13, సెప్టెంబర్ 2022, మంగళవారం

రామాయణానుభవం_ 143*

 🌹 *రామాయణానుభవం_ 143* 


హనుమ సీత సంవాదం కొనసాగుతోంది....


"తల్లీ! రామునికి ఇంతవరకు నీవెక్కడ ఉన్నావో  తెలియదు. తెలిశాక తక్షణమే మహేంద్రుడు శచీదేవిని తీసికువెళ్లినట్లు నిన్ను తీసుక వెళ్తాడు.


నీ వార్త తెలిసిన వెంటనే వానర మహాసైన్యంతో శ్రీరాముడు బయలుదేరి తన బాణాలతో సముద్రాన్ని బంధించి, లంకలోనికి ప్రవేశించి, సమస్త రాక్షస కోటిని సంహరిస్తాడు. ఆయనకు సురులు, అసురులు ఎవ్వరు అడ్డుకారు.


సింహముచే బాధింపబడిన మహాగజమువలె నీ విరహ బాధతో శ్రీరాముడు నలిగి పోతున్నాడు.


మేము నివసించే మహా పర్వతములపై, మేము భక్షించే కందమూల ఫలములపై

ఒట్టుపెట్టుకొని నిజమే చెప్పుతున్నాను. స్వర్గంలో ఉన్న మహేంద్రునివలె ప్రస్రవణ పర్వతముపై అందమైన కన్నులు, సుందరములైన కుండలములు గల శ్రీరాముని నీవు అతి త్వరలో చూడగలవు.


శ్రీరామునికి నీకు దూరమైన నాటి నుండి అన్నము, రుచించడం లేదు. నిద్రపోవడం

లేదు. ఒకవేళ నిద్రపట్టితే, వెంటనే "సీతా" అని నీ మధుర నామాన్ని ఉచ్చరిస్తూ వెంటనే మేల్కొంటాడు.


ఆయనకు ఆయన శరీరముపై స్పృహే లేదు. ఆయన నిన్నే ధ్యానిస్తూ నీ గురించే పలవరిస్తూ, నిన్ను పొందడానికే ప్రయత్నిస్తున్నాడు" అని హనుమ తెలిపాడు. 

సీతాదేవికి రామ వార్త విన్నందువలన శోకము తొలగింది. కాని ఆయన తన కొరకే శోకిస్తున్నాడని తెలిసి మళ్లీ శోకము కలిగింది. మబ్బులు కొద్దిగా మిగిలిన శరద్రాత్రి వలె సీతాదేవి శోక హర్షాలను కలిగి ఉంది.


హనుమంతుడు సీతాదేవితో "అమ్మా! రాముడు క్షేమంగా ఉన్నాడు. కాని నీ విరహ దుఃఖముతో కృంగిపోతున్నాడ”ని చెప్పాడు. ఆ మాటలు సీతకు అమృతమువలె, విషము వలె అనిపించాయి.

*అమృతం విషసంసృష్టం త్వయా వానర భాషితమ్*

*యచ్చ నాన్యమనా రామో యచ్చ శోకపరాయణః*


"హనుమా! రాముని క్షేమవార్త అమృతము వలె నాకు ప్రాణం పోసింది. అయితే ఆయన అమితమైన దుఃఖంతో ఉన్నాడు" అన్న మాట నాకు విషమువలె భరించరానిదిగా ఉంది.


సుఖదుఃఖాలు మనిషిని త్రాటితో కట్టి లాగినట్లు దైవములాగి వేస్తుంది. దైవాన్ని ఎవ్వరు ఎదిరించజాలరు. *లేకపోతే సజ్జనులు, శక్తి సంపన్నులైన రామలక్ష్మణులు, నేను ఇంత ఆపదల వలయంలో చిక్కుకోవడమేమిటి?*

*విధిర్నూనమసంహార్యః ప్రాణినాం ప్లవగోత్తమ*

*సౌమిత్రిం మాం చ రామం చ వ్యసనై: పశ్య మోహితాన్*


శ్రీరామచంద్రస్వామి లంకకెప్పుడు వస్తాడో? రావణుని సంహరించి నన్నెప్పుడు స్వీకరిస్తాడో? అయితే ఆయన ఆలస్యం చేస్తే ప్రయోజనము లేదు. రావణుడు నన్ను తీసుకొని వచ్చాక, తనను వరించడానికి ఒక సంవత్సరము గడువిచ్చాడు. ఆ గడువు పూర్తి కావడానికి ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలాయి.....


**

సీత హనుమ సంభాషణ...


హనుమా రావణుడు మూర్ఖుడు. చండ స్వభావుడు. ఆయన ఎవ్వరి మాటను వినడు. ఇంతకు ముందు ఎన్నోసార్లు “రాఘవునికి నన్ను అప్పగించి లంకా సామ్రాజ్య వైభవాన్ని, ఆనందోత్సాహాలను పదిలంగా కాపాడుమని" విభీషణాదులు హితము పలికారని విభీషణుని పెద్ద కూతురు నల నాతో స్వయంగా చెప్పింది. అయితే అంత్యకాలము దాపురించిన వానికి దీపము మలిగిపోయేప్పటి వాసన రానట్లే రావణునికి ఈ సలహాలు రుచించడం లేదు.


అయినా రావణుడెంత కాలము ప్రయత్నించినా నన్ను దక్కించుకోలేడు. నా ప్రభువు అతులిత పరాక్రమ సంపన్నుడు. ఆశ్రిత రక్షాదక్షుడు. నన్ను రావణుని బారి నుండి తప్పక కాపాడగలడు.


రాముడు రావణుని జయించుటకు తగిన బలము, పరాక్రమము, ఉత్సాహము, ప్రభావము మొదలైన గుణాలన్ని కలవాడు.


పదునాల్గు వేల మంది భయంకర రాక్షసులను “ఒంటి చేతితో” గెలిచిన శ్రీరామ భద్రుని ముందు రావణుడు నిలువగలుగుతాడా?

రాముడనే సూర్యుడు తన బాణాలనే కిరణాలతో శత్రుసైన్యమనే జలాన్ని తప్పక "ఇంకింప జేస్తాడు" అని పలికి ఊరుకుంది.


హనుమకు సీతాదేవి ఇంకా లంకలో శత్రువుల మధ్య బాధపడడం మంచిది

కాదనిపించింది. అప్పుడు హనుమ సీతాదేవి భయాన్ని, బాధను పోగొట్టడానికి ఆమెతో

ఈ విధంగా అన్నాడు. 


"అమ్మా! నేను తిరిగి వెళ్ళి శ్రీరామచంద్రునికి నీ వార్తను వివరించగానే, ఆయన ససైన్యంగా వచ్చి, రావణుని సంహరించి, నిన్ను తీసికొని వెళ్తాడు.


కాని నీకంత వరకు ఓర్చుకొనే ఓపిక లేక పోతే, నిన్ను నా వీపుఎక్కించుకొని ఇప్పుడే

వెళ్లి స్వామి సన్నిధిలో సమర్పిస్తాను.

నేను సముద్రమును దాటడం, నిన్ను దాటించడం నాకు ఒక లెక్క కాదు. అవసరమైతే రావణునితో పాటు, ఆయన పరివారంతో పాటు మొత్తము లంకనే పెల్లగించి, తీసికొని వెళ్లి రాముని ముందు ఉంచుతాను.


అగ్నిదేవుడు హోమంలో అర్పించిన హవిస్సును ఇంద్రునికి అప్పగించినట్లే నిన్ను నేను రామునికి అప్పగిస్తాను.

*అహం ప్రస్రవణస్థాయ రాఘవాయాద్య మైథిలి*

*ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలః*

 నీవు సందేహించకు. నా వీపుపై కూచో. ఆకాశమార్గంలో సూర్యచంద్రులతో సంభాషిస్తూ నా వీపుపై కూచొని సముద్రాన్ని దాటి ఇప్పుడే రామలక్ష్మణులను చూడగలవు. నన్నెదిరించుటకు రావణునికి శక్తి చాలదు. నేనెంత సులభంగా సముద్రం దాటి వచ్చానో అంత సులభంగా తిరిగి నిన్ను తీసికొని సముద్రం దాటి వెళ్లగలను".


హనుమ మాటలు సీతాదేవికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. " చిన్న శరీరము ఉన్న నీవు నన్ను సముద్రం దాటిస్తావా?" అని ప్రశ్నించింది......

*కథం వాల్పశరీరస్త్వం మామితో నేతుమిచ్ఛసి*

*సకాశం మానవేన్ద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ*

కామెంట్‌లు లేవు: