_*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 14 వ భాగము*_
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*సనందనుడు పద్మపాదుడగుట:*
సనందనుడు ఎటువంటి శిష్యుడు? వేకువనే లేచి గొంతెత్తి గురుస్మరణ చేయడంతో సహశిష్యులు మేలుకొనేవారు. గురువనగా క్రిందటి జన్మకర్మలను నివారించి జ్ఞానవైరాగ్యాలను ప్రసాదిం చేవాడని త్రికరణ శుద్ధిగా నమ్మి గురుపాద పద్మము లను కండ్లకు అద్దుకొనే వాడు. సర్వకాల సర్వావస్థ లయందు గురువు రూపాన్ని మనసులో స్థిరంగా ఉంచుకొని గురుపాదధూళి శిరమున దాల్చెడివాడు. గురు సన్నిధానము నకు వెళ్ళినప్పుడు సాష్టాంగ వందనము ఆచరించే వాడు. గురువుల నివాసాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేవాడు. వేకువనే తన కాలకృత్య ములు నిర్వర్తించుకొని వేళ తప్ప కుండా గురువులకు తానే స్నానం చేయించే వాడు. గురుదేవుడు ఉపదేశించిన మంత్రాన్ని దీక్షగా జపించుకొంటూ గురు కార్యాలను అడగక ముందే పూర్తి చేసేవాడు. గురువు కడ స్వేచ్ఛగా సంచరించి ఎరుగడు. గురువుల శాఠీలు, కౌపీనాలు శుభ్రపరచి ఆరబెట్టేవాడు. అన్ని విధములా సద్భావంతో సత్ప్రవర్తనుడైన సనంద నుడిపై వాత్సల్యభావం కలిగి అతనికి ముమ్మారు సూత్రభాష్యం చెప్పారు శంకరస్వామి. అది చూచిన తోడి శిష్యుల మనస్సులలో అసూయా భావం మొలకెత్తింది. వాళ్ళ ప్రవర్తనలలో వస్తున్న మార్పులను కనిపెట్టి ఆ మాలిన్యాన్ని మొదటలోనే తుంచివేయాలని సమకట్టారు.
ఒకనాడు గంగాతీర సైకత స్థలులలో శిష్యులతో కలిసి విశ్రమిస్తున్నారు శంకరులు. ఇంతలో పాఠంచెప్పే వేళ అయింది. సనందనుడు అక్కడ లేడు. కార్యార్థియై గంగకు ఆవలి ఒడ్డుకు వెళ్ళాడని అందరికి తెలుసును. పాఠం మొదలు పెట్టమని వేడు కొన్నారు శిష్యులు. సనందనుడు రావాల న్నారు గురువుగారు. ఏరు దాటటానికి పడవ గాని, తెప్ప గాని లేదు, ఇప్పుడప్పుడే సనందనుడు రాడు అన్నారు శిష్యులు. అపుడు శంకరాచార్యుడు గొంతెత్తి “సనందనా! తిరిగి రా!” అని పిలిచారు. ఆ కేక సనందనుని మనస్సును కప్పిన మాయను తొలగించే కేక! వెంటనే సనందనుడు తిరుగు ముఖంపట్టి గంగలో పాదం పెట్టాడు. తన తనయుని కాపాడ నెంచిన గంగమ్మ తల్లి బిడ్డ పాదం క్రింద పెద్ద పద్మం అమర్చింది. రెండో పాదం క్రింద ఇంకొక పద్మం అమ ర్చింది. ఇట్లా అడుగడుగు నకూ పద్మాలు అమరి వాటిపై తన పాదాలు మోపి నడచి వస్తున్నాడు సనందనుడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూచిన శిష్యులు సంభ్రాంతులై తమ తప్పిదాన్ని తెలుసు కొన్నారు.
“పద్మపాదా!” అని సంబోధిస్తూ సనందనుని శంకరాచార్య స్వామి కౌగిలించుకొన్నారు. ఆ విధంగా సార్థకనామం వచ్చింది శిష్యునికి.
*వ్యాసమహర్షి రాక:*
మొదట్లో పతంజలి వ్రాసిన సూత్ర భాష్యాన్ని ఆ నాడు పొగడని ద్వైతుడు లేడు. అద్వైతులు మాత్రం వ్యాసుడు ద్వైతాన్ని ఆదరిస్తాడనుకోలేదు. ఆఖరికి పతంజలికే తన భాష్యంపై నమ్మకం కను మరుగైంది. అనుమానా స్పదాలైన భాష్యాలు అచ్చటచట కలవని వ్యాసునకు తెలుసును. శ్రీ శంకరాచార్యులు అద్వైత పరంగా సూత్రభాష్యం వ్రాశారన్న సంగతి దశదిశలా వ్యాపించడంతో కృష్ణ ద్వైపాయనుడు సంతోషించి ఆ విషయం ఏమిటో కనుగొనే ఉద్దేశంతో ప్రచ్ఛన్నరూప ధారియై వెళ్ళడానికి నిశ్చయించుకొన్నాడు.
ఒకనాడు శ్రీ శంకరా చార్యుడు శిష్యులకు సూత్రభాష్యం చెబుతున్నారు. శిష్యుల సందేహాలను గురువు గారు తీరుస్తున్నారు. ఆ బ్రహ్మ విచారణలో నిమగ్ను లైన వారికి ఎంత ప్రొద్దెక్కిందో తెలియలేదు. అంతరిక్షంలో నున్న ఆదిత్యుడు ఈ పాఠాలను ఆసక్తిగా వినడానికి కాబోలు దగ్గరగా రావడంతో ఆ ప్రచండత కు శిష్యులు తాళలేక పోయారు. కాలాతీతం కావడంతో పాఠం ముగిద్దామనుకొనే సమయానికి ఒక ముదుసలి బ్రాహ్మణుడు వచ్చి నిలబడ్డాడు వారి ముందట. ఆయన ఆ శిష్యులను ఉద్దేశించి ఇలా అడిగాడు:
“మీరెవ్వరు? ఏ విషయం చెప్పుకుంటున్నారో వివరంగా చెబుతారా”.
అప్పుడు శిష్యులు ఆ వృద్ధ విప్రునితో "బ్రాహ్మణోత్తమా! వ్యాసవిరచితమైన బ్రహ్మ సూత్రాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు ఈ మహితాత్ములైన మా గురువుగారు చక్కని భాష్యాలు వ్రాసిన వారు. మాకు బోధిస్తున్నారు. అప్పుడు ఆ కపట విప్రుడు శంకరాచార్యుని వైపు తిరిగి ఇలా అడిగాడు:
"బుద్ధిమంతుడా! ఈ సరి ఎవ్వరూ చేయజాలని భాష్యరచన చేసావంటే మెచ్చదగినదే! అందులో ఒక సూత్రానికి ఎలాంటి భాష్యం వ్రాశావో వివరిస్తావా?”. అందుకు ముదమందిన శంకరుడు "ద్విజోత్తమా! నేను ఇవి వ్రాశానని నాకేమీ గర్వం లేదు. ఏ సూత్రానికి అర్థం కావాలని మీరు కోరుతున్నారో చెప్పండి.” అప్పుడు మొదలైంది చర్చ.
*వ్యాస శంకర వాదోపవాదములు:*
ముసలివాని రూపంలో ఉన్న వ్యాసు డడిగాడు: “యతివర్యా!
బ్రహ్మసూత్రాలలోని మూడవ అధ్యాయం లోని మొదటి సూత్రం 'తదంతరప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్త: ప్రశ్న నిరూపణాభ్యాం' దీని గురించి నీకేదైనా తెలుస్తే చెప్పు”. ఆ సూత్రాన్ని వివరించడం అంత సుళువు కాదు. తీగలాగితే డొంకంతా కదుల్తుంది కదా! అందులో భాష్యకారుని పస బయట పడుతుందని అడిగాడు వ్యాసమహర్షి. సమాధానంగా శంకరుడు:
"స్వామీ! శ్రుతిలో తెలిపినట్లు ప్రశ్నోత్తరాల వల్ల తేలిన నిగ్గు ననుసరించి జీవుడు వేరొక శరీరంలో ప్రవేశించినపుడు సూక్ష్మభూతాలను వెంటబెట్టుకొని పోవును. ఎన్నో తర్జన భర్జనలు చేసి వ్యాసుడు ఈ సూత్రాన్ని చిత్రించాడు” అని సూత్రభావం చెప్పాడు.
“అయితే స్వామీ! ఆ తర్జన భర్జన లేమిటో వివరించగలవా?” అని మరల ప్రశ్నించాడు వృద్ధ విప్రుడు. శంకరుని వివరణను వ్యాసుడు కాదనటం శంకరుడు సమర్థించు కొనడం. వ్యాసుని ప్రశ్న పరంపరలకు ఓపికగా శ్రుతి స్మృతి ప్రమాణాలతో సమర్థంగా చాక చక్యంగా విజ్ఞానాన్ని వైదుష్యాన్నీ చూపిస్తూ అపూర్వంగా సాగిన శంకరుని వివరణ శిష్యుల్ని దిగ్భ్రాంతుల్ని చేశాయి. ఆ విధంగా ఎనిమిది దినములు ధారాళంగా సాగిన వాదప్రతి వాదాలలో ఇసుమంతయినా క్రుంగ లేదు శంకరస్వామి. తన వాదాన్ని ఆ విప్రుడు వేయి విధాల ఖండిస్తున్నాడు. అన్నిటికీ తొణకక బెణకక సరియైన సప్రమాణ మయిన ఉపపత్తులు చూపిస్తున్నాడు శ్రీశంకరా చార్యస్వామి. ఈ ముసలి వాడు వ్యాసుడే అని గ్రహించాడు పద్మపాదుడు. శంకరుని చెవిలో ఆ రహస్యాన్ని ఊదాడు. అప్పుడు విప్రునితో “ఆచార్యదేవా జ్ఞానదాతా! అద్వైతమత స్థాపనా చార్యా! మీ శరీరాన్ని ఆశ్రయించు కొని ఉన్నవన్నీ లోకాలకు వెలుగు నిస్తున్నాయి. కలి మీ కడకు రానోపదు. మిమ్ములను చూస్తే విష్ణుమయంగా ఉంది. మీది విశ్వప్రేమ. విశ్వమే మీ బిడ్డ. మీ ప్రేమకు నా భాష్యరచన ఏమైనా అవరోధం కలిగించునేమో యని పరిశీలన కొరకై వచ్చి ఉంటారు. లోపాలున్న సవరించు కొంటాను. కరుణించండి. మీ నిజరూపం చూపించి నన్ను కృతార్థుణ్ణి చేయండి!” అని అర్థించారు శంకరులు.
*వ్యాస దర్శనం:*
శంకరాచార్యునితో జరిపిన వేదాంత చర్చతో వ్యాస మహర్షి ఆనందసాగరంలో మునిగి తేలాడు. శంకరుల ప్రార్థనతో నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు జలతారు పుంజాల వలె జటలు ప్రకాశిస్తుండగా. ఆ పరమ మౌనిని చూడగానే శిష్య సమేతంగా లేచి వినమ్రులై సాష్టాంగ వందనాలు అర్పించాడు శంకరస్వామి. "పుణ్యచరితా! కృష్ణద్వైపాయన మహర్షి సత్తమా! కరుణాసాగరా! వందనశతానేకములు! నా జన్మ పావనమైనది. లోక కల్యాణార్థం పెక్కు మహాకార్యాలను పరిపూర్తి చేశావు. పరాత్పరుని వేవిధాల చిత్రించి జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేసి పామరుల అజ్ఞానాన్ని తొలగించిన దివాకర స్వరూపుడవు. కలగా పులగంగా ఉన్న వేదాలను నాలుగింటిగా ఏర్పరచి వేదవ్యాసుడవని కొని యాడబడ్డావు. వేదార్థాలు సామాన్యులకు తెలిసి రావని కరుణామూర్తివై పదునెనిమిది పురాణాలు గా వ్రాశావు. దానితో తృప్తి పొందక పదునెనిమిది పర్వాల మహాభారతాన్ని అనితర సాధ్యంగా అపూర్వసంవిధానంగా మలచి మున్నెన్నడు ఎవ్వరు చేయని, చేయలేని 'పంచమ వేదము' అని ప్రణుతికెక్కిన మహా మహితమైన గ్రంథరాజాన్ని ప్రపంచానికి ప్రసాదించావు. బ్రహ్మసూత్రాలు సూత్రీక రించి జగాలకు హారతిగా ఇచ్చావు. పరాత్పరుడే ఆ సూత్రాలలో స్థిరనివాస మేర్పరచుకొన్నాడు. వాటిని నిండుగా అవగాహన పొందినవాడు జీవన్ముక్తుడే” అని పరి పరి విధాల స్తుతించి ఆసనము స్వీకరించుడని నమ్రుడై అర్థించాడు శంకరుడు. మారు పల్కక వ్యాసుడు సుఖాసీను డయ్యాడు. పిమ్మట శంకరుని వైపు తిరిగి వ్యాసుడు ఇలా అన్నాడు:
“నాయనా! శంకరా! నీవు సూత్రభాష్యం వ్రాయడమే కాక శిష్యులకూ, మునులకూ అందరికీ చక్కగా బోధిస్తున్నావు. నీ మూలంగా తత్త్వవిద్య విస్తృతంగా వ్యాపించి దేశప్రజలు తరిస్తారు.”
మరల ఈ విధంగా మాట్లాడాడు వ్యాస భగవానుడు: "శంకరా! నీకు నీవే సాటి! నీ భాష్యంలోని కొన్ని ఘట్టాలను తడిమి చూచాను. అనుమానాలకు అవకాశమివ్వ కుండా స్వప్రజ్ఞతో నీవు తెలివిగా తీర్చిదిద్దిన రీతులు అమోఘములు. శ్రీ గోవింద భగవత్పాదుడు అడుగు జాడలలో మెలగి వారి ఆజ్ఞను శిరసావహించి చేస్తున్న ఈ కృషి అద్వితీయము అలౌకికము.సాక్షాత్తు శంకరుడవే నీవు! చావు పుట్టుకలు లేకుండా చేసికొననెంచేవారికి రాచబాట నిర్మించావు గదా! బ్రహ్మతత్వాన్ని బహుళంగాను, స్థిరంగాను దేశమందు పాతుకొనేలా చేయి. అది నీ అవతార కర్తవ్యము”.
ఆ మాటలు విన్న శంకరాచార్యుడు 'తాపసోత్తమా! తమ దయ వలన నా భాష్యరచనలు పూర్తి అయినవి. దేశమందు ఉన్న దుష్టమతాలను ఖండించాను. నా జన్మ సార్థక మైంది. నా ప్రార్థన ఆలకించండి. ఈ మణికర్ణికా ఘట్టమందు నా కోసమై కొంచెము సేపు ఉండండి. మీ పవిత్ర సన్నిధానమందు ఈ శరీరాన్ని విడిచిపెట్టెదను” అని శంకరుడర్థించగా ఆ పలుకులు ములుకులు వలె తగిలిన ఆ మహాముని పరితపించి శంకరుని చూచి ఇట్లా అన్నాడు: “నాయనా! నీ కార్యభారం ఇంకా పరిపూర్తి కాలేదు. దేశంలో అపరిణత బుద్ధితో వక్రమార్గావలంబులైన అప్రబుద్ధులు ఇంకా ఉన్నారు. వారి వలన హాని ఎక్కువ జరుగుతోంది. అట్టి వారిని నీ ప్రతిభా పాట వాలతో సరియైన దారికి మళ్ళించి అద్వైత మతవ్యాప్తికి సుస్థిర సంస్థానిర్మాణం కావించ వలసిన గురుభారం నీ భుజస్కంధాల పై ఉండగా నీవు తొందర పడకు" అని బోధించి మరల అంటాడు ఆ మహాత్ముడు.
"శంకరా! నీవు ఎనిమిది ఏళ్ల ఆయుష్షుతో పుట్టావు. నీ మహిమతో అది రెట్టింపయింది. నీకు వరమిస్తున్నాను. ఇంకా నీ పని ముగియలేదు. అందుకని నీకో మరి పదారేడుల ఆయువు ఆ పరమేశ్వరుని అనుగ్రహ పూర్వకంగా నీకు లభిస్తోంది. నీ చరిత్ర ఆచంద్రతారార్కమూ ప్రసిద్ధమగు గాక!” ఈవిధంగా దీవన ఇచ్చి అంతర్ధాన మయ్యాడు కృష్ణద్వైపాయనుడు.
*కాలడి శంకరకైలాస శంకర*
*శ్రీ శంకరాచార్య చరిత్రము*
*14 వ భాగము సమాప్తము.*
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి