*నవ్వుతూ బతకాలిరా..!*
➖➖➖✍️
*‘తొండము నేకదంతమును తోరపు బొజ్జయు...' అంటూ వినాయకుణ్ని వర్ణించాడొక కవి.*
*తొండమే తప్ప నోరు లేనప్పుడు, ఆయన నవ్వితే తెలిసేదెలా... అనే ప్రశ్నకు ‘మెల్లని చూపుల మందహాసమున్' కంటితోనే నవ్వుతాడని బదులిచ్చాడు.*
*నిజానికది హృద్యమైన విద్య. రాముడికీ తెలుసది. 'నోరు తెరిచి మాట్లాడక ముందే రాముడి కళ్లు నవ్వుతూ పలకరిస్తాయి... ఆయన స్మితపూర్వభాషి' అన్నారు వాల్మీకి మహర్షి.*
*'నల్లనివాడు పద్మ నయనంబులవాడు కృపారసంబు పై చల్లెడువాడు...' మాత్రమే కాదు- కృష్ణుడు.*
*‘నవ్వురాజిల్లెడు మోమువాడు కాబట్టి తాము మనసు పడ్డామన్నారు గోపికలు.*
*'తలనిండ పూదండ దాల్చిన రాణి... మొలక నవ్వులతో నన్ను మురిపిస్తోంది' అన్నారు కవి దాశరథి. నవ్వనేది ఆషామాషీ దినుసు కాదు-* *'సహజాతంబది సర్వమానవ మనస్సంతాప నిర్వాపకంబు (ఆవేదనను తొలగిస్తుంది) ఇహలోకంబున పారిజాతమది' అని తేల్చారు అబ్బిరెడ్డి శతావధాని.*
*పురాణకవులు మొదలు ఆధునిక అవధాన కవుల దాకా మొహానికి నవ్వే అందం, అలంకారమనేది ఏకాభిప్రాయం.*
*రౌద్ర గంభీరమూర్తిగా తోచే పరమశివుణ్ని సైతం పగలబడి నవ్వించాడు నంది తిమ్మన.* *శివపార్వతుల కల్యాణం జరుగుతోంది. అయ్యవారి తలపై అమ్మవారు తలంబ్రాలు పోస్తూ ఉలిక్కిపడింది.* *ఎందుకంటే అక్కడ అప్పటికే గంగమ్మ ఒబ్బిడిగా సర్దుకొని ఉంది. ఆ గంగాజలంలో తన ప్రతిబింబాన్నే గమనించి 'వేరొక్క తొయ్యలి (స్త్రీ) యంచున్ మదినెంచు పార్వతి అసూయావ్యాప్తిని' చూసి పరమశివుడు ఫక్కున నవ్వాడన్నాడు-* *పారిజాతాపహరణ కావ్యంలో.*
*ఇది చదవగానే కనీసం మనసులోనైనా మందహాసం మెరిసిందంటే- మనలో కొంత హాస్యప్రవృత్తి ఉందని లెక్క. అది మంచి ఆరోగ్య హేతువు. *
*'నాలో హాస్యప్రవృత్తే లేకుంటే- నేను ఏనాడో ఆత్మహత్యకు సిద్ధపడేవాణ్ని' అన్న మహాత్మాగాంధీ మాటలు గుర్తున్నాయా?*
*నవ్వుతూ బతకాలన్నది- సాధారణ నినాదం కాదు, సరైన జీవన విధానం. పగలంతా చాకిరీ చేసిచేసి ఈసురోమంటూ ఇల్లు చేరే పెనిమిటికి ఇల్లాలి చిరునవ్వే వాజీకరణం.*
*అనారోగ్యాలను పారదోలే జీవరసాయనం. నిజానికి నవ్వు ఏనాడో చికిత్స స్థాయికి ఎదిగింది.*
*'పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధ లే*
*నవ్వులు సర్వదుఃఖ దమనంబులు...' అని వైద్యశాస్త్రం గుర్తించింది.* *రచయితలు సైతం ఈ వాస్తవం గ్రహించారు. 'రవ్వంత సడి లేని రసరమ్య గీతాలు' అంటూ నవ్వులను సినీకవులు అభివర్ణించారు!*
*ఆకలితో నకనకలాడుతున్న పిల్లవాడు తెగించి హోటల్లో దూరాడు. తృప్తిగా తిన్నాడు. డబ్బులు అడిగితే లేవన్నాడు. కోపం ముంచుకొచ్చిన యజమాని పిల్లవాణ్ని లాగి గూబమీద కొట్టాడు. కుర్రాడు కిందపడ్డాడు. హాస్యరసం సత్తా ఎరిగిన ముళ్లపూడి వంటి రచయిత- పిల్లవాణ్ని పైకి లేపి 'అయ్యా, ప్రతిరోజూ ఇదే లెక్కన నేను భోజనానికి రావచ్చా!' అని అడిగిస్తాడు.*
*ఇదీ ఒక రకమైన సాహితీ వైద్యమే! స్ఫూర్తిమంతమైన ఆర్తిని గుండెకు హత్తించే మంత్రదండం- హాస్యప్రవృత్తి.*
*కొంతకాలంగా మనిషి మొహమ్మీది దరహాసాన్ని కొవిడ్ మహమ్మారి తుడిచిపెట్టేసింది. హాస్యప్రవృత్తిని అణిచేసింది. ఈ నేపథ్యంలో డెన్మార్క్ కు చెందిన ఓ సూపర్ బజార్ యజమానికి అద్భుతమైన ఆలోచనతట్టింది. లోపలికి రావాలంటే షాపు అద్దాల తలుపు దగ్గర ఆగి ఫకాల్న నవ్వాలి. అలా నవ్వితేనే- సెన్సర్స్ అమర్చిన తలుపు తెరుచుకుంటుంది. ప్రజలకు ఈ కొత్త ఊహ నచ్చి ఉత్తిపుణ్యాన వచ్చి, మందహాసాల నుంచి అట్టహాసాల వరకు రకరకాల నవ్వుల పువ్వులు విరజిమ్ముతున్నారట. వారికి ఆరోగ్యం చేకూరుతోంది. యజమానికి వ్యాపారం పెరుగుతోంది. తెలివొకడి సొమ్మా మరి!*✍️
….ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి