం – లింగపురాణం, గ – గరుడ పురాణం, కూ – కూర్మపురాణం, స్కా – స్కాందపురాణం.


వ్యాసభగవానులు వేదములను విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదమును ఒక్కక్క శిష్యుడికి అప్పచెప్పారు. వ్యాసుడు చేసిన సేవ అంతా ఇంతా కాదు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

కామెంట్‌లు లేవు: