*విజ్ఞాన పెన్నిధులు*
➖➖➖✍️
*భారతీయ సనాతన సంప్రదాయానికి మూలాధారాలు- చతుర్వేదాలు. విజ్ఞాన పెన్నిధులుగా ఆర్ష ధర్మానికి ఆలంబనగా నిలిచే సమున్నత ప్రతీకలుగా వేదాలు విలసిల్లుతున్నాయి. అఖిల సృష్టిలోని జ్ఞానమంతా వేదాల్లో ప్రకటితమవుతుంది. సాధారణ పరిభాషలో ‘వేదం’ అంటే జ్ఞానం. మనసులో అలముకున్న అజ్ఞానాంధకారాన్ని పారదోలే అనంత జ్ఞాన కాంతిపుంజాలు వేదనిధులు. సృష్ట్యాదిలో సర్వశ్రేష్ఠులైన ఋషులకు భగవత్ చైతన్యం ద్వారా వేదవిద్య అందింది. తరవాత ఆ ఋషి పుంగవులు వేదాన్ని గానం చేస్తున్న సందర్భంలో బ్రహ్మరుషి విన్నాడంటారు. ఆ బ్రహ్మరుషి బృహస్పతికి, బృహస్పతి ఇంద్రరుషికి, ఇంద్రరుషి భరద్వాజుడికి వేద విజ్ఞానాన్ని పంచారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలనే నాలుగు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన సారస్వతామృతంగా తేజరిల్లుతున్నాయి.*
*గురుశిష్యుల పఠన, పాఠన విధితోనే వేద పరంపర కొనసాగుతోంది. యుగయుగాలుగా మహర్షుల చింతన, మనన, పరిశీలన, పరిశోధన, అధ్యయనాలతో వేద విజ్ఞానం మరింతగా వెలుగు పుంజాల్ని విరజిమ్మింది. ‘విద్’ అంటే తెలుసుకోవడం. మహర్షులు, ఋషులు మంత్రద్రష్టలుగా వేదమంత్రాల్లోని నిగూఢ రహస్యాల్ని తెలుసుకుని, వాటి గురించి మననం చేసి, పరిశీలనాత్మక దృక్పథంతో అనుభవంలోకి ఆపాదించుకుని, ఆ జ్ఞానభాండాల్ని విశ్వానికి అమూల్యమైన కానుకలుగా అందించారు.
*ఋగ్వేదమంత్రాల్ని రుచ సముచ్ఛయంగా పేర్కొంటారు. నాలుగు పంక్తుల శ్లోకాలుగా ఉండే ఈ మంత్రాలన్నీ దేవతా స్తుతులుగా, యజ్ఞ నిర్వహణకు ఉపకరిస్తాయి. వైదిక దేవతల ప్రార్థనా పూర్వక మంత్రాల సమ్మిళితంగా ఋగ్వేదం ప్రతిఫలిస్తుంది.*
*యజుర్వేదం గద్యరూపాత్మకమైనది. ‘యజుష్’ అంటే పూజ. ప్రక్రియా పూర్వకమైన విధి విధానాలైన పూజ, ఆరాధనల మంత్రాలు యజుర్వేదంలో నిక్షిప్తమై ఉన్నాయి.*
*వివిధ యజ్ఞాల ప్రాముఖ్యాన్ని ఆవిష్కరిస్తూ, వాటి ఆచరణ రీతుల్ని విహిత కర్మకాండల సంవిధానాల్ని యజుర్వేదం వివరిస్తుంది.*
*దేవతల్ని ఆనందపరచడానికి యజ్ఞయాగాదుల్లో, ఆరాధనా క్రతువుల్లో గానం చేసే మంత్రాల శ్రేణి- సామవేదం. స్వర, తాళయుక్తంగా ఆలపించడానికి ఆమోదయోగ్యంగా సామవేద మంత్రాలు దోహదమవుతాయి.*
*బ్రహ్మవేదంగా పేరుపొందిన నాలుగో వేదం- అధర్వణం. తంత్రం, యంత్రం, మంత్రాల సమ్మేళనమై అధర్వణ వేదం భాసిల్లుతుంది. ఆధ్యాత్మిక చింతనాపరమైన, భగవదనుగ్రహాన్ని పొందడానికి సంబంధించిన మంత్రాలన్నీ ఈ వేదంలో నెలకొని ఉంటాయి. ‘బ్రాహ్మణి’గా వ్యవహరించే ఈ వేదానికి బ్రహ్మవిద్య అనే పేరు ఉంది.*
*చతుర్వేదాలు కేవలం పారమార్థిక విషయాల్ని మాత్రమే కాక జన బాహుళ్యానికి ఉపకరించే ఎన్నో అంశాల్ని ప్రతిబింబిస్తాయి. రాజనీతి, ఆచార వ్యవహారాలు, ఔషధాల విజ్ఞానం, గణిత, భౌతిక, రసాయనిక సూత్రాలు, ప్రజాతంత్రం, రాజ్యరక్షణ, శాసన విధానం, సంస్థల నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం, వ్యవసాయం, భూగోళ, ఖగోళ విజ్ఞానాంశాలు- ఇలా వేదాలు విజ్ఞాన పెన్నిధులై పరిఢవిల్లుతున్నాయి.*
*వేదమంత్రాలన్నీ లోక కల్యాణాన్ని కాంక్షిస్తాయి. విశ్వశ్రేయస్సును కోరుకుంటాయి. అందుకే వేదాల్ని ‘విశ్వసాహిత్యం’గా వివేకానందుడు వర్ణించారు. ‘పరమపద సోపానాన్ని అధిరోహించడానికి వేద విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. వేదం జీవన నాదమై రవళిస్తుంది. ఆ నాదంతో జీవన గమనాన్ని అనుసంధానం చేసుకుంటూ మానవులు నిత్య జాగృతులు కావాలి’ అనే జగద్గురువు ఆదిశంకరుల సందేశం అనుసరణీయం.*✍️
- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ఇలాటి మంచి విషయాలకోసం... గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...9493906277
లింక్ పంపుతాము.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి