16.
రామాయణం...
ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...
*వాల్మీకి రామాయణం:*
*16 వ భాగం:*
➖➖➖✍️
*పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహోగ్రమైన తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు.*
*అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేథ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు.*
*”అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదు” అని మహర్షులు చెప్పారు. “కాని అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తిచెయ్యచ్చు”అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు.*
*ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద, ఋచీకుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చుని ఉన్నాడు.*
*అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహరణకి గురైనందుకుగాను నాకు ఒక యాగపశువు కావాలి, మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి” అన్నాడు.*
*అప్పుడా ఋచీకుడు ఇలా అన్నాడు… "పెద్దకొడుకు ధర్మసంతానం(పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు) కావున నేను వాడిని ఇవ్వలేను, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడు మధ్య కొడుకైన శునఃశేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు.*
*రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి, యాగం పూర్తి చెయ్యడానికి తన కొడుకుని పంపాడు ఆ ఋచీకుడు.*
*అంబరీషుడు ఆయనకి లక్ష గోవుల్ని దానంగా ఇచ్చాడు. శునఃశేపుడిని తీసుకెళుతున్న అంబరీషుడు కొంతదూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడకి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునఃశేపుడు చూశాడు.*
*వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు "నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామ అవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వననింది, మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేసారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది. కాబట్టి మీరు నన్ను రక్షించాలి" అని అన్నాడు.*
*అప్పుడు విశ్వామిత్రుడు… “సరే!” అని తన కొడుకులని పిలిచి, “తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ శునఃశేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి” అన్నాడు.*
*కథం ఆత్మ సుతాన్ హిత్వా త్రాయసే అన్య సుతం విభో |*
*అకార్యం ఇవ పశ్యామః శ్వ మాంసం ఇవ భోజనే ||*
*”నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా, ఇంకొకడి కొడుకుని రక్షిస్తావా, మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది” అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు.*
*ఆగ్రహించిన విశ్వామిత్రుడు......*
*శ్వ మాంస భోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు |*
*పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యాం అనువత్స్యథ ||*
*”మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళలాగ కుక్క మాంసం తింటూ బతకండ”ని శపించాడు.*
*అప్పుడాయన. శునఃశేపుడితో.... “నువ్వు బెంగపెట్టుకోమాకు, నిన్ను తీసుకెళ్ళి యూప స్తంభానికి కడతారు. ఇప్పుడు నేను నీకు రెండు మంత్రాలని చెప్తాను, నిన్ను అలా యూప స్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ రెండు మంత్రాలని జపించు, అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి, నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, ‘నేను ఈ యాగానికి ప్రీతి చెందాను’ అని యాగ ఫలితం ఇస్తాడ”ని చెప్పి ఆ రెండు మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు.*
*తరవాత శునఃశేపుడిని యూప స్తంభానికి కట్టారు, అప్పుడాయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, “నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యాగపశువుని బలి ఇవ్వకుండానే మీకు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను “అన్నాడు.*
*అందరూ సంతోషించారు. కోపంలో తన కొడుకులని శపించానని విశ్వామిత్రుడు బాధ పడ్డాడు. ఈ సారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.*
*అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు.*
*”మేనక! నేను నీయందు కందర్ప వశుడనయ్యాను(అంటె మన్మధ ఆవేశం కలిగింది), అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు” అన్నాడు.*
*మేనక “సరే” అనంది. అలా మేనకతో క్రీడిస్తూ క్రీడిస్తూ పదేళ్ళు గడిచిపోయాయి.*
*సర్వం సురాణాం కర్మ ఏతత్ తపో అపహరణం మహత్ |*
*అహో రాత్రా అపదేశేన గతాః సంవత్సరా దశ ||*
*పది సంవత్సరాల తరువాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ‘ఈ మేనకతో ఏదో, ఒక రోజు లేకపోతే రెండు రోజులు అనుకున్నాను, కాని ఇలా పది సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనస్సుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు’ అనుకొని కోపంగా మేనక వైపు చూశాడు, కాని ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకని వెళ్ళిపోమన్నాడు.*
*ఈ సారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.*✍️
రేపు... 17వ భాగం...!
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి