2, ఏప్రిల్ 2025, బుధవారం

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*335 వ రోజు*

పాండవ శిబిరంలో ఆనందోత్సాహాలు

కలసిన కృష్ణార్జునులు

సైంధవవధా సందర్భమున కృష్ణార్జునులు చూపిన ప్రతిభ ధృతరాష్ట్రుడిలో భయోత్పాతాలు కలిగించాయి. " సంజయా ! సైంధవ వధానంతరం నా కుమారులు ఏమి చేసారో వివరించుము " అన్నాడు. సంజయుడు " మహారాజా ! సైంధవవధ కలిగించిన ఉత్సాహంతో పాండవసేన కౌరవసేనతో తలపడింది. కృపాచార్యుడు, అశ్వత్థామ అర్జునుడి మీద శరవర్షం కురిపించారు. అర్జునుడు ఆ శరములన్నీ ఖండించి తిరిగి వారి మీద శరవర్షం కురిపించాడు. శరధాటికి కృపాచార్యుడు స్పృహతప్పాడు. అతడి సారధి కృపాచార్యుని పక్కకు తీసుకు వెళ్ళాడు. అశ్వథ్థామ కూడా అతడి వెంట వెళ్ళి పోయాడు. అది చూసి అర్జునుడు ఖిన్నుడైయ్యాడు. కృష్ణుడు అర్జునుడుని ఓదారుస్తూ " అర్జునా ! దేవేంద్రునికైనా గెలువ సాధ్యం కాని కురుసేనను ఒంటి చేత్తో గెలిచిన నీ పరాక్రమము ప్రశంశనీయము. సైంధవుని తల వృద్ధక్షతుడి ఒడిలో పడవేసి మహా తపోధనుడి శాపం నుండి తప్పించు కున్నావు. ఇంద్రుడిచ్చిన శక్తాయుధంతో విర్ర వీగుతున్న కర్ణుని జయించి ప్రశంశా పాత్రుడవు కమ్ము " అన్నాడు. అర్జునుడు కృష్ణా ! అలా అనకు నీ కృపతో నేను సైంధవుని వధించగలిగాను. నీ కటాక్షవీక్షణం పొందిన వాడికి కార్య సిద్ధి కలుగక మానదు " అన్నాడు. ఆ మాటలకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి " అర్జునా! మన కొరకు ధర్మరాజు ఎదురు చూస్తుంటాడు. మనం వెళ్ళాలి " అన్నాడు. అర్జునుడు, సాత్యకి, భీముడు, ఉత్తమౌజుడు ధర్మరాజు వద్దకు వెళుతుండగానే సూర్యాస్తమయం అయింది. ఇరు పక్షాలు యుద్ధం మాని తమ శిబిరాలకు వెళ్ళారు. ధర్మరాజు శిబిరం చూసి కృష్ణుడు పాంచజన్యం పూరించాడు. ఆ శంఖధ్వని విని ధర్మరాజు వెలుపలకు వచ్చి ఒకే సారి వారిద్దరిని కౌగలించుకొని ఆనందబాష్పాలు రాల్చి " అర్జునా! అర్జునా! నీ శపధము నెరవేర్చుకున్నావు. ఈ మహానుభావుని దయ వలన ఈ గండం గడిచి బయట పడ్డాము " అని శ్రీకృష్ణుని కృతజ్ఞతాభావంతో చూసాడు. శ్రీకృష్ణుడు " ధర్మజా! కౌరవుల మీద మీకు ఉన్న కోపమే ఈ విజయానికి కారణం అయింది. మీ వంటి సత్పురుషుల కోపాన్ని తట్టుకోవడం ఎవరి తరం ? ఒక్క అర్జునుడే కాదు, సైంధవుని వధించుటే కాదు, ఇలాంటి దుస్సాధ్యమైన కార్యాలు ఎన్నైనా ఎవరైనా అవలీలగా చేయగలరు. మీలాంటి సత్ప్రుషుల కోపానికి ఉన్న ప్రభావం అలాటింది " అన్నాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు " కృష్ణా! నీవే అలిగిన దేవాసురులు సహితం రూపు మాసిపోతారు. నీ దయ ఉంటే మాత్రమే జీవులు సుఖంగా జీవించగలరు. మా మీద నీ దయ ప్రసరించినంత కాలము మాకు కార్య సిద్ధి లభిస్తుంది " అన్నాడు వినయంగా. ఇంతలో భీముడు, సాత్యకి ధర్మరాజుకు నమస్కరించారు. ధర్మరాజు వారిని లేవనెత్తి కౌగలించుకున్నాడు. శత్రు సంహారంతో ధర్మరాజు ఆనందానికి అవధులు లేక పోయింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: