19, జులై 2023, బుధవారం

మలబద్ధక సమస్య

 మలబద్ధక సమస్య గురించి వివరణ  


     

     కొంతమందిలో విరేచనం సాఫీగా ఉండదు. ఎక్కువ సమయం  లెట్రిన్ లో గడపవలసి వస్తుంది. మలము ఒకేసారి విసర్జించకుండా కొంచం కొంచం విసర్జించడం జరుగుతుంది. ఇలా జరుగుతూ మరలా అర్థగంట తరువాత మరలా మలవిసర్జనకు వెళ్ళవలసి వస్తుంది. ఇలా ఉదయాన్నే 2 నుంచి 3 సార్లు వెళ్లవలసి వస్తుంది. అయినను సంపూర్ణముగా విరేచనం అవ్వదు . కడుపు తేలికగా ఉండకుండా బరువుగా అనిపించును. ఇంకా కొంత మలము ప్రేవులలో ఉండినట్లు అనిపించును. 


            ఈ సమస్య ఎక్కువుగా కూర్చుని పనిచేయు ఉద్యోగస్తులలోను , వ్యాపారస్తులలోను కనిపించును. చాలా మంది ఉదయం లేవగానే విరేచనముకు వెళ్తున్నాము ఎటువంటి సమస్య లేదని పొరబడుతున్నారు. నిజానికి ఆరోగ్యకరమైన మనిషి రోజుకు రెండుసార్లు విరేచనముకు వెళ్లవలెను . ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషదాలు సేవించి కడుపును శుభ్రపరచుకోవలెను . ఈ కాలంలో ఈ నియమాలను ఎవరూ పాటించటం లేదు . 


               మలబద్దకం వలన ప్రేవులలోని వ్యర్దాలు బయటకి విసర్జించక పోవడం వలన శరీరంలో టాక్సిన్స్ ఎక్కువ అయ్యి అనేక రోగాలు వస్తాయి. రోగాలు రావడానికి మొదటి మెట్టు మలబద్దకం . ఎక్కువ కాలం ప్రేవులలో మలం సంపూర్ణముగా విసర్జించకుండా ఉండటం మూలాన ప్రేవులలో సీసం తయారగును. 


 మలబద్దకం లక్షణాలు  - 


 *  ఆకలి సరిగ్గా లేకుండా ఉండటం . 


 *  తలనొప్పి . 


 *  నిద్ర సరిగ్గా పట్టకపోవుట . 


 *  ముఖంపైన మొటిమలు వచ్చును . 


 *  శరీరం నందు వేడి పెరుగును . 


 *  కంటి క్రింద నల్లటి చారలు వచ్చును. 


 *  తలలో చుండ్రు పెరుగును . వెంట్రుకలు రాలును . 


 *  కడుపులో మంట . 


 *  నడుమునొప్పి . 


  మలబద్దకం రావడానికి గల కారణాలు  - 


  *  ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువుగా లేకుండా ఉండటం. పాలిష్ పట్టిన బియ్యం , మైదా పిండి వంటి వాటిలో పీచుపదార్థం అసలే ఉండదు . 


 *  కాఫీ , టీ , మద్యము విపరీతముగా తాగుట వలన కూడా మలబద్దకం వచ్చును . 


 *  నీరు తక్కువ తాగుట కూడా మలబద్ధకానికి కారణం అగును. 


 *  శారీరక శ్రమ లేనందువలన మరియు మానసిక ఆందోళనకు తరచుగా గురగుట వలన కూడా మలబద్దకాన్ని కలుగచేయును . 


  నివారణా యోగాలు  - 


 *  ఎక్కువుగా పాలిష్ చేయబడిన బియ్యాన్ని 

ఆహారముగా వాడరాదు. వీలులేని పరిస్థితుల్లో పాలిష్ బియ్యాన్ని వాడవలసి వచ్చినపుడు ప్రతిరోజు తవుడు ( Rice bran ) రెండు స్పూనులు చక్కెరతోగాని , తేనెతో గాని కలుపుకుని తినవలెను . లేదా తవుడుకు కొంచం నీరు చేర్చి చారులో కలుపుకుని లోపలికి తీసుకోవాలి . 


 *  బజారు నందు లభ్యం అయ్యే గోధుమపిండి మరియు మైదాపిండి నందు పీచుపదార్థాలు పుష్కలంగా లేవు . కావున బజారులో దొరుకు గోధుమపిండికి బదులుగా గోధుమలు తెచ్చుకుని శుభ్రపరచి మనమే మిల్లులో పట్టించుకుని వాడుకోవడం మంచిది . 


 *  పైన చెప్పిన విధముగా పాలిష్ తవుడు , మిల్లులో పట్టించిన గోధుమపిండి వాడటం వలన మలబద్దకం నివారణ అగుటయే కాకుండా B1 , B2 , నియాసిన్ విటమిన్లు కూడా సమృద్దిగా లభ్యం అగును. 


 *  వరి అన్నం మరియు గోధుమపిండితో చేసిన చపాతీలు , రొట్టెలు వాడునప్పుడు వీలైనంత అధికంగా ఆకుకూరలు , కూరగాయలు వాడాలి . దీనివలన మలబద్దకం తగ్గుటయే కాకుండా ఖనిజ లవణాలు , విటమిన్లు కూడా లభ్యం అగును . 


 *  భోజనము చేసిన అర్థ గంట తరువాత 2 గ్లాసులు , రాత్రి పడుకునే ముందు 2 గ్లాసులు , ఉదయాన్నే పండ్లు తోముకున్న తరువాత 2 గ్లాసుల నీటిని తాగవలెను . ఉదయాన్నే నీటిని తాగి కొంచంసేపు నడవటం లేదా వ్యాయామం చేయుట ద్వారా సుఖవిరేచనం అగును. 


 *  కాఫీ , టీ అలవాటు ఉన్నవారు క్రమముగా అలవాటును తగ్గించుకోవాలి. రోజుకు రెండుసార్ల కన్నా ఎక్కువసార్లు కాఫీ , టీలు సేవించరాదు . 


     మలబద్ధక సమస్యతో బాధపడువారు త్రిఫలా చూర్ణం రెండు స్పూన్లు  మోతాదులో ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి రాత్రిపూట పడుకునే ముందు తీసుకొనుచున్న ఉదయాన్నే సుఖవిరేచనం అగును. నేను ఇంతకు ముందు చెప్పిన విధముగా ఔషధాలు వాడుటయే కాక ఆహారం నందు ముఖ్యముగా మార్పులు చేసుకొనవలెను . మలబద్దకం మొదలయింది అంటే మీయొక్క అనారోగ్య సమస్యలు మొదలవుతున్నట్లే  కావున మొదటిలోనే సమస్య నివారించుకోవడం ఉత్తమం . 


      మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   

కామెంట్‌లు లేవు: