4, జూన్ 2023, ఆదివారం

కృపావర్షానికి కారణం:

 

           *కృపావర్షానికి కారణం:*

                   ➖➖➖✍️


*ఒక్కడే అయినప్పటికీ, సందర్భాన్నిబట్టి పరమాత్మ అనేక నామరూపాల్లో అలరారుతుంటాడు.*


*ఉన్నాడని నమ్మేవారికి ఉన్నట్లుండేవాడు, లేడనేవారి మనోభావాలకు విఘాతం కలగకుండా వారినీ కాపాడేవాడు కాబట్టే ద్వైదీభావాత్మకుడు.* 


*సత్వ-రజస్‌-తమస్‌ అనే మూడు గుణాలున్నవారినీ వారికి తగినట్లు అనుగ్రహాన్ని, ఆగ్రహాన్ని చూపేవాడు కాబట్టి త్రిగుణాత్మకుడు.*


*నాలుగు దిక్కులా నిండి ఉన్నవాడు, నాలుగు వేదాలూ ప్రస్తుతించేవాడు,  సమయాన్ని, భక్తుల మనోభావాల్ని బట్టి ప్రవర్తించేవాడు. అందువల్ల చతురుడు.* 


*పంచభూతాల్లో ఆత్మస్వరూపంగా ఉంటూ వాటిని నియంత్రించేవాడు. కనుక, పంచభూతాత్మకుడు.*


*అరిషడ్వర్గాలకు అతీతుడు. అవతారాన్ని బట్టి సప్తరుషుల మన్ననలు సైతం అందుకునేవాడు. ఇలా ఆ పరమాత్మ ఒక్కడే అయినా అనేక రూపుడు.* 


*‘ఏకం సత్‌ బహవో వదంతి విప్రాః’ (బ్రహ్మపదార్థం ఒక్కటే... అయినప్పటికీ అవసరాన్ని బట్టి అనేక రూపాలుగా కనిపిస్తుంది) అని వేదాంతులు చెప్పడానికి కారణం అదే.*


*ఆయన జీవులందరి సంరక్షణార్థం అందరికీ చేరువలో, చెంతనే ఉంటాడు. కానీ ఎవరూ అంత సులభంగా గుర్తించలేరు. చేరుకోలేరు.*


*యోగులైనా, భక్తులైనా పొందలేని ఆయన సాక్షాత్కారాన్ని అమాయకులు, అతి సామాన్యులు అత్యంత సులభంగా పొందగలుగుతున్నారు. దానికి కారణం వారి భక్తి తత్పరత.*


*పరమాత్మ గురించి, ఆయన అనుగ్రహం గురించి అంతగా తపన పడవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించేవారికి భాగవతం అతి సున్నితమైన సమాధానం ఇస్తుంది.*


*‘దాహార్తి తీర్చుకునేందుకు నీరు, క్షుద్బాధ తీరడానికి ఆహారం, శరీర తాపం తగ్గడానికి చల్లని గాలి... ఇలా సృష్టిలో ప్రతి అంశానికీ ఒక పరిష్కార మార్గం ఉన్నట్లే  ఆధ్యాత్మిక (గత జన్మ వాసనా బలంతో సంక్రమించిన),  ఆదిభౌతిక (ఈ జన్మలో చేసిన కర్మ ఫలితం), ఆదిదైవిక (దైవ సంబంధమైన) కష్టాలు తొలగిపోవాలంటే ఒక సరళమైన తరుణోపాయం ఉండాలి.* 


*ఆ మార్గమే భగవదన్వేషణ, ఆరాధన. ఇదే తప్ప అన్య మార్గం లేదు.*


*ఆ పరమాత్ముని మనసా (తలంపుతో), వాచా (వాగ్రూపంలో), కర్మణా (ఆయనకే చేస్తున్నాననే భావనతో తోటివారికి సేవ చేయడం రూపంలో) కొలిచిన వారిని వాటికి ప్రతిగా సదాచార వర్తనులు, మనోనిగ్రహపరులు, పరిశుద్ధాంతరంగులు అయ్యేటట్లు అనుగ్రహిస్తాడు.*


*ఆ దైవానుగ్రహం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. యోగాభ్యాసంతో ఆత్మదర్శనం చేసిన యోగులకు ఆత్మ స్వరూపుడు.*


*వేదాల్లో చెప్పినట్లు కర్మల చేత ఆరాధించినవారికి కామిత ఫలదాత.*


*స్మృతుల (పురాణాల)లో చెప్పిన విధంగా ధర్మాచరణ రూపంలో ఆరాధించినవారికి ధార్మిక ఫలప్రదాత.*


*ఉపనిషత్తుల్లో చెప్పిన విధంగా ఉపాసనాత్మక జ్ఞానం కలిగినవారికి ఆ రూపంగా మోక్షాన్ని ఒసగేవాడు.*


*ఎవరు ఏ మార్గాన త(కొ)లచినా, అది మనస్ఫూర్తిగా చేసినదై ఉండాలి. అలా తమ తమ ధర్మాలు తప్పకుండా నడుచుకుంటూ, సమభావంతో ఉంటూ ఆయన్నే నమ్మి జీవించేవారు- సూర్యుడి రాకతో పెనుచీకటి అంతరించిన విధంగా అన్ని బంధాల నుంచీ విముక్తులవుతారు.*


*ఇంతాచేసి అందరికీ అందినట్లనిపించినా ఎవరికీ అందనంత దూరంలోనే ఉంటాడు.*


*ఈ విషయాన్ని, దానికి కారణాన్ని గురించి ఆయనే స్వయంగా ఒక సందర్భంలో గోపికలతో ఇలా చెప్పాడు…  ‘నన్ను సేవించే వారికందరికీ కావలసినవన్నీ ఇస్తాను. సేవించనివారినీ అలాగే ఆదరిస్తాను. అవసరాన్ని బట్టి అంశ, అనుప్రవేశ, ప్రవృత్తి-నివృత్తి రూపాల్లో దర్శనమిస్తాను. అంతేకానీ, నా పూర్ణరూపాన్ని ప్రత్యక్షంగా చూపను... అందుకే అందరికీ అందినవాడిలా అనిపించినా ఎవరికీ అందనివాణ్ని’ అని.* 


*ఆ మాటలకు తగినట్లే విష్ణురూపుడైన ఆ పరమాత్మతో ఎవరూ పొందలేని సాన్నిహిత్యాన్ని సాధారణ గోపాలకులు పొందారు.*


*కల్మషం లేనివారి స్వచ్ఛమైన మనోభావాలు, ప్రేమానురాగాలే భగవానుడి కృపావర్షానికి కారణాలు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


కామెంట్‌లు లేవు: