13, సెప్టెంబర్ 2022, మంగళవారం

రామాయణానుభవం_ 145*

 🌹 *రామాయణానుభవం_ 145* 


బ్రహ్మ రుద్ర మహర్షులు కాకాసురుడు శరణు వేడాడు, వాళ్ళెవరూ సరమర్థులు కారు.


"ఒక్కసారి దగ్గరకు తీయకపోయినప్పటికి మళ్లీ మళ్లీ వెళ్లి కాళ్లపై పడితే కరుణించక పోతారా?" అని వెళ్లిన వారి దగ్గరకే మళ్లీ వెళ్లాడు. మూడులోకాలలో తిరస్కారమే మళ్లీ మళ్లీ ఎదురైంది.


*త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః*


ఇక ఎవ్వరు తనను దగ్గరకు రానీయరని తెలిసి, లోకాలన్ని తిరిగి తిరిగి విసిగి వేసారి అలసటతో తాళలేక ఆ దుర్మార్గుడు తనను చంపదలిచిన రామప్రభువు పాదాల పైననే పడిపోయాడు.


సీతాదేవి అతని స్థితిని చూచింది. జాలి పడింది. అంత అపచారము చేసిన వానిని కూడ తప్పుచేసే కొడుకులాగే చూచింది ఆ లోకజనని. ఆయనపై ఆ తల్లికి దయ కలిగింది.


కాకాసురుడు రామచంద్రుని కాళ్లపై పడ్డాడు. కాని సక్రమంగా పడిపోలేదు. 


స్వామి కాళ్లవైపు తన కాళ్లు ఉండేట్లు పడిపోయాడు. కావాలని కాదు. చేతగాక పడిపోయాడు.


*పురతః పతితం దృష్ట్వా ధరణ్యాం* *వాయసం తథా తచ్ఛిరః పాదయోస్తస్య* *యోజయామాస జానకీ*


తండ్రి కంటపడకుండా తనయులను కాపాడే తల్లివలె, రామభద్రుడు ఆగ్రహంతో ఉండగానే, ఆయన గమనించకుండా ఆ కాకిని లేవనెత్తి, దాని తలను స్వామి పాదాలపై పడేట్లుగా సవరించింది ఆ దయామయి.


అప్పటికి ఆ కాకిని గమనించని రామచంద్రునితో "స్వామి! ఇంత పిట్టపై అంత కోపమా? అని నన్ను పరిహసించారే గాని మీరు మాత్రము "పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలా?" ఆ అల్పప్రాణి మీ బ్రహ్మాస్త్రాన్ని తట్టుకోగల్గుతుందా?దిక్కు లేక

మీ చరణాలనే ఆశ్రయించింది చూడండి. శరణన్న వారిని సంరక్షించే కరుణామయులే మీరు” అని కాంతా సమ్మితంగాస్వామితో ఆ కాకి విషయంలో పురుషకారం చేసింది.


*వధార్హమపి కాకుతః కృపయా పర్యపాలయత్*


జానకీ దేవి  ప్రార్ధనతో (పురుషకారం) స్వామి ఆగ్రహం మటుమాయ మైంది. చిరునవ్వుతో "కాకీ! బ్రతికి పోయావులే" అని లేపాడు.


అయితే రామబాణానికి తిరుగులేదు కద! అందువలన బ్రహ్మాస్త్రానికి ఏదైనా ఒక అవయవాన్ని ఆహారంగా సమర్పించుమన్నాడు కాకుత్సుడు. (కకుత్సని వంశంలో జన్మించిన శ్రీరాముడు) కాకి తన కుడికన్నును సమర్పించింది.


అందుకే కాకికి ఒకటే కన్ను ఉంటుంది. కాకాసురుడు “కాకః” “కాకః” అని సంతోషంతో అరవసాగాడు.


**

సీతాదేవి హనుమతో రామునికి తన వినతిని అందించాలనుకొంది. అప్పుడు నేరుగా రామునితోనే మాట్లాడుతున్నట్లు ఈ మాటలు అన్నది. "రామచంద్రా! ఆనాడు నా కొరకు ఒక పిచ్చుకపై బ్రహ్మాస వేశావు కదా! ఈనాడు నేనింత ఆపదలో ఉన్నప్పుడు నన్ను కాపాడవా?


నానాధుడివే! జగన్నాధుడివే! ఇప్పుడు నేను అనాథగా అలమటిస్తుంటే కూడ చూచి. ఊరకుండడము న్యాయమా?


ఆనాడు నీతో కలసి ఉన్నప్పుడు "అన్ని ధర్మాలకంటే శ్రేష్టమైన ధర్మమేది?" అని

అడిగినప్పుడు.


*ఆనృశంస్యం పరోధర్మః* పరదుఃఖ దుఃఖిత్వమే  పరమధర్మము అన్నావే? ఇప్పుడు నన్ను నా దుఃఖానికి వదలివేయడం ధర్మమా?


స్వామీ! మీరు మహావీరులే. అసహాయ శూరులే. "ఇక్ష్వాకుడా మియం భూమిః సశైల వనకాననా" అన్నట్లు ఈ భూమి, పర్వతాలు, సముద్రాలు అన్ని మీ ఆధీనంలో ఉన్నవే కదా! మీరు రక్షించాలనుకొంటే సురులు, నరులు, రాక్షసులు, గంధర్వులు ఎవ్వరైనా, సకల లోకాలలో మరెవ్వరైనా మీ ముందు నిలువగలుగుతారా?" అని అడిగానని నా మాటలను హనుమా! నాస్వామికి తెలుపు.


అయినా హనుమా! అసాధారణ సామర్ధ్యము కల్గికూడ, నా స్వామి నన్ను రక్షించడం. లేదంటే ఆయనకు దయలేదని కాదు. ఆయన దయాసముద్రుడు. అయినా నన్ను రక్షించ రాలేదంటే కారణము నా పాపమే.


*మమైన దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయః*

 నాదే కొద్దో గొప్పో పాపము తప్పక ఉంటుంది.


సమర్ధులై ఉండి కూడ రామలక్ష్మణులు తనను రక్షించడానికి రాకపోవడానికి తన తప్పులే కారణమని సీతాదేవి బాధపడుతుంటే - హనుమ ఆమెను ఓదార్చసాగాడు.


**


[భగవత్ అపచారం... 


అరణ్యవాసానికి సీతను రాముడు వద్దన్నపుడు 

రామ జామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం

రామా నీవు పురుష రూపం లో ఉన్న స్త్రీ వి కాబట్టి నన్ను అరణ్యానికివద్దంటున్నావు అన్నది 

దీనిని భగవత్ అపచారం అని,  


లేడి వెంట  రాముడు వెళ్లినప్పుడు తన పై వేరే ఆలోచనతోనే లక్ష్మణుడు ఉన్నాడని, ఆయన అడవులకు వెంట వచ్చింది కూడ అందుకే అంది. తాను ఆయనకు ఎన్నటికి లొంగవని అంది. 

దీనినీ భాగవత అపచారం గా సంప్రదాయం పరం గా చెబుతారు.....

ఇలాంటి విషయాల ను పెద్దలను  సేవించి తెలుసుకుంటే ఆవగతం అవుతాయి.

కామెంట్‌లు లేవు: