1, జూన్ 2023, గురువారం

చారిత్రాత్మక కథాస్రవంతి🌹* . ♦️ *ఆర్య చాణక్య*♦️ *అధ్యాయము - 13 : పార్ట్ - 77*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌷🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*అధ్యాయము - 13 : పార్ట్ - 77*


చంద్రగుప్తుని సేనలు పాటలీపుత్రాన్ని ముట్టడించాయి. 


పాంచాల, సింహపుర, నేపాళ, కిరాతక, బాహ్లికాదిక్, కళింగ, ఆంధ్ర రాజ్యముల నుండి తరలి వచ్చిన అశేష సైనిక సమూహమునకు పర్వతకుని సర్వసైన్యాధ్యక్షునిగా గౌరవ బాధ్యతలప్పగించి చాణక్య చంద్రగుప్తులు యుద్ధయాత్రను ముందుకు నడిపించారు. 


జీవసిద్ధి మంత్రాంగమునకు నందుల అహంకారముతోడైనందున మగధకు వచ్చే నలువైపులా ఉన్న సామంత దుర్గములన్నీ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే చంద్రగుప్తుని వశమయ్యాయి. ఇంద్రప్రస్థము, హస్తినాపురము, కురుక్షేత్రము, కాశీ, అయోధ్య, మధుర తదితర సామంతరాజ్యాలన్నీ సంధి చేసుకుని చంద్రగుప్తుని సార్వభౌమత్యాన్ని అంగీకరించాయి. 


'తాము జయించిన రాజ్యములలో గారీచ మధ్యమమున నున్న గ్రామాలలో గానీ ప్రజలను కొల్లగొట్టరాదనీ, హింసించరాదనీ, స్త్రీలపై అత్యాచారమునకు పాల్పడరాదనీ ' చాణక్యుడు తన సేనలకు ముందుగానే కఠినమైన హెచ్చరికలు ఇవ్వడం చేత దారిపొడవునా గ్రామ గ్రామాన జనులు జేజేలతో చాణక్య చంద్రగుప్తులకు స్వాగతాలు పలికారు. అలా మూడు మాసాలు పాటు వరస రాజ్యాలన్నింటినీ లొంగదీసుకుంటూ వచ్చిన చంద్రగుప్తుని సేనలు ఒక శుభముహూర్తాన పాటలీపుత్రమును నాలుగు వైపుల నుంచీ ముట్టడించాయి. 


పారశీక నేపాళ సైన్యములతో పర్వతకుడు, అతని సోదరుడు వైరోజనుడు, కుమారుడు మలయకేతువులతో కలిసి చాణక్యుడు పాటలీపుత్రపు ఉత్తరదిక్కును ముట్టడించాడు. 


సింహపుర, కామారాపాధిపతులు తమ సేనలతో తూర్పునుండి పాంచాల, కొరాత, బహ్లికాదులు పడమటి దిక్కు నుండి ముట్టడించారు. 


ఇక ఆంధ్ర, కళింగ, పిప్పలవన సేనా సమూహంతో దక్షిణ దిశ నుండి పాటలీపుత్రాన్ని ముట్టడించాడు చంద్రగుప్తుడు. పాటలీపుత్ర దుర్గము శత్రుసమూహముల మధ్య దిగ్బంధమైపోయింది. 


మగధ సామ్రాజ్యమునకు రాజధాని నగరం పాటలీపుత్రము తొమ్మిది మైళ్ళ పొడవు రెండు మైళ్ళ వెడల్పు కలిగినది. దాని చుట్టూ అరవైనాలుగు ముఖద్వారాలతో, అయిదువందల డెబ్బై బురుజులతో నిర్మించబడిన కోటగోడ పటిష్టమైనది. ఆ కోటగోడలపై అశ్వరుడులై సైనికులు పహారా కాయుటకు వీలుగానున్నది. ఆ దుర్గమునకు నలువైపులా అగాధమువంటి కందకము నిర్మించబడింది. ఆ కందకము నిండా శోణానది జలాలు నిండుగా ప్రవహిస్తూ వాటిలో భయంకరమైన మొసళ్లు తిరిగాడుతుంటాయి. 


ఆ కందకము దాటడానికి దానిపై బలమైన చెక్కవంతెనలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఆ వంతెనలు కోటలోనించే పైకి లేపుట, కందకము మీదికి దించు ఏర్పాటు ఉండడం చేత కోటలోని వారి అనుమతి, సహాయ సహకారాలు లేనిదే బయటివారెవ్వరూ దుర్గములోపలికి ప్రవేశింపలేరు. సాధారణ దినములలో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆ వంతెనలు కందకము మీదికి దించబడి పౌరుల రాకపోకలకు వీలు కల్పిస్తుంటాయి. రాత్రిళ్ళు మాత్రం వంతెనలు కందకముపైకి లేపబడతాయి. ఈ ప్రత్యేకత వలననే పాగలాపుత్ర దుర్గము అన్యులకు దుర్గ్రాహ్మమైనదిగా పేరుగాంచింది. 


పాటలీపుత్రము చుట్టూ వందలాది పాటలీవృక్షములతో కూడిన అనేక వనములు ఉండడం చేతనే దానికి పాటలీపుత్రము అనే పేరు ఏర్పడింది. ఆ పుష్పముల సువాసనలు నిరంతరమూ వ్యాపించుచుండుట చేత దానికి కుసుమపురము అనే నామాంతరము వచ్చింది. 


ఇన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కారణంగానే పాటలీపుత్రమును నలువైపులా చుట్టుముట్టిన చంద్రగుప్తుని సేనా వాహినులు కోటలోనికి ప్రవేశించే ఉపాయాలను అన్వేషిస్తూ కోటబయటనే మోహరించాయి. 


కోటలోపల వందలాది విశాలమైన వీధులు, వివిధ స్తోమతలు గల ప్రజలు నివసించు వివిధ రకాల నివాసాలు ఉన్నాయి. కోటలోపల మరో బలమైన ప్రాకారము ఉన్నది. ఆ ప్రాకారము నలుచతురాస్రాకారము గలది. దానిని ఆనుకొని లోపలా, బయటా సైనికులూ, సేనాధిపతులూ, మంత్రులు, ఇతర రాజోద్యోగులు నివసించడానికి వారి వారి అర్హతలకి తగినట్టుగా నివాసాలు ఉన్నాయి. వాటితోపాటు చతురంగబలాల కవాతులకు విశాలమైన మైదానాలు, వివిధ ఆయుధాలతో నిండిన గిడ్డంగులు, గజ, తురగశాలలు, ధాన్యాగారాలు, ధనగారాలు ఉన్నాయి. వీటి మధ్యన సువిశాలముగా ఇంద్రభవనమును పోలిన రాజభవనమున్నది. 


అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అలరారే ఈ రాజభవనానికి 'సుగాంగ ప్రాసాదము' అని పేరు. 


ఈ సుగాంగ ప్రాసాధనలో గల వివిధ భవన సముదాయాలలో రాక్షసామాత్యుడు, ఇతర ముఖ్యులు నివసిస్తుంటారు. వీటి మధ్యన మహాద్భుతమైన భవనమే రాజగృహము. ఈ రాజగృహములో సముదాయాలలో మగధరాజులు వారి కుటుంబ సభ్యులు నివసిస్తుంటారు. 


ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పాటలీపుత్రపు కోటలోపలికి ప్రవేశించుటెట్లో చంద్రగుప్త, పర్వతకులకు బోధపడలేదు. చాణక్యుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా ఉండిపోయాడు. 


రెండు రోజులపాటు ఇరువర్గాలలో ఎలాంటి చలనమూ లేదు. కోటలోపలి నుంచి ప్రతిఘటించిన వారు లేరు. కోట బయట నుంచి పోరు సలపడానికి వైరివర్గము వారెవరూ తారసపడలేదు. అలా ఎంతకాలము నిశ్శబ్దాన్ని భరించాలో ఎవ్వరికీ అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. 


మూడోనాటి ఉదయం కోటలో ఒక విచిత్రం జరిగింది. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: