*హైందవం వర్ధిల్లాలి 2*
మానవ జీవన వ్యవస్థ ఎప్పుడు శిల లాగా మార్పు లేకుండా చైతన్య రహితంగా ఉండే వ్యవహారం కాదు, నదీనదముల లాగా చైతన్య స్థితిగల మహా స్రవంతి, ఒప్పుకొనవలసిన సత్యమిది. ఈ ప్రవాహంలో కూడా భద్రత, అభివృద్ధి మరియు ఆనందములతో బాటు ఆపదలు గూడా పొంచి ఉండడం సంభవమే. ఈ ప్రవాహంలో జీవన సరళి ననుసరించి స్వదేశంలోని వివిధ ప్రాంతాలు మరియు వివిధ దేశాలను సందర్శించు లేదా ఆ ప్రాంతాలలో స్థిరపడు అవకాశాలు గూడా మెండు. *ఎక్కడ ఉన్నా తమ తమ ధర్మాలు, శాస్త్రాలు, సంప్రదాయాల ప్రకారం జీవన మనుగడ సాగిస్తూ అభివృద్ధి మార్గంలో పయనించేవారు వివేకులు*. మరియొక వింత మరియు విడ్డూరమైన స్వభావ జనులను ప్రపంచం గమనిస్తున్నది. అనాదిగా సనాతన మరియు ఆర్య, ఆర్ష ధర్మాలతో కూడుకొని ఉన్న భారత దేశంలో జన్మించి, వారసత్వము పొంది ఉన్న కొందరు, తమకు మాలిన విదేశీ పోకడలు అనగా పాశ్చాత్య ధోరణుల ననుసరిస్తున్నారు. వారు తాత్కాలిక సుఖం, భోగాలు పొందగలరేమో గాని అది శాశ్వతం కాదు. ఇట్టి ప్రభావం ఆధునిక విద్యాధికులు మరియు వాణిజ్య వర్గాలలో ఎక్కువగా దృశ్యమగుచున్నది. వేర్వేరు ప్రాంతాల్లో, దేశాలలో నివసించినా తమ తమ ధర్మాలకు, సంప్రదాయాలకు, ఆచారాలకు కట్టుబడి ఉన్నవారు మరింత ఆత్మనిబ్బరంతో శాశ్వత సుఖ శాంతులు పొందుతున్నారన్న విషయం వాస్తవం. *ఎవరు ఎక్కడ ఉన్నా తమ హైందవ ఆచారాలను, ధర్మాలను మరియు సంప్రదాయాలను వదులుకోను అవసరంలేదు*.
ధనం పెరిగినా కొద్దీ మదం పెరుగుతుందంటారు. ఈ మధ్య కాలంలో ఇది వాస్తవ రూపందాలుస్తుంది. పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడిన అధికులు స్వధర్మాన్ని విమర్శించటం, ఎదిరించడం, విభేదాలతో నిర్వచించడం. ఈ లాంటి ధోరణులు *నాగరికత పేరుతో , చదువుకున్న వారమనే విర్రవీగుతూ సనాతన ధర్మం పాత చింతకాయ పచ్చడి అంటూ, మూఢాచారమంటూ, వెకిలిగా నవ్వుతూ హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం* అధికమగుచున్నవి.
ఇంకా కొంతమంది అన్యమత అనురక్తులు, నాస్తిక వాదులు Tv లాంటి ప్రజాభిమాన మాధ్యమాలలో హైందవ ధర్మం, సంప్రదాయం, ఆచారాలు, పండుగలు, పర్వదినాలపై పండిత చర్చలు నిర్వహించి, ఎప్పుడైనా భిన్నాభిప్రాయాలు ప్రకటితమైనప్పుడు, గేలి పూర్వక వ్యాఖ్యానాలు చేయడం, హైందవాన్ని కించపర్చడం అలవాటుగా మారుతున్నది, జరుగుచున్నది. మరికొందరు బహిరంగంగా హిందూ దేవీ దేవతలపై కుత్స్తిత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇటువంటి హిందూ ధర్మ, సంప్రదాయ ద్రోహులను ఉపేక్షించరాదు, సంఘటితంగా ఇటువంటి ద్రోహులను నిరోధించాలి, అవసరమవుతే చట్టం ద్వారా గుణపాఠం నేర్పాలి, శిక్షించాలి. *కావున హిందూ ధర్మానికి, సంస్కృతికి ఉపిరులుదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి, పునర్వైభవం తేవాలి*.
*వేదాలు, ఉపనిషత్తులలోని అంతులేని జ్ఞాన విజ్ఞానం పునాదిగా ఏర్పడినదే హైందవ ధర్మం మరియు సార్వజనీన సుఖశాంతులకు ఆరోగ్యదాయానికి పునాదిగా హిందూ ధర్మం ఫరిఢవిల్లినట్లు చెప్పబడినది*. హైందవ ధర్మం దేవుడు *ఒక్కడే* అను సిద్ధాంతం ఆధారంగా ఆవిర్భవించలేదు. హిందు ధర్మాన్ని అనుసరించేవారు ప్రకృతిలో ఎవరినైనా అనగా రాళ్ళు, చెట్లు, వృక్షములు, జంతు (గో మాత, నందీశ్వరుడు ఇత్యాది), పక్షి (నెమలి, హంస) ఇతర చరములు (నాగ సంబంధ), జలం, అగ్ని వంటి వాటిని స్వేచ్చగా పూజించవచ్చు, ఆరాధించవచ్చు. మరియొక మాట ఒకే దేవుడు, ఒకే చిహ్నం, పూజలకై ఒకే స్థలమన్నది హిందు ధర్మంలో లేదు. *సత్ సంప్రదాయము, ఉత్తమ ఆచరణ ఆధారంగా రూపొందించబడినది హిందూ ధర్మము*. ఇంతటి విశిష్టమైన హైందవ ధర్మంపై ధారావాహిక రచనకు పూనుకోవడం నా స్థాయికి మించిన ప్రయత్నంగా (కృత్యంగా) భావిస్తున్నాను. అవుతే *సాధనాత్ సాధ్యతే సర్వం* అని నమ్మినవాణ్ణి, కావున ప్రయత్నం చేస్తున్నాను.
*మాన్యులకు విజ్ఞప్తి*
ఈ రచనలలో అన్యమైన, అసంగతమైన, అప్రస్తుత, అనంగీకార, సత్య దూర ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు. తగు ప్రమాణములు జతపర్చిన చదువరులకు మరింత జ్ఞాన దాయకంగా ఉండగలదు.
ధన్యవాదములు.
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి