13, సెప్టెంబర్ 2022, మంగళవారం

రామాయణానుభవం_ 144*

 🌹 *రామాయణానుభవం_ 144* 


సీతాదేవి పలుకులకు హనుమ చిన్నబోయాడు. తన శక్తి సామర్ధ్యాలను సీతాదేవికి చూపాలనుకొన్నాడు. తన శరీరాన్ని పెంచసాగాడు. పెద్ద పెద్ద కొండలే చిన్న చిన్న బండలుగా తగ్గిపోయాయి అప్పుడు హనుమ అగ్నివంటి ఎఱ్ఱని ముఖంతో, వజ్రము వంటి గోళ్లతో భయంకరమైన దంష్ట్రలతో మేరుపర్వతమంత ఎత్తుతో ప్రకాశించాడు. ఆయన అప్పుడు సీతాదేవిని చూచి, "తల్లీ! నా పర్వతాకారాన్ని చూచావుకదా! ఇక అనుమానాన్ని వదలిపెట్టి నిశ్చింతగా నా వీపుపై ఎక్కి వచ్చి రామలక్ష్మణులను దర్శించి, వారి శోకాన్ని తొలగించు"మని కోరాడు.


ఆ భీమరూపం చూసిన సీత కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. "మహాకపీ! నీ శక్తిసామర్థ్యాలు నాకు తెలుసు. నువ్వు యింతటి వాడివి కాకపోతేఊహించడమే సాధ్యంకాని సముద్రలంఘనానికి పూనుకోవు. 


నువ్వు నన్ను అవలీలగా తీసుకువెళ్ళగలవనీ తెలుసు. అయితే మనం రాముడి కార్యం చెడిపోకుండా ఏమి చెయ్యాలో నిర్ణయించాలి.  నేను నీతో వెళ్ళకూడదు.


అంత ఎత్తులో, ఎంతో వేగంతో నువ్వు వెడుతూంటే భయపడి (కళ్ళు తిరిగి) నేను పడిపోవచ్చు. నన్ను తీసుకు వెడుతుంటే చూసిన రాక్షసులు చుట్టుముట్టి నీమీద దాడి చెయ్యవచ్చు. వాళ్ళందరివద్ద గొప్ప ఆయుధాలు ఉంటాయి. నువ్వు ఏ ఆయుధాలూ లేకుండా, ఒక పక్కన నన్ను రక్షిస్తూ వేరొకపక్కన నిన్ను రక్షించుకోవాలి. ఆ మహాయుద్ధం చూసి భయంతో నేను సముద్రంలో పడిపోవచ్చు.

*న చ శక్ష్యే త్వయా సార్ధం గన్తుం శత్రువినాశన*

*కలత్రవతి సన్దేహస్త్వయ్యపి స్యాదసంశయః*

అయితే, నువ్వు మహాపరాక్రమవంతుడివి కనుక ఆ రాక్షసులందర్నీ సంహరించగలవు. కాని, దానివలన రాముడి కీర్తి దెబ్బతింటుంది.


లేదా, ఏదో రకంగా నీనుంచి నన్ను ఎత్తుకుపోయి రాక్షసులు ఎవరికీ కనపడనిచోట దాచెయ్యవచ్చు. అప్పుడు నువ్వు చేసిన యీ మహాప్రయత్నమంతా వృథా అవుతుంది.

ఇవన్నీ అలా ఉంచి.....


రాముడు ఇక్కడికి వచ్చి సబాంధవంగా రావణుణ్ణి సంహరించి నన్ను తీసుకువెడితే-అది అతడికి తగిన పద్ధతి. రాముడి పరాక్రమం ముందు యీ రాక్షసులు నిలువలేరు. ఆ పరాక్రమం విన్నాను. కళ్ళారా చూసాను. ఆ రాముడి రాకకోసం ఎదురుచూస్తున్నాను. నువ్వు రామలక్ష్మణులనూ, వానరసేనానాయకులనూ వెంటనే తీసుకువచ్చి నాకు సంతోషం కలిగించు.”.....

*స మే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం సయూథపం క్షిప్రమిహోపపాదయ*

*చిరాయ రామం ప్రతి శోకకర్శితాం కురుష్వ మాం వానరముఖ్య హర్షితామ్*

**


సీతాదేవి పరిశుద్ధమైన పలుకులను విని హనుము సంతృప్తితో ఇలా అన్నాడు: "తల్లీ! పురుషులు ఆవేశంతో తొందరపడితే, స్త్రీలు నెమ్మదిగా ఆలోచించి, ఆ పురుషులు ఆలోచనలలోని మంచి చెడులను వారికి తెలిపి, వారిని శాంతపరుస్తారు.


అలాగే నీవు ఒక స్త్రీ రత్నంగా నా ఆవేశానికి మంచి చెడులు చెప్పి అడ్డుకట్ట వేశావు. ఒక వీర పత్నిగా నీ పతికి కలిగే అవమానాన్ని నివారించావు. ఒక పతివ్రతగా నీ స్వభావాన్ని నీ మహిమను నిరూపించుకొన్నావు. ఇంతటి స్థిరత్వము, ఇంతటి వీరత్వము, ఇంతటి పాతివ్రత్యము రామభద్రుని ధర్మపత్నివైన నీకు తప్ప మరొకరికి సాధ్యమా?


నేను నీ కష్టాలకు తొందరలో ముగింపు పలుకాలని నాతో రమ్మని పిలిచానే తప్ప

వేరే ఉద్దేశ్యంతో కాదు.


నీకు నా వెంట రావడం ఇష్టము కాకుంటే, నేను నిన్ను కలిసి మాట్లాడానని రాముడు నన్ను నమ్మే విధంగా ఏదైనా ఒక ముఖ్యమైన గుర్తు తెలుపుమని కోరాడు. అప్పుడు సీతాదేవి తనకు, రామునికి తప్ప వేరెవ్వరికి తెలియని కాకాసుర

వృత్తాంతాన్ని హనుమకు తెలిపింది.

*ఏవముక్తా హనుమతా సీతా సురసుతోపమా*

*ఉవాచ వచనం మన్దం బాష్పప్రగ్రథితాక్షరమ్*

*ఇదం శ్రేష్ఠమభిజ్ఞానం బ్రూయాస్త్వం తు మమ ప్రియమ్*


"రామభక్తా! మేము చిత్రకూట పర్వతముపై ఒక తాపసాశ్రమాన్ని నిర్మించుకొని అందులో నివసించాము. మందాకినీ నదీతీరంలోని, ఆ ఆశ్రమ పరిసరాలలోని ఒక తోటలో భార్యాభర్తలు ఒక తూరి విహరించాము. ఆ ఆటలో నేను తొందరగా అలసిపోయి విశ్రాంతి తీసికోవాలనుకొన్నాను. నా భర్త తొడపై పడుకొన్నాను. అప్పుడు అక్కడికి మాంసముపై ఆశతో ఒక పాడు కాకి వచ్చి నా చుట్టు తిరుగుతూ రొద చేయసాగింది. కొంచెము సమయం తరువాత నా గుండెలపైకి ఎగిరి పొడవ సాగింది.


దగ్గరలో ఎండు మాంసము ముద్ద ఉన్నా, దాని జోలికి పోక నా గుండెలనే గీర సాగింది. నేను నా మొలత్రాడును తీసి దానిని కొట్టబోయాను. అప్పుడు నా నాథుడు "ఇంత చిన్న పిట్టపై అంత కోపమా" అని పరిహసించాడు. నాకు అంత బాధలో కూడ నా భర్త మాటలకు సిగ్గు కలిగింది. రాముడు నన్ను దగ్గరకు తీసికొని ఓదార్చాడు. నా కన్నీటిని తుడిచాడు.


అప్పుడు నా ప్రాణవిభుడు నా తొడపై పడుకొన్నాడు. నేను కాకి బాధను భరిస్తున్నాను.


నా భర్తకు నిద్రా భంగము కలుగుతుందని ఆ కాకిని కొట్టే ప్రయత్నాన్ని మానుకొన్నాను.


"స్వామి నిద్రా సౌందర్యాన్ని కనులారా సేవిస్తున్నాను. ఆ స్వామి సహజంగానే సుందరుడు. నిద్రలో ఆయన సౌందర్యము మరింత అధికమైంది. రెప్పపాటు కూడ లేక తదేకంగా తన్మయంగా ఆ స్వామినే చూస్తూ ఉండిపోయాను. ఆ ఆనందంలో నా గుండెల నుండి కారే రక్తాన్ని కూడ గమనించలేదు.


అయితే నా రక్తపు బిందువులు కొన్ని నా భర్త కపోలము పై పడ్డాయి. ఆ వేడికి వెంటనే సుఖంగా నిద్రించే పరంతపుడు నా స్వామి మేలుకొన్నాడు. "అయ్యో నా మూలంగా నా స్వామికి నిద్రాభంగమైందే?" అని నేనెంతో బాధపడ్డాను. ఆయన ఆగ్రహ పరవశుడయ్యాడు. "ఐదు తలలుగల భయంకర సర్పముతో ఆటలాడే ఆ నీచుడెవ్వడు? నిన్ను ఇంత క్రూరంగా హింసిస్తున్న ఆ అథముడెవ్వడు?" అని కోపంతో లేచి చుట్టు ప్రక్కల పరిశీలించాడు. అప్పటికి విడువకుండా నా గుండెలను పొడుస్తున్న అసురు స్వభావం గల ఆ పాడు కాకి రాముని కంటబడింది.


అరులను అణచడానికి ఆ అసహాయ శూరుడైన రామునికి ప్రత్యేకంగా ఒక ఆయుధము కావాలా? ప్రక్కలో ఉన్న ఒక గడ్డిపోచను తీసికొన్నాడు. బ్రహ్మాస్త్రాన్ని దానిలో సంధించి వదిలాడు. ఆ బ్రహ్మాసము ఆ కాకిని తరుమసాగింది......

*స తం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి*

*తతస్తం వాయసం దర్భస్సోమ్బరేనుజగామ హ*

కామెంట్‌లు లేవు: