శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా
హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం
దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!
టీకా:
శారద = శరదృతు; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = మంచిగంధం; మరాళ = హంస; మల్లికా = మల్లిపువ్వుల; హార = దండ; తుషార = మంచు; ఫేన = నురుగు; రజత = వెండి; అచల = కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్పవృక్షము; సుధా = పాల; పయోనిధి = సముద్రము; సిత = తెల్లని; తామరస = తామరపువ్వు; అమర వాహినీ = ఆకాశ గంగ {అమరవాహిని - అమర (దేవతల) వాహినీ (నది) - ఆకాశగంగ}; శుభ = శుభకర మైన; ఆకారతన్ = ఆకారముతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్గు = కలుగుతుంది; భారతీ = సరస్వతీదేవీ.
భావము:
భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి