4, జూన్ 2023, ఆదివారం

చారిత్రాత్మక కథాస్రవంతి🌹* . ♦️ *ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 80*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 80*


పాటలీపుత్ర దుర్గము చంద్రగుప్త సేనల వశమైనది. 


నందులు మరణించినందున ప్రస్తుతానికి చేయునది లేక రాక్షసామాత్యుడే స్వయంగా చాణక్య చంద్రగుప్తులకు స్వాగతం పలికాడు. ఆ సందర్భంలో అతడు కావాలనే తన మిత్రుడైన పర్వతకుని విస్మరించాడు. 


చాణక్య చంద్రగుప్తులకు ఒక ప్రత్యేక భవనం విడిదిగా ఏర్పాటు చేయబడింది. పర్వతక, వైరోచన, మలయకేతులకు మరొక భవనం, ఇతర రాజన్యులకు వారి వారి అంతస్థుల ననుసరించి విడిది భవనాలు ఏర్పాటు చెయ్యబడ్డాయి. 


పాటలీపుత్ర దుర్గము, నగరంలోని ముఖ్యస్థావరాలన్నింటి రక్షణ బాధ్యతలను చంద్రుని స్వంత రాజ్యములైన పాంచాల, సింహపురి సేనలు స్వీకరించాయి. చాణుక్యుని స్వంత గూఢచారులు అన్ని ముఖ్య ప్రాంతములందూ భటులుగా, దాసులుగా, పరిచారకులుగా, అనేక విధాలైన మారవేషాలలో కుదురుకొని యుద్ధానంతర విశేషాలను, ప్రజాభిప్రాయాలనూ వైరీవర్గపుటెత్తుగడలను గమనించసాగారు. 


రాజభవనమైన సుగాంగ ప్రాసాదములో ప్రవేశించడానికి మంచి ముహూర్తాలు లేనందున చంద్రగుప్తునికి వేరొక భవనము విడిది అయింది. ఈ ఏర్పాట్లన్నీ దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించిన రాక్షసామాత్యుడు చీకటి పడే వేళకు తన నిజగృహమునకు చేరుకున్నాడు. 


ఇక మగధ సామ్రాజ్య విజయానంతరం 'చంద్రగుప్తుని త్రోసిరాజని' తామే మగధను ఆక్రమించగలమన్న ఆశతో, సంతోషంతో పర్వతక బృందము ఆ రాత్రి మధ్యపానీయముల మత్తులో మునిగితేలారు. ఆ విజయానికి తామే కారకులమన్న సంబరంలో పండగ చేసుకుంటున్న పర్వాతక బృందము ఆ యుద్ధంలో అధికంగా నష్టపోయినది తమ సైనికులేననీ, తమవద్ద ఇప్పుడు తమ రక్షణకు అవసరమైనంత స్వీయసైనిక బలంలేదన్న విషయాన్ని కూడా గమనించలేని స్థితిలో వారున్నారు. 


ఆ రాత్రి ఎవరి ఆలోచనల్లో వారున్నారు. అందరివీ రహస్య మంత్రాంగాలే కనుక ఎక్కడా చడీ చప్పుడూ లేదు. రాక్షసామత్యుడు తన గృహంలోని ఏకాంత మందిరంలో ఒంటరిగా ఆలోచనా సముద్రంలో మునిగిపోయాడు. 


"ఆహా ! ఆ చాణక్య హతకుడు అనంతపనీ చేశాడు. ఆనాడు చేసిన ప్రతిజ్ఞ తీర్చుకోవడానికి మా మిత్రులని తమ మిత్రులుగా మార్చుకొని వారి చేతనే దండయాత్ర జరిపించి ఫలితములను తాను పొందుతున్నాడు. కోటలోపలనుంచి కూడా పధకం ప్రకారం సైనిక తిరుగుబాటు జరిపించాడంటే... ఆ చాణక్యుని ప్రజ్ఞయే.. ప్రజ్ఞ.. మరినేనో... నందుల నాశనాన్ని కళ్లారా చూస్తూ ఏమి చెయ్యలేని అసమర్ధుడిగా మిగిలిపోయాను, మహాపద్మనందుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వ్యర్థుడినయ్యాను... పైగా, ఆ చంద్రుడి చేతచిక్కిన నన్ను చంపక "గురువాజ్ఞ ప్రకారం ప్రాణదానం చేస్తున్నా"నని పలికితే... భరించి... సహించి... దిక్కుమాలిన ప్రాణాలు కాపాడుకుని... ఆ చంద్రునికే కోటలోనికి స్వాగతమిచ్చినాను గదా... చీఛీ... ఇంకెందులకీ పౌరుషహీనమైన బ్రతుకు..." 


పరాభవ పరాజయ పరితప్త హృదయంతో కుమిలిపోతున్న రాక్షసుడు ఆవేదనతో తనలో తాను క్షోభిస్తూ "నందులను రక్షిస్తాననీ, మగధ సింహాసనం నందులదేనని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నేనూ ఒక మనిషినేనా .... ? కాదు... మాటంటే ... మాటే... చంద్రగుప్తుడికి సింహాసనం దక్కరాదు. చాణక్యుని ఆటలు ఈ రాక్షసామాత్యుని ముందు సాగనివ్వరాదు... నందులు హతమైనా... నేను ఇచ్చిన మాటకోసం ... నందవంశజుడు ఎవరో ఒకర్ని తెచ్చి... ఎవరో ఒకర్ని ...." అంటూ ఆవేశపడుతున్న వాడల్లా చప్పున ఆగి "ఆ ! వున్నాడు... రాక్షసామాత్యుని మాట చెల్లించడానికి ... ఆ మాట పుచ్చుకున్నవాడే ... ఇంకా జీవించి ఉన్నాడు ... అతడే... మగధకి మహారాజు..." అని అరిచాడు బిగ్గరగా సంతోషాన్ని పట్టలేక. 


మరుక్షణం తేరుకుని తన మాటలెవరైనా విన్నారేమోనని తలతిప్పి చూశాడు. అది తన గృహంలోని ఏకాంత మందిరం అని గుర్తుకుతెచ్చుకున్నాక అతని మనస్సు కుదుటపడింది. 


"ఎలాగైనా అతడిని ఒప్పిస్తాను... ఎన్ని కష్టాలు పడైనా సరే ... అతడినే మగధకు రాజును చేస్తాను ... ఈ రాక్షసామాత్యుడి తడాఖా ఏమిటో ఆ చాణక్యుడికి రుచి చూపిస్తాను" అనుకుంటూ అప్పటికప్పుడే, ఆ నిశిరాత్రి వేళ తన నివాసంలోంచి బయటపడి శోణనదీ తీరం వైపుగా, ఒంటరిగా, రహస్యంగా సాగిపోయాడు రాక్షసామాత్యుడు. 

(ఇంకా ఉంది)...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: