1, జూన్ 2023, గురువారం

ధర్మము

 ధర్మము


"ధర్మః” శబ్దమునకు “సమస్త విశ్వమును నిలకడగా ఉంచునది అని అర్థము”. దీనిని పాణిని మహర్షి ఊణాది సూత్రములో వివరించారు. ఈ ధర్మ స్వరూపమును ప్రత్యక్ష ప్రమాణము ద్వారా గాని, అనుమాన ప్రమాణము ద్వారా గాని, హేతువాద లేదా నాస్తికవాదముల ద్వారా గాని తెలుసుకోలేము. వేదముద్వారా, పురాణేతిహాసముల వలన మాత్రమే తెలియును.అయితే ఈ ధర్మము యుగములను అనుసరించి మారుతూ ఉంటుంది. ధర్మసూక్ష్మములు స్థూల దృష్టి కలవారికి అవగాహన ఉండదు. అందుకే కర్ణుడు గొప్పవాడు ద్రౌపది పతివ్రత కాదు, రాముడు వాలి విషయంలో ధర్మం పాటించలేదు, రావణ్ ఈజ్ గ్రేట్ అని విమర్శిస్తారు. అప్పటికి మనమేదో ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ అవపోసన పట్టినట్టు..


ధర్మము స్థూలధర్మమని, సూక్ష్మధర్మమని ద్వివిధములు. ఆపద్ధర్మము, విశేషధర్మము అనునవి సూక్ష్మధర్మమునకు పర్యాయ పదములు.


సహజధర్మముచే నెరవేరని వాటిని ఆపద ఏర్పడినప్పుడు అట్టి ఆపత్కాలములో మాత్రమే ఆచరింపదగినది ఆపద్ధర్మము. ఆపత్కాలమున అట్లు చేయుట అధర్మముకాక ధర్మమే అగును. కనుకనే అది ఆపద్ధర్మమయినది.


పూర్వం ఉపస్తి అను ముని తన కుటుంబముతో ఆకలితో అలమటించు సమయమున అతడొక గ్రామమునకు పోయి మావటివానిడి చేరి వాడు తినుచున్న మినుపగుగ్గిళ్ళను యాచిస్తాడు. మావటివాడు ఉచ్ఛిష్టమయిపోయినవి ఇంతకంటె వేరేమిలేవని చెప్తాడు. ఆ ఉచ్ఛిష్టమయిన వానినే ఇమ్మని అడిగి తీసికొని భుజించి ఆకలి తీర్చుకొనెను. మావటివాడు త్రాగుటకు తాను త్రాగగా మిగిలిన నీటిని ఇవ్వబోగా ఈ జలము ఉచ్ఛిష్టము, నాకు వద్దు అని ఉపస్తి చెప్తాడు. అప్పుడు మావటివాడు ఈ గుగ్గిళ్ళు మాత్రము ఉచ్ఛిష్టము కావా? . వీటిని తినవచ్చునా ? అని అడుగుతాడు. అప్పుడు ఉషస్తి ఆ గుగ్గిళ్ళు తినకపోతే నా ప్రాణములు పోయి ఉండేవి. అలాంటి ఆపద సమయమున ఉచ్ఛిష్ట దోషము లేదు. నాకు త్రాగుటకు జలము దొరుకును. ఇప్పుడు అట్టి ఆపదలేదు. ఆ నీరు నాకు ఇప్పుడవసరము లేదు అని తిరస్కరిస్తాడు. ఇది ఆపద్ధర్మస్వరూపము. ఇది ధర్మముయొక్క సూక్ష్మత. ఆపదయందు మాత్రమే దానిని అనుష్ఠించిన దోషము లేదు. ఆపద తీరిన తర్వాత తిరిగి అట్లు చేసిన దోషము కలుగును. దీని తత్వము ఎఱుగక లేదా ఆర్ష సాంప్రదాయము తెలియక వేదాలు, ఋషుల మహత్యము తెలుసుకోక సామాన్యులు శాస్త్రాల్లోని విషయాలను అవమానిస్తున్నారు.


కొందరు మెట్ట వేదాంతంతో ఇతరులకు హాని చేయకపోవడం, మంచిగా మాట్లాడటం ధర్మం అని వారికి తోచిన రీతిలో చెబుతుంటారు. ధర్మం నిర్ణయించడం అంత సులువు కాదు. గురువులచే శాస్త్ర ప్రమాణంగా తెలిసుకున్న విషయాలే ఒక్కోసారి ఆచరించలేక సంగ్దిగ్ధావస్థ కలుగును. ధర్మసూక్ష్మం చాలా విశాలమైనది.


బహుభాషావేత్త అయిన “వింటరినిడ్జ్"  "There is no word in any European Language which is quite synonymous with the Sanskrit word Dharma" ధర్మః పదానికి సమాన అర్థము కలిగిన శబ్దము ఏ భాషలలో లేదని చెప్పాడు.


అంతగొప్పవి మన ధర్మశాస్త్రాలు. కేవలం ఒక్క ధర్మం అనే పదం పైన అనేక ఋషులు నైమిశారణ్యంలో చర్చలు చేసారు. అనేక గ్రంథాలు దీనిపై ప్రచురించ బడ్డాయి.అవిద్యతో ధర్మం గురించి కొందరు సూడో సెక్యులర్లు వక్రీకరించిన రచనలు కూడా చేసారు. 


ధర్మం గురించి అర్థమవ్వాలి అంటే గురుముఖంగా మన శాస్త్రాలను తెలుసుకోవడం వల్లనే సాధ్యం.

కామెంట్‌లు లేవు: