19, జులై 2023, బుధవారం

ఆంధ్రభోజా..! శ్రీకృష్ణదేవరాయ

 నిన్నటి రోజు సోమవారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రాంగణమంతా స్నాతకోత్సవ సందడి అలముకుంది. వేదిక పసిడి కాంతులు పులుముకుంది. కార్యక్రమానికి ఛాన్సలర్‌ హోదాలో ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అంతా హడావిడిగా ఉండటంతో వేదిక దిగువ నుంచి వెదజల్లుతున్న మట్టి పరిమళాలను ఎవరూ గుర్తించలేకపోయారు. కొంత సమయం తరువాత మైకులో #సాకే_భారతి అనే పిలుపు వినిపించింది. మోడరన్ దుస్తులు ధరించిన అమ్మాయి వేదికపైకి వస్తుందనుకున్నారంతా...కానీ.. అలా జరగలేదు.


***

పీహెచ్‌డీ పట్టా ఆమె చేతిలో కాంతులీనింది 

పీహెచ్‌డీ పట్టా అందుకోవడానికి వేదిక మీదకు భర్త, కూతురితో కలిసి వచ్చింది సాకే భారతి. అరిగిపోయిన హవాయి చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదికమీది పెద్దలూ, అతిథుల ముఖాల్లో ఒకటే ఆశ్చర్యం. పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేస్తూ నడిచొస్తున్న ఆ చదువుల సరస్వతిని చూసి అబ్బుర పడ్డారంతా. అప్రయత్నంగా చేతులన్నీ ఒక్కటై చప్పట్లతో ప్రాంగణమంతా మార్మోగింది. అయినా.. భారతిలో ఇసుమంతైనా గర్వం కనిపించలేదు. పీహెచ్‌డీ పట్టా ఆమె చేతుల్లో చేరి కాంతులీనింది. ఎందుకంటే.. భారతి దినసరి కూలీగా ఎండనకా, వాననకా చెమటోడ్చింది. చదువుపై ఆసక్తితో అహోరాత్రాలూ శ్రమించింది. ఉన్నతంగా నిలబడాలన్న తపనతో... రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించింది.


***

సంబరపడిపోయిన కూలి జనం

అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే ఓ మారుమూల పల్లె. ఆ ఊరి చివర ఓ చిన్న రేకుల షెడ్డు ముందు పెద్ద ఎత్తున జనాలు. అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం, మరింత సంతోషం. ఎందుకా అని ఆరాతీస్తే నిత్యం తమతో పాటు కూలి పనులకొచ్చే భారతి డాక్టరేట్ అందుకుందని సంబరపడిపోతున్నారు ఆమె తోటి కూలీలు. కోచింగ్‌లూ, అదనపు తరగతుల సాయం లేకుండా రసాయన శాస్త్రాన్ని ఔపోసన ఎలా పట్టిందని ఆశ్చర్యపోతున్నారు మరికొందరు. ఈ భావోద్వేగాలన్నీ శుభాకాంక్షలుగా వెల్లువెత్తిన క్రమంలోనూ ఆ చదువుల తల్లి భారతిలో అదే నిలకడ.


***

భర్త కూతురు ఓ భారతి.. ముగ్గురూ ముగ్గురే 

చిన్నప్పటి నుంచీ బాగా చదువుకోవాలనుకునేది భారతి. పదో తరగతి వరకూ శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్‌ పామిడి జూనియర్‌ కాలేజీలో పూర్తిచేసింది. భారతి తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలోభారతి పెద్దది. కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేక భారతికి మేనమామ శివప్రసాద్‌తో పెళ్లి చేశారు. భవిష్యత్ గురించి ఎన్ని కలలున్నా...ఆ విషయం భర్తకు చెప్పలేకపోయింది. అతడే ఆమె కోరికను అర్థం చేసుకున్నాడు. పై చదువులు చదివేందుకు ప్రోత్సాహం అందించాడు. భారతి కూడా తమ జీవితాలను బాగు చేసుకోవడానికి ఇదో అవకాశం అనుకుంది. భర్త ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. అందుకే కొన్నిరోజులు కాలేజీకి వెళ్తూ.. మరికొన్ని రోజులు కూలి పనులు చేస్తూ అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. అప్పటికే తనకో కూతురు గాయత్రి. ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే చదువూ, పనులూ సమన్వయం చేసుకునేది. రోజూ రాత్రి పొద్దుపోయే వరకూ, మళ్లీ కోడి కూయక ముందే లేచి పుస్తకాలతో కుస్తీ పట్టేది. 


***

బస్సెక్కేందుకు 8 కిలోమీటర్లు నడక

కాలేజీకి వెళ్లాలంటే ఊరి నుంచి కనీసం 28 కిలో మీటర్లు ప్రయాణించాలి. రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే, ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకూ నడిచి వెళ్లి అక్కడ బస్సెక్కేది. ఇన్ని కష్టాల మధ్యా భారతి డిగ్రీ, పీజీ మంచి మార్కులతో పూర్తిచేసింది. అది చూసి భర్త, టీచర్లూ పీహెచ్‌డీ దిశగా ఆలోచించమన్నారు. ప్రయత్నిస్తే ప్రొఫెసర్‌ డా.ఎంసీఎస్‌ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్‌’ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. ఇందుకోసం వచ్చే ఉపకార వేతనం భారతికి కొంత సాయపడింది. అయినా తను కూలి పనులు మానలేదు. ఇకపై మంచి ఉద్యోగాన్ని అందిపుచ్చుకుని.. మరెందరిలోనో జ్ఞానకాంతులను వెలిగించే దిశగా భారతి అడుగులు వేయాలనుకుంటున్నారు భారతి.

అహో.. ఆంధ్రభోజా..! శ్రీకృష్ణదేవరాయ.

నీ చరిత అజరామరమయా!

కామెంట్‌లు లేవు: