19, జులై 2023, బుధవారం

మాతల్లినిచేపట్టుటయే

 శుభోదయం🙏


మాతల్లినిచేపట్టుటయే నీప్రసిధ్ధికి మూలము!


కట్టిన పుట్టమేమి, కనకాంబరమా?కరితోలు, నెత్తిపై

బెట్టినదేమి, మత్త శిఖిపింఛమ?ఉమ్మెత గడ్డిపువ్వు, మై

దట్టినదేమి, చందన కదంబరమా?తెలిబూది! నిన్ను జే

పట్టిన రాచపట్టి చలువన్ పరమేశ్వరుడైతి ధూర్జటీ!


ఓ పరమేశ్వరా, నువ్వు ఏమి బంగారు తో నేసిన పట్టు వస్త్రాలు ధరించావా? లేదే, ఏనుగు చర్మం వస్త్రంగా ధరించావు. పోనీ, తల పైన ఏమైనా నెమలి పింఛం ధరించావా? లేదే గడ్డి పూలని దండగా‌ ధరించావు.‌ కనీసం శరీరానికి చందనం పూతయినా పూసుకున్నావా?

అదీ లేదే, శవ‌భస్మాన్ని శరీరం నిండా పూసుకున్నావు.

అయినప్పటికీ నువ్వు జగత్తుకు అధిపతి అయిన మహాదేవుడివి అయ్యావంటే అది భవాని తమరి చేయి పట్టుకోవడం వల్లనే కదా అని కవి అంటాడు.

ఇలాంటిదే శంకరాచార్యుల రచనగా ప్రసిద్ధమైన దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో కూడా ఒక శ్లోకం

చితా భస్మాలేపో, గరళ మశనం, 

దిక్పట ధరో, జటా ధారీ,

కంఠే భుజగపతి హారీ  పశుపతిః, 

కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం

 భవాని త్వత్పాణి గ్రహణ పరిపాటీ ఫలమిదం


అమ్మా భవానీ దేవీ, శవ‌భస్మాన్ని పూసుకునేవాడు, విషాన్ని ఆహారంగా స్వీకరించేవాడు, దిగంబరుడు, జుట్టు జడలు కట్టి ఉన్నవాడు, కపాలం ధరించి బిచ్చమెత్తుకునేవాడు,  స్మశానం లోని భూతాలకు అధిపతి అయిన మహాదేవుడు జగత్తుకు అంతా అధిపతి అయ్యాడంటే అది నీ చేయి పట్టుకోవడం వల్లనే కదమ్మా, అంటే నిన్ను వివాహమాటం వల్లనే కదమ్మా అని ఈ శ్లోక భావం.

ఇక్కడ మనకు ఒక సందేహం వచ్చే అవకాశం ఉన్నది. అదేంటంటే భర్తను ఇలా ఎగతాళి చేస్తూ ఉంటే భార్యకు కోపం రాదా అని అనిపిస్తుంది. అంటే శివుని నిందించినట్టుగా అనిపించే ఈ మాటల వల్ల భవాని కోపగించుకోదా అని సహజంగానే మనకు అనిపిస్తుంది. 

కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక ఉన్నది. భర్తకు ఎవరైనా తనను తిట్టినా లేక తిట్టినట్టు అనిపించినా, భార్యను మెచ్చుకుంటే అది భర్తకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విషయం మన లాంటి సాధారణ మానవులకే కాదు, పరమేశ్వరుడికి కూడా వర్తిస్తుంది. అందుకే భక్తులు భగవద్ అనుగ్రహం పొందడానికి ఒక్కొక్కసారి ఇలాంటి విచిత్రమైన మార్గాన్ని కూడా ఆశ్రయించవచ్చు.

త్యాగరాజ స్వామి కూడా ఒక కీర్తనలో శ్రీ రామచంద్రమూర్తిని,  నీదేంలేదు. అంతా మా జానకిని చెట్టబట్టగా మహరాజువైతివి అని తేల్చేశాడు.

                          స్వస్తి!

కామెంట్‌లు లేవు: