( రంగమార్తాండ )
‘.
వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే
పార్వతీపరమేశ్వరౌ...’
ఒక వాక్కును పలికితే దాంట్లో ఉండే శబ్దార్ధాలు రెండింటినీ విడదీయడం కష్టం. నిజానికి పాపం కూడా!
శబ్దమూ, అర్ధంలా కలిసిమెలిసి ఉండే, విడదీయరాని బంధమున్న ఆ పార్వతీపరమేశ్వరుల్ని స్తుతించే శ్లోకం అది. ఆ పోలిక ఎందుకంటే...
అక్షరానికున్న శక్తి అటువంటిది. ఒక్క అక్షరం. కేవలం ఒకే ఒక్క అక్షరం మారినా, ఉచ్చారణలో తేడా చూపించినా శబ్దార్ధాలు రెండూ మారిపోయే అవకాశాలున్నదే భాష. అది కేవలం తెలుగనే కాదు.
అటువంటి భాషను ఔపోసన పట్టి, కళను శ్వాసించి, కరతాళధ్వనులను భుజిస్తూ కుటుంబ బాధ్యతలను, స్వీయ ఆరోగ్యాన్ని సైతం విస్మరించే తపనగలవారే రంగస్థల నటులు.
నాటకం....
ఇందులో సరిదిద్దుబాటుండదు.
నోటివెంట వెలువడిన మాట తిరిగి తీసుకునే అవకాశముండదు.
ఏడవాలంటే ఏదో ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుని కంటతడిపెట్టాలి.
రాని నవ్వుని కృతకంగా కాకుండా సహజమైన ధోరణిలో ప్రదర్శించాలి.
ముఖం మీద పడే ప్రకాశవంతమైన దీపకాంతిలో సైతం చిక్కని హావభావాలు కనబరచాలి.
ఉక్కబోతల్ని భరించాలి.
ముందున్న ప్రేక్షకుల్లో కొందరు ఆకతాయిలు చేసే వ్యాఖ్యానాలకి స్పందించనంత స్థితప్రజ్ఞత అలవాటవ్వాలి.
ఇంత కష్టసాధ్యమైన నాటకాన్ని ఎన్నో ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మహానటులెందరో ఉన్నారు.
వారందరికీ నివాళిగా నిండుగా విరబూసిన మందార పుష్పం ఈ ‘రంగమార్తాండ!’
కథా కమామీషుల్లోకి వెళ్లను.
ఎందుకిన్ని ప్రివ్యూలు?
చాలామంది హేళన చేస్తున్నారు. చూస్తున్నాను.
మహా మహా చిత్రాలే మూడువారాలకు మించి థియేటర్లలో ఆడని ఈ రోజుల్లో ఈ రంగమార్తాండ ఏదో కోట్లు కూడబెట్టెయ్యాలని కాదు వారి తాపత్రయం.
ఇది ఒక యజ్ఞంలా భావించి తీశారు. కృష్ణవంశీ ఇష్టాలన్నిటినీ కిక్కిరిసేంత దిట్టంగా కూరేసిన చిచ్చుబుడ్డి ఈ సినిమా. అంటించేముందు రాయబారం మందు మేమందరం. ఆ వెలుగులెలాగూ ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతాయి. అందులో సందేహమేమీ లేదు. వెలుగులంటే వసూళ్ళు మాత్రమే కావు.
ఈ దిట్టానికి అసలు కారణం మన లక్ష్మీభూపాలగారు. ఏ రీతిలో బయటపడాలి, ఎంత బలంగా ఉవ్వెత్తున ఎగసిపడాలనే స్థాయికి దిశానిర్దేశం చేసింది ఆయనే! కథావిస్తరణలో భాగంగా పాత కథనే ప్రస్ఫుటంగా అభివ్యక్తపరచడంలో వారి పాత్ర స్పష్టంగా కనబడుతుంది.
ఒక నటుడు, ఆ మాటకొస్తే నిజమైన నటుడనేవాడు ఎంత తపనపడతాడో ఈ చిత్రం చూపిస్తుంది. ఒక పాత్రపట్ల ఇష్టం, ఆ సంభాషణలపట్ల గౌరవం, భాషపై మమకారం, భావవ్యక్తీకరణపై పట్టుదల ఎంత తీవ్రస్థాయిలో ఉంటాయనేది ఇందులో రాఘవరావు పాత్ర నిరూపిస్తుంది.
అదంతా కంఠశోష అనుకుని పక్కకు తోసేసి మళ్లీ మన రొడ్డకొట్టుడే మనకిష్టం అనుకుంటే చేసేదేమీలేదు. కానీ ఇప్పుడీ రొడ్డకొట్టుణ్ణి సైతం రక్తికట్టించేలా చెయ్యగలుగుతున్న పెద్ద హీరోల్ని చూస్తే మనకొక విషయం అర్ధమవుతుంది.
ఒకప్పుడు వారందరూ ఎంతో తపనతో, భక్తితో తమకిచ్చిన ప్రతి పాత్రనూ నిబద్ధతతో నటించారు కనుకనే ఇంతకాలం పరిశ్రమలో నిలబడివున్నారని! అదే పునాది. ఏ నటుడికైనా ఆ ఇటుకలు గట్టివైతే ఘటికుడవుతాడు.
కృష్ణవంశీ చిత్రాలు లౌడ్‌గా ఉంటాయి. చెప్పదలచుకున్నది గట్టిగా చెప్పడం ఆయనకలవాటు. వినిపించుకోనివాళ్లకి డాల్బీ అట్మాస్‌లో చెబితేనే అర్ధమవుతుందని ఆయన భావన.
ఆ ఇంటెన్సిటీ ఇందులో చాలాచోట్ల కనబడుతుంది. నటీనటులకి విపరీతమైన వ్యాయామం ఈ సినిమా. ముఖంలో హావభావాలు పలికించడానికి మొత్తం ముఖ కండరాలన్నిటినీ శాయశక్తులా వాడాల్సిన అవసరం కల్పించారు దర్శకుడు.
మరాఠీ నాటకం నటసామ్రాట్ కి
ఇది అనుసరణే అయినా తాజాగా ఉంది.
ఇక ప్రకాష్‌రాజ్ నటుడిగా ఉగ్రరూపం ప్రదర్శించాడు. చిత్రంలో స్పృశించని అంశం లేదు. తెరవెనుక అన్నిటా తానై దర్శకుడు ఏంచెప్పాలనుకున్నాడో అదంతా తెరమీద నిండుగా ఆవిష్కరించిన మాయలమారి ప్రకాష్‌రాజ్.
వాయిస్ ఆఫ్ కృష్ణవంశీ అనిపించాడు.
బ్రహ్మానందం సంభాషణలు పలకడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈమధ్య చూసిన నాలుగైదు చిత్రాల్లో ఆయన నోట స్లర్డ్ స్పీచ్ వినబడింది.
కానీ ఇందులో ఒకానొక సన్నివేశంలో ఆయన ఒక పావుగంటపాటు తన సత్తా ఏమిటో చూపించేశారు. ఆ సన్నివేశం పూర్తయేవరకూ ఉగ్గబట్టుకున్న హాలంతా ఒక్కసారిగా చప్పట్లతో దద్దరిల్లిపోయింది.
పోనీ వచ్చినవారందరూ విద్యావంతులు, కాస్తోకూస్తో రచనావ్యాసంగంలో ప్రవేశమున్నవారూ కాబట్టి అలా అనుభూతి చెందారని మీరనుకోవచ్చు.
కానీ పూర్వం మన నాటకాలన్నింట్లోనూ వన్స్‌మోరంటూ రాత్రి తెల్లవార్లూ మళ్లీ మళ్లీ అదే సన్నివేశాన్ని చేయించుకుని మనసారా ఆనందించిన ప్రజలందరూ నిరక్షరాస్యులూ, నేలక్లాసు ప్రేక్షకులే!
అంచేత నాకు ఆ సన్నివేశం మళ్లీ మన పూర్వకాలపు వన్స్‌మోర్లను హాల్లో వినిపించేలా చేస్తుందేమోననిపిస్తోంది.
నిజానికి అటువంటి సన్నివేశాలు చూసి చాలా ఏళ్లయింది. అవి చిత్రీకరించడానికి చాలా ఓర్పు కావాలి. నేటి దర్శకులకి అంత సహనం ఉందని నేననుకోవట్లేదు.
ప్రకాష్‌రాజ్, కె.కె.మీనన్, పంకజ్ త్రిపాఠీ, నానా పటేకర్, నవాజుద్దీన్ సిద్దికీలాంటి అద్భుతమైన నటుల్ని సైతం కమర్షియల్ చట్రంలో బిగించేసి సాధారణమైన చిత్రాల్నే నిర్మిస్తోంటే వారి కుతి ఎలా తీరుతుంది? కసి ఎలా బయటపడుతుంది?
‘ఇదికదా నేను... ఇలాక్కదా నాలో ఉన్న అసలైనవాడు బయటపడేది?’ అని కాలు నేలమీద దబ్ మని కొట్టిమరీ నటించారు ఇద్దరికిద్దరూ! నిజమైన రంగమార్తాండులనిపించారు ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం!
ఇక మిగతావారిలో నాకు బాగా నచ్చింది శివాత్మిక. ఆ అమ్మాయిలో సహజమైన నటి ఉంది. అది ఎవరో నేర్పితే వచ్చేదికాదు. యాక్టింగ్ స్కూళ్లవల్లా రాదు. తనకి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉందనిపించింది.
రంగమార్తాండ తప్పకుండా చూడండి. ఇదేదో ప్రచారం కోసం చెప్పట్లేదు. సినిమా కుటుంబసమేతంగా చూడొచ్చు.
ఇలాంటి కధలు మన / మీ యిళ్లలో కూడా తప్పకుండా జరుగుతాయి. మీరూ కచ్చితంగా కనెక్టవుతారు. తథ్యం!
ఇళయరాజా!
ఈయన పాట లేకుండా నా కారు కదలదు. నోరు పెగలదు. అంతిష్టం. ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో సైతం దమిడి చేమంతిలాంటి ఫ్యూజన్ పాటతో మళ్ళీ మనందరి ముందుకూ ఘనంగా వచ్చాడు ఈ జ్ఞాన దేశిగన్!
ఉత్తరాంధ్ర పదాల్ని హాయిగా పరిచయం చేస్తున్నా బల్లా విజయకుమార్ రాసిన ఈపాట చాలా ప్రాచుర్యం పొందింది.
ఆర్ద్రతాలోపంతో బాధపడుతున్న నేటి చిత్రాల మీద బిందెడు నీళ్లు ఒంపి మరీ చెప్పింది ఈ రంగమార్తాండ..... ఏమని?
‘ఎంతసేపూ చేతి తడే కాదురా అబ్బాయిలూ, మనసు తడిని సైతం గమనించుకోం’డంటూ!
విజయోస్తు!
శుభాభినందనలు!
.....సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి