16, సెప్టెంబర్ 2024, సోమవారం

శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

 శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన

పాదారవిందశతకం

🙏🌸🙏🙏🙏🌸🙏

శ్లోకము:-

సుపర్వస్త్రీ లోలాలక పరిచితం షట్పదచితైః

స్ఫుర ల్లాక్షారాగం తరుణతరణిజ్యోతి రరుణైః |

భృతం కాంత్యంభోభిః విసృమరమరందైః సరసిజైః

విధత్తే కామాక్ష్యాఃచరణయుగలం బంధుపదవీమ్ ||9||

 

భావము:

దేవతాస్త్రీలు దేవీచరణ కమలాలపై తలవంచి మొక్కగా, వారి ముంగురులు తుమ్మెదల్లా వ్యాపించాయి. దేవీచరణాలకు అలంకరించిన పారాణి ఎరుపెక్కిన బాల సూర్యప్రభను వెదజల్లుచున్నది.చరణాల కాంతి ప్రవాహము కమలాల నుండి ప్రవహిస్తున్న తేనెలా ఉంది. ఇలా చరణాలకు కమలాలకు అన్నివిదాలా చుట్టరికం సరిపోయింది.

*********************************

అమ్మవారి పాదాల, పాదోదక వైభవవివరణలో భాగంగా శ్రీ శంకర విరచిత *సౌందర్యలహరి* నుండి మరొక శ్లోక వివరణ క్లుప్తంగా.....

 

కదా కాలే మాతః - కథయ కలితాలక్తకరసం

పిబేయం విద్యార్థీ - తవ చరణ నిర్ణేజనజలమ్‌|

ప్రకృత్యా మూకానా - మపి చ కవితా కారణతయా

కదా ధత్తే వాణీ - ముఖకమలతాంబూలరసతామ్‌||

 

భావము:

అమ్మా ! నీ పాదములు ఎర్రగా అందముగా ఉండుట కొరకు నీ అరికాలికి పూతగా ఎర్రని లత్తుక రసము పూయబడి ఉండును. నీ పాదములు కడిగినప్పుడు ఆ పాద్యోదకము నీ అరికాలి లత్తుక రసముతో కూడి ఎర్రగా శోభిల్లును.అటువంటి నీ పాదోదకము స్వీకరించినంత మాత్రాన, జన్మతః చెవిటివారుగా పుట్టిన వారు సైతం చక్కగా వినగలుగుతున్నారు.పుట్టు మూగవారు సైతం మాట్లాడగలుగుతున్నారు. అంతేకాదు మహా కవీశ్వరులు కాగలుగుతున్నారు.ఇన్ని అద్భుతాలకు హేతువైన, మహామహిమ కలిగిన, శారదా ముఖస్థ తాంబూలరసం వంటి, నీ ఎర్రని లాక్షావర్ణ లత్తుకారస మిళితమైన, నీ పాదోదకాన్ని బ్రహ్మవిద్యకై ( బ్రహ్మ జ్ఞానం) అర్రులు చాచు విద్యార్థినైన నేను నా మరణకాలం లోపులో ఎప్పటికి గ్రోలి ఈ మాయా మోహాంధకారాన్ని విడచి బ్రహ్మజ్ఞానాన్ని పొందగలనో కనీసం ఆ సమయమన్నా తెలుపరాదా తల్లీ.

{ ఇచట అమ్మ పాదోదక మహిమ వర్ణించబడినది. దీని ముందు శ్లోకంలో అమ్మే మహా మాయా స్వరూపిణిగా ఈ జగత్తును మాయలో పరిభ్రమింపచేయుచున్నదని చెప్పబడినది.మరి ఆ మాయనుండి బయట పడాలంటే అమ్మ పాదాలే శరణ్యం. అమ్మ పాదోదకం మాత్రమే ఈ మాయనించి బయట పడవేసి, బ్రహ్మవిద్యను ఉపాసించేలాగున చేసి, బ్రహ్మజ్ఞానాన్ని పెంపొందింపచేసి, ఈ మోహాందకారం నుండి బయటపడేలా చేయగలిగినది.అది మన ఉపాసనతోనో మన భక్తితోనో మాత్రమే దాన్ని సాధించలేము.అమ్మ అనుగ్రహంతో మాత్రమే అది సాధ్యం. అందుకే అమ్మా ఆ క్షణం ఎప్పుడమ్మా అని అమ్మను వేడుకోవడం}

 

🔱 ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱                                                                                                                                                                                             🙏🌸🌸🌸🌸🌸🙏

కామెంట్‌లు లేవు: