శ్రీశ్రీశ్రీ
*ఇంటింటా రామాయణ దివ్యకథా పారాయణం*
*
*5 వ రోజు*
🌸 *సుందరకాండ*🌸
***
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి.
****
మనోజవం
మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |
వాతాత్మజం
వానరయూథ ముఖ్యం
శ్రీరామ దూతం
శరణం ప్రపద్యే||
(మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీ రామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను.)
***
సీతాన్వేషణ సంకల్ప దీక్షతో ఆంజనేయుడు మహేంద్రగిరి పర్వతం ఎక్కి ఉత్సాహంతో కాసేపు విహరించాడు. మహా వేగంతో ఆకాశంలోకి ఎగిరేందుకు పట్టుకోసం భూమిపై కాలు పెట్టి అదిమితే అది ఎక్కడ కుంగుతుందో నని మహేంద్రగిరి పర్వతాన్ని ఆపుగా చేసుకున్నాడు. తలపైకి ఎత్తి చూశాడు. విశాల ఆకాశం ప్రేరణనిచ్చింది. మహోత్సాహం ఆవహించింది. తూర్పుకు తిరిగాడు. సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి నమస్కరించాడు. శ్రీరామచంద్రమూర్తిని శరీరంలోకి ఆవహింపచేసుకున్నాడు.
వానరసేనవైపు తిరిగాడు, మిత్రులారా! రామకార్యార్థం వెడుతున్నాను. రామబాణం ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంతో లంకలో ప్రవేశిస్తాను. అక్కడ సీతమ్మవారు లేకపోతే దేవలోకం వెళతాను. అక్కడా ఆ మహాతల్లి కనిపించకపోతే రావణాసురుణ్ణే బంధించి ఈడ్చుకువస్తాను . లేదంటే లంకానగరాన్నే పెళ్లగించి తీసుకువస్తాను చూస్తూ ఉoడండి అంటూ
ఒళ్లువిరిచి, దేహాన్ని సాగదీసి,చేయి ముందుకు సాచి...జై శ్రీరామ్ అంటూ మహేంద్రగిరిని కాలితో గట్టిగా అదిమి హనుమ ఒక్క ఉదుటున ఆకాశంలోకి లేచాడు. వానర సేన హనుమకు,శ్రీరామ చంద్రమూర్తికి జేజేలు పలుకుతున్నది. హనుమ మహేంద్రగిరినుంచి పైకి లేస్తుంటే, ఆ ఊపుకు మహేంద్రగిరి ఊగిసలాడింది. చెట్లు ఆ మహోధృత గాలికి పుష్ఫ వర్షం కురిపించాయి. వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది.జీవకోటికి ఏదో తెలియని ఆనందం. విషప్రాణులు భయంతో విలవిలలాడి పోయాయి. అలా సముద్రం మీద మహావేగంతో హనుమంతుడు లంకానగరంవైపు దూసుకుపోతున్నాడు. స ముద్రంపై పడిన హనుమంతుడి నీడ, సముద్రంలో గాలివాటుకు పోతున్న నౌకలా కనిపిస్తున్నది. సముద్రం అల్లకల్లోలమౌతున్నది. రెక్కల పర్వతంలా దూసుకుపోతున్నాడు మన హనుమ. దేవతలు హనుమనుచూసి విజయోస్తు... విజయోస్తు అని దీవిస్తున్నారు.
*సాగరుడి సాయం*
సముద్రుడు తల పెకి ఎత్తి చూశాడు. రామకార్యార్థి అయి వెళుతున్న హనుమ కనిపించాడు. ఏదో ఒక రకంగా హనుమకు సహాయం చేయాలనుకున్నాడు.అలా రామకార్యంలో తానూ భాగస్వామి కావాలనుకున్నాడు. అప్పుడు సముద్రంలోనే దాగి ఉన్న మైనాకుడనే పర్వతాన్ని పిలిచి, ఈ సముద్రం నుంచి పైకి లేచి నువ్వు హనుమకు ఆతిథ్యం , కాసేపు విశ్రాంతి నివ్వు .అలా రామకార్యంలో తరిద్దాం అన్నాడు సముద్రుడు. మైనాకుడు ఆకాశవీధికి పెరుగుతూ వెళ్లి హనుమకు విశ్రాంతి ఇవ్వాలన్న సంకల్పంతో అతనికి అడ్డంగా నిలిచాడు.. హనుమ తనకు ఏదో అడ్డుగా నిలిచిందని భావించి గుండెతో మైనాకుడిని ఒక్క గుద్దు గుద్దాడు. దానితో కలవరపడిన మైనాకుడు నిజరూపం లో ఎదురుగా నిలిచి , తన శిఖరంపై విశ్రాంతి తీసుకోమన్నాడు. హనుమ సంతోషించాడు.కానీ రామకార్యార్థినై సంకల్పదీక్షతో వెళుతున్నాను. విశ్రాంతి కిది సమయం కాదు . అని మైనాకుడి తృప్తి కోసం అతనిని చేతితో స్పృశించి ప్రభంజన వేగంతో హనుమంతుడు ముందుకు దూసుకుపోతున్నాడు. హనుమ దీక్షకు,పట్టుదలకు దేవతలు ముచ్చటపడ్డారు.
గంధర్వ దేవతాగణాలు హనుమ శక్తిసామర్థ్యాలు పరీక్షించాల్సిందిగా నాగమాత సురస ను కోరారు. ఆమె భారీ కాయంతో హనుమ మార్గానికి అడ్డుపడింది. హనుమా! ఈరోజు నువ్వు నాకు ఆహారం. నువ్వు మర్యాదగా నా నోట్లోకి ప్రవేశించు అని గద్దించింది. అప్పుడు హనుమంతుడు, వినయంతో, అమ్మా... నేను రామకార్యార్థినై వెళుతున్నాను. సీతామాత జాడ తెలుసుకుని వచ్చిన తర్వాత నీకు ఆహారం అవుతాను అన్నాడు. సురస ఒప్పుకోలేదు. సరే నా దేహానికి సరిపడినంతగా నీ నోరు తెరువు అన్నాడు. సురస నోరు పెద్దది చేస్తున్నది. హనుమ కూడా తన దేహాన్ని పెంచుతూ పోతున్నాడు. ఇలా ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఒక దశలో హనుమ ఉన్నట్టుండి తన దేహాన్ని బొటన వేలి స్థాయికి తగ్గించి సురస నోట్లో కి ప్రవేశించి క్షణకాలంలో బయటకు వచ్చేశాడు. అమ్మా నీవు చెప్పినట్టే చేశాను. ఇక వెళ్లిరానా అన్నాడు. ఆంజనేయుని సూక్ష్మబుద్ధికి సంతసించి, నాయానా నీకు కార్యసిద్ధి కలుగుతుంది. సీతారాములను కలుపుతావు అని ఆశీర్వదించి మార్గం సుగమం చేసింది.
అలా గగనతలంలో సముద్రంపై దూసుకుపోతున్న హనుమ నీడను ఛాయాగ్రాహిణి అనే సముద్రంలోని సింహిక అనే రాక్షసి చూసింది. తనకు భలే ఆహారం దొరికిందని అనుకునుంది. నోరుతెరిచి హనుమ నీడ ఆధారంగా అతనిని తన నోట్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నది. ఇది గమనించాడు హనుమ. దేహాన్ని మరింత పెంచినా ప్రయోజనం లేక పోయింది. వెంటనే సూక్ష్మరూపియై సముంద్రంలోని సింహికను ఢీకొట్టి దాని ప్రాణాలు తీశాడు. సింహిక మృతకళేబరం సముద్రంపై తేలుతుంటే దేవతలు సంతోషంతో పుష్పవృష్టి కురిపించారు. ఈ విధంగా ధైర్యం, విశాలదృష్టి, బుద్ధి, చాకచక్యం ప్రదర్శించిన హనుమకు ఇక ఎదురులేదని దేవతలు దీవించారు. అంతలోనే దక్షిణతీరంలో పర్వత పంక్తులు హనుమంతుడికి కనిపించాయి. లంకానగరానికి దగ్గరలోని త్రికూటగిరి శిఖరం మీద దిగాడు. ఇంత దూరం సముద్రంపై ఎగిరివచ్చినా ఏమాత్రం అలిసిపోలేదు. సాయం సంధ్యా వందనాది కార్యక్రమాలు ముగించాడు.
*లంకానగర ప్రవేశం*:
త్రికూటగిరినుంచి లంకానగరాన్ని చూశాడు హనుమంతుడు. బహు సుందరంగాఉంది. అంతేకాదు, చీమకూడా నగరంలో ప్రవేశించడానికి వీలులేకుండా రాక్షసులు కాపలాకాస్తున్నారు. సూక్ష్మరూపి అయి వానర రూపంలోనే లంకలో ప్రవేశించి సీతామాత జాడ తెలుసుకోవాలనుకున్నాడు. చిన్నవానరంగా లంకలో ప్రవేశించడానికి రాజద్వారం చేరుకున్నాడు. ఇంతలో లంకిణి అనే రాక్షసి ఎదురుగా నిలిచి, వనాలలో తిరిగే వానరానికి ఇక్కడేం పని అని గద్దించింది. తన అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించడం కుదరదని చెప్పింది. లోపల ఉన్న వనాలను సరస్సులను పక్షులను చెట్లను, ఆ నగర సౌందర్యాన్ని ఒక్కసారి చూసి వచ్చేస్తానన్నాడు హనుమ. లంకిణి కుదరదన్నది. నేను లంకను కాపలా కాస్తుంటాను. నన్ను గెలిస్తే కాని నువ్వు లోపలికి అడుగు పెట్ట లేవు అంటూ హనుమను ఒక్క దెబ్బ కొట్టింది. హనుమ వెంటనే కుడిచేయి పైకిఎత్తి పిడికిలి బిగించాడు. కానీ కుడిచేతితో కొడితే లంకిణి చనిపోతుంది. స్త్రీ కదా అని ఆలోచించి ఎడమ చేతితో ఒక్క గుద్దు గుద్దాడు.ఆమె కళ్లుతేలేసి కిందపడింది. అప్పుడు లంకిణి, నాయనా! నువ్వు నన్ను గెలిచావు. ఒక వానరుడు వచ్చి నన్ను గెలిచిన నాడు రావణాసురుడి అంత్యకాలం సమీపించినట్టు అని బ్రహ్మగారు నాకు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు లంకా నగరం భవిష్యత్తు, రాక్షసుల భవిష్యత్తునాకు అర్ధమై పోయింది. ఇక ద్వారం తెరుస్తున్నాను. ఈ ద్వారం గుండానే వెళ్లు , సీతమ్మను కనిపెట్టు అని చెప్పింది.కానీ హనుమ రాజద్వారం గుండా ప్రవేశించకుండా ,ఎడమ కాలులోపలికి పెట్టి ప్రాకారం మీదినుంచి లంకానగరంలోకి కిందికిదూకాడు. అప్పటికే రాత్రి అయింది. చంద్రుడి వెలుగులో లంకానగరం మరింత శోభాయమానంగా కనిపిస్తున్నది.
*అంతఃపురంలో సీతాన్వేషణ*
చిన్నశరీరం ధరించి, హనుమంతుడు రావణుని మందిరంలో, పానశాలలో, పుష్పక విమానములో .. అన్నిచోట్లా సీతమ్మను వెదికాడు. రాత్రి వేళ రావణుని మందిరంలో కాంతలు భోగ లాలసులై, చిత్ర విచిత్ర రీతులలో నిద్రిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూచి కలవరపడిన హనుమంతుడు, తాను ,రామ కార్యాచరణ నిమిత్తం ఏ విధమైన వికారాలకూ లోను గాకుండా సీతాన్వేషణ చేస్తున్నందున తనకు దోషం అంటదని, తన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లదని సమాధానపడ్డాడు. పుష్పక నిమానం అందాన్ని, రావణుని ఐశ్వర్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. నిద్రిస్తున్న స్త్రీలలో మండోదరిని చూసి సీతమ్మ అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ తెలియక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి ఇష్టపడ లేదు. తన కార్యం విఫలమైతే సుగ్రీవుడు, రామ లక్ష్మణులు, మరెందరో హతాశులౌతారని బాధపడ్డాడు.చివరికి ప్రాణత్యాగం చేసుకుందామని కూడా ఆలోచించాడు. సీతమ్మ జాడ కనిపెట్టకుండా తాను వెనుకకు వెళ్ళేది లేదని నిశ్చయంచుకొన్నాడు. ఆ సమయంలో అశోక వనం కనిపించింది.
నమోస్తు రామాయ సలక్ష్మణాయ,
దేవ్యైచ తస్మై
జనకాత్మజాయై,
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో,
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని ప్రార్థించాడు.
దేవతలు, మహర్షులు తనకు కార్య సాఫల్యత కూర్చాలని ప్రార్ధించాడు. బ్రహ్మ, అగ్ని, వాయుదేవుడు, ఇంద్రుడు, వరుణుడు, సూర్యచంద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, శివుడు, సకల భూతములు, శ్రీమహావిష్ణువు తనకు కార్యసిద్ధి కలిగించాలని ప్రార్థించి సీతాన్వేషణకు చివరి ప్రయత్నంగా అశోకవనంలో అడుగుపెట్టాడు.
*అశోకవనంలో*
*సీతమ్మ దర్శనం*
అశోకవనం అనన్య సుందరమైనది. అందులో చక్కని వృక్షాలు, పూలు, చిత్ర విచిత్రాలైన కృతక పర్వతాలు, జలధారలు ఉన్నాయి. అక్కడ అతి మనోహరమైన ఒక శింశుపా వృక్షాన్ని ఎక్కి హనుమంతుడు చుట్టుప్రక్కల పరిశీలింపసాగాడు.
అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భయంతో కృశించిన ఒక స్త్రీని చూశాడు.. ఆమె ధరించిన దుస్తులు, ఆమె తీరు, ఉన్న స్థితిని బట్టి హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. ఆమె దీనావస్థను, రామలక్ష్మణాదుల దుఃఖమును తలచుకొని, కాలం ఎంతటివారికైనా అతిక్రమింపరాని బలీయమైనది అనుకొని, హనుమంతుడు దుఃఖించాడు.
*త్రిజటాస్వప్నం*
అశోకవనానికి రావణుడు వచ్చాడు. సీతమ్మను బెదరించి, తనకు వశంకావాలని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని, రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. పోగాలము దాపురించినందువల్లనే రావణుడికి ఈ నీచ సంకల్పం కలిగిందని హెచ్చరించింది. శ్రీరాముని బాణాగ్నికి లంక భస్మం కావడం తథ్యమని రావణుడికి గట్టిగా చెప్పింది. ఒక నెల రోజుల గడువు పెట్టి రావణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతమ్మను నయానా, భయానా అంగీకరింపచేయాలని ప్రయత్నించ సాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదిరించారు. భయ విహ్వలయై, ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొన్నది.
వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీతవంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన ఒక కల గురించి ఇలా చెప్పింది .....
"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత కూర్చుని ఉంది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత, వారంతా పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు.
ఇంకో వైపు, రావణుడూ కలలో కనిపించాడు ."ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి, పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి అతనిని లాగుతున్నట్టు ఉంది. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలం త్రాగుతూ, పిచ్చివారివలె లంకలో గంతులు వేస్తున్నారు."....ఇలాంటి దృశ్యాన్ని నేను కలలో చూశాను అని త్రిజట చెప్పింది. ఇది లంకకు రాబోయే చేటుకాలాన్ని సూచిస్తున్నదని హెచ్చరించింది.
ఇలా చెప్పి త్రిజట, తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని,ఆమే దిక్కు అని తక్కిన రాక్షస కాంతలకు హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.
త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని వివరించడం, హనుమ చెట్టుపై నుంచి విన్నాడు.ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాడు. అయితే ఒక్కసారిగా సీతమ్మకు వానర రూపంలో కనిపిస్తే కంగారుపడుతుందని, ఆమె భయంతో కేకలు వేస్తే కాగల కార్యం చెడిపోతుందని గ్రహించాడు. నెమ్మదిగా రామకథా గానం చెట్టుపైనుంచే ప్రారంభించాడు.
ఆ రాముడు సీతను వెదకడానికి పంపిన దూతలలో ఒకడైన తాను ప్రస్తుతం లంకను చేరి, చెట్టుపైనుండి, సీతను చూచానని ఆ కథాక్రమంలో తెలియజేశాడు. ఆ రామకథా శ్రవణంతో సీతమ్మ కొంత ఆనందించింది. కానీ తాను కలగంటున్నానేమోనని భ్రమ పడింది. తల పైకెత్తి, మెరుపు తీగవలె, అశోక పుష్పము వలె ప్రకాశిస్తున్న వానరుని చూచి కలవరపడింది. తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు, మహేంద్రునికి, బృహస్పతికి, అగ్నికి నమస్కరించింది. హనుమంతుడు మెల్లగా చెట్టు దిగివచ్చి ఆమెకు శుభం పలికాడు. సీతమ్మకు తన వృత్తాంతాన్ని, రాముని దుఃఖమునూ వివరించాడు. శ్రీరాముని పరాక్రమాన్నీ, గుణగణాలనూ ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీతమ్మ అంత దుఃఖంలోనూ, అందరి క్షేమసమాచారములు అడిగి తెలుసుకుని, ఆపై రాముని వర్ణించమని కోరింది.
*శ్రీరామ సుందర రూప వర్ణనం*
హనుమంతుడు, భక్తితో అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించాడు. "రాముడు ఆజానుబాహుడు. కమల పత్రాక్షుడు. రూప దాక్షిణ్య సంపన్నుడు. శుభలక్షణములు గలవాడు, తేజోమూర్తి, ధర్మ రక్షకుడు, సర్వ విద్యాపారంగతుడు, లోకమర్యాదలను పాటించువాడు. సమ విభక్తములైన శరీరాంగములు కలవాడు. దీర్ఘములైన బాహువులు, శంఖమువంటి కంఠము కలవాడు. ఉత్తముడు, వీరుడు. నల్లనివాడు. అతని తమ్ముడైన లక్ష్మణుడు అట్టి శుభలక్షణములే కలిగి, ఎర్రని మేని ఛాయ గలవాడు - అలాంటి రామలక్ష్మణులు నీ కోసం దుఃఖిస్తున్నారు తల్లీ . సుగ్రీవునితో చెలిమి జేసి, నిన్ను వెదకటానికి నలువైపులా వానరులను పంపారు. ఓ సీతా మాతా! త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇక్కడినుండి తీసుకువెళతాడు, మనస్సు దిటవుచేసుకుని ఉండు" - అని హనుమంతుడు చెప్పాడు.
*హనుమంతుడికి*
*చూడామణి ఇచ్చిన సీత* :
శ్రీరాముని గురించి విని, సీత ఊరడిల్లింది. తరువాత హనుమంతుడు ఆమెకు శ్రీరాముని ఆనవాలైన అంగుళీయకమును ఇచ్చాడు. రాముడు చెప్పిన మాటలు తెలియజేశాడు. ఆమెకు శుభం పలికాడు. తనతో వస్తే ఆమెను తీసికొని వెళ్ళగలనని అన్నాడు. ఇంత చిన్నవానరం తనను ఎలా తీసుకువెళుతుందని సందేహించవద్దని చెప్పాడు. జై శ్రీరామ్ అంటూ ఆకాశం ఎత్తుకు ఎదిగి సీతమ్మకు నమస్కరించాడు.
సీతమ్మ హనుమంతుని పలుకులకు సంతోషించి అతని పరాక్రమాన్ని ప్రశంసించింది. కాని , స్వయంగా శ్రీరాముడే వచ్చి, రావణుని వధించి, తనను తీసికొని వెళ్ళాలని చెప్పింది. రాముని పరాక్రమానికి ముల్లోకాలలోను ఎదురు లేదని తెలిపింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, భల్లూక వానరులకు ధర్మక్రమ మనుసరించి కుశలం అడిగినట్లు తెలుపమని పలికింది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకుంటే తాను బ్రతుకనని చెప్పింది. ఆ మహాసముద్రాన్ని దాటడం హనుమంతుడు, వాయుదేవుడు, గరుత్మంతుడు తప్పఇతరులకు ఎలా సాధ్యమని సంశయించింది.
అందుకు హనుమంతుడు, తనకంటే గొప్పవారైన మహావీరులు వానరులలో ఎందరో ఉన్నారని, తాను సామాన్యుడను గనుకనే ముందుగా తనను దూత కార్యానికి -పంపారని ఆమెకు నచ్చచెప్పాడు. మహావీరులైన రామలక్ష్మణులు కపి భల్లూక సేనా సమేతంగా, త్వరలో లంకకు వచ్చి లంకను వాశనం చేసి రావణ సంహారం సాగించడం తథ్యమని ఆమెకు నచ్చ చెప్పాడు. హనుమంతుని సీతమ్మ ఆశీర్వదించింది.
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం|
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం||
**
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|
అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||
( ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరుప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు.)
***
*(సుందరకాండ-*
*పరమపావన* *సీతాదర్శనఘట్టం సమాప్తం)*
----------