*తిరుమల సర్వస్వం 196-*
*కపిల తీర్థం -1*
*సప్తగిరుల సమారోహమైన తిరుమల కొండ పాదభాగంలో తిరుపతి పట్టణ శివారులో ఉన్న కపిలేశ్వరస్వామి ఆలయం, తిరుపతి వాసులకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవాలయం. తిరుమల యాత్రికులతోనూ, స్వామిని అనునిత్యం దర్శించుకునే తిరుపతి పట్టణవాసుల తోనూ కపిలేశ్వరస్వామి ఆలయం ఎల్లవేళలా కళకళలాడుతూ సందడిగా ఉంటుంది. కార్తీకమాసం మరియు ఇతర ముఖ్య పర్వదినాలలో పోటెత్తిన భక్తులు జనసంద్రాన్ని తలపిస్తారు. ఈ దేవాలయ సముదాయానికి ఎదురుగా అలిపిరికి వెళ్ళే దారిలో, ఈమధ్య కాలం లోనే ప్రతిష్ఠించబడ్డ; కపిలేశ్వరస్వామికి అభివాదం చేస్తూ గంభీరంగా కూర్చొనివున్న నందీశ్వరుని విగ్రహం ముచ్చట గొలుపు తుంటుంది. అందువల్లనే ఈ కూడలిని 'నంది సర్కిల్' గా పిలుస్తారు. ఈ ప్రాంతం నుండే తిరుమల శోభ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాల్లో, తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు, ఈ ప్రాంతమంతా విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది.*
కపిలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సమున్నతమైన పర్వతశ్రేణుల నుంచి జాలువారే పవిత్ర జలధారను 'కపిలతీర్థం' గా వ్యవహరిస్తారు. శేషాచల శ్రేణుల్లోని ఏడుకొండల నుంచి ప్రవహించే వందల కొద్ది జలప్రవాహాలు ఒకదానితో ఒకటి సమ్మిళితమై, ఉధృతమైన జలపాతం గా మారి, ఈ తీర్థంలో బహిర్గతమవ్వడం ద్వారా ఆ సప్తగిరుల మహిమలన్నింటినీ పుణికిపుచ్చుకున్న ఈ కపిలేశ్వరతీర్థానికి విశేషమైన పౌరాణికప్రాశస్త్యం ఉంది.
ఒక ప్రక్క ఎత్తయిన పర్వతశిఖరాలు, మరో ప్రక్క దట్టమైన, ఆకుపచ్చని అడవులు; మధ్యలో దివి నుండి భువికి వస్తున్నట్లుగా కానవచ్చే జలపాతం. ఆ ప్రకృతి సోయగం చూసి తీరవలసిందే గానీ, వర్ణింపశక్యం కాదు.
కార్తీకమాసపు ప్రాతఃసంధ్యా సమయంలో చలికి గజగజా ఒణుకుతూ, శివకేశవులను స్మరించుకుంటూ, ఈ చల్లటి జలధార క్రింద పవిత్ర స్నానమాచరిస్తూ పరశమొందటం ఒక ఆధ్యాత్మిక మధురానుభూతి. ఆ మాసంలో కపిలతీర్థం ఎదురుగా ఉన్న పుష్కరిణికి ఇరుప్రక్కలా ఉన్న సంధ్యావందన మండపాలు, మండలదీక్ష లోనున్న అయ్యప్పస్వాముల తోనూ, పుష్కరిణి జలాలు గగనాన మెరిసే తారలను స్మరణకు తెచ్చే అరిటాకు దొన్నెల కార్తీక దీపాలతోనూ; ఉత్సవశోభను తలపిస్తాయి.
*ఆ పేరెలా వచ్చింది?*
'కపిలతీర్థాని' కి ఆ పేరు రావటం వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక గాథ ఉంది.
విశ్వంలో సృష్టిని విస్తరింపజేయడానికై బ్రహ్మ ద్వారా ఉద్భవించిన ప్రజాపతులలో ఒకరైన 'కర్దమప్రజాపతి' కి లోకకల్యాణార్థం సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే 'కపిలుడు' అనే పేరు గల పుత్రునిగా జన్మించాడు. దైవాంశ సంభూతుడైన ఆ బాలుడు కౌమారావస్థలో ఉండగానే తండ్రి కర్దమ ప్రజాపతికి, తల్లి 'దేవహూతి' కి *'కపిలగీత'* అనబడే ఆధ్యాత్మిక సారాన్ని బోధించి; వారిరువురికి ముక్తిని ప్రసాదించాడు. తదనంతరం ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ, పాతాళలోకానికి చేరుకొని, అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని, అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించి తీవ్రమైన తపమాచరిస్తుండేవాడు.
అదే సమయంలో ఇక్ష్వాకువంశస్తుడు, శ్రీరామచంద్రునికి పూర్వజుడు అయిన సగరచక్రవర్తి అశ్వమేధయాగాన్ని తలపెట్టి, అత్యంత ప్రతిభాశాలి, మిక్కిలి సమర్థవంతుడు అయిన తన మనుమడు అంశుమంతుని రక్షణలో యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు.
ఇంద్రదేవుడు అతని యాగాన్ని భగ్నం చేయడం కోసం ఆ అశ్వాన్ని తస్కరించి పాతాళలోకంలో ఉన్న కపిలమహర్షి ఆశ్రమంలో విడిచిపెట్టాడు. యాగాశ్వం జాడ ఎంతకూ తెలియక పోవడంతో, ఆజ్ఞ మేరకు అతని అరవై వేల మంది పుత్రులు భూమండలమంతా గాలించారు. అప్పుడు కూడా అశ్వం కానరాక పోవడంతో, భూమినంతా ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చొప్పున పంచుకొని, మొత్తం 60 వేల యోజనాల పృథ్వీమండలాన్ని పాతాళం వరకు త్రవ్వుకుంటూ పోయారు. పాతాళలోకంలో మిగిలిన మూడు దిక్కులను ఆసాంతం గాలించిన తర్వాత, ఉత్తరదిక్కున కపిలమహర్షి ఆశ్రమంలో మేత మేస్తున్న యాగాశ్వం వారికి కనబడింది. కపిలమహర్షే ఆ అశ్వాన్ని దొంగిలించాడని భ్రమపడ్డ సగరపుత్రులు అతనిని దుర్భాషలాడగా, తపోభంగంతో కోపోద్రిక్తుడైన మునీశ్వరుడు దిక్కులు పిక్కటిల్లేలా 'హుంకారం' చేశాడు. దాంతో సగరపుత్రులు భస్మమై బూడిదరాశిలా మారిపోయారు.
సగరుని అశ్వపు జాడ గానీ, తన పుత్రుల యోగక్షేమాలు గానీ ఎంతకూ తెలియకపోవడంతో తల్లడిల్లిన సగరుడు తన మనుమడైన అంశుమంతుని పిలిచి తన పినతండ్రుల జాడ తెలుసుకోవలసిందిగా ఆదేశించాడు.
సగరుని దేవేరులిద్దరిలో పెద్ద భార్యకు 'అసమంజసుడు' అనే అయోగ్యుడు పుత్రునిగా జన్మించగా; చిన్నభార్యకు అరువది వేల పుత్రులు కలిగారు. కొన్ని అకృత్యాల కారణంగా దేశ బహిష్కారానికి గురైన అసమంజసుని కుమారుడే 'అంశుమంతుడు'. ఆ విధంగా సగరుని అరువదివేల పుత్రులు అంశుమంతునికి పినతండ్రులవుతారు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి