16, సెప్టెంబర్ 2024, సోమవారం

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

 ♦️ *మోక్షగుండం విశ్వేశ్వరయ్య*♦️



*బాల్యం, విద్యాభ్యాసం* 


*మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861* , సెప్టెంబరు 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలో గల చిక్కబళ్ళాపూర్ తాలూకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ అనే బ్రాహ్మణ దంపతులకి జన్మించారు. వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మూడు శతాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్ళారు. కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలిగే వారు. అతని తండ్రి సంస్కృత పండితుడు, హిందూ ధర్మశాస్త్ర పారంగతుడే కాక ఆయుర్వేద వైద్యుడు కూడా. 


విశ్వేశ్వరయ్యకు 12 సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు. చిక్కబళ్ళాపూరులో ప్రాథమిక విద్య, బెంగుళూరులో ఉన్నతవిద్య పూర్తి చేసాడు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ., తరువాత పుణె సైన్సు కాలేజి నుండి సివిలు ఇంజనీరింగులో ఉత్తీర్ణుడయ్యాడు.


పుణెలో ఇంజనీరింగు పూర్తయిన తరువాత తన 23వ యేట బొంబాయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరిన తరువాత, భారత నీటిపారుదల కమిషనులో చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది. అతను దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వచేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను అతను రూపొందించాడు. 


1903లో మొదటిసారిగా దీనిని పుణె దగ్గరి ఖడక్‌వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. దీని తరువాత గ్వాలియర్ వద్ద అల తిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు.


1906-1907 మధ్య కాలంలో అతన్ని భారత ప్రభుత్వం యెమెన్ లోని ఆడెన్ కి పంపించి అక్కడి నీటి పారుదల వ్యవస్థనూ, మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. అతను నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ మంచి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తిచేయబడింది.


హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినపుడు, ఆయనకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది.కావేరీ నది పై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆది నుంచి అంతం వరకు అతని పర్యవేక్షణలోనే జరిగింది. అప్పట్లో *కృష్ణరాజ సాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతిపెద్దది.* 


 *కర్ణాటక పితామహుడు* 


1908లో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత, మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేసాడు. క్రింద పేర్కొన్న సంస్థల ఏర్పాటులో అతను కీలక పాత్ర పోషించాడు.


1. మైసూరు సబ్బుల కార్మాగారం

2. పారాసిటాయిడ్ లేబొరేటరీ

3. విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, భద్రావతి

4. శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్

5. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం

6. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్

7. ద సెంచురీ క్లబ్

8. మైసూర్ చాంబర్ ఆఫ్ కామర్స్

9. విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్


1917లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో ముఖ్యపాత్ర వహించాడు. తరువాత ఈ కళాశాలకు అతని పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటక లోని పేరున్న విద్యా సంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా అతని పాత్ర ఉంది. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాడు. *తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు* ఏర్పాటులో కూడా అతని పాత్ర ఉంది. *హైదరాబాదులోని పత్తర్‌గట్టి నిర్మాణానికి డిజైన్* ను అందించాడు.


 *పురస్కారాలు* 


1911లో అతను కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ (companion of the order of Indian empire) గా నియమితుడయ్యాడు. 1915 లో మైసూరు దివానుగా ఉండగా అతను ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిషు ప్రభుత్వం *నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్* అనే బిరుదును ఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1955 లో భారత దేశపు అత్యున్నత పౌర పురస్కారం *భారతరత్న* ప్రధానం చేశారు.


లండన్ లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ యాభై సంవత్సరాల పాటు, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆయనకు గౌరవ సభ్యత్వాన్నిచ్చాయి. భారతదేశంలోని *ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.* 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (Indian science congress)కు అతను అధ్యక్షుడిగా వ్యవహరించాడు.


విశ్వేశ్వరయ్యకు అనేక రంగాలలో విశేషమైన గుర్తింపు లభించింది. అందులో ప్రధానమైనవి విద్యారంగం, ఇంజనీరింగ్. కర్ణాటకలోని అత్యధిక ఇంజనీరింగు కళాశాలలు అనుబంధమై ఉన్న బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ అతను పేరు మీద నెలకొల్పబడింది. ఇంకా బెంగుళూరులోని యూనివర్శిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పుణెలోని నాగపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (Nagpur college of engineering) అతని పేరు మీదుగా పిలవబడుతున్నాయి. పుణెలో అతని నిలువెత్తు విగ్రహాన్ని చూడవచ్చు.[8] అతను జన్మశతి సంవత్సరంలో బెంగుళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక ప్రదర్శనశాల నెలకొల్పబడింది


*స్మారక చిహ్నం* 


అతను స్వస్థలమైన *ముద్దెనహళ్ళి* లో విశ్వేశ్వరయ్య మెమోరియల్ ట్రస్టు వారు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇది అతను నివసించిన ఇంటి పక్కనే నెలకొల్పబడింది. ఇందులో అతను సాధించిన పతకాలు, బిరుదులు, అతను వాడిన కళ్ళద్దాలు, కప్పులు, వెబ్ స్టర్ డిక్షనరీ, అతను విజిటింగు కార్డును ముద్రించే పరికరం లాంటి వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. అంతే కాకుండా అతను రూపకల్పన చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన కృష్ణరాజ సాగర్ ఆనకట్ట నమూనాను కూడా సందర్శించవచ్చు. అక్కడి ప్రజలు దాన్ని ఓ దేవాలయంగా భావిస్తుంటారు.


*101 సంవత్సరాల వయసులో* 1962 ఏప్రిల్ 14న బెంగళూరులో ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.


🍀🍀🍀🌿👳‍♀️🌿🍀🍀🍀



*ఆయన మేధో శక్తికి ఒక ఉదాహరణ* 


*రైలు చైన్ లాగిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య*


బ్రిటిష్ వారి కాలంలో భారత్‌లో ఓసారి ఓ రైలు వెళ్తోంది. అందులో చాలామంది బ్రిటిషర్లే ఉన్నారు. వారితో పాటు ఓ భారతీయుడు కూడా కూర్చుని ప్రయాణిస్తున్నాడు.


నల్లటి చర్మరంగు కలిగి, సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. అతడిని చూసిన బ్రిటిషర్లు.. అతడో తెలివితక్కువవాడని, నిరక్షరాస్యుడని వేళాకోళం చేయసాగారు. కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు.


కానీ, ఉన్నట్లుండి లేచి నిలబడిన ఆ వ్యక్తి రైలు చైన్ లాగాడు. వేగంగా వెళ్తున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగింది. అందరూ అతడి గురించే మాట్లాడుకోసాగారు. అక్కడికొచ్చిన గార్డు.... చైన్ ఎవరు లాగారని ప్రశ్నించాడు.


'నేనే' అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. 'ఎందుకు లాగానో చెప్పనా... కొద్ది దూరంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయని నాకనిపిస్తోంది' అని ఆ వ్యక్తి చెప్పాడు.


నీకెలా తెలుసు అని గార్డు మళ్లీ ప్రశ్నించాడు.


రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు, దానితో పాటు శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు అలా అనిపించింది అని ఆ వ్యక్తి అన్నాడు.


దీంతో కొద్ది దూరం నడిచి వెళ్లి చూసిన గార్డు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రైలు పట్టాలు రెండూ దూరం దూరంగా పడి ఉన్నాయి. నట్లు, బోల్టులు దేనికవి విడిపోయి ఉన్నాయి.


ఇది విశ్వేశ్వరయ్య గారి మేధోశక్తికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే...!!


*నిఖార్సైన  నిజాయితీ* 


*అది ఒక చిన్న గ్రామం.* అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఓ *ఇంజనీరు* వచ్చి, తన పని పూర్తిచేసుకొని, రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్లాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ఇంజనీరు తన బ్యాగు నుండి రెండు కావ్వొత్తులు తీసి వెలిగించి లెక్కలు వ్రాసుకున్నాడు. తర్వాత ఆ కొవ్వొత్తులు ఆర్పి, మరో *రెండు కొవ్వొత్తులు* బ్యాగు నుండి తీసి వెలిగించి పుస్తకం చదవ సాగాడు. అది గమనిస్తున్న గ్రామ పెద్ద,


*అయ్యా! ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగులోనే ఈ పుస్తకం కూడా చదవొచ్చు కదా!* దాన్ని ఆర్పి వేరేదాన్ని ఎందుకు వెలిగించారు అని అడిగాడు.


అందుకు ఆ ఇంజనీరు, మొదట వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి. *దాని వెలుగులో ప్రభుత్వ పనులు చేశాను.* ఇప్పుడు నా ఆనందం కొరకు నా సొంత కొవ్వొత్తులు వెలిగించి చదువుతున్నాను అన్నాడు.


ప్రభుత్వ సొమ్ము కాజేయాలని చూసేవారే ఎక్కువగా ఉంటారు. కానీ ఇతనెంత నిజాయితీగా ఉన్నాడని, ఆ ఇంజనీరు వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ గ్రామ పెద్ద. ఇంతకీ *ఆ ఇంజనీరు ఎవరో తెలుసా?* 


ఇంకెవరూ.... *మోక్షగుండం విశ్వేశ్వరయ్య...*


🔸🔸🔸🔸👳‍♀️🔸🔸🔸🔸

కామెంట్‌లు లేవు: