🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *పురాణ పఠనం*
. *🪐శ్రీ కృష్ణావతారం🪐*
. *102వ అధ్యాయం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*భృగుమహర్షి శోధనంబు*
వారు పలు యాగాలను వైభవోపేతంగా చేయసాగారు. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు ఎక్కువ గొప్పవారు అన్న చర్చ వారి మధ్య వచ్చింది. ఇలా చర్చించుకుని, భృగుమహర్షిని త్రిమూర్తుల మహత్యములను పరీక్షించి రమ్మని పంపారు. అంతట ఆ మహర్షి బయలుదేరి వెళ్ళి…..ఆయన సత్త్వ గుణసంపదను పరీక్షించాలి అనుకుని, భృగుమహర్షి బ్రహ్మదేవుడి కొలువులోనికి ప్రవేశించాడు. బ్రహ్మను స్తుతించకుండా ఆ మహర్షి మౌనంగా నిలబడ్డాడు. బ్రహ్మదేవుడు రుసరుస లాడి చిరాకుగా చూస్తూ....చతుర్ముఖుడు తన మనసులో కలతపడ్డాడు. భృగువు తన కొడుకే కదా అనుకుని, బ్రహ్మదేవుడు తన రోషాన్ని ఎలాగో చల్లార్చుకున్నాడు. ఆ మహాతపశ్శాలి, మునివరుడు, భృగుమహర్షి బ్రహ్మదేవుడి సభనుండి నిష్క్రమించి, నాగాభరణుడు అయిన ఈశ్వరుని కోసం కైలాస పర్వతం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ వెండికొండ మీద విశ్రమించి ఉన్న పార్వతీపరమేశ్వరులు బ్రహ్మదేవుని పుత్రుడు అయిన భృగువు రాకకు సంతోషించారు. భృగువు సోదరవాత్సల్యంతో తనను కౌగలించుకుంటాడు అనుకుని పరమశివుడు వేగంగా అతనికి ఎదురు వెళ్ళాడు. కాని, శివుడి సత్త్వగుణం పరీక్షించాలనే ఉద్దేశంతో....భృగువు శివుని రాకకు స్పందించకుండా ఊరక నిలబడ్డాడు. ముక్కంటి పరమశివుడు, బ్రహ్మపుత్రుడైన భృగువు ఎడల ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన విస్ఫులింగాలు వెదజల్లే త్రిశూలంతో ఆ మహర్షిని వక్షంపై పొడవడానికి ప్రయత్నించాడు. కాని, పార్వతీదేవి చటుక్కున అడ్డువచ్చి....పార్వతీదేవి పతి పాదాలమీదపడి సముచిత మధుర వచనాలతో అతని కోపం పోగొట్టింది. భృగువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
పిమ్మట భృగుమహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఒడిలో తలపెట్టుకుని పవళించి ఉన్నాడు. కౌస్తుభమణితో విరాజిల్లుతున్న విష్ణువు యొక్క వక్షాన్ని మునీశ్వరుడు తన కాలితో గట్టిగా తన్నాడు. నారాయణుడు నిర్వికారంగా పానుపు దిగి, ముని దగ్గరకు వచ్చి, కాళ్ళకు నమస్కారించి ఇలా అన్నాడు. “ఓ మునివర! దివ్య తపశ్శాలి! నీ రాకను గురించి తెలిసికొనలేక నేను చేసిన అపరాధాన్ని మన్నించు నన్ను కరుణించు. నీవు అభయము ఇచ్చుటలో ముందుండు వాడవు. ఈ మణిమయ సింహాసనంపై ఆసీనులు కండు. పవిత్రమూర్తి! మహానుభావా! నీ పాదజలం నన్నే కాదు నా కడుపులో ఉన్న సమస్త లోకాలను, లోకపాలకులను పవిత్రం చేయగలదు. ఓ మునీశ్వరా! నీ పాదతాడనము నా వక్షానికి అలంకారము అయిది. నీ రాక మా వంటి వారికి శుభదాయకం కదా. నేను ధన్యుడను అయ్యాను.” అని మృదుమధురంగా మాట్లాడాడు. శ్రీపతి మధురోక్తులకు భృగుమహర్షి మనసు సంతుష్టి చెందింది. ఆ శ్రీహరిని, ముకుందుడిని, అనంతగుణ నిధిని పలువిధాల స్తుతించాడు. ఆనంద భక్తి పారవశ్యాలతో కనులు చెమర్చుతుండగా విష్ణువు దగ్గర అనుమతి తీసుకొని, వెనుదిరిగి సరస్వతీనదీ తీరంలో ఉన్న మునుల వద్దకు వచ్చి, వారికి విషయం అంతా చెప్పాడు.....ఆ ఋషీశ్వరులకు తను వెళ్ళివచ్చిన వివరాలు, తనకు అవగతము అయిన త్రిమూర్తుల స్వభావాలు భృగుమహర్షి సవిస్తరంగా తెలిపాడు. ఆ మునీంద్రులు అచ్చెరు వొందారు. వారు సందేహాలు విడిచిపెట్టారు. సకల కల్యాణనిధి, చిన్మయస్వరూపుడు, లక్ష్మీపతి, అనుపమ అనవద్యుడు, ఆదిమధ్యాంత రహితుడు, పుండరీకాక్షుడు అయిన శ్రీమహావిష్ణువు ఒక్కడే పరమదైవం అని నిర్ణయించారు. అలా ఆ మునులు మహాఙ్ఞానులు అయి, హరిపాదారవింద ధ్యానరతులు అయి, ప్రీతితో సేవించారు.
అలా విష్ణుమూర్తిని భక్తితో సేవించిన ఆ మునులు వైకుంఠప్రాప్తిని పొందారు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు.
విప్రుని ఘనశోకంబు
“మహారాజా! తామరల వంటి విశాల నయనాల వాడు శ్రీకృష్ణుడు కుశస్థలిలో సుఖంగా ఉంటున్న రోజులలో, ఒక విప్రుని భార్యకు పుత్రుడు పుట్టి పుట్టగానే చనిపోయాడు. శోకంతో కన్నీళ్ళు పెట్టుకుని మృతబాలుడిని ఎత్తుకుని వచ్చి, ఆ బాలుడి శవాన్ని రాజద్వారం ముందు పెట్టి, విధిని నిందిస్తూ, తనను తాను తిట్టుకుంటూ, బ్రాహ్మణుడు గుండెబ్రద్దలయ్యేలా “అయ్యో” అంటూ దుఃఖించసాగాడు. దుర్భరశోకంతో కుమిలిపోతున్న ఆ విప్రుడు అక్కడి ప్రజలతో “బ్రాహ్మణద్వేషి, శాస్త్రాచారాన్ని పాటించని వాడు, పాపాత్ముడు అయిన క్షత్రబంధువు చేసిన పాపం వలన నా కుమారుడు పుట్టగానే చచ్చిపోయాడు. దేశాన్ని ఏలే రాజు హింసను ఏవగించుకోకుండా, న్యాయానికి దూరుడు, ఇంద్రియలోలుడు అయితే ఆ ప్రజలు నిరాశతో దుఃఖాలవలన అధికమైన కష్టాలను పొందుతారు.” అని ఏడుస్తూ ఇక అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. ఈ విధంగా తనకు కొడుకులు పుట్టి మరణించిన ఎనమండుగురు కొడుకులను ప్రతిసారి, వారిని తీసుకు వచ్చి రాజమందిర ద్వారం ముందు పెట్టి, ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ మునుపటిలాగే కొన్ని కథలు చదివి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా అతనికి పుట్టి చనిపోయిన తొమ్మిదవకొడుకును కూడ ఆ బాలుని శవాన్ని తెచ్చి ఆక్రందిస్తున్న బ్రాహ్మణుడిని చూసిన అర్జునుడు ఇలా అన్నాడు. “అయ్యా! ఇలా నీవు దుఃఖిస్తుంటే చూసి ఈ అన్యాయాన్ని వారించే సమర్ధత గల విలుకాడు ఒక్కడు అయినా ఈ నగరంలో లేడా? ఇది పాపము.
ఈలోకంలో అధికంగా ఎవరి రాజ్యంలో కన్నబిడ్డల్ని పోగొట్టుకుని దుర్భరశోకంతో పరితపించే బ్రాహ్మణులు ఉంటారో, ఆ రాజు రాజు కాడు కేవలం వేషగాడు మాత్రమే. నీ కుమారుడిని నేను బ్రతికిస్తాను అలా చేయకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను.” ఈ పలుకులు వినిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి ఇలాగా అన్నాడు. “అయ్యా! ఇలాంటి అవివేకపు మాటలు పలుక తగదు. మహా వీరులు, మహా బలశాలురు అయిన బలరామకృష్ణులు, కృష్ణకుమారుడు ప్రద్యుమ్నాదులు ఉండగా, ఇంకా... ప్రశంసించదగిన బలం కలిగిన యాదవవీరులు ఉండగా, వారిచేతనే కాని పనిని చక్కపెట్టడం నీవు ఎలా చేయగలవు కానీ, నీ దారిన నీవు వెళ్ళు.” ఇలా అంటున్న ఆ బ్రాహ్మణుడి మాటలు వినిన ఇంద్రతనయుడు...అర్జునుడి మనసులో దురహంకారం పెచ్చుమీరింది. రెండు చేతులతో వడిగా బాణాలు వేయగలిగిన ఆ మహావీరుడు రోషంతో వశంతప్పి, అక్కడి జనాలు అందరు వినేలా విప్రుడితో ఇలా అన్నాడు. “నేను బలరాముడినికాను కృష్ణుడిని కాను; ప్రద్యుమ్నుడిని కాను; అతని కొడుకైన అనిరుద్ధుడిని కాను. యుద్ధంలో నా భీకరమైన గాండీవం నుండి వెలువడే వాడిబాణాలతో శత్రువులను చీల్చిచెండాడే మహాపరాక్రమం కలిగిన నేను అర్జునుడిని. అంతేకాక.....అయ్యా! ఆ పరమశివుడినే ఎదిరించి పోరాడి భుజబలం చూపిన నన్నే ఎరుగవా? మృత్యుదేవత పొగరు అణచి, నా పట్టు ప్రదర్శించి, నీ పుత్రులను ఇప్పుడే తీసుకు వచ్చి ఇస్తాను.” ఇలా నమ్మకంగా పలికిన పార్థుడి మాటలపై బ్రాహ్మణుడి మనసు శాంతించింది. అతడు నరుని కొనియాడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నిదినాలు గడిచాయి. విప్రుడి భార్యకు మళ్ళీ ప్రసవించే సమయం సమీపించింది. భూసురుడు వెంటనే వచ్చి పరమ భీభత్సంగా యుద్ధంచేసే వాడైన అర్జునుడికి ఈ విషయం చెప్పాడు. ఆ ఇంద్రపుత్రుడు అంతట...
విశిష్టమైన పవిత్రజలాలతో ఆచమనం చేసాడు. పరిశుద్ధ ప్రదేశంలో నిలబడి శివుడికి నమస్కరించాడు. గొప్పగొప్ప అస్త్రాలను వేయగలిగిన అర్జునుడు శుభప్రదులైన మంత్రదేవతలను మనసున తలచుకుని గాండీవాన్ని ఎక్కుపెట్టి పట్టుకున్నాడు. అమ్ముల పొదులు రెంటినీ కట్టుకున్నాడు. ఈ విధంగా సంసిద్ధుడు అయిన అర్జునుడు అంతట....బ్రాహ్మణుడి కూడా వెళ్ళి ఆ ప్రసవమందిరం చుట్టూ దట్టమైన బాణాలతో కప్పివేశాడు. మిక్కిలి జాగరూకతతో ప్రసూతిగృహానికి కావలి కాస్తున్నాడు. అప్పుడా బ్రాహ్మణుని భార్యకు మగ పిల్లాడు పుట్టి వెంటనే చనిపోయాడు. అక్కడి జనం ఆర్తనాదాలు చేశారు. మరణించిన పిల్లాడు శరీరంతోసహా ఆకాశంలోనికి అదృశ్యం అయ్యాడు. బ్రాహ్మణుడు విలపిస్తూ మురాసురుడు కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. అలా వెళ్ళిన విప్రోత్తముడు....శ్రీకృష్ణుడి సమక్షంలో నిలబడి. “ముకుందా! నందనందనా! సనందాది ముని వందితా! పరమానంద! శ్రీకృష్ణా! గోవిందా! హరీ! శరశ్చంద్రుని వెన్నెల వంటి గొప్ప సత్కీర్తి కలవాడా! ఒకటి, అంతకన్నా ఎక్కువ హల్లులు పెక్కుమార్లు ఆవృత్తి చేయుట వృత్యనుప్రాస. అనగా ఒకే హల్లు అనేకసార్లు తిరిగితిరిగి వస్తే అది వృత్యనుప్రాస. ఇక్కడ విప్రుడు శ్రీకృష్ణుని స్తుతించు సందర్భంలో కంద పద్యంలో "పూర్ణానుస్వార పూర్వక ద" పది పర్యాయాలు వాడుతూ నింద చేయబోతున్నాడు అని సూచిస్తున్నాడా అన్నట్లు వృత్యనుప్రాస మన పోతన అలంకరించాడు. మహాత్మా! నా విన్నపాన్నిఆలకించు. పౌరుషహీనుడైన పార్థుని డాంబిక వచనాలను నమ్మి అమాయకుడిని అయి కొడుకును పోగొట్టుకున్న నన్ను నేను ఏమని నిందించుకోవాలి. సమస్త జగత్తు సృష్టి స్థితి లయాలకు మూలకారకుడవు అయిన నీవు సమర్థుడివే అయినా వారించలేక ఊరకున్నావు. మానవమాతృడు ఇంతటి మహాకార్యం ఎక్కడ నెరవేర్చగలడు?” అని ఇంకా ఇలా అన్నాడు....“ఈ పాండుతనయుడు ఒక విలుకాడట; ఇతగాడి మాటలు యదార్థ మట; ఇదొక గాండీవ మట; ఇతగాడికి దివ్యాస్త్రాలంటూ ఉన్నాయిట; ఏ మనగలం.” ఈలాగున బ్రాహ్మణుడు తనను నిందిస్తుంటే, కోపం వచ్చిన అర్జునుడు తన విద్యాప్రభావంతో వెంటనే బయలుదేరి యమమందిరానికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణపుత్రులు లేకపోడంతో పార్థుడు వెంటనే ఇంద్ర, అగ్ని, నిరృతి, వరుణ, వాయు, కుబేర,–
ఈశానుల నివాసాలకు వెళ్ళి అన్వేషించాడు. అనంతరం దేవ, యక్ష, కింపురుష, నాగ, రాక్షస, సిద్ధ, సాధ్య, ఖేచరాదుల ఇళ్ళకు వెళ్ళి బ్రాహ్మణపుత్రుల కోసం వెదికాడు. కాని వారి జాడ అక్కడ కూడా దొరకలేదు. చివరకు మళ్ళీ భూలోకానికి వచ్చాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం అగ్నిప్రవేశం చేయటానికి పట్టుదలగా సిద్ధపడ్డాడు, శ్రీకృష్ణుడు ఈ విషయం తెలుసుకుని “బ్రాహ్మణ కుమారులను నేను నీకు చూపిస్తాను.” అని చెప్పి అర్జునుడిని మంటల్లో దూకకుండా వారించాడు. పిమ్మట...
మృతవిప్రసుతులఁదెచ్చుట
సూర్యుడు ఉదయపర్వతాన్నిఎక్కినట్లు, అందమైన దివ్యరత్నకాంతులతో ప్రకాశిస్తున్న బంగారు రథాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి అధిరోహించాడు. తన దేహకాంతులు దిక్కుల ప్రకాశిస్తుండగా శ్రీకృష్ణుడు విప్రబాలురను వెదకటానికి బయలుదేరాడు. పట్టణాలతో పల్లెలతో దుర్గాలతో అరణ్యాలతో పర్వతాలతో నదీనదాలతో సరోవరాలతో నిండిన భూమండలం, సప్తసముద్రాలు, మహాదీవులు, కులపర్వతాలు, మేరుపర్వతం దాటి శ్రీకృష్ణుడి రథం మహావేగంతో ముందుకు సాగిపోయింది. శ్రీకృష్ణార్జునులు దట్టమైన చీకటిమండలాన్ని ప్రవేశించారు.
వారు సాహసంగా ముందుకు వెళ్తూ ఉంటే, చీకటి మరింత భయంకరంగా తయారైంది. కళ్ళకేదీ కనిపించ లేదు. గుఱ్ఱాలు శక్తి కోల్పోయి దారితప్పి నిలబడిపోయాయి. శ్రీకృష్ణుడు భేదించరాని ఆ చీకట్లను రూపుమాపడం కోసం...బాలసూర్యుడి కాంతికి సాటివచ్చే కాంతితో వెలిగే తన చక్రాయుధాన్ని శ్రీకృష్ణుడు ప్రయోగించాడు. అది విజృంభించి చిమ్మచీకటిని తొలగిస్తూ పైనుండి ముందుకు దూసుకుని పోసాగింది. కృష్ణార్జునులు చక్రాయుధం వెళ్ళే మార్గం వెంట అమితివేగంగా రథాన్ని నడిపించుకుంటూ వెళ్ళి చీకటిని దాటారు. అప్పుడు వారి ముందు కన్నులు మిరుమిట్లు కొలిపే దివ్యతేజస్సు కనిపించింది. అర్జునుడు భయంతో కళ్ళు మూసుకున్నాడు. అతని ఆ స్థితిలో కొంత దూరం వెళ్ళారు. పిమ్మట, పూని మహావేగంగా వీచే గాలులతో, చెలరేగే కెరటాలతో గంభీరంగా ఉన్న జలరాశిని కృష్ణార్జునులు ప్రవేశించారు. ఆ నీటి నడిమిభాగంలో కోటిసూర్యుల కాంతులు ప్రకాశిస్తున్నాయి. అక్కడ ఆ జలరాశిమధ్యలో ఒక దివ్యభవనం కనబడింది. దానిలో తేజోమయమైన వేలకొలది మనోహరమైన మణిస్తంభాలు ఉన్నాయి రమణీయ రత్నహారాలు అలంకృతమై వ్రేలాడుతున్నాయి. అది అనంత తేజస్సుతో విరాజిల్లుతోంది. సూర్యచంద్ర కిరణాలకు ప్రవేశింపరానిది, జన్మరాహిత్యానికి మార్గము, నిత్యైశ్వర్యదాయకము, అవ్యయము, మహోన్నతము, సాటిలేని వైభవోపేతము, పరమ యోగీంద్రులకు ప్రవేశయోగ్యము, భాగవతోత్తములకు నివాసస్థానము అయి విరాజిల్లుతోంది. ఆయొక్క మహాసౌధంలో...అటువంటి ఆ దివ్యభవనంలో దట్టమైన శరత్కాలపు పండువెన్నెల, కర్పూరం, మంచులకు సాటివచ్చే తెల్లనిదేహము; తుమ్మెదల్లాగా నల్లకలువల్లాగా ఇంద్రనీలమణులలాంటి నల్లని కంఠాలు; ఉదయకాలం సూర్యుడిలాగా ప్రకాశించే పద్మరాగమణులతో కూడిన పడగలు; తెరచుకున్న నోళ్ళ నుంచి వెలువడే విషపు పొగలలా ఉన్న నాలుకలు; యాగగుండాలలోని జ్వాలలాగ ప్రకాశించే వేడిచూపులు; వెండికొండలాగా ఉన్న భారీ ఆకారము కలిగిన ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడనే పాన్పు....ఆ ఆదిశేషుని పాన్పుగా కొని సుఖంగా ఆసీనుడై ఉన్న తేజోమూర్తి దగ్గరకు శ్రీకృష్ణార్జునులు వెళ్ళి దర్శించారు. నీలమేఘశ్యాముడు, ఆశ్రితజనరక్షకుడు, పద్మాలలో తుమ్మెదలాగ సనకాది మునీంద్రుల హృదయపద్మాలలో నివసించేవాడు, పూర్ణ చంద్రుని మించిన ముఖకాంతి కలవాడు, విశ్వవిఖ్యాత చారిత్రుడు, ప్రాతఃకాలంలో వికసించిన పద్మపత్రాల వంటి నేత్రాలు కలవాడు, లక్ష్మీమనోహరుడు, శ్రీకరుడు, పీతాంబరధరుడు, హారాలు కేయూరాలు కటక కంకణాలు కిరీటాలతో భూషణుడు, భవసాగర శోషణుడు, భక్తజన సంపోషణుడు అయిన మహావిష్ణువును వారు చూసారు. అంతేకాదు, సదా సునందాది పరిజనులచే సేవించబడువాడు, నిత్యానంద కందళిత హృదయుడు, శ్రీదేవి భూదేవి సమేతుడు, నారదయోగీంద్ర గానలోలుడు, కరుణాసముద్రుడు, అవ్యయుడు, అనఘుడు, అనంతుడు, అప్రమేయుడు, అజితుడు, అవికారుడు, పరమ పురుషుడు, పురుషోత్తముడు, సకల లోకాల సృష్టి స్థితి లయ కారకుడు, చిత్తు అచిత్తులకు ఈశ్వరుడు, అష్టభుజుడు, వక్షమున కౌస్తుభమణి అలంకృతుడు, శంఖచక్రగదాశార్ఙ్గాది దివ్యాయుధ సంపన్నుడు, సర్వశక్తి సేవితుడు, బ్రహ్మదేవుని జనకుడు అయిన ఆ శ్రీమన్నారాయణునికి శ్రీకృష్ణార్జునులు భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి, చేతులు జోడించి స్తుతించారు. ఆ ఆదినారాయణుడు వారిని దయాదృష్టితో చూసి, మందహాసం చేసి, సాదరంగా ఇలా అన్నాడు. “భూమికి భారమైపోయిన రాక్షసులను వధించి, ధర్మాన్ని రక్షించడం కోసం నా అంశతో మీరిద్దరు నరనారాయణులుగా జన్మించారు.
మహానిష్ఠతో ఉన్నతులైన మిమ్మల్ని ఈ మునీశ్వరులు చూడాలని కోరారు. అందుకని, మీరిక్కడకు రావాలనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుని కుమారులను ఇక్కడకు తెప్పించవలసివచ్చింది.”
అని పిమ్మట “ఈ బాలకులను మీరు తీసుకుని వెళ్ళండి” అని పలికి ఆ బాలకులను అప్పజెప్పి విష్ణువు వారికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. శ్రీకృష్ణార్జునులు వినయంతో భగవంతుడిని అనేక విధాల స్తుతిస్తూ బ్రాహ్మణపుత్రులతో అక్కడ నుండి బయలుదేరారు. కోరిన పని సాధించి సఫల మనోరథులు అయిన కృష్ణార్జునులు వారి వారి వయసులకు తగిన ఆకారాలతో ఉన్న ఆ విప్రసుతులను వెంటబెట్టుకుని వచ్చి బ్రాహ్మణుడికి అప్పజెప్పారు. ఆ బిడ్డలను చూసిన ఆ విప్రుడు ఎంతో ఆనందం పొందాడు. అంతట....ఓ మహారాజా పరీక్షిత్తు! ఇంద్రతనయుడు సూర్యసమతేజస్వి అయిన అర్జునుడు కృష్ణుడితో వెళ్ళి తను దర్శించిన ఆ లోకశరణ్యుడు విష్ణుమూర్తి సౌధవైభవం; ఆయన మహనీయ సమున్నత యశస్సునకు మనస్సులో ఆనందించి పెక్కుమార్లు స్తుతించాడు. పద్మాక్షుడిని, భక్తమందారుని, పుణ్యాత్ముని, అఖిలేశుని, కేశవుని, జయశీలుని, పరమాత్ముని, శ్రీకృష్ణుడిని స్తుతించి; ఆయన పాదపద్మాలకు ప్రణామాలు చేసి అర్జునుడు మిక్కిలి ఆనందించాడు.అంతట....అనంతుడు, వేదవేద్యుడు, సర్వేశ్వరుడు, ఆద్యుడు, అభవుడు అయిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణులాదిగా గల సమస్త ప్రజలను సకల ధన వస్తు సంపన్నులను చేసాడు. వారిని సంరక్షిస్తూ ధర్మాన్ని సంస్థాపిస్తు పాపాత్ములను సంహరిస్తు, ద్వారకలో గొప్ప శుభసంతోషాలతో ప్రకాశించాడు. సంతోషచిత్తుడై ప్రజలు మెచ్చేలాగ అనేక యజ్ఞ యాగాలను శ్రీకృష్ణుడు శాస్త్రోక్తంగా తనను ఉద్దేశించి తనే పరమోత్సాహంతో జరిపించాడు,
సశేషం🙏
*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి