19, జులై 2023, బుధవారం

సాహిత్య కల్పవృక్షం

 ,సాహిత్య కల్పవృక్షం విశ్వనాథ:


"కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సాహితీ జగత్తులో ఒక యుగకర్త. ఆలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి. నవ్య సంప్రదాయోద్యమ నాయకుడు. 

నాలుగు దశాబ్దాల పాటు యుగకర్తగా తెలుగు సాహిత్యాన్నంతా ప్రభావితం చేసిన ప్రతిభాశాలి. ప్రజ్ఞామూర్తి. 

రామాయణ కల్ప వృక్షం ఆధ్యాత్మిక అన్వేషణకు అద్దంపట్టే ఒక ఇతిహాస కావ్య కల్పన. 

ఆయన పలుకే ఒక ప్రమాణం. విశ్వనాథ ఒక కల్ప వృక్షంలా భాసించారు.

 వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో కవి సార్వభౌముడు అంటే శ్రీనాథుడు.

కవిసమ్రాట్ అంటే విశ్వనాథ సత్యనారాయణ. 

వీరిద్దరూ బిరుదులకే

బిరుదాలైనవారు. 

విశ్వనాథ ఈ శతాబ్ది తెలుగు కవులందరిలో జీనియస్. ఆయన ఏ బాటలో నడిచినా సమ్రాట్టు. 

రచయితగా విశ్వనాథ ఒక సమగ్ర వ్యక్తి..కళాప్రపూర్ణుడు. ఆధునిక రస దర్శనాన్ని వివిధ ప్రక్రియల ద్వారా , ప్రయోగాల ద్వారా ప్రదర్శించి చూపించి నవ్య సంప్రదాయ యుగకర్తగా ప్రశంసింపబడుతున్నాడు కవి సమ్రాట్ విశ్వనాథ." 

సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం గారు 

నుడివిన ఈ నాలుగు మాటలు చాలు "కవిసమ్రాట్"  శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి మహత్తు తెలుగు సాహిత్య జగత్తులో ఎంత గొప్పదో గ్రహించేందుకు.

" జయంతి తే సుకృతినో రస సిద్దాః కవీశ్వరాః  నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం" అంటారు భర్తృహరి. రససిద్ధి కలిగిన సత్కవులకు జయమగుగాక. 

రససిద్ధిని పొందిన సత్కవీశ్వరుల కీర్తి శరీరాలకు ఎలాంటి మరణంగాని..వార్ధక్యం గానీ ఉండవు.

 వారు కీర్తి కాయంతో సదా వర్ధిల్లుతూనే ఉంటారు.

భర్తృహరి పేర్కొన్నట్లు విశ్వనాథ సత్యనారాయణ గారు రస సిద్ధిని పొందిన సత్కవీశ్వరులు. 

కవిత్వ దీక్షా విధిని చేపట్టిన ఒక మహాయోగి. కవితా ఋషి.

తెలుగువారి పూర్వ పుణ్య తపః ఫలంగా తెలుగునాట కృష్ణా తీరంలోని నందమూరు 

గ్రామంలో 1895 సెప్టెంబర్ 10 మన్మథ నామ సంవత్సరం భాద్రపద బహుళ షష్ఠి మంగళ వారం ఉదయం శోభనాద్రి.. పార్వతమ్మ దంపతుల పుణ్య గర్భాన ప్రభవించి వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో తనంతటి విలక్షణ కవి మరొకరు లేరని నిరూపించి  విభిన్న ప్రక్రియా రచనలతో తెలుగు భాషా సాహిత్య సంస్కృతులను పరిపుష్టం చేసి తెలుగు జాతి యశశ్చంద్రికలను దశదిశలా వ్యాప్తి చేసి  

"కవిసమ్రాట్" గా నేటికీ విరాజిల్లుతున్న ఘనత విశ్వనాథ సత్యనారాయణ గారికి దక్కుతుంది. రామాయణ కల్పవృక్షం కావ్య రచనతో 

తెలుగు జాతికి  మొట్టమొదటిసారిగా "జ్ఞానపీఠ" పురస్కారాన్ని సాధించిపెట్టి  జాతీయ స్థాయిలో తెలుగు జాతి కీర్తి పతాక రెపరెపలాడేలా చేసిన ఘనత కూడా విశ్వనాథ సత్యనారాయణ గారికే చెల్లుతుంది. 

1976 అక్టోబర్ 18 న పరమపదించేటంత వరకు విశ్వనాథ సాహిత్య ప్రస్థానం సాగుతూనే ఉంది. 

శ్రీశ్రీ అభివర్ణించినట్లు విశ్వనాథ నిజంగానే తెలుగువారి 'గోల్డు నిబ్'.తెలుగు జాతి మలి నన్నయ్య కూడా! 

 విశ్వనాథ సత్యనారాయణ గారిని ' కవిసమ్రాట్ ' గా తొలుత అభివర్ణించింది భావరాజు నరసింహారావు గారు. 

ఆ బిరుదం విశ్వనాథ వారి ఇంటి పేరుకు ముందు చేరి ఆయనకు సామాజికంగా.. సాహిత్యపరంగా ఎంతో గౌరవాన్ని సంతరించి పెట్టింది. విశ్వనాథ వారికి

 జాలి గుణంతోపాటు  కోప స్వభావం కూడా కొంచెం ఎక్కువే. 

ఆయన మాట తీరు క్రొత్త వారికి ఆయనను అహంకారిగా పొరబడేలా చేస్తుంది. ఆయనతో కొంత చనువు పెరిగాక ఆయన హృదయ మార్దవం ఎంత గొప్పదో తెలిసివస్తుంది.

ప్రతిభ కలిగిన కవికి తాను నిజంగా గొప్ప వాడిననే భావన కొంత అహంకారాన్ని కలుగ చేస్తుంది.

అది వారికి 

శోభస్కరమే అవుతుంది తప్ప నింద్యంకాదు.

ఎవరైనా వితండ వాదం చేస్తున్నా..అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసినా..సనాతన ధర్మాన్ని కించపరచేందుకు యత్నించినా విశ్వనాథ సత్యనారాయణ గారికి కోపం కలిగేది.

ఒకసారి ఒక వ్యక్తి విశ్వనాథ గారిని అదేపనిగా విసిగిస్తుంటే విశ్వనాథ గారు కొంచెం కోపగించుకున్నారు.

అందుకు ఆ వ్యక్తి మీరు వికారంగా మాట్లాడతారు. "వికారి" నామ సంవత్సరంలో పుట్టి ఉంటారు అంటూ చమత్కరించాడు. 

అందుకు విశ్వనాథ సత్యనారాయణ గారు నేను "మన్మథ" నామ సంవత్సరంలో పుట్టాను. 

నీవు మాత్రం కచ్చితంగా  "ఖర" నామ సంవత్సరంలోనే పుట్టి ఉంటావు అనేసరికి ఆ వ్యక్తి ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్క కూడా లేకుండా పోయింది.

ఈ విపరీత కోప గుణమే కొన్నిసార్లు విశ్వనాథ వారిని కొందరికి దూరం చేసింది. విశ్వనాథ గారి వాక్కు దారుణాఖండల శస్త్ర తుల్యం.

అయితే ఆయన హృదయం మాత్రం నవనీత కోమలం. "విశ్వనాథ వారి మాట కరుకు కావచ్చు. కాని వారి మనసు వెన్న "  అని మండలి వెంకట కృష్ణారావు గారు పేర్కొనడం ఇందుకు నిదర్శనం.

ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు చేతనైనంత సహాయం చేసేవారు.

ఎంతోమంది బీదసాదలను  విశ్వనాథ వారు ఆదుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారిని బాగా ఎరిగిన ఒక వృద్ధుడు తాను అన్నం తిని రెండు రోజులు అయిందని రెండు రూపాయలు ఉంటే సహాయం చేయమని ప్రాధేయపడ్డాడు. 

వెంటనే విశ్వనాథ వారు ఆ వృద్ధుడిని సమీపంలోని హోటల్ కు తీసుకువెళ్లి ఒక నెలకు సరిపడే భోజన టిక్కెట్లను ఇప్పించారు. 

ఆ వృద్ధుడు ఎప్పుడు వచ్చినా ఆతడికి భోజనం పెట్ట వలసినదని డబ్బులు తాను ఇస్తానని చెప్పారు.

విశ్వనాథ వారిని అడిగేందుకు ముందు ఆ వృద్ధుడు మరికొంత మందిని చేయి చాచి అడిగినా వారు రిక్త హస్తం చూపారు. ఎవరు ఇబ్బందులలో ఉన్నా వారిని ఆదుకునే దయా సముద్రుడు విశ్వనాథ అనేందుకు ఆయన ఆ వృద్ధుని ఆదుకున్న తీరే ఉదాహరణ.

విశ్వనాథవారి కవిత్వంలో పాషాణ పాకాన్ని చూసిన వారికి ఆయన హృదయంలోని కారుణ్య గుణం అర్థం కాకపోవడం ఎంత విచిత్రం!! విశ్వనాథ వారిది పాషాణ పాకమైతే ఆయనను అర్థం చేసుకోలేని వారిది పాషాణ హృదయమని చెప్పాలి.

 విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటిలో ఒక కుటుంబం అద్దెకుండేది. 

వారి అమ్మాయి వివాహం కోసం కొంత డబ్బు అవసరమై ఆ కుటుంబ యజమాని విశ్వనాథ గారిని ఆశ్రయించారు. 

విశ్వనాథ వారు డబ్బు సహాయం చేసి ఆ వివాహం నిర్విఘ్నంగా  జరిగేలా చూసారు. 

కొంతకాలానికి  ఆ కుటుంబ యజమాని విశ్వనాథ గారికి తిరిగి డబ్బులు ఇవ్వబోతే విశ్వనాథ వారు తీసుకోలేదు. పైగా మీరు ప్రతినెలా నాకు చెల్లించే ఇంటి బాడుగ డబ్బులను దాచిపెడుతూ వచ్చాను. 

మీ డబ్బులే నేను మీకు ఇచ్చాను అంటూ విశ్వనాథ  ఆ డబ్బులు తీసుకోవడానికి సున్నితంగా నిరాకరించారు. విశ్వనాథ వారి సమున్నత వ్యక్తిత్వానికి ఆ కుటుంబం వేనవేల కృతజ్ఞతలు తెలుపుకుంది. 

ఎందరో పేద విద్యార్థులకు విశ్వనాథ గారు ఫీజులు చెల్లించి వారి చదువులు నిర్విఘ్నంగా సాగేలా సహాయపడ్డారు. అయితే తాను చేసే దానధర్మాల గురించి   విశ్వనాథ ఎప్పుడూ ప్రచారం చేసుకునేవారు కాదు.

ఒకసారి విశ్వనాథ గారిని ఒక సమాజంవారు మంచి శాలువా తో ఘనంగా సన్మానించారు. విశ్వనాథ గారు రిక్షాలో ఇంటికి వెళుతూ ఒక వ్యక్తి చలికి వణుకుతుండడం గమనించి రిక్షా ఆపించి తన ఒంటిపైని శాలువాను చలితో బాధపడుతున్న వ్యక్తికి కప్పి వెళ్లారు. 

విశ్వనాథ సత్యనారాయణ గారి తండ్రి శోభనాద్రిగారు మహాదాత.

తండ్రంటే విశ్వనాథ వారికి అమిత భక్తి..గౌరవం.

"నా తండ్రి యనన్ దధీచి శిబి కర్ణాదుల్ పునారూప సంస్థానం బందిన కర్మయోగి " . "అట్టి తండ్రికి పరమ భక్తాగ్రగణ్యు డైన పుత్రుడను"  అంటూ విశ్వనాథ సత్యనారాయణ గారు తమ తండ్రి శోభనాద్రి గారి గురించి బహుధా శ్లాఘించారు.

అడిగినవారికి లేదనకుండా దానధర్మాలు చేసి శోభనాద్రి  నిరుపేదగా  మారారు.

ఒకసారి శోభనాద్రిగారు బజారులో నడిచివస్తుంటే గోచి  ధరించిన ఒక పేదవాడు ఎదురుపడి అయ్యా!! కట్టుకునేందుకు ఏదైనా వస్త్రం ఉంటే ఇమ్మని అర్ధించాడు . 

శోభనాద్రిగారు వెంటనే తన పై వస్త్రాన్ని నడుముకు కట్టుకుని తన పంచెను ఆ వ్యక్తికి ఇచ్చివేసారు. 

శోభనాద్రిగారి వద్ద ఇచ్చేందుకు  ఆ సమయంలో ఆ పంచె తప్పితే మరేమిలేదు.

 అంతటి మహాదాత..కారుణ్యహృదయులు శోభనాద్రిగారు. 

తండ్రి దాన గుణం..కారుణ్య హృదయం విశ్వనాథ వారికి కూడా వారసత్వంగా సంక్రమించింది.

జ్ఞానపీఠ పురస్కారం కింద ఆయనకు లభించిన సొమ్ము తొందరగానే ఖర్చయిపోయింది.

డబ్బులకు ఆయన ఇబ్బంది పడుతుండడం గమనించిన కొందరు శ్రేయోభిలాషులు విశ్వనాథ గారిని ఆ విషయమై ప్రశ్నించడంతో విశ్వనాథ వారు నా జేబుకు కనిపించని రంధ్రాలు చాలానే ఉన్నాయి అంటూ ఆ డబ్బులో ఎక్కువ భాగం దానధర్మాలకు, దేవాలయ అభివృద్ధికి ఖర్చై పోయిన వైనాన్ని పరోక్షంగా వెల్లడించారు.

 ప్రతిభ ఎవరిలో ఉన్నా కులమతాలకు అతీతంగా విశ్వనాథ వారిని మెచ్చుకుని గౌరవించే వారు. 

ఒక సందర్భంలో జ్ఞానానంద కవి కవిత్వాన్ని విశ్వనాథ వారు మెచ్చుకుని ఆయనకు రెండు వందల రూపాయలు ఇచ్చి సత్కరించారు. 

మరుసటి రోజు ఒక రూపాయి అవసరమై విశ్వనాథ వారు ఆ రూపాయి కూడా తన వద్ద లేకపోవడంతో తెలిసిన మిత్రుని వద్ద ఆ రూపాయిని అప్పుగా తీసుకున్నారట. విశ్వనాథ గారి హృదయం ఎటువంటిదో గ్రహించేందుకు ఈ సంఘటన ఒక మచ్చుతునక. 

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారితో విశ్వనాథ వారికి ఆత్మీయపూర్వక మైత్రి. వారిరువురి నడుమ చోటుచేసుకున్న చెణుకులను వారిరువురి నడుమ స్పర్ధగా చిత్రించిన మేధావులు కూడా ఉన్నారు. 

అయితే విశ్వనాథ..జాషువా పరస్పర గౌరవ భావంతో మెలిగారు. 

తనకు కుల మత  శాఖా  భేదాల పట్టింపులు లేవని విశ్వనాథ ఒక సందర్భంలో స్పష్టం చేశారు. 

విశ్వనాథ సత్యనారాయణ కవిత్వం  తమ కవిత్వం కంటే తక్కువేమీ కాదని  చెళ్లపిళ్ల 

వేంకటశాస్త్రి గారు అనడం తమ శిష్యునిపట్ల ఆయనకు గల వాత్సల్య భావాన్ని..విశ్వనాథ వారి కవన ప్రతిభను

చాటి చెబుతుంది. 

శిష్యుడైన విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం కావ్యాన్ని చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారు ఎంతగానో మెచ్చుకున్నారు.

తన ఎదుగుదలకు సహాయపడిన వారిని..తనను అవసరంలో ఆదుకున్న వారిని విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్నడూ మరచి పోలేదు. తనకు సహాయం చేసిన వారికి ప్రత్యుపకారం చేసారు.  ఇబ్బందులలో ఉన్నప్పుడు తనను  ఆర్ధికంగా ఆదుకున్న వారిని విశ్వనాథ వారు జీవితంలో ఎన్నడూ మరువలేదు.  

తనకు ఆర్ధిక పరిపుష్టి చేకూరిన తరువాత విశ్వనాథ గారు వారి ధనాన్ని వారికి  తిరిగి ఇచ్చివేసారు. 

తీసుకునేందుకు  నిరాకరించిన వారిని సున్నితంగా ఒప్పించారు. 

తనకు ఉద్యోగం లేని కాలంలో విశ్వనాథ సత్యనారాయణ గారు కుటుంబ జరుగుబాటు కోసం  తన పుస్తకాలను చేతిసంచిలో పెట్టుకుని చుట్టుపక్కల గ్రామాలకు కాలి నడకన వెళ్లి విక్రయించి ఆ వచ్చే ధనంతో కుటుంబాన్ని కొన్నాళ్లు పోషించారు. 

ఉన్నత పదవులు లభించి కారులో తిరిగే స్థాయి కలిగినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు  గర్వించలేదు.

దేహికి సుఖదుఃఖాలు రెండూ సమానమేనని భావించిన గొప్ప స్థితప్రజ్ఞులు విశ్వనాథ. 

భార్య వరలక్ష్మి అంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి అమితమైన ప్రేమ..గౌరవం..ప్రాణం.. అభిమానం. 

భార్య గతించిన సందర్భంలో విశ్వనాథ సత్యనారాయణ గారు అనుభవించిన దుఃఖం సామాన్యమైనదికాదు.

 సీతా వియోగ సమయంలో శ్రీరాముడు అనుభవించిన పరివేదనతో సమానమైన దుఃఖమది.

తన అభ్యుదయానికి..ఉన్నతికి..

తాను మహాకవిగా ఎదగడానికి తన భార్య వరలక్ష్మి కారణమని విశ్వనాథ చాటారు. భార్యాభర్తల నడుమ ఉండవలసిన అన్యోన్యతకు విశ్వనాథ సత్యనారాయణ.. వరలక్ష్మి దంపతులు ప్రతీక. 

కష్ట సుఖాలలో..కలిమి లేములలో ఆ దంపతులు కలిసే జీవించారు.

 వరలక్ష్మీ త్రిశతి కావ్యం   విశ్వనాథ వారికి భార్యపట్ల గల అపార  ప్రేమను వెల్లడి చేస్తుంది.

శ్రీమద్రామాయణ కల్పవృక్షం కావ్యం విశ్వనాథ సత్యనారాయణ గారిని జ్ఞానపీఠ శిఖరాగ్రాన 

సు ప్రతిష్ఠితుని చేసింది. 

జీవుని వేదన..తండ్రి శోభనాద్రి ఆదేశం రామాయణ కల్పవృక్షం కావ్యరచనకు ప్రేరేపణ అయ్యాయి.

 తెలుగులో రామాయణాలు చాలా ఉన్నాయి కదా! 

మరలా మీరు రామాయణం వ్రాయడమెందుకు!  

అంటూ ఆక్షేపించిన వారికి విశ్వనాథ వారు 

" మరలనిదేల రామాయణంబన్నచో నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ తినుచున్న యన్నమే తినుచున్న దిన్నాళ్ళు తన రుచి బ్రదుకులు తనవి గాన , 

చేసిన సంసారమే సేయుచున్నది తనదైన యనుభూతి తనదిగాన , తలచిన రామునే తలచెద నేనును..నా భక్తి రచనలు నావిగాన" 

అంటూ సొగసుగా..గడుసుగా సమాధానమిచ్చారు. శ్రీమద్రామాయణ   కల్పవృక్షం కావ్య రచన  పూర్తి అయ్యేటంత వరకు శ్రీరామ భక్తిసామ్రాజ్య అధిష్ఠితుడైన ఆంజనేయ స్వామి విశ్వనాథ సత్యనారాయణ గారికి రక్షగా నిలిచాడు. 

"రామాయణ కల్పవృక్షం" కావ్య రచనకు గాను భారత ప్రభుత్వం విశ్వనాథ సత్యనారాయణ గారిని "జ్ఞాన పీఠ" పురస్కారంతో ఘనంగా సత్కరించింది.

ఇక్కడ మరో విశేషం ముచ్చటించాలి. 

విశ్వనాథ సత్యనారాయణ గారు ఏ రచనకు పూనుకున్నా రోజులు లేదా వారాలు లేదా కొన్ని నెలల్లో పూర్తి అయ్యేది. రామాయణ కల్పవృక్షం కావ్య రచనకు మాత్రం మూడు దశాబ్దాల సమయం పట్టింది. ఇదే విషయాన్ని కొందరు ప్రశ్నించగా విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ రామాయణం నేను రాయలేదు..ఆ శ్రీరాముడే రచించాడు. 

ఆ కావ్యం రచించేందుకు ఆయనకు ముప్పై ఏళ్లు పట్టింది  అంటూ సమాధానమిచ్చారు. దీనినిబట్టి రామాయణ కల్పవృక్షం కావ్య రచన 

శ్రీరామానుగ్రహ ఫలమని భావించాలి. 

పోతన మహాకవి కూడా " పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుం డుట , నే పలికిన భవ హర మగునట, పలికెద, వేరొండు గాథ పలుకగనేలా " అంటూ ఆ శ్రీరామ చంద్రుడే తన చేత భాగవత కావ్య రచన చేయించుకున్నాడని వినయంతో పలికారు. 

అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా రామాయణ కల్పవృక్షం ఆ శ్రీరాముని దివ్య అనుగ్రహ ఫలమేనని..తన చేత ఆ శ్రీరామ చంద్రుడే రామాయణ కల్పవృక్షం రచింప చేసుకున్నాడని విశ్వసించారు.

శ్రీరామ నామ మంత్రంతో పాటు  హనుమ మంత్రాన్ని కోట్ల పర్యాయాలు జపించి మంత్రసిద్ధి పొందిన విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆ రఘుకుల తిలకుడైన శ్రీరాముడు, శ్రీరామ బంటైన ఆంజనేయ స్వామి, శారదా స్వరూపమైన ఆ జగన్మాత ఎల్లప్పుడూ వెంటనంటి రక్షిస్తూ ఉండేవారనేందుకు పలు తార్కాణాలు కూడా ఉన్నాయి.

ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారి ఆశయం ఏమిటి? మందిలో ఒకనిగా మిగలడమా!! కాదు.. పూర్వ కవీంద్రులు వేసిన బాటకు మరిన్ని మెరుగులు దిద్దడం.. మహాకవుల శ్రేణిలో తానూ ఒక ప్రత్యేకత కలిగిన మహాకవిగా తన స్థానాన్ని సుస్థిరపరచుకోడం విశ్వనాథ గారి ఆశయం.

" నన్నయ్యయు దిక్కన్నయు నన్నావేశించిరి 

పరిణాహ మనస్సంచ్చన్నత వారలు పోయిన తెన్నున మెరుగులను దిద్దుచు బోదున్" అంటూ విశ్వనాథ స్పష్టం 

చేసారు.

పూర్వ తెలుగు కవులలో ఎవరి శైలి ఎటువంటిదో విశ్వనాథ సత్యనారాయణ చక్కగా విశ్లేషించి చెప్పారు. 

"ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు దెనుగు తోట,

యెర్రన్న సర్వ మార్గేచ్చా విధాత్రుండు, పోతన్న తెలుగుల పుణ్యపేటి, శ్రీనాధుడు రసప్రసిద్ధ ధారాధుని, కృష్ణ రాయడనన్య కృతి ప్రబంధ, పెద్దన్న వడపోత పెట్టినిక్షు రసంబు, రామకృష్ణుడు సురారామ గజము, ఒకడు నాచన సోమన్న యుక్కివుండు చెరిపి పదిసార్లు దిరుగ వ్రాసినను మొక్కవోని యీ యాంధ్ర కవిలోక మార్ధమణుల మద్గురు స్థానములుగ నమస్కరించి

భాస కాళిదాస భవభూతి దిజ్ఞాగులకు, బ్రశస్త వాగ్వి లక్షణుడు మురారిభట్టునకును, రామకథా భాష్యకారులకును మోడ్పు కై ఘటించి " అంటూ సంస్కృతాంధ్ర మహా కవులలో ఎవరు తనకు గురు సదృ శులో..ఆదర్శమో పేర్కొంటూ విశ్వనాథ సత్యనారాయణ  వారికి వినయంతో  అంజలించారు. 

ఆ మహానుభావుల సమిష్టి సారస్వత అంశను విశ్వనాథ సత్యనారాయణ గారిలో మనం దర్శిస్తాము.

అందుకే విశ్వనాథ సత్యనారాయణ తెలుగు జాతికి..కవులకు ప్రాతః స్మరణీయులై వెలుగొందు తున్నారు.

కిన్నెర నడకలు కవితలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకచోట  ' బంగారు తీగలో పానకమ్మై పోయే ' అని వర్ణిస్తారు.

నిజమే! విశ్వనాథ వారి కవిత్వం కూడా బంగారు తీగలో ప్రవహించే పానకమే!! వెయ్యి కాగితాలు చెడగొట్టి ఒక కవిత రాసే అల్ప కవి కాదుగదా!!  

విశ్వనాథ. 

విశ్వనాథ 

ప్రవహించే పద్య ధార.

ఆ రుచిని..మాధుర్యాన్ని ఆస్వాదిస్తేనే ఆ ఆనంద సిద్ధి..రస సిద్ధి అనుభవమయ్యేది. 

రసము వేయి రెట్లు గొప్పది నవ కథా ధృతిని మించి అని విశ్వనాథ వారు అనడంలో ఆంతర్యం ఇది. 

లోకం పట్టనంత

సంఖ్యలో  కవుల సంఖ్య పెరిగిపోతున్న నేటి రోజుల్లో అసలు ' సుకవి ' అని ఎవరిని ప్రస్తావించాలి!! 

దీనికి కూడా విశ్వనాథ వారే సమాధానం చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ గారి దృష్టిలో సుకవి అనే దానికి ఒక్క వాల్మీకి తప్ప వేరెవరూ ఆ పిలుపునకు అర్హులుకారు. గుంటూరు శేషేంద్ర శర్మ గారు కవుల గురించి వెలిబుచ్చిన అభిప్రాయం కూడా విశ్వనాథ వారి అభిప్రాయాన్ని సమర్ధించేదిగా ఉండడం గమనార్హం.

 "వేయి పడగలు" విశ్వనాథ సత్యనారాయణ గారి కీర్తిని శాశ్వతం చేసిన గొప్ప నవల. 

తన రచనలలో  విశ్వనాథ సత్యనారాయణ గారు తన సమకాలీన సమాజాన్ని.. వ్యక్తుల పోకడలను..భిన్న మనస్తత్వాలను పాత్రల రూపంలో తెలియ చెప్పారనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఒక్క రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు ఈ రెండు రచనలు చాలు విశ్వనాథ సత్యనారాయణ గారి పేరు సాహిత్య ప్రపంచంలో శాశ్వతంగా నిలిచేందుకు.

 ప్రకృతి వర్ణనలు విశ్వనాథ వారి కవిత్వంలో పాఠకులను ఆకర్షిస్తాయి. 

ఏ మాసంలో ఏ పక్షంలో రాత్రి సమయంలో  చంద్రుని కాంతి భూమి పై ఎలా ప్రసరిస్తుందో  గమనించేందుకు తాను ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపానని విశ్వనాథ వారు ఒక సందర్భంలో పేర్కొన్నారు. కిన్నెరసాని పాటలు.. ఆంధ్ర ప్రశస్తి వంటి వాటితో పాటు విశ్వనాథ వారు వివిధ ప్రక్రియలలో శతాధిక రచనలు చేసి మహాకవి పదవికి..కవిసమ్రాట్ బిరుదానికి తాను నూటికి నూరుపాళ్లూ అర్హుడినేనని నిరూపించుకున్నారు. 

దేనికీ.. ఎవరికీ భయపడని..ఎవరికీ తలవంచని మేరు నగ ధైర్య ధీరుడు విశ్వనాథ. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వనాథ సత్యనారాయణ గారిని   ఆస్థాన కవిగా, శాసన మండలి సభ్యునిగా నియమించి తనను తాను గౌరవించుకుంది.

1935 లో విశ్వనాథ సత్యనారాయణ గారికి కవి సమ్రాట్ బిరుదు ప్రదానం జరిగింది.

1963 లో విశ్వనాథ మధ్యాక్కరలు రచనకుగాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

1964 డిసెంబర్ 12 న ఆంధ్ర విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదంతో గౌరవించింది. 1970 లో పద్మభూషణ్ లభించింది. 

1971 ఫిబ్రవరిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 1971 అక్టోబర్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా విశ్వనాథ

నియమితులయ్యారు.

 1971 నవంబర్ 16 న సర్వోన్నత మైన జ్ఞానపీఠ్ పురస్కారంతో భారత  ప్రభుత్వం విశ్వనాథ సత్యనారాయణ గారిని గొప్పగా గౌరవించింది.

జాతీయదృష్టితో భారతీయత పరిరక్షింపబడాలనే తపన.. స్వస్థాన వేష భాషలు పరిరక్షింపబడాలనే ఆరాటం విశ్వనాథ వారిలో చూస్తాము.

సమాజంలో ధర్మం కనుమరుగు కాకుండా రక్షింప బడాలనేది విశ్వనాథ వారి ఆశయం. పాశ్చాత్య పోకడలను గుడ్డిగా అనుకరించడం అనర్ధ దాయకమని విశ్వనాథ హెచ్చరించారు.

 నైతిక విలువలు మంచులా కరిగి ధన ప్రభావం పెరిగి మనిషితనం మృగ్య మవుతున్నదని  విశ్వనాథ  ఆవేదన చెందారు.

" ధనమనగ నెట్టులుండునొ జన మెరుగరు మున్ను బ్రదుకు సారము కలిమిన్, ధనమే జీవిత లక్ష్యం బనగా రసహీనమయ్యె  నందరి బ్రదుకుల్ " అంటూ విశ్వనాథ విశ్లేషించారు. 

పద్యంలో అభ్యుదయ కవిత్వాన్ని పండించిన ఘనత కూడా విశ్వనాథ వారికి చెల్లుతుంది. 

"వందమంది పేదవారి నెత్తురు గడ్డకట్టి నీవు మేడ కట్టినావు, వారి యుసురు తీవ్ర వాయువు వీవగా తూలి మేడ నేల గూలి పోవు" అంటూ విశ్వనాథ పెత్తందారులను.. దోపిడీ శక్తులను హెచ్చరించారు. 

సమ సమాజాన్ని.. సామాజిక కల్యాణాన్ని విశ్వనాథ తన రచనల ద్వారా కాంక్షించారని చెప్పవచ్చు. 

విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు వేటికవే ప్రత్యేకం. ఆంధ్రుల పౌరుష ప్రతాపాలను.. ఆంధ్ర జాతి ఘనతను ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి వంటి రచనల ద్వారా చాటి చెప్పారు. ఋతు సంహారం, శ్రీకృష్ణ సంగీతం, ఝాన్సీ రాణి, రురు చరిత్రము, శివార్పణము,  కిన్నెరసాని పాటలు, మా స్వామి, శశి దూతము, భ్రష్ట యోగి, భ్రమర గీతలు, గోపాలోదాహరణం,  పాముపాట,  అనార్కలి, అవతార పరివర్తనము, అమృత శర్మిష్ఠం, నన్నయ గారి ప్రసన్న కథా కవితార్ధ యుక్తి, అల్లసాని వారి అల్లిక జిగిబిగి, ఒకడు నాచన సోమన్న,గురు ప్రసాదం, వేయి పడగలు,హాహా హూ హూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు,

మా బాబు, చెలియలి కట్ట, 

చందవోలు రాణి,కడిమి చెట్టు, బద్దన్న సేనాని , ఏకవీర, దంతపు దువ్వెన, దమయంతీ స్వయంవరం వంటి శతాధిక రచనలు వివిధ ప్రక్రియలలో విశ్వనాథ సత్యనారాయణ గారి లేఖిని నుండి వెలువడ్డాయి. 

దుర్యోధనుడు, వేన రాజు,నర్తన శాల వంటి రూపకాలను విశ్వనాథ రచించారు. 

ఎమెస్కో వారు ప్రచురించిన పలు కావ్యాలకు విశ్వనాథ వారు విలువైన పీఠికలు రచించారు. 

సంస్కృతంతో పాటు ఆంగ్లంలో కూడా విశ్వనాథ పలు రచనలు చేశారు. 

ఆంగ్ల భాషలో విశ్వనాథవారి ప్రావీణ్యం అపారం.

పురాణ వైర గ్రంథమాల, కాశ్మీరు రాజవంశ చరిత్ర, నేపాలు రాజవంశ చరిత్ర పేరిట విశ్వనాథ సత్యనారాయణ గారు చరిత్రను లోతుగా అధ్యయనం చేసి విశిష్ట రచనలను జాతికి కానుకగా అందించారు.

తెలుగులో ఇంతటి విస్తృతి కలిగిన సాహిత్యాన్ని సృష్టించిన కవి, రచయిత ఒక్క విశ్వనాథ సత్యనారాయణ తప్ప 

మరొకరులేరని చెప్పడం అతిశయోక్తి కాదు.

 శ్రీశ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిని శ్రీనాథ కవిసార్వభౌముడు అంతటి మహాకవిగా ప్రస్తుతించారు.

గురువుల పట్ల.. పెద్దల పట్ల విశ్వనాథ వారికి గౌరవం మెండు.

 " అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుండ 

లఘు స్వాదు రసావతార 

ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడయినాడన్నట్టి , దా వ్యోమపేశల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశ స్వామికున్నట్లుగన్" అంటూ విశ్వనాథ సత్యనారాయణ గారు తనంతటి గొప్ప శిష్యుని కలిగిన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారు మరింకెంతటి గొప్పవారో గ్రహించండంటూ  లోకానికి ప్రబోధించారు.

 రామాయణ కల్పవృక్షం కావ్య రచన ద్వారా 

 తన గురువైన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారి ప్రత్యక్ష ప్రశంసకు పాత్రులైన ప్రతిభామూర్తి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. 

విశ్వనాథ సాహిత్యం పై తన ప్రభావం గానీ..వేరెవరి ప్రభావంగానీ లేదని..విశ్వనాథది సర్వ స్వతంత్ర ధోరణి అని చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారు ప్రశంసించారు. 

విశ్వనాథ సత్యనారాయణ గారి జీవితం గురించి వ్రాయాలంటే అది మరో "విశ్వనాథ కల్పవృక్షం" అవుతుంది.

చలం అంచనాలో  విశ్వనాథ సత్యనారాయణ గత జన్మలో కవిబ్రహ్మ తిక్కన.

పూర్వ కవులతోపాటు వర్తమాన కవులలో కనిపించని రచనా విలక్షణత..శైలీ విన్యాసం విశ్వనాథ సత్యనారాయణ రచనలలో గమనించవచ్చు 

 కావ్య సముద్రాన్ని మధించి సాహిత్య అమృతాన్ని రసజ్ఞులైన పాఠకులకు విశ్వనాథ పంచిపెట్టారు.  విశ్వనాథ సత్యనారాయణ గారి పేరిట ఆధునిక సాహిత్య చరిత్రలో ప్రత్యేకంగా విశ్వనాథ యుగాన్ని ఏర్పరచడం సముచితం.

విశ్వనాథను  తెలుగువారి మలి నన్నయ్యగా సంభావించ వచ్చు .

తెలుగు సాహిత్య చరిత్రలో పూర్వ కావ్య సంప్రదాయ ధోరణిలో వెలువడిన చిట్టచివరి కావ్యం..తెలుగు వారి రామాయణం విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్యమని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ప్రశంసించారు. 

విశ్వనాథ సత్యనారాయణ గారి కొన్ని కవితల్లో  సామాజిక స్పృహ ప్రస్ఫుటమవుతుంది.  సమాజాన్ని వీడి కవిత్వం లేదుకదా!! 

విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వాన్ని ఓపికగా అర్ధం చేసుకునే తీరిక లేని..కొందరు "పెద్దమనుషులు"! విశ్వనాథ వారి కవిత్వ శైలిని పాషాణ పాకమని ఈసడించారు. ఎవరు ఎంతగా ఆక్షేపించినా విశ్వనాథ వారి వ్యక్తిత్వ స్థాయి.. రచనల స్థాయి తగ్గేది కాదని గుర్తించాలి. మాత్సర్యంతో విశ్వనాథ సత్యనారాయణ గారి ఎదుగుదలను అడ్డుకోవాలని చూసిన వారెందరో!!  

అయితే విశ్వనాథ మాత్రం తన వ్యతిరేకులపట్ల కూడా గౌరవ భావం ప్రదర్శించేవారు. 

విశ్వనాథ వారి పేరు..రచనలు.. కవిత్వం నేటికీ నిలిచే ఉన్నాయి.

ప్రౌఢంగా..సరసంగా..సరళంగా... తేట తెలుగులో.. సంస్కృత సమాస పద భూయిష్ఠంగా రచన చేసి వివిధ స్థాయి పాఠకులను..కవి పండితులను..పామరులను రంజింప చేయగలిగే సామర్థ్యం విశ్వనాథ వారిలో పుష్కలంగా ఉందని గుర్తించాలి. 

విశ్వనాథ వారు ఒక సభలో కొన్ని పద్యాలను చదివి ఆ తరువాత వేరే అంశంలోకి వెళ్లేందుకు ఉపక్రమించగా సభకు హాజరైన వారిలో ఒక సామాన్య వ్యక్తి లేచి నోటి కాడ విస్తరిని లాగేసారు అని పెద్దగా అనడంతో విశ్వనాథ వారు ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి నా పద్యాలు పాషాణపాకమని ఎవరికీ అర్థం కావని అంటారే! అనడంతో ఆ వ్యక్తి నాకు మాత్రం మీ పద్యాలు వింటుంటే          అపూర్వమైన ఆనందం కలుగుతున్నది. 

మరికొన్ని పద్యాలను ఆలపించండి అని అభ్యర్థించడంతో విశ్వనాథ వారు మరికొంత సేపు పద్యాలను ఆలపించి ఆతనికి సంతోషం కలుగ చేసారు. 

అక్షర జ్ఞానంలేని పామరుడికి విశ్వనాథ వారి పద్య గానం అంతగా ఆనందం కలిగిస్తే విద్యావంతులైనవారు..పండితులైనవారు ఇంకెంతగా ఆస్వాదించాలో దీనినిబట్టి అర్థమవుతుంది. 

పైగా విశ్వనాథ సత్యనారాయణ గారికి సంగీత జ్ఞానం పుష్కలం.

 ఆయన గొంతెత్తి కమ్మగా పద్యాలు.. శ్లోకాలను ఆలపిస్తుంటే శ్రోతలు మంత్రబద్ధ భుజంగాల మాదిరి తన్మయత్వంతో వినేవారు. విశ్వనాథ వారి ఉపన్యాసం కూడా చమత్కారాలతో సాగేది. ఆయన దృష్టి ఎప్పుడు ఎవరిపై ప్రసరిస్తుందో..వేటగాని బాణంలా ఎవరిని గాయపరుస్తుందో తెలియదు. ఒక సభలో విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రసంగిస్తుంటే సూటు

బూటుతో సభకు హాజరైన ఒక ఉపాధ్యాయుుడు కాళ్లు అదేపనిగా కదిలిస్తుండడం విశ్వనాథ వారు గమనించారు. రామాయణ కథలో తన బల పరాక్రమాలను అతిగా 

ఊహించుకుని వాలిపై కాలు దువ్వి వాలి చేతిలో నిహతుడైన దుందుభి గురించి ప్రస్తావిస్తూ దుందుభిలాంటి విపరీత మనస్కులు ఈ కాలంలో కూడా ఉంటారు. మండు వేసవిలో ఫుల్ వూలు సూటు వేసుకున్న పండితుల లాగా అనడంతో పాపం! సదరు ఉపాధ్యాయుడు బిక్కచచ్చిపోయాడు. 

తరగతి గదిలో విశ్వనాథ వారు పాఠం చెబుతుండగా ఎవరైనా విద్యార్థులు గోల చేస్తే వారిని  మందలించేవారు. 

అయితే ఆయన తిట్లకు విద్యార్ధులు కోపగించుకోకుండా హాయిగా నవ్వుకునేవారు.

పైగా విశ్వనాథ వారి చేత తిట్లు తినడాన్ని కూడా గొప్పగా 

చెప్పుకునేవారు.

 విద్యార్థులను తొలుత మందలించినా తరువాత ఆయన వారితో ఆప్యాయంగా మాట్లాడేవారు. 

విశ్వనాథ వారి జాలి హృదయం ఎందరి ఆకలినో తీర్చింది.ఎందరి జీవితాలనో నిలబెట్టింది. 

ఎందరో  విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకుండా కాపాడింది. 

విశ్వనాథ వారు కవిత్వపరంగానేకాదు.. వ్యక్తిత్వపరంగా కూడా అత్యున్నతులని గుర్తించాలి.

ఒక సందర్భంలో ఒక వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారిని మీ రచనలు అర్ధం చేసుకోవడం కష్టం.

అందరికీ అర్ధమయ్యేలా వ్రాయవచ్చు కదా అని ప్రశ్నించారు. 

అందుకు విశ్వనాథ సత్యనారాయణ గారు "ముందు  నా రచనలను చదివి అర్ధం చేసుకోగలిగేటంత భాషా పరిజ్ఞానాన్ని సంపాదించుకుని ఆ తరువాత ఎక్కడ దోషమున్నదో విమర్శించమనండి" అంటూ సమాధానమిచ్చారు. 

నిజమే!

విశ్వనాథ సత్యనారాయణ వంటి మహాకవుల రచనలను చదివి గుణ దోష విచారణ చేయగలిగేటంత భాషా సమర్ధత..వివిధ పురాణ..కావ్య ..నాటక..శాస్త్ర ..ప్రాచ్య పాశ్చాత్య సంస్కృతుల  పరిజ్ఞానం..సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషా పాటవం.. నిఘంటు జ్ఞానం..లోతైన మనస్తత్వ చిత్రణ..ప్రకృతి పరిశీలన.. మానవీయ దృష్టి కోణం..సామాజిక స్పృహ..జీవితం పట్ల పరిపూర్ణ అవగాహన వంటి సమర్ధతలు  మనకు ఉన్నప్పుడు మాత్రమే విశ్వనాథ సత్యనారాయణ వంటి బహుముఖ ప్రజ్ఞావంతులను కొంతైనా విమర్శించగలిగే నైతిక అర్హత మనకు సిద్ధిస్తుంది.

శ్రీ శ్రీ మహాప్రస్థానం కావ్యానికి యోగ్యతా పత్రం వ్రాస్తూ చలం శ్రీశ్రీ కవిత్వాన్ని తూచగలిగే రాళ్లు తనవద్దలేవని పేర్కొన్నారు. 

అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వ గొప్పదనాన్ని తూచగలిగే పడికట్టు రాళ్లు మనవద్ద లేవని చెప్పడం అతిశయోక్తి కాదు.

"మన తెలుగు కవులలో  అనన్య ప్రతిభాశాలురు ముగ్గురున్నారు.

నాచన సోమన, కృష్ణ దేవ రాయలు, తెనాలి రామకృష్ణుడు.

ఈ మువ్వురినీ కాచివడగడితే అయినవాడు విశ్వనాథ సత్యనారాయణ" అని కాటూరి వెంకటేశ్వరరావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారి గొప్పదనాన్ని అక్షరీ కరించారు. 

" ఆధునిక సాహిత్యంలో 20 వ శతాబ్దంలో మహామహితుడైన విశ్వనాథ కుండలీంద్రుండు తన్మహనీయస్థితి మూలమై నిలువ అన్నట్లు మొత్తం సాహిత్యానికి ఆధారమై 

నిలిచినాడు.

ఈనాటి భారతీయ సాహిత్యానికే కాదు సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఒక ఉజ్జ్వల శిఖరం. సమకాలీనమైన అంశాలు పొగమంచులై ఆ శిఖరాన్ని కప్పినట్లు భాసించినా , పునరుజ్జ్వలిత మైన ఆ వ్యక్తిత్వం శతాబ్దపు అంచులను దాటి ప్రకాశిస్తూనే ఉన్నది" అంటూ కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గూర్చి కోవెల సుప్రసన్నాచార్య విలువైన అభిప్రాయాన్ని సంతరించారు.

విశ్వనాథ సత్యనారాయణ గారితో పోల్చదగిన.. ఆయనతో సాటి రాగలగిన  మహాకవి మరో వెయ్యేళ్లకైనా పుడతాడా అనేది సందేహమే!! 

" కవితామ్నాయ రహస్యముల్ తెలియగా గాంక్షించి నావేవి పొమ్మవనిన్ నీవేవనిం దలంపక తదేకాసక్తితో జేరు మా కవి సామ్రాట్టగు విశ్వనాథ ప్రతిభా గంభీర వారాన్నిధిన్ శివ కోటీర ఝురీతురీయ వచనశ్రీ సన్నిధిన్ బెన్నిధిన్ ,

ఎవని యాకృతి మించు హిమశైల శిఖరమై, కవులలో పుడమి మానవులలోన ఎవని భారతి వెల్గు నేకైక దీపమై, జగములందాగామి యుగములందు ఎవని మన్గడ యొప్పు శ్రవణపీయూషమై , కథలలో ( సూరి) వాక్సుధలలోన ఎవని స్థానము గ్రాలు నవనవోన్మేషమై, ఋషులలో నిఖిలా నిమిషులలోన అతడు కవియును ఋషియు దేవతయుగాడు,  కవులు ఋషులును దివిజులుం గలసి మెలసి మ్రొక్కు సాక్షాత్తు పరబ్రహ్మ మూర్తిగాక, విశ్వనా ధుండు కేవలావిర్భవుండె" అంటూ డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి గొప్పగా ప్రస్తుతించారు. నిజమే! ఆలోచించి చూస్తే విశ్వనాథ సత్యనారాయణ సాధారణ మానవుడు కాదని.. దివ్యత్వం నిండిన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని పాఠకులకు అనిపించడంలో వింతలేదు. 

విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీశ్రీ అర్పించిన కవితాంజలి చాలా ప్రత్యేక మైనది.

ఉపద:

" మాటలాడే వెన్నెముక

పాట పాడే సుషుమ్న

నిన్నటి నన్నయ భట్టు

ఈనాటి కవిసమ్రాట్టు

గోదావరి పలకరింత

కృష్ణానది పులకరింత

కొండవీటి పొగమబ్బు

తెలుగువాళ్ల గోల్డు నిబ్బు

అకారాది క్షకారాంతం

ఆసేతు మిహికావంతం

అతగాడు తెలుగువాడి ఆస్తి

అనవరతం తెలుగునాటి ప్రకాస్తి

ఛందస్సు లేని ఈ ద్విపద

సత్యానికి నా ఉపద "

అంటూ విశ్వనాథ స్మృతికి కవితాంజలులు ఘటించారు

శ్రీశ్రీ.

"కవిసమ్రాట్" శ్రీ విశ్వనాథ సత్యనారాయణ  తెలుగు జాతిలో  జన్మించడం తెలుగువారి అదృష్టం.

తెలుగు భాషా లలామకు లభించిన దివ్య వరం.

వ్యాస రచయిత:

(ఎం వి ఎస్ శాస్త్రి,

 ఒంగోలు.

కామెంట్‌లు లేవు: