3, ఏప్రిల్ 2025, గురువారం

ప్రైవేట్ టీచర్లమ్

 ప్రైవేట్ టీచర్లమ్ 


  మమ్మల్ని ఏమి అడగకండి

 మా గురించి గొప్పగా చెప్పుకోవడానికి

 ఏమీ లేదు ఏమీ ఉండదు

 మాకు మర్యాద లేదు

 మాకు రక్షణ లేదు

 కనీసం కడుపునింపేంత జీతమూ లేదు

 ఎండయితేనేమి వానయితేనేమి

 ఏ కాలమైతేనేమి

 అడ్మిషన్ల పోరులో చెప్పులే కాదు                     మా బతుకులూ అరిగిపోతాయి

 ఎక్కిన గడప మళ్ళీ మళ్ళీ ఎక్కుతూ

 ఎదురయ్యే తిరస్కారాలే మాకు విందు

 మాకు ఆత్మాభిమానం ఉండకూడదు

 మనోభావాలు అస్సలు ఉండకూడదు

 మా బతుకులు బక్కచిక్కి పోతున్నా 

 యాజమాన్యాలను గద్దెనెక్కించే

 క్రతువులో సమిధలైపోవాల్సిందే

 భ్రష్టుపట్టిన ఈ విద్యా వ్యవస్థ

 మా దేహాలకు తూట్లు పొడుస్తున్నా 

 మా మొహాలపై చిరునవ్వుల

 పౌడర్ అద్దుకోవాల్సిందే 

 నాయకులకు మేము ఓటర్లుగాను

 మీడియాకు వార్తా వస్తువుగాను

 కనిపిస్తామే గాని

 మేము మేముగా కనిపించం వాళ్లకి

 మమ్మల్ని ఎప్పుడూ ప్రైవేట్ గా చూస్తారు

 మేము ప్రైవేట్ టీచర్లము కదా


 కూని అంకబాబు

 నెల్లూరు

కామెంట్‌లు లేవు: