4, జూన్ 2023, ఆదివారం

మనోనిగ్రహం

 మనోనిగ్రహం


గీత మాటిమాటికీ సమత్వం బోధిస్తుంది.కష్టంకాని, సుఖంలోకాని ఏవిధమైన ఉద్వేగమూ ఉండరాదని చెపుతుంది. ''దుఃఖే ష్వనుద్విగ్న మనాః సుఖేషు విగతస్పృహః'' ఈ స్థితి మనకు రావాలంటే మనం పరిపూర్ణంగా ఈశ్వరుని శరణుజొచ్చితేకాని రాదు. ఈవిషయంలో భగవానులు చక్కగా నిస్సందేహమైన ఆదేశాలు ఇస్తున్నారు. 'యుక్త ఆసీత మత్పరః' 'మామేకం శరణం వ్రజ' 'వాసుదేవ స్సర్వమితి' అన్నిటినీ సమభావంలో చూడలేక కోరికలతో క్రోధాలతో తన మనస్సు రెపరెప లాడుతూంటే, సమర్పణబుద్ధితో తన ధర్మాన్ని చేయలేనివాడు అయుక్తుడని అంటుంది గీత. అయుక్తునికి బుద్ధీలేదు, భావనాలేదు. భావనఅంటే భక్తితోడి శరణాగతి. ఎప్పుడైతే వానికి భావన లేకపోయిందో, వానికి శాంతిసైతమూలేదు శాంతిలేనివానికి సుఖమెక్కడిది? 'అశాంతస్య కుతస్సుఖం' ఈగీతోపదేశాన్ని అనుసరించే, త్యాగయ్య 'శాంతములేక సౌఖ్యమూలేదు' అని గానంచేశారు. ప్రాపంచిక సుఖాలపై తరచు మళ్ళే మనస్సు నిత్యసౌఖ్యాన్ని తెలుసుకోలేక, చిల్లిపడిన నేతికడవవలె ఎన్నడూ నిండక భంగపడుతుంది. గీతాశాస్త్రంలో మనం చూచే యోగం పరోక్షజ్ఞానానికీ, అపరోక్షజ్ఞానానికీ రెంటికే అవసరమని తేలుతున్నది. 


ఐతే గీతలో యోగసందర్భంగా ఉపయోగింపబడిన సమత్వానికి అర్థం ఏకత్వంకాదు. రాజూ, రౌతూ సమమనికాదు దానికి అర్థం. సుఖదుఃఖాలను సమభావంగా చూడటమే దాని ఉద్దేశం. సారాంశమేమిటంటే నియతకర్మలను చేయుమనీ, ఆ చేయడమున్నూ ఫలాభిసక్తి లేక భక్తితో ఆర్ద్రమైన హృదయంతో చేయుమనీ, కర్మ పూర్తికాగానే అది ఈశ్వరార్పితం చేయుమనిన్నీ, ఈఆదేశాలు పాటించాలంటే ఇంద్రియనిగ్రహం ఉండాలి. విషయ ప్రపంచంనుండి ఇంద్రియాలను విముఖంచేయాలి. అట్లుకాక విషయాలను చూచినదే తడవుగా మనస్సు కళ్ళెంలేని గుఱ్ఱమువలె పరుగిడిపోతే దానిసాయంతో ఆత్మచింతనగానీ, సత్యదర్శనంగానీ చేయలేము. ఇంద్రియాలచే ఉద్విగ్నమైన మనస్సు ప్రజ్ఞ తప్పిపోయి తుపానులో చిక్కుకొన్న నావవలె అల్లలాడిపోతుంది. 'వాయుర్నావమివాంభసి' మనస్సుకూ, ప్రజ్ఞకూ గీతలో చేయబడిన తారతమ్యం మనం గుర్తించాలి. మనస్సుచేసే పనులను అనుసరించి ఒకొకపుడు బుద్ధి అనీ చిత్తము అనీ వేర్వేరుపదాలతో దానినే వాడుతూంటారు. అంతర్ముఖధ్యానం చేసేది ప్రజ్ఞ గీతలో మనస్సు సముద్రంతోనూ, ప్రజ్ఞ నావతోనూ, ఇంద్రియోద్వేగం తుపానుతోనూ పోల్చబడ్డది. 


ఇంద్రియ నిగ్రహమనే అస్థి భారంపై, స్థితప్రజ్ఞత్వమనే సౌధం కట్టబడింది. ఇంద్రియాలనుఆంతర్ముఖంచేస్తే ఆత్మైకత్వసిద్ధి కలుగుతుంది. ఎన్నినదులు వచ్చి తనలో పడుతున్నా నిశ్చలంగా ఉంటుంది సముద్రం. 'ఆపూర్వమాణ మచల ప్రతిష్ఠం' ఆవిధంగా ఒకని మనస్సు పరివర్తితమైతే అతడు జ్ఞాని. అట్టివాడు నిత్యా నిత్య వివేచనంతో వ్యాపకబ్రహ్మాన్ని అనుసంధానించి ఆ ఆనందానుభూతితో జీవాత్మ పరమాత్మైక్యాన్నిసాధిస్తాడు. ప్రాపంచకుడుదేనిని నిజమని అనుకొంటాడో జ్ఞానికి అదిమిథ్య. అందుచేతనే భగవానుడు అర్జునునికి నీకుతగిన కర్తవ్యం నీవు చేయుమని చెప్పడం. యుద్ధంచేయడం రాజ్యం కోసం కాదు, మనో నిగ్రహంకోసం. మనోనిగ్రహం లాభించిందంటే నైష్కర్మ్యం సిద్ధించి బ్రహ్మనిర్వాణానికి దారితీస్తుంది. ఆత్మ పరమాత్మల ఐక్యమే బ్రహ్మనిర్వాణం.                        


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: